
దేశానికి పూర్తికాలం రక్షణ మంత్రిగా పని చేసిన ఏకైక మహిళ.. కీలకమైన ఆర్థిక శాఖను చేపట్టిన రెండో మహిళ..భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సభ్యురాలిగా ఉన్న రెండో మహిళ..కాంగ్రెస్ కుటుంబం నుంచి వచ్చిన బీజేపీ నాయకురాలు.. ఈ విశేషణాలన్నీ ఒక్కరికే చెందుతాయి. ఆమే నిర్మలా సీతారామన్..!
కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో శుక్రవారం లోక్‌సభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మల బహుముఖ ప్రజ్ఞాశాలి. పుస్తక పఠనంపై ఎంతగా ఆసక్తి చూపుతారో సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లోనూ ఆమె అంతే చురుగ్గా ఉంటారు. తమిళనాడులోని మదురైలో 1959, ఆగస్టు 18న ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టారు నిర్మల. తండ్రి నారాయణ్ సీతారామన్ రైల్వే ఉద్యోగి. తల్లి సావిత్రి గృహిణి. తండ్రి నుంచి క్రమశిక్షణను, తల్లి నుంచి పఠనాసక్తిని పుణికి పుచ్చుకున్నారు నిర్మల. తిరుచిరాపల్లిలోని సీతాలక్ష్మి రామస్వామి కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. 1980లో ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఎం.కాం. పట్టా పుచ్చుకున్నారు. భారత్– యూరప్ జౌళి వాణిజ్యంపై పీహెచ్‌డీ చేశారు. యూనివర్సిటీలో పరిచయమైన తెలుగు వ్యక్తి పరకాల ప్రభాకర్‌ను 1986లో పెళ్లాడారు. తర్వాత ఇద్దరూ లండన్ వెళ్లారు. అక్కడ నిర్మల ప్రైస్‌వాటర్ కూపర్స్ సంస్థలో పని చేశారు. కొన్నాళ్లు బీబీసీకి కూడా సేవలందించారు. 1991లో స్వదేశానికి తిరిగి వచ్చారు. ప్రభాకర్ స్వస్థలమైన నరసాపురం(ఆంధ్రప్రదేశ్)లో కొన్నాళ్లుండి, అటు తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. వీరికి ఒక కుమార్తె ఉంది. నిర్మల హైదరాబాద్‌లో ప్రణవ పేరుతో ఒక విద్యా సంస్థను స్థాపించారు.
భర్త ప్రభాకర్‌ది కాంగ్రెస్ కుటుంబం కాగా, నిర్మల 2006లో బీజేపీలో చేరారు. ప్రభాకర్ 2007లో చిరంజీవి నెలకొల్పిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్న నిర్మల 2010లో బీజేపీ అధికార ప్రతినిధుల్లో ఒకరిగా నియమితులయ్యారు. 2014లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక నిర్మలా సీతారామన్ వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా, ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. 2014లో ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2017, సెప్టెంబర్ 3న రక్షణ శాఖ బాధ్యతలను చేపట్టారు. ఇందిరా గాంధీ తర్వాత రక్షణ మంత్రిగా పని చేసిన మహిళ నిర్మలే. అయితే, ఇందిరాగాంధీ ఏడాది పాటే ఆ శాఖను నిర్వహించారు. నిర్మల పూర్తికాలం రక్షణ మంత్రిగా ఉన్నారు. 2019లో మళ్లీ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. నిర్మలా సీతారామన్‌కు కీలకమైన ఆర్థిక శాఖను అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment