
ప్రతి విద్యార్థి తల్లికి ఇస్తామని కొత్త పల్లవి అందుకున్న సర్కారు
ఏటా రూ.13,113 కోట్లు అవసరం
రూ.9,407 కోట్లే కేటాయింపు
బడ్జెట్‌లో చెప్పిన నిధులు మొత్తం ఖర్చు చేసినా24.70 లక్షల మందికి కోత
ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.15 వేలు ఇస్తాం. నీకు పదిహేను వేలు... నీకు పదిహేను వేలు.. నీకు కూడా పదిహేను వేలు ఇస్తాం.’ అని టీడీపీ నేతలు ఎన్నికల ప్రచారంలో ఇంటింటికీ వెళ్లి చెప్పారు. ఈ లెక్కన రాష్ట్రంలో ఉన్న 87.42 లక్షల మంది పిల్లలకు రూ.15వేలు ఇచ్చేందుకు ఒక ఏడాదికి రూ.13,113 కోట్లు కావాలి.
‘తల్లికి వందనం కింద ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న పిల్లలు అందరికీ రూ.15వేలు చొప్పున ఇస్తాం.’ అని బాబు గ్యారెంటీ పేరిట మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఈ లెక్కన చూసినా యూడైస్‌లో నమోదైన విద్యార్థులు 87.42 లక్షల మందికి రూ.15వేలు చొప్పున ఇవ్వాలంటే రూ.13,113 కోట్లు కావాలి.
‘తల్లికి వందనం పథకాన్ని 2025-26 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నాం. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి రూ.9,407 కోట్లు కేటాయిస్తున్నాం.’ అని 2025ృ26 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి చెప్పారు. అంటే.. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.15వేలు ఇస్తామన్న హామీ నుంచి ‘ప్రతి విద్యార్థి తల్లికి’ ఈ పథకం వర్తిస్తుంది అనే వరకు తీసుకొచ్చారు. గత పరిణామాలు, ప్రస్తుతం ఆర్థిక మంత్రి మాటలు చూస్తే ‘తల్లికి వందనం’ అమలుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సాక్షి, అమరావతి: ‘తల్లికి వందనం’ పథకంపై కూటమి ప్రభుత్వం మరోసారి అంకెల గారడీ చేసింది. ఈ పథకం కింద ఎంతమందికి సాయం అందిస్తారనేది చెప్పకుండా బడ్జెట్‌లో రూ.9,407 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించి కనికట్టు చేసేందుకు ప్రయత్నించింది. కొత్తగా ‘ప్రతి విద్యార్థి తల్లికి’ సాయం అంటూ చంద్రబాబు మార్క్ మోసానికి తెరతీసింది. ఎన్నికల సమయంలో ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామని చెప్పారు.
‘సూపర్ సిక్స్’ హామీలకు వచ్చేసరికి ప్రభుత్వ, ప్రయివేటు విద్యా సంస్థల్లో ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ రూ.15వేలు ఇస్తామని పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ 2024–25లో తల్లికి వందనం పథకానికి రూ.5,387 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు. కానీ, పైసా ఇవ్వలేదు. ఒక్క విద్యార్థికి సాయం అందించలేదు. శుక్రవారం ప్రవేశపెట్టిన 2025–26 బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.9,407 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు.
‘ప్రతి విద్యార్థి తల్లికి’ ఈ పథకం వర్తిస్తుందని కొత్త ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం అందించిన యూడైస్ ప్లస్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 87.42 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతి విద్యార్థికి రూ.15 వేలు చొప్పున ఇవ్వాలంటే రూ.13,113 కోట్లు అవసరం. కేటాయించింది రూ.9,407 కోట్లే. అంటే మొత్తం విద్యార్థుల్లో 24.70 లక్షల మందికి కోత పెట్టక తప్పదు. అందుకే ‘ప్రతి విద్యార్థి తల్లికి’ ఈ పథకం వర్తిస్తుందని కొత్త పల్లవి అందుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విద్యాశాఖకు తగ్గిన కేటాయింపులు
రూ.3.22 లక్షల కోట్ల బడ్జెట్‌లో పాఠశాల విద్యకు రూ.31,805 కోట్లు (9.86 శాతం) కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అదే 2024–25 రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ.2.94 లక్షల కోట్లతో ప్రతిపాదనలు చేయగా, ఇందులో పాఠశాల విద్యకు రూ.29,909.31 (10.15శాతం) కోట్లు కేటాయించారు. అయితే, చేసిన ఖర్చు మాత్రం రూ.28,560.64 కోట్లే. ఈ మొత్తం వేతనాలు, అలవెన్సులకే సరిపోయింది.
ప్రస్తుత బడ్జెట్‌లో రూ.31,805 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించినా, ఆ మొత్తం ఉపాధ్యాయులు, ఉద్యోగుల వేతనాలు, అలవెన్సులకే సరిపోతాయి. అలాగే, 2024–25 బడ్జెట్‌లో ప్రకటించిన 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రకటనకే పరిమితమైంది. తాజా బడ్జెట్ ప్రసంగంలోనూ ఈ అంశాన్ని కూటమి సర్కారు రెండోసారి ఎంతో గొప్పగా చెప్పుకోవడం గమనార్హం.
‘నాడు–నేడు’ ప్రశ్నార్థకం
గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‘మన బడి నాడు–నేడు’ పథకం రెండో విడతలో రూ.8వేల కోట్ల బడ్జెట్‌తో 23 వేల ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో సమగ్ర మార్పులకు శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వ హయాంలోనే రూ.4 వేల కోట్ల విలువైన పనులు పూర్తిచేశారు. మిగిలిన పనులు పూర్తికావాలంటే మరో రూ.4 వేల కోట్లు అవసరం.
కూటమి ప్రభుత్వం ఈ పథకానికి ‘మన బడి–మన భవిష్యత్తు’గా పేరు మార్చి 2024–25 బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించినా పైసా ఖర్చు చేయలేదు. అలాగే, 2025–26 బడ్జెట్‌లోనూ రూ.1,000 కోట్లు కేటాయింపునకు ప్రతిపాదించారు. దీంతో మన బడి–మన భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment