పోలవరం ఎత్తు 41.15 మీటర్లకే ఎందుకు పరిమితమైంది?: బుగ్గన | Buggana Rajendranath questioned Chandrababu Naidu on Polavaram Project | Sakshi
Sakshi News home page

పోలవరం ఎత్తు 41.15 మీటర్లకే ఎందుకు పరిమితమైంది?: బుగ్గన

Published Sun, Feb 2 2025 5:15 AM | Last Updated on Sun, Feb 2 2025 5:18 AM

Buggana Rajendranath questioned Chandrababu Naidu on Polavaram Project

ఆ మేరకే ప్రాజెక్టు పూర్తిచేస్తామని బడ్జెట్‌లో ఎందుకు ప్రస్తావించారు? 

సీఎం చంద్రబాబుకు తెలీకుండానే కేంద్రం దీనిని ఖరారు చేస్తుందా? 

12 మంది ఎంపీలతోనే బిహార్‌కు అత్యధిక ప్రాధాన్యం దక్కింది కదా.. 

మరి 16 మంది ఎంపీలున్నా బాబు ఎందుకు నిధులు రాబట్టలేకపోయారు? 

నిర్మాణంలో ఉన్న పోర్టులకూ ఎందుకు నిధులు కోరలేదు? 

75వేల మెడికల్‌ సీట్లు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కేంద్రం చెబుతోంది కదా

మరి మన రాష్ట్రానికి 750 సీట్లు ఎందుకు వద్దనుకున్నారు? 

సీఎం చంద్రబాబుకు మాజీ ఆర్థిక మంత్రి ‘బుగ్గన’ ప్రశ్నల వర్షం

కర్నూలు (టౌన్‌): పోలవరం ప్రాజెక్టుకు తీరని నష్టం చేకూరడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వాకం కాదా అని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రశ్నించారు. గతంలోనూ ఆయన చేతగానితనం, పొరపాట్ల కారణంగా ఈ ప్రాజెక్టుకు ఎంతో నష్టం జరిగిందని.. ఇప్పుడు మళ్లీ ఆయన నిర్లక్ష్యంతో ప్రాజెక్టుకు పెనుముప్పు ఏర్పడుతోందన్నది నిజం కాదా అని నిలదీశారు. 2025–26 కేంద్ర బడ్జెట్‌ను శనివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన నేపథ్యంలో బుగ్గన కర్నూలులో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ అనేక ప్రశ్నలు సంధించారు. 

ఆయన ఏమన్నారంటే.. పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల ఎత్తుతోనే పూర్తిచేసేందుకు రూ.5,936 కోట్లు ఇస్తామని కేంద్ర బడ్జెట్‌లో చెప్పారు. వాస్తవానికి.. పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మిoచాల్సి ఉంది. ఆ విధంగా నిరి్మస్తేనే పోలవరం ద్వారా 200 టీఎంసీల నీరు లభిస్తుంది. దీనివల్ల కృష్ణా, గోదావరి జిల్లాల్లోని లక్షలాది ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, కొత్త ఆయకట్టుకు నీరు లభిస్తుంది. 

అలాగే, 960 మెగావాట్ల విద్యుదుత్పత్తి, విశాఖ నగరానికి, 600 గ్రామాలకు తాగునీరు అందుతుంది. ఈ ప్రయోజనాలు చేకూరాలంటే 150 అడుగుల మేర నిర్మిస్తేనే సాధ్యపడుతుంది. అయితే, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకే ఎందుకు పరిమితం చేస్తున్నారు. దీనిని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి తెలీకుండానే కేంద్రం పోలవరం ఎత్తును 41.15 అడుగులకు ఖరారు చేస్తుందా? 

నిజానికి.. 2017–18లో చంద్రబాబు ప్రభుత్వం అలాంటి పొరపాటే చేస్తే దానిని సరిదిద్దుకునేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి నాలుగేళ్లు పట్టిన విషయం నిజం కాదా? ఇక రూ.12,500 కోట్లు సాధించామని చంద్రబాబు చెబుతున్నారు. ఇది మా ప్రభుత్వం సాధించింది కాదా!? ఆనాడు కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా పోలవరం ఎత్తుపై వివరణ ఇచ్చాం. తొలి ఏడాది 41.15 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేపట్టి నీటిని నిల్వచేస్తామని చెప్పాం కదా.. తర్వాత రెండేళ్లలో నీటినిల్వ పెరుగుతున్న కొద్దీ ముంపు ప్రాంతాల్లో భూసేకరణ చేపట్టి ప్రాజెక్టు ఎత్తున 45.72 మీటర్లకు పెంచుతామని చెప్పాం. 

ఇది ప్రాజెక్టు మాన్యువల్‌లోనూ ఉందా లేదా!? కానీ, ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం అవేమీ లేకుండానే పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల ఎత్తుతోనే పూర్తి­చేస్తామని బడ్జెట్‌లో రాయించుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? తక్షణం దీనిపై కేంద్రానికి క్లారిటీ ఇవ్వకపోతే పోలవరం ప్రాజెక్టుకు, రాష్ట్ర ప్రజలకు తీరని నష్టం జరుగుతుంది. ఇదిలా ఉంటే.. బడ్జెట్‌ కాపీలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి.. ‘నిర్మాణం’ అన్న పదానికి బదులు ప్రాజెక్టు పూర్తి (కంప్లీషన్‌)కి అని ఎందుకు పేర్కొన్నారు? దీని వెనకున్న మతలబు ఏంటి? ఇకపోతే.. రాష్ట్రంలో నాలుగు పోర్టులు నిర్మాణంలో ఉన్నాయి. వాటికీ ఎందుకు నిధులు కోరలేదు?  
 
16 మంది టీడీపీ ఎంపీలున్నా బాబు ఎందుకు విఫలమయ్యారు? 
ఇక ఎన్‌డీఏ కూటమిలో 16 మంది టీడీపీ ఎంపీలున్నా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో.. నిధులు రాబట్టడంలో సీఎం చంద్రబాబు ఎందుకు ఘోరంగా విఫలమయ్యారు? ఈ విషయంలో ఆయన ఏమాత్రం చొరవ చూపలేదన్నది నిజం కాదా? వాస్తవానికి.. టీడీపీ మద్దతుతో కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం నడుస్తోంది. ఆ పార్టీకి 16 మంది ఎంపీలూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలోనూ టీడీపీ కొనసాగుతోంది కదా! అయినా కేంద్ర బడ్జెట్‌ నుంచి ఏపీకి చంద్రబాబు ఎందుకు నిధులు సాధించలేకపోయారు? 

రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడంలో చంద్రబాబు అసమర్థుడిగా నిలిచారా లేదా? ఇక గతంలో వైఎస్సార్‌సీపీకి 23 మంది ఎంపీలున్నారని, కేంద్రం నుంచి ఎక్కువ నిధులు దక్కించుకోవడంలో విఫలమవుతున్నారంటూ చంద్రబాబు పదేపదే విమర్శించారు కదా! నిజానికి.. అప్పుడు కేంద్రానికి వైఎస్సార్‌సీపీ మద్దతు అవసరంలేదు. కానీ, ప్రస్తుతం టీడీపీ మద్దతుపై కేంద్రం  ఆధారపడి ఉంది. దీనిని వినియోగించుకుని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పెద్దఎత్తున నిధులు తెచ్చుకునే స్థితిలో చంద్రబాబు ఉన్నా ఇప్పుడాయన ఎందుకు విఫలమయ్యారు? 

అదే కేవలం 12 మంది ఎంపీలతోనే బిహార్‌ రాష్ట్రం ఎక్కువ నిధులు సాధించి బడ్జెట్‌లో అత్యధిక ప్రాధాన్యత ఎలా దక్కించుకుంది? ఇటీవల నీతి ఆయోగ్‌ నివేదికపై మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. తలసరి ఆదాయంపై ఆయన విశ్లేషణను చూసి ఒక ఎన్‌ఆర్‌ఐ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. సీఎం లెక్కల్లోని తప్పులను ఎత్తిచూపారు. 2018–19లో ఏపీలో తలసరి ఆదాయం రూ.1.54 లక్షలు ఉంటే 2022–23లో రూ.2.20 లక్షలకు చేరింది. చంద్రబాబు హయాం కంటే జగన్‌ హయాంలో తలసరి ఆదాయం పెరిగింది నిజమా కాదా? సీఎంగా ఉన్న వ్యక్తే తప్పుడు లెక్కలు చెబితే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారా?  

వైఎస్సార్‌సీపీ విధానాలే కేంద్రంలోనూ
ఇక వైఎస్‌ జగన్‌ హయాంలో అమలుచేసిన విద్యా ప్రమాణాల పెంపు విధానాలనే నేడు కేంద్రం అనుసరిస్తోంది. సెకండరీ, ప్రైమరీ పాఠశాలలకు బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్టివిటీ రాబోతోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ స్కూళ్లలో ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్స్‌ ఏర్పాటుచేసి బ్రాడ్‌బాండ్‌ సర్విస్‌ అందించాం. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేశాం. టీడీపీ, ఎల్లో మీడియా దీనిని తీవ్రంగా వ్యతిరేకించాయి. 

రాబోయే ఐదేళ్లలో దేశంలో 75 వేల మెడి­కల్‌ సీట్లు అందుబాటులోకి వస్తున్నట్లు బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించింది కదా.. అందులో భాగంగా ఈ ఏడాది 10 వేల సీట్లు ఇవ్వాలని నిర్ణయించారు కదా.. ఆనాడు మెడికల్‌ సీట్ల ఆవశ్యకతను మాజీ సీఎం జగన్‌ గుర్తించి రాష్ట్రంలో ఒకేసారి 17 మెడికల్‌ కాలేజీల నిర్మాణం మొద­లుపెట్టి గత ఏడాది ఐదింటిని ప్రారంభించారు. 

దీనివల్ల 750 మెడికల్‌ సీట్లు అందుబాటులోకి వచ్చా­యా లేదా? అన్ని కళాశాలలు పూర్తయితే 2,450 సీట్లు దక్కేవి. కానీ, చంద్రబాబు ప్రభుత్వం మెడికల్‌ సీట్ల సాధనలో ఎందుకు చొరవ చూపట్లేదు? రాష్ట్ర విద్యా­ర్థులకు ఎందుకు ఇంతలా నష్టం చేకూరుస్తున్నారు?.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement