
సున్నావడ్డీ పథకం అమలుకు రూ.నాలుగైదు వేల కోట్లు అవసరం
కానీ, తాజా బడ్జెట్ ప్రతిపాదనల్లో కేవలం రూ.100 కోట్లే కేటాయింపు
సాక్షి, అమరావతి: మహిళా పొదుపు సంఘాల సున్నా వడ్డీ పథకాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం మళ్లీ నిర్వీర్యం చేసే దిశగానే అడుగులు వేస్తోంది. ఎన్నికల హామీ ప్రకారం.. ఈ పథకం అమలుకు ఏటా రూ.నాలుగైదు వేల కోట్ల వరకు నిధులు కావాల్సి ఉంటే.. శుక్రవారం నాటి బడ్జెట్‌లో కేవలం రూ.100 కోట్లు మాత్రమే కేటాయించి వారి ఆశలు, ఆకాంక్షలపై నీళ్లు జల్లింది. నిజానికి.. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించిన ‘పొదుపు’ మహిళలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లపాటు అమలైన సున్నా వడ్డీ పథకానికి చంద్రబాబు ప్రభుత్వం రాగానే బ్రేకులు పడ్డాయి.
ఇప్పటికే రాష్ట్రంలోని దాదాపు కోటి మందికి పైగా ‘పొదుపు’ మహిళలు తాము 2023 ఏప్రిల్ – 2024 మార్చి మధ్య ఏడాదిపాటు ప్రతినెలా అసలుతో కలిపి చెల్లించిన వడ్డీ డబ్బులను ‘సున్నా వడ్డీ’ పథకం కింద ప్రభుత్వం తిరిగి ఎప్పుడు చెల్లిస్తుందా అని వేయికళ్లతో నిరీక్షిస్తున్నారు. నిజానికి.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగిన ఐదేళ్ల కాలంలో ఏప్రిల్ నెలలోనే చెల్లించే విధానాన్ని ప్రవేశపెట్టింది.
కానీ, 2023–24 ఆర్థిక సంవత్సరం ముగియక ముందే 2024 మార్చి మధ్యలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం.. ఎన్నికల అనంతరం చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటుకావడం జరిగిపోయింది. ఇప్పుడు మరో ఆర్థిక సంవత్సరం పూర్తవుతున్నా ప్రస్తుత సర్కారు సున్నావడ్డీ పథకం ఊసే ఎత్తడంలేదు.
మరోవైపు.. 2024–25 ఆర్థిక సంవత్సరంలోనూ సకాలంలో రుణ వాయిదాలను చెల్లించిన మహిళలకు ఈ ఏడాది మార్చి ఆఖరు తర్వాత సున్నా వడ్డీ పథకం కింద మరో రూ.నాలుగైదు వేల కోట్లు వారికి చెల్లించాల్సి ఉంది. కానీ, శుక్రవారం నాటి బడ్జెట్‌లో కేవలం రూ.100 కోట్లే కేటాయించడం చూస్తుంటే ‘పొదుపు’ మహిళలకు చంద్రబాబు సర్కారు ఇస్తున్న ప్రాధాన్యత స్పష్టమవుతోంది.
2014–19 మధ్య కూడా ఇంతే..
ఇక రాష్ట్ర విభజనకు ముందు నుంచి అమలులో ఉన్న పొదుపు సంఘాల సున్నా వడ్డీ పథకాన్ని 2014–19లో కూడా నాటి సీఎం చంద్రబాబు పూర్తిగా నీరుగార్చారు. అప్పట్లో ఐదేళ్లకుగాను కేవలం రెండేళ్ల నాలుగు నెలల కాలానికి సంబంధించిన సున్నావడ్డీ డబ్బులను మాత్రమే చెల్లించారు. 2016 ఆగస్టు తర్వాత కాలానికి మొండిచెయ్యి చూపించారు.
Comments
Please login to add a commentAdd a comment