
సాక్షి, అమరావతి : కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్ ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేకంగా ఎలాంటి కేటాయింపులు లేవని, ప్రత్యేక హోదా, రాజధాని, రెవెన్యూ లోటు, పోలవరం వంటి కీలక అంశాల్లో తమ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రాన్ని కోరిన వాటిలో కేవలం పొదుపు సంఘాలకు వడ్డీ రాయితీని మాత్రమే ఇచ్చారని అన్నారు. కేంద్ర బడ్జెట్ ప్రభావం రాష్ట్ర బడ్జెట్‌పై తప్పకుండా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చేయూతనివ్వాల్సిన అవసరం ఉందనీ, కానీ కేంద్రం అలా చేయలేదని అన్నారు. రాష్టానికి రావాల్సిన ప్రతి అంశంపై కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నామని, అయితే కొన్ని కేటాయింపులపై సర్దుకుపోవాలన్నారు. ఏదేమైనా నవరత్నాలు, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతిహామీని అమలురుస్తామని ఆయన ఉద్ఘాటించారు.