సాక్షి, న్యూఢిల్లీ : భారత దేశం రెండంకెల జీడీపీ వృద్ధి రేటును సాధించే చారిత్రక సంధికాలంలో ఉందని ప్రధాన మంత్రి ప్రధాన మాజీ ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణియన్ ఐదేళ్ల క్రితం వ్యాఖ్యానించారు. ఆయన ఇటీవలనే నరేంద్ర మోదీ ప్రభుత్వం గత ఐదేళ్లలో సాధించినట్లు చెబుతున్న జీడీపీ వృద్ధి రేట్ల పట్ల పలు అనుమానాలు వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం చూపించిన 6.8 నుంచి 7.1 శాతం వృద్ధి రేటు సరైనదని కాదని, అంతకన్నా తక్కువ ఉంటుందని, స్వతంత్ర ఆర్థిక నిపుణులతో తిరిగి లెక్కలు వేయించాలని కూడా సూచించారు. అయితే ‘గత ఐదేళ్ల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ సజావుగా ఉంది’ గురువారం విడుదల చేసిన ఆర్థిక సర్వే నివేదికలో ప్రధాన మంత్రి కొత్త ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్ వ్యాఖ్యానించారు.
బీజేపీ ప్రభుత్వం చివరి రోజుల్లో జీడీపీ రేటు మరింత పడిపోయిన విషయాన్ని గానీ, నిరుద్యోగ సమస్య 6.1 శాతంతో గత 49 ఏళ్లలోనే గరిష్ట స్థాయికి చేరుకుందంటూ కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందన్న విషయాన్ని సుబ్రమణియన్ ప్రస్తావించలేదు. ప్రస్తుతం 2.8 ట్రిలియన్ డాలర్లు ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను ఐదు ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లడం తన లక్ష్యమన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్న మాటలను ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆ లక్ష్యాన్ని ఆర్థిక సర్వేలో చేర్చారు. దీని కోసం చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించాలని కూడా ఆర్థిక సర్వే సూచించింది. అందుకోసం పన్ను రాయతీలు కల్పించాలని, విమాన సర్వీసుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. విమాన సర్వీసుల్లో ప్రాధాన్యతకు సరైన వివరణ, స్పష్టత లేదు. వాళ్ల కోసం సీట్లను రిజర్వ్ చేసి ఉంచాలా? వారు ప్రయాణించాలనుకుంటే అప్పుడు సీట్లను సర్దుబాటు చేయాలా? వారిని మంచి బిజినెస్ క్లాస్‌లో కూర్చోబెట్టాలా? వారికి టిక్కెట్లలో రాయతీ కల్పించాలా? లేదా ప్రయాణ సౌకర్యం కల్పించాలా? స్పష్టత లేదు. చిన్న, మధ్య తరహా పారిశ్రామిక వేత్తలు విమానాల్లో పర్యటించాల్సినంత అవవసరం ఉంటుందా? అన్నది అసలు ప్రశ్న.
కారు మబ్బులు కమ్ముకున్న ప్రస్తుత ఆర్థిక ఆకాశం నుంచి కాసులు కురుస్తాయన్న బాగుండేమోగానీ, ఆర్థికాకాశం నీలి రంగులో మెరిసిపోతోందని ఆర్థిక నిపుణులు కేవీ సుబ్రమణియన్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఆశించిన ఫలితాల కోసం ఎన్ని కాలాలు వేచి చూడాలో! (చదవండి: 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యమా?!)
Comments
Please login to add a commentAdd a comment