దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను పరిష్కరించే స్ఫూర్తి కూడా కేంద్ర బడ్జెట్‌లో కొరవడటం చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ప్రభుత్వ మొత్తం వ్యయం, ప్రజలను ప్రభావితం చేస్తున్న రంగాల్లో పెట్టే వ్యయంలో కూడా పెరుగుదల కనిపించడం లేదు. తీవ్రమైన నిరుద్యోగిత అలుముకున్న తరుణంలో పనికి ఆహార పథకం తిరోగమించడం ప్రమాదకరం. ప్రభుత్వం స్వయంగా ఖర్చుపెట్టడం, సంక్షేమ పథకాలకు నిధులు వెచ్చించడానికి బదులుగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు మరింతగా తలుపులు బార్లా తెరవడం అంటే.. ప్రజలపై ప్రభుత్వం నేరుగా ఆయుధం గురిపెడుతున్నట్లే లెక్క. విదేశీ రుణాలపై అధికంగా ఆధారపడటం కేంద్రప్రభుత్వాన్ని మరింత విదేశీ ఒత్తిళ్లకు లోబడేలా చేస్తుంది. అంతకు మించి రాష్ట్రాలకు ఆదాయం తగ్గిపోయి కేంద్రంపై ఆధారపడటం.. భారత సమాఖ్యతత్వానికి, ప్రజాస్వామ్యానికే ఇది గొడ్డలిపెట్టు అవుతుంది.
ఆర్థిక శాస్త్రాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నడూ బలమైన అంశంగా భావించలేదు. తొలి దఫా పాలనలో అది తీసుకొచ్చిన కీలకమైన సంస్కరణలు పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ ఎంత వినాశకరంగా పరిణమించాయో అందరికీ తెలిసిందే. కాబట్టే 2019–20 కేంద్ర బడ్జెట్ మనకు ఏదో తెచ్చిపెడుతుందని భావిం చడం అర్థరహితం. ఇలాంటి సందర్భంలో కూడా దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను ఎలా పరిష్కరించాలి అనే స్ఫూర్తి కూడా కేంద్ర బడ్జెట్‌లో కొరవడటం చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఆర్థిక కార్యాచరణ నెమ్మదించడం, వ్యవసాయరంగ సంక్షోభం. భారీస్థాయి నిరుద్యోగిత, విదేశీ చెల్లింపుల భారం వంటి సీరియస్ సమస్యలపై కూడా బడ్జెట్ పెద్దగా దృష్టి కేంద్రీకరించినట్లు లేదు.
ముఖ్యంగా రాబడి వృద్ధి రేటు మందగించిపోతోంది. ఆర్థిక కార్యాచరణ మందగించడం ఒక కారణం కాగా, పేలవమైన జీఎస్టీ వసూళ్లు ప్రధాన కారణం. 2018–19కి గాను సవరించిన వసూళ్ల అంచనాను ప్రస్తుత ఆర్థిక మంత్రి ఉల్లేఖించారు. ఇవి గత సంవత్సరం బడ్జెట్ అంచనాలకు సమీపంగా ఉన్నాయి. కానీ తాజాగా కాగ్ ప్రకటించిన గణాంకాలకంటే ఇవి కాస్త అధికంగా ఉండటం గమనార్హం. కాగ్ నివేదిక ప్రకారం 2018–19 సంవత్సరంలో కేంద్రప్రభుత్వం బడ్జెట్ అంచనాతో పోలిస్తే జీఎస్టీ రాబడిలో రూ. 1.6 లక్షల కోట్లు తక్కువగా నమోదైంది. ఇక 2019–20 ఆర్థిక సంవత్సరంలో పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేసినా వాస్తవానికి అలా కనిపించడం లేదు.
బడ్జెట్ ప్రకారం చేసిన వ్యయంలో కూడా పెరుగుదల కనిపించడం లేదు. మొత్తం వ్యయం, ప్రజలపై ప్రభావితం చేస్తున్న రంగాల్లో పెట్టిన వ్యయం విషయంలో కూడా పెరుగుదల కనిపించడం లేదు. చాలావరకు పెరిగిన వ్యయాలు సాధారణ జీడీపీలో అంచనా వేసిన రేటు ప్రకారంగానే జరుగుతూ వచ్చాయి. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మహాత్మాగాంధీ జాతీయ పనికి ఆహార పథకం విషయంలో 2018–19కి గాను సవరించిన అంచనాలతో సరిపోల్చితే తగ్గుముఖం పట్టింది. దేశవ్యాప్తంగా తీవ్రమైన నిరుద్యోగిత అలుముకున్న తరుణంలో పనికి ఆహార పథకం తిరోగమించడం ప్రమాద ఘంటికలను మోగిస్తోంది.
చేసిన ఈ వ్యయాలకు సంబంధించిన గణాంకాలు కూడా 2018–19కి గాను సవరించిన అంచనాల ప్రాతిపదికపైనే పొందుపర్చడమైనది. సవరించిన అంచనాల కంటే వాస్తవ అంచనా తగ్గుముఖం పట్టినందువల్ల 2019–20లో కూడా ఈ పతనం కొనసాగుతుందని స్పష్టమవుతోంది. ప్రపంచీకరణ నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్యవ్యవస్థ ఒత్తిళ్లను సంతృప్తిపర్చాల్సి ఉందని ఎన్డీఏ భావిస్తున్నందున అంచనా వేసిన ఈ వ్యయాలనైనా కేంద్రప్రభుత్వం ఖర్చుపెట్టగలదా అనేది సందేహమే. ముంచుకొస్తున్న మాంద్య పరిస్థితుల్లో వ్యయానికి సంబంధించి పెట్టుకున్న లక్ష్యాలను కూడా కొనసాగించడం కష్టమే కావచ్చు.
ఈ పరిస్థితుల్లో దేశానికి అవసరమైంది రాబడి, ఖర్చుల గణాంకాలను వల్లించే బడ్జెట్‌పై కేవలం చర్చ కాదు. ఆర్థిక వ్యవస్థను వేగవంతం చేసే అదనపు రాబడి వనరులపై తక్షణం దృష్టి సారించాల్సి ఉంది. కానీ ఈ కోణంలో ఎలాంటి సృజనాత్మక ఆలోచనలను చేపట్టడానికీ ఎన్డీఏ ప్రభుత్వం తిరస్కరించడం గమనార్హం. ప్రస్తుతం కేంద్రానికి వస్తున్న రాబడుల ట్రెండ్స్‌ని భవిష్యత్తుకు కూడా సూచికలుగా అలా ప్రస్తావించడం మినహా తాజా బడ్జెట్ పెద్దగా ఊడబొడిచిందేమీ లేదు.
ఈ దఫా బడ్జెట్‌లో గణనీయంగా పేర్కొనాల్సిన విషయం ఏమిటంటే సంపద పన్ను పెంచడం. దేశంలోని బిలియనీర్ల మొత్తం ఆదాయం రూ. 560 లక్షల కోట్లుగా అంచనా. వీరిపై కనీసం ఒక్క శాతం సంపద పన్ను పెంచినా సరే కేంద్రప్రభుత్వానికి రూ. 5.6 లక్షల కోట్ల ఆదాయం వచ్చే అవకాశముంది. ఇక వారి వారసత్వ ఆస్తులపై కూడా పన్ను పెంచినట్లయితే అదనంగా రూ.9.3 లక్షల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు రకాల పన్నులను దేశీయ బిలియనీర్లపై విధించినట్లయితే రూ.15 లక్షల కోట్ల రాబడి కేంద్ర ఖజానాకు సమకూరుతుంది. దేశంలో కునారిల్లుతున్న సంక్షేమ పథకాలకు ఈ భారీ మొత్తం కాస్త ఊపిరి పోసే అవకాశం ఉంది. ఇంత రాబడి వచ్చినట్లయితే, ప్రతి భారతీయుడికీ అయిదు ప్రాథమిక హక్కులకు హామీ ఇవ్వవచ్చు. అవేమిటంటే, ఆహార హక్కు, ఉపాధి హక్కు, సెకండరీ స్థాయివరకు నాణ్యమైన విద్యను పొందే హక్కు, ప్రభుత్వం నిర్వహించే జాతీయ ఆరోగ్య సేవ ద్వారా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ హక్కు, వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్కరికీ నెలకు రూ. 2,000ల వృద్ధాప్య పింఛను (ఇప్పుడు నెలకు రూ. 200 మాత్రమే ఇస్తున్నారు). హక్కుతోపాటు దివ్యాంగులకు ప్రయోజనాలు కూడా కల్పించవచ్చు.
నిజానికి, బడ్జెట్ సమర్పించడానికి ముందు, సంపన్నులపై వారసత్వ పన్ను విధిస్తారని భావించారు. ఆశ్చర్యకరంగా ప్రస్తుత బడ్జెట్ దాని ప్రస్తావన అయినా తేలేదు. మరోవైపున, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల గురించి ఊదరగొడుతున్నారు. తాజా బడ్జెట్‌లో ఏదైనా వ్యూహా త్మకపరమైన అంశం ఏదైనా ఉందంటే, దేశంలోనికి ఎఫ్‌డీఐలను ఆకర్షించడం మాత్రమే. ఇది కూడా కార్మికుల హక్కులను అణిచివేయడం, భూమిని మరింత సులభంగా స్వాధీనపర్చుకోవడం ద్వారా అమలు కానుంది. ఈ రకమైన అభివృద్ధిని కొనసాగించడం అంటే నిరుద్యోగి తను మరింతగా పెంచడానికే దారితీస్తుంది. ప్రభుత్వం స్వయంగా ఖర్చుపెట్టడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నిధులు వెచ్చించడం అనే అంశాలను దేశ ఆర్థిక వ్యవస్థ చోదకశక్తిగా మార్చడానికి బదులుగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు మరింతగా తలుపులు బార్లా తెరవడం అనేది ప్రజలపై ప్రభుత్వ ఆయుధంగా మారనుంది. ప్రపంచ ఆర్థికవ్యవస్థ మందగమనంలోకి జారిపోతున్న తరుణంలో, బహుళ జాతీయ సంస్థలు ఆయా దేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కోల్పోతున్న తరుణంలో ప్రభుత్వమే ఖర్చుపెట్టడం ద్వారా అభివృద్ధిని ముందుకు తీసుకుపోవడం ప్రజా ప్రయోజనాలకు పట్టం కట్టినట్లవుతుంది. నరేంద్రమోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మేక్ ఇన్ ఇండియా నినాదం లక్ష్యమే ఇది. కానీ ఆ మార్గంలో గత ఐదేళ్లలో కేంద్రం ఎంతమేరకు నడిచింది?
కేంద్ర ప్రభుత్వం కొన్ని తీపి మాటలు చెబుతూ కొద్దిమేరకు పెట్టుబడులను తీసుకురాగలిగినట్లు చెప్పుకోవడం నిజమని భావించినప్పటికీ, అది గత అయిదేళ్లలో ఎన్ని ఉద్యోగాలను సృష్టించగలిగింది అనేది ప్రశ్న. ఒకవైపు బహుళ జాతి సంస్థలు, మరోవైపు దేశీయ బడా వాణిజ్యవేత్తలు సాధించిన వృద్ధి రేటు అధికంగా ఉందని ప్రచారం జరుగుతున్నప్పటికీ, పెంచి చెబుతున్న ఇంత భారీ జీడీపీ రేట్లు కూడా దేశ శ్రామిక వర్గానికి అవసరమైన సహజ ఉపాధిని పెంచలేకపోవడం గమనార్హం. ఇలాంటి తరహా వృద్ధి ధోరణులతో దేశీయ నిరుద్యోగితను తొలగిస్తామని చెప్పడం పూర్తిగా అవాస్తవికమే అవుతుంది. ఇదంతా అందరికీ అనుభవైకవేద్యమైన విషయమే కానీ మోదీ ప్రభుత్వం కూడా మధ్యయుగాల ఫ్రాన్స్ బర్బన్ రాజుల్లాగా, ‘నేర్చుకున్నదీ లేదు.. మర్చిపోయిందీ లేదు’ అనే దోరణిలో కూరుకుపోవడం విశేషం.
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌లో పొందుపర్చిన రెండు అంశాలు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారి తీయనున్నాయి. ఒకటి. ప్రభుత్వ రుణాల కోసం అంతర్జాతీయ ద్రవ్యమార్కెట్లను సంప్రదించడం. దీనివెనుక ఎలాంటి విలువైన కారణం కూడా కనిపించడం లేదు.
ఎందుకంటే ప్రభుత్వ రుణాలపై పరిమితి అనేది ద్రవ్యలోటుపై స్వయంగా విధించుకున్న సీలింగ్‌పై ఆధారపడి ఉంటుందే తప్ప దేశీయ మార్కెట్లో రుణాలు సాధించలేని ప్రభుత్వ అసమర్థతపై ఆధారపడి ఉండదు. ప్రభుత్వం విదేశాల నుంచి రుణాలకు ప్రయత్నించడం పెరగటం అంటే, భారత ప్రభుత్వంపై అంతర్జాతీయ ద్రవ్యసంస్థల పట్టును మరింతగా పెంచడమే అవుతుందని మర్చిపోరాదు. ఇలాంటి నేపథ్యంలో రుణాలను తేవడంలో వాటిని తీర్చడంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా దేశంపై నిరంకుశంగా మితవ్యయాన్ని రుద్దడానికి ఆస్కారం ఉంటుంది. పైగా బడ్జెట్ విదేశీ మారక మార్కెట్టును ద్రవ్యమార్కెట్‌తో ముడిపెట్టింది. దీనివల్ల రూపాయి పతనం మరింత పెరిగి ప్రభుత్వంపై రుణభారం ఆకాశాన్ని అంటుతుంది. అంతిమంగా కేంద్ర ప్రభుత్వం విదేశీ ఒత్తిళ్లకు పూర్తిగా లోబడాల్సిన పరిస్థితి ఏర్పడక మానదు.
ఇక రెండో అంశం సమాఖ్యతత్వానికి చెందినది. జీఎస్టీని తనకు తానుగా భారత రాజ్యాంగంలోని సమాఖ్య చట్రంపై చేసిన భారీ దాడిగా చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి వివేచన లేకుండా ఈ ఒకే దేశం ఒకే పన్ను విధానాన్ని గుడ్డిగా ఆమోదించేశాయి. కానీ ఆశించిన రాబడిలో జీఎస్టీ విఫలం కావడం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంపై దారుణ ప్రభావం వేసింది. దీనికంటే మిన్నగా ప్రస్తుత కేంద్ర బడ్జెట్‌లో, కేంద్రప్రభుత్వం తన రాబడిని పెంచుకోవడానికి సెస్సులు, సర్చార్జీలను పునరుద్ధరిం చింది. అంటే ఇలా ఆర్జించే రాబడిలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమాత్రం వాటా ఉండదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆర్థిక వనరులను కేంద్ర ప్రభుత్వం గుప్పిటలో ఉంచుకోవడానికి ఇది ఇతోధికంగా ఉపయోగపడుతోంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామం. ఎందుకంటే రాష్ట్రాలు ఒక మూలకు నెట్టబడి కేంద్రం సహాయానికి దేబిరించాల్సి వస్తుంది. కేంద్రం కూడా తనకు అనుకూలంగా ఉండే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు, వ్యతిరేకంగా ఉండే రాష్ట్ర ప్రభుత్వాలను ఉపేక్షించడం అలవాటు చేసుకునే స్థితి ఏర్పడుతుంది. భారత సమాఖ్యతత్వానికి, ప్రజాస్వామ్యానికే ఇది గొడ్డలి పెట్టు అవుతుంది.
వ్యాసకర్త విశ్రాంత ఆర్థిక ఆచార్యులు, జేఎన్‌యూ, ఢిల్లీ
ప్రభాత్ పట్నాయక్
Comments
Please login to add a commentAdd a comment