న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో 2019– 20 ఆర్థిక సంవత్సరానికి గాను రక్షణ శాఖకు రూ. 3.18 లక్షల కోట్లు కేటాయించారు. 1962 చైనా యుద్ధం తర్వాత అతి తక్కువగా దేశ జీడీపీలో దాదాపు 1.6 శాతం మేర రక్షణ శాఖకు కేటాయింపులు చేశారని నిపుణులు చెబుతున్నారు. మొత్తం కేటాయింపుల్లో పెట్టుబడి మూలధన వ్యయం కోసం రూ. 1,08,248 కోట్లు కేటాయించారు. వీటి ద్వారా కొత్త ఆయుధాలు, యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, ఇతర మిలటరీ పరికరాలు, కొనుగోలు చేయను న్నారు. అలాగే రెవెన్యూ వ్యయాన్ని రూ. 2,10,682 కోట్లుగా ఖరారు చేశారు. ఈ నిధులను వేతనాలు, సైనిక వ్యవస్థల నిర్వహణ నిమిత్తం వినియోగిస్తారు. అలాగే ఈసారి రూ. 2.95 లక్షల కోట్లు బడ్జెట్ అంచనాలను చూపించగా.. 7.93 శాతం వృద్ధితో రూ. 3,18,931 కోట్లు కేటాయించినట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కార్యాలయం తెలిపింది. అలాగే మన దేశంలో తయారు కాని రక్షణ పరికరాలను దిగుమతి చేసుకునేందుకు కస్టమ్స్ డ్యూటీని మినహాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రూ. 1,12,079 కోట్ల పెన్షన్ నిధులను విడిగా కేటాయించారు. ఈ పెన్షన్ నిధులను, మొత్తం శాఖ బడ్జెట్‌ను కలిపి చూస్తే రక్షణ శాఖ బడ్జెట్ రూ. 4.31 లక్షల కోట్లు అవుతుంది. అయితే బడ్జెట్‌లో రక్షణ శాఖకు కేటాయించిన నిధుల తో రక్షణ నిపుణులు నిరాశ వ్యక్తం చేశారు.
హోం శాఖకు 1.19 లక్షల కోట్లు
మౌలిక వసతుల కల్పన, ఆధునీకరణకు పెద్దపీట
హోం మంత్రిత్వ శాఖకు మొత్తంగా రూ. 1,19,025 కోట్లను ఈ బడ్జెట్‌లో కేంద్రం కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ. 5,858 కోట్లు ఎక్కువ. మౌలిక వసతులను మెరుగుపర్చడం, పోలీసు వ్యవస్థను ఆధునీకరించడం, సరిహద్దు ప్రాంతాల్లో మెరుగైన రక్షణ కల్పించడంపై కేంద్రం ఎక్కువగా దృష్టిపెట్టింది. 2018–19 బడ్జెట్‌కు సంబంధించి సవరించిన అంచనా (రూ. 1,13,167 కోట్లు) కంటే 5.17 శాతం ఎక్కువగా ఈ సారి హోం శాఖకు నిధులు అందనున్నాయి. దేశ రాజధానిలో చట్టాన్ని అమలు చేసే ఢిల్లీ పోలీసు విభాగానికి రూ. 7,496.91 కోట్లను కేంద్రం కేటాయించింది. ఇండో–పాక్, ఇండో–చైనా సహా అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ. 2,129 కోట్లను ఖర్చు చేయనున్నట్లు బడ్జెట్‌లో తెలిపింది. నక్సల్, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనటంతోపాటు అవసరమైనప్పుడు ఇతర విధులను కూడా నిర్వర్తించే సీఆర్‌పీఎఫ్‌కు తాజా బడ్జెట్‌లో రూ. 23,963.66 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇండో–పాక్, ఇండో–బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కాపలాకాసే సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్)కు రూ. 19,650.74 కోట్ల నిధులను కేంద్రం అందించనుంది. మొత్తంగా అన్ని కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు (సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బీ, ఎన్‌ఎస్‌జీ, అస్సాం రైఫిల్స్) కలిపి మొత్తంగా రూ. 71,713.9 కోట్లను కేంద్రం కేటాయించింది. 2018–19 బడ్జెట్‌లో ఈ మొత్తం రూ. 67,779.75 కోట్లు మాత్రమే. దేశం లోపల నిఘా కోసం పనిచేసే నిఘా విభాగం (ఐబీ)కి ప్రస్తుత బడ్జెట్‌లో రూ. 2,384.1 కోట్లు ఇచ్చారు. ప్రధాని, మాజీ ప్రధానులు, వారి కుటుంబీకులకు రక్షణ కల్పించే ప్రత్యేక రక్షణ దళం (ఎస్పీజీ)కు రూ. 535.45 కోట్లను కేటాయించారు.
మౌలిక వసతులకు 4 వేల కోట్లు
బ్యారక్‌లు, నివాస గృహాల నిర్మాణం, ఆధునిక వాహనాలు, ఆయుధాల కొనుగోలు తదితరాల వంటి మౌలిక వసతుల కోసం రూ. 4,757 కోట్లను కేంద్రం ఈ బడ్జెట్‌లో కేటాయించింది. పోలీసు దళాల ఆధునీకరణకు రూ. 3,462 కోట్లు, సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి రూ. 825 కోట్లు, జమ్మూ కశ్మీర్‌లో వలసదారులు, ఇంకా వలస వెళ్లి మళ్లీ వెనక్కు వచ్చిన వారికి పునరావాసం కోసం రూ. 842 కోట్లు, స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్ కోసం రూ. 953 కోట్లను బడ్జెట్‌లో కేంద్రం కేటాయించింది.
Comments
Please login to add a commentAdd a comment