
సూపర్ సిక్స్ హామీల అమలుకు కేటాయింపులు లేవు: బుగ్గన
అప్పులపైనా కూటమి పార్టీల అబద్ధాల కుట్ర బట్టబయలైంది
డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకొంటున్నారు కదా..?
మరి సృష్టిస్తున్న సంపదను ఎన్నికల హామీల అమలుకు ఎందుకు కేటాయించడం లేదు?
సాక్షి, అమరావతి: రాష్ట్ర బడ్జెట్ బుక్ చూస్తే కలర్ ఎక్కువ... కంటెంట్ తక్కువగా కనిపిస్తోందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు అంటూ ఇన్నాళ్లూ సీఎం చంద్రబాబు చేసిన దుష్ప్రచారం బడ్జెట్ లెక్కల సాక్షిగా బయటపడిందన్నారు. బుగ్గన ఇంకా ఏమన్నారంటే..
» బడ్జెట్ అంచనా వ్యయం రూ.3,22,359 కోట్లు, రెవెన్యూ రాబడి రూ.2,17,976 కోట్లు, అప్పు రూ.1,04,382 కోట్లుగా చూపించారు. ఇది కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్. బడ్జెట్ ప్రసంగంలో గత ప్రభుత్వం గురించి 25 సార్లు, విధ్వంసం అంటూ మరో పది సార్లు ప్రస్తావించారు. ప్రభుత్వం ఏర్పాటై పది నెలలు అవుతోంది. ఇకనైనా ప్రజలకు ఎన్నికల హామీల అమలు గురించి చెప్పాల్సిన అవసరం లేదా?
» సూపర్ సిక్స్ హామీలపై ప్రతి ఇంటికి తిరిగి పదేపదే చెప్పి ప్రజలను నమ్మించారు. 2019–24 వరకు నాటి సీఎం వైఎస్ జగన్ క్యాలెండర్ ప్రకారం మేనిఫేస్టోలో చెప్పినది ప్రతీదీ అమలు చేశారు. అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఇదే తరహాలో హామీలను అమలు చేస్తుందని ఆశతోనే ప్రజలు కూటమికి పట్టం కట్టారు. గతంలో అనేకసార్లు చంద్రబాబు వల్ల మోసపోయినా కూడా తిరిగి వారు చెప్పిన ఆకర్షణీయమైన హామీలతో మోసపోయి కూటమికి అధికారం అప్పగించారు.
సూపర్ సిక్స్ హామీల అమలేదీ?
సూపర్ సిక్స్ హామీల అమలును చూస్తే తొలి ఏడాది బడ్జెట్ లో ఎలా మొండిచేయి చూపించారో అలాగే ఈ బడ్జెట్ లో కూడా చేశారు. దీపం పథకం కింద అర్థదీపం, పావుదీపం అమలు చేశారు. మరోవైపు కూటమి ప్రభుత్వం చేసినంత అప్పు చరిత్రలో ఏ ప్రభుత్వం చేయలేదు. ఒక్క ఏడాదిలోపే రూ.1.19 లక్షల కోట్లు అప్పులు చేశారు. 1995 నాటి పరిస్థితిని ఉదహరిస్తూ, జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నామని ఆర్థిక మంత్రి వాపోయారు.
కానీ ఉమ్మడి రాష్ట్రంలో 1995లో మిగులు బడ్జెట్ ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకుంటున్నారు. మరి ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుకు ఈ సృష్టిస్తున్న సంపదను ఎందుకు కేటాయించడం లేదు? 2014–19 లో స్థూల ఉత్పత్తి 13.5 పెరిగితే, 2019–24 లో 10.3 పెరిగిందని పోలిక చెబుతున్నారు. వైఎస్సార్‌సీపీ హాయంలో కోవిడ్ తో మొత్తం ఎకానమీ దెబ్బతిన్న సమయాన్ని కూడా పోలుస్తారా?
అప్పులపై తప్పుడు లెక్కలు
» అప్పుల గురించి మాట్లాడుతూ 2024, మార్చి 31 నాటికి అప్పు రూ.3,75,295 కోట్లు ఉంది. ప్రభుత్వ అప్పు రూ. 4,38,278 కోట్లు, పబ్లిక్ అకౌంట్స్ లైబిలిటీస్ రూ. 80,914 కోట్లు, కార్పోరేషన్ అప్పులు రూ.2,48,677 కోట్లు, సివిల్ సప్లయిస్ రూ.36,000 కోట్లు, విద్యుత్ సంస్థలు రూ.34,267 కోట్లు, రూ.1,13,000 కోట్లు కాంట్రాక్టర్‌లకు, ఎంప్లాయిస్ కు రూ.21,000 కోట్లు, మొత్తం కలిపి రూ.9,74,556 కోట్లు అప్పులు ఉన్నాయని ముఖ్యమంత్రి తన ప్రజెంటేషన్‌లో వెల్లడించారు. అంతకు ముందు వైఎస్సార్‌సీపీ రూ.14 లక్షల కోట్లు అప్పులు చేసిందని ఎలా మాపై విషప్రచారం చేశారు?
» కార్పొరేషన్ అప్పులు రూ.2,48,677 కోట్లు అన్ని చంద్రబాబు చెప్పారు. కానీ కాగ్ చెప్పిన దాని ప్రకారం రూ.1,54,797 కోట్లు అని స్పష్టంగా ఉంది. అంటే కాగ్ చెప్పినది సరైనదా? లేక మీరు చెబుతున్న లెక్కలు సరైనవా? వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆర్థిక అంశాలపై ఏది చెప్పినా ప్రతి దానికీ ఆధారాన్ని చూపించేవారు, కానీ కూటమి మాత్రం తమ లెక్కలకు ఎక్కడా ఆధారాలను చూపించడం లేదు.
సివిల్ సప్లయిస్ కు ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీ ఇవ్వలేకపోవడం వల్ల, పేమెంట్ చేయడానికి సివిల్ సప్లయిస్ అప్పులు చేసింది. అంటే ఈ రూ.36,000 కోట్లు కూడా కాగ్ చెప్పిన రూ. 1,54,797 కోట్ల అప్పుల్లో కలిసే ఉంది. కానీ దానిని కూటమి ప్రభుత్వం విడిగా చూపి ఎక్కువ అప్పులు ఉన్నట్లుగా చిత్రీకరించింది. డిస్కం అప్పుల గురించి రూ.34,267 కోట్లు ఉన్నట్లు చూపించారు.
సడ్సీటీ కింద రైతులకు, ఎస్సీ, ఎస్టీ లకు గృహ వినియోగ సబ్సిడీని ప్రభుత్వం డిస్కంలకు కట్టకపోవడం వల్ల డిస్కంలు అప్పులు చేశాయి. ఇవి కూడా కాగ్ చెప్పిన మొత్తంలో కలిసే ఉన్నాయి. దానిని కూడా విడిగా చూపి ఎక్కువ అప్పులు చేశామని ప్రచారం చేశారు.
» అలాగే కాంట్రాక్టర్ లకు చెల్లించాల్సిన వాటిల్లో అప్ లోడ్ అయినవి 86,000 కోట్లు వీటిని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. మొత్తం అప్పులు చూస్తే 7,83,773 కోట్లుగా లెక్క తేలుతున్నాయి. వీటిల్లో 3,90,250 కోట్లు తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయి, వైయస్‌ఆర్ సీపీ పాలనలోకి వచ్చినప్పుడు ఉన్న అప్పు. మా హయాంలో జరిగిన అప్పు రూ.3,33,513 కోట్లు మాత్రమే. కానీ కూటమి పార్టీలు మాపై తప్పుడు ప్రచారం చేశాయి. శ్రీలంక, కాంబోడియా అంటూ దుష్ప్రచారం చేశాయి.
సంపద సృష్టించడమంటే వృద్ధి రేటు తగ్గడమా?
» సంపద సృష్టి అంటూ చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. పదినెలల్లో మైనస్ 0.01 శాతం వృద్ధిలో ఉన్నారు. వైఎస్సార్‌సీపీకి పాలన చేతకాదు అంటూ విమర్శలు చేశారు. మరి ఈ పదినెలల్లో మీరు చేసింది ఏమిటీ? స్థూల ఉత్పత్తి బాగుంటే, రెవెన్యూ రాబడిలో వృద్ది కనిపిస్తుంది.
2024లో అంటే ఏప్రిల్ నుంచి 2025 జవనరి వరకు పదినెలలు లెక్కేస్తే రెవెన్యూ రాబడి మైనస్ లోకి వచ్చింది? 2023 ఏప్రిల్ నుంచి 2024 జనవరి వరకు వైఎస్సార్‌సీపీ పాలనలో సాధించిన రెవెన్యూ రూ. 72,872 కోట్లు. కూటమి పాలనలో పది నెలల్లో రూ.72,864 కోట్లు వచ్చింది. అంటే మా కన్నా ఎనిమిది కోట్లు తక్కవగా రెవెన్యూ వచ్చింది. ఇదేనా మీ సంపద సృష్టి?
» నీతి అయోగ్ ప్రకారం 2015–19 వరకు 12.9 శాతం రెవెన్యూ రాబడిలో సీఎజీఆర్ ఉంది. 2020–23 వరకు 14.1 శాతం పెరిగింది. దీనిని బట్టి ఎవరు సంపదను సృష్టిస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇంటిపన్నులు పెంచి రెవెన్యూ పెంచుకోవాలని చూస్తున్నారు. పన్నులు పెంచడం వల్ల రాబడి పెరగకపోగా ఒకదశలో నిలిచిపోతుంది. ఫిబ్రవరి 1, 2025 నాటికి 16,997 గ్రామాలు, 9వేల వార్డుల్లో మార్కెట్ విలువను పెంచాలని ప్రతిపాదించారు. కూటమి పాలనలో స్టాంప్స్ అండ్ రెవెన్యూ ఆదాయం పడిపోవడంతో దానిని పెంచుకోవడానికి భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచాలని నిర్ణయించారు.
వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు
తాజా బడ్జెట్ లో వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ధాన్యంకు గత ఏడాది రూ. 1740 క్వింటా రేటు ఉంటే, ఈ ఏడాది రూ.1,470 నుంచి 1,500 ఉంది. ఎంఎస్పీ రూ. 2,300 ఉంది. ప్రొక్యూర్ మెంట్ ఎక్కడ జరుగుందో తెలియడం లేదు. వ్యవసాయదారులు దళారీలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. మిర్చి క్వింటా గత ఏడాది 21 నుంచి 23 వేలకు అమ్మితే ఈ ఏడాది రూ.8 నుంచి 11 వేలకు అమ్ముతున్నారు. పత్తి క్వింటా గత ఏడాది మా హయాంలో రూ.10 వేలు ఉంటే, ఇప్పుడు రూ.5000కి అమ్మతున్నారు.
మినుములు గత ఏడాది రూ.10 వేలు ఉంటే, ఈ ఏడాది రూ.6 వేలు, కంది క్వింటాలు గత ఏడాది రూ.9–10వేలు అమ్మితే ఈ ఏడాది రూ.5500 లకు అమ్ముకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అన్నదాత సుఖీభవ కింద ఎక్కడా రైతులను ఆదుకోవడం లేదు. రూ.6300 కోట్లు అన్నదాతా సుఖీభవ కోసం బడ్జెట్ లో రాశారు. కేంద్రం ఇచ్చే ఆరు వేలను కూడా కలుపుకునే అని మాట మార్చారు. దీని ప్రకారం చూసినా 45 లక్షల మంది రైతులకే అందుతుంది. మొత్తం 55 లక్షల మంది రైతులు ఉన్నారు.
ఇరవై వేలు రాష్ట్రప్రభుత్వమే ఇస్తే కనీసం 30 లక్షల మందికి కూడా ఈ కేటాయింపులు సరిపోవు. గత ఏడాదికే 55 లక్షల మంది రైతులు రైతుభరోసాను అందుకున్నారు. అన్నదాత సుఖీభవకు బడ్జెట్ లో కేటాయింపులు రూ.6300 కోట్లు అని చూపిస్తే, అగ్రికల్చర్ బడ్జెట్ లో వ్యవసాయ మంత్రి అన్నదాత సుఖీభవకు రూ.9400 కోట్లు చూపించారు. ఇందులో ఏది సరైనదో, ఎందుకు వ్యత్యాసం చూపించారో తెలియదు.
పథకాల కేటాయింపుల్లోనూ చిత్తశుద్ధి లేదు
» సూపర్ సిక్స్ పథకాల అమలుకు బడ్జెట్ లో చేసిన కేటాయింపులు చూస్తే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని అర్థమవుతుంది. యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు, నెలకు రూ.3 వేల భృతి అన్నారు, స్కూల్ కు వెళ్లే విద్యార్థికి రూ.15వేలు, ప్రతి రైతుకు రూ.20 వేలు ఆర్థిక సాయం, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇలా ఏ హామీకీ సరైన కేటాయింపులు లేవు.
2025–26లో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అన్నదాతా సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ.20 వేలు కేటాయిస్తున్నామని చెప్పారే తప్ప ఎంత దీనికి కేటాయిస్తున్నారో ప్రకటించలేదు. తల్లికి వందనం పైన కూడా అలాగే చెప్పారు. నిజంగా వీటిని అమలు చేసే ఉద్దేశం ఉంటే దానిపైన ఎందుకు స్పష్టత ఇవ్వలేదు?
» తల్లికి వందనంకు బడ్జెట్ బ్రీఫ్‌లో రూ.9,407 కోట్లు చూపించారు. కానీ వాస్తవంగా లెక్కలను బట్టి దాదాపు రూ.12,450 కోట్లు అవసరం. కానీ కేటాయించింది రూ.8,278 కోట్లు మాత్రమే. దీనిప్రకారం కేవలం 55 లక్షల పిల్లలకే తల్లికి వందనం అందుతుందని అర్థమవుతోంది. అంటే వారికి ఎగ్గొట్టేస్తున్నారు. అప్పు చూస్తే జనవరి నెలాఖరు నాటికి రూ.82,738 కోట్లు అని చూపించారు.
కానీ బడ్జెట్ బుక్ లో మాత్రం అప్పు కేవలం రూ. 73,362 కోట్లు అని రాశారు. మూలధన వ్యయం రూ.24,072 కోట్లు అని గత బడ్జెట్‌లో చెప్పి, ఖర్చు పెట్టింది ఎంతా అని చూస్తే రూ.10,850 కోట్లు మాత్రమే. అంటే ఈ రెండు నెలల్లో రూ.13000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారా?
Comments
Please login to add a commentAdd a comment