ఐదేళ్లలో రెలైక్కిస్తా.!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : రాబోయే ఐదేళ్లలో కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్ పనులను పూర్తి చేయడమే కాకుండా జిల్లా ప్రజలందరికీ రైలు సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తానని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ హామీ ఇచ్చారు. కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా మార్చి తెలంగాణ చిత్రపటంలో అగ్రభాగాన ఉంచుతానన్నారు.
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐజేయూ అనుబంధం) ఆధ్వర్యంలో ప్రెస్‌క్లబ్‌లో సోమవారం నిర్వహించిన ‘మీట్‌ది ప్రెస్’లో పాల్గొన్న వినోద్‌కుమార్ కరీంనగర్ ఎంపీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నేటి వరకు పార్లమెంట్‌లో లేవనెత్తిన అంశాలు, జిల్లా అభివృద్ధికి చేస్తున్న కృషితోపాటు తన ముందున్న కర్తవ్యాలను మీడియా ముందుంచారు. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ, టీయూడబ్ల్యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కరుణాకర్, శ్రీనివాస్‌లతో కలిసి పాల్గొన్న ఈ కార్యక్రమంలో వినోద్‌కుమార్ చెప్పిన మాటల్లోని ముఖ్యాంశాలివే.
16వ లోక్‌సభలో ఎన్నో రాజకీయ పార్టీలున్నప్పటికీ అసలు సిసలైన ప్రతిపక్షంగా వ్యవహరించిన పార్టీ టీఆర్‌ఎస్సే. దేశంలోని అన్ని సమస్యలను ప్రస్తావించాం. 92 ప్రశ్నలను సంధించాం. అనేక చర్చల్లో పాల్గొన్నాం. పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలపడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ స్టాట్యుటరీ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టాను. రాజ్యాంగపరమైన సందేహాలైనందున కోర్టుకు వెళ్లాలని లోక్‌సభ స్పీకర్ రూలింగ్ ఇవ్వడం కూడా కనీవినీ ఎరుగనిది.
కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్‌కు ఏళ్ల తరబడి ఎదురవుతున్న అడ్డంకులను తొలగించగలిగా. భూసేకరణకు అయ్యే ఖర్చు, ప్రాజెక్టు పనుల్లో మూడో వంతు వ్యయంతోపాటు ఐదే ళ్లపాటు నిర్వహణ నష్టాన్ని భరించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాను. వారం రోజుల్లో భూసేకరణ పనులు మొదలవుతాయి. తరువాత తొలుత వాగులు, కాలువలున్న చోట వంతెనలు నిర్మాణాలు ప్రారంభమవుతాయి. ఐదేళ్లలో రైల్వేలైన్ పనుల పూర్తి కావడం కష్టమే. అయినప్పటికీ ఐదేళ్లలో జిల్లా ప్రజలందరినీ రెలైక్కించేందుకు కృషి చేస్తా.
{పాణహిత-చేవెళ్లకు జాతీయహోదా కల్పించాలనే ఏకైక లక్ష్యంతోనే కేసీఆర్ ఆదేశాల మేరకు జలవనరులకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా కొనసాగుతున్న. అటవీ, పర్యావరణ అనుమతులు వచ్చేలా కృషి చేస్తున్నా. ఇందుకోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్లి జాతీయహోదా సాధిస్తా.
గొర్రెల పెంపకాన్ని ‘పెద్ద మిషన్’గా రూపొందిస్తున్నా. కేంద్రం నుంచి సబ్సిడీ అందించేందుకు యత్నిస్తున్నా.
కరీంనగర్ మిల్క్ డెయిరీ ప్రతిరోజూ రెండు లక్షల లీటర్ల పాలసేకరణ లక్ష్యంగా పెట్టుకున్నాం. అందులో భాగంగా పాడిరైతులకు అదనంగా మరో రెండు గేదెలను కొనుగోలు చేసేందుకు వడ్డీలేని రుణాలందించేందుకు యత్నిస్తున్నా.
చేనేత, పవర్‌లూం ఉత్పత్తులకు మార్కెటింగే అసలు సమస్య. బ్రాండెడ్ సంస్థల ప్రతినిధులను ఇక్కడికి తీసుకొచ్చి వారి అవసరాలకు అనుగుణంగా ఇక్కడికి కార్మికులకు సాంకేతిక నైపుణ్యతలో శిక్షణనిపిస్తా. వారి ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ఇబ్బంది లేకుండా చేస్తా.
కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా రూపొందించాలనే కలను నెరవేరుస్తా. సమగ్ర ప్రాజెక్టు నివేదికను అందివ్వాలని స్థానిక ప్రజాప్రతినిధులు, నగర పాలక సంస్థ అధికారులను కోరాను. ఇదే అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశాను. ఆయన సానుకూలంగా స్పందించారు.
ఏదో ఒక ఫ్యాకల్టీలో శాతవాహన యూనివర్సిటీని ప్రపంచంలోనే నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తున్నా. వర్సిటీ అధికారులతో చర్చించడంతోపాటు అవసరమైన సహాయాన్ని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశాను.
కరీంనగర్ జిల్లాను జాతీయ రహదారికి అనుసంధానించే ప్రణాళికలు రూపొందిస్తున్నా. ఇది కార్యరూపం దాల్చేందుకు ఫిబ్రవరిలో కేంద్ర అధికారుల బృందాన్ని ఇక్కడికి తీసుకొస్తా.
సిరిసిల్లలో కేంద్రీయ విద్యాలయానికి అవసరమైన భూసేకరణ వివరాలను కేంద్రానికి పంపాను. ఈ ఏడాది తరగతులు ప్రారంభమయ్యేలా కృషి చేస్తా. కరీంనగర్ రహదారికి దగ్గర్లోనే ఎయిమ్స్‌ను స్థాపించేందుకు ప్రయత్నిస్తున్నా.
తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటుపై పోటీ ఉన్నా కరీంనగర్‌కే దక్కేలా కృషి చేస్తా. పాస్‌పోర్ట్ కార్యాలయంలో త్వరలోనే సకల సౌకర్యాలు కల్పిస్తా. నకిలీ వీసాల ఏజెంట్ల బెడద లేకుండా ఉండేందుకు కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి కార్యక్రమాలు చేపడతాం.
నేదునూరును థర్మల్ ప్రాజెక్టుగా రూపొందించేందుకు నేను వ్యక్తిగతంగా వ్యతిరేకిని. ఎందుకంటే బొగ్గును ఉపయోగిస్తే కరీంనగర్‌లో కాలుష్యం పెరుగుతుంది. ఎంత ఇబ్బంది ఉన్నా గ్యాస్ కేటాయింపుల కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తా.
హైదరాబాద్-కరీంనగర్-వేములవాడ-ధర్మపురి-మహదేవ్‌పూర్-హన్మకొండ-యాదగిరిగుట్ట-హైదరాబాద్ పేరిట తెలంగాణలో అతిపెద్ద టూరిస్ట్ సర్క్యూట్ ప్రతిపాదనలకు కేంద్రం సానుకూలంగా ఉంది. వంద శాతం అనుమతి లభించేందుకు కృషి చేస్తా. జిల్లాలోని పర్యాట ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దేలా చేస్తా.