
పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు రూ.13,862.29 కోట్లు
విదేశీ రుణంలో అమరావతి అభివృద్ధికి రూ.6 వేల కోట్లు
సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అమరావతి అన్నది ఒట్టిమాటే
సీఆర్‌డీఏ, నెల్లూరు కార్పొరేషన్ టిడ్కో రుణాల చెల్లింపునకు రూ.1945 కోట్లు
భూసమీకరణ కింద రాజధానికి భూములిచ్చిన రైతులకు కౌలు చెల్లింపునకు రూ.297.87 కోట్లు
అమృత్ 2.0 పథకం కింద పనులకు రూ.751.72 కోట్లు
స్వచ్ఛ భారత్, స్మార్ట్ సిటీ తదితర కేంద్ర పథకాల ద్వారా రూ.1031.25 కోట్ల గ్రాంట్
కేంద్ర ఆర్థిక సంఘం ద్వారా రూ.450.44 కోట్లు వస్తాయని అంచనా
విజయవాడకు రూ.115.11 కోట్లు.. విశాఖపట్నం అభివృద్ధిపై శీతకన్ను
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంపై చంద్రబాబు కూటమి ప్రభుత్వ డొల్లతనం 2025–26 బడ్జెట్ సాక్షిగా నిరూపితమైంది. కేంద్ర ప్రాయోజిత పథకాలు అమృత్ 2.0, స్వచ్ఛ భారత్.. కేంద్ర ఆర్థిక సంఘం నిధులను మాత్రమే మౌలిక వసతుల కల్పనకు కేటాయించింది.
సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అమరావతి అంటూ సీఎం చంద్రబాబు నుంచి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ వరకు చెబుతున్న మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నది మరోసారి బహిర్గతమైంది. రూ.6 వేల కోట్ల విదేశీ రుణంతో అమరావతిని అభివృద్ధి చేస్తామని బడ్జెట్‌లో పేర్కొనడమే అందుకు నిదర్శనం.భూసమీకరణ కింద రాజధానికి భూములిచ్చిన రైతులకు కౌలు చెల్లించేందుకు రూ.297.87 కోట్లు కేటాయించింది.
» విశాఖపట్నం అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. విజయవాడకు కేవలం రూ.115.11 కోట్లు కేటాయించింది.
» నెల్లూరు కార్పొరేషన్, సీఆర్‌డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ), ఏపీ టిడ్కో (ఆంధ్రప్రదేశ్ టౌన్‌షిప్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్) రుణాలు చెల్లించేందుకు రూ.1,945 కోట్లు కేటాయించడం గమనార్హం.
» పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు ప్రస్తుత బడెŠజ్‌ట్‌లో ప్రభుత్వం రూ.13,862.29 కోట్లు కేటాయించింది. ఇందులో అమరావతి అభివృద్ధికి తెచ్చే విదేశీ రుణం రూ.6 వేల కోట్లు.. కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్ర ఆర్థిక సంఘం నిధులు రూ.2,233.41 కోట్లు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. రాష్ట్ర బడ్జెట్ నుంచి ఇచ్చింది రూ.5,628.88 కోట్లే అన్నది స్పష్టమవుతోంది.
ఇందులో అధిక శాతం ఉద్యోగుల జీతభత్యాలు, కార్యాలయాల నిర్వహణకే వ్యయం చేయాల్సి ఉంటుంది. అమరావతి సహా పట్టణాలు, నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పన (కేపిటల్ వ్యయం) కోసం రూ.7049.54 కోట్లు ఖర్చు చేస్తుండడం గమనార్హం.
రుణాలతోనే రాజధాని నిర్మాణం
అమరావతి నిర్మాణానికి కావాల్సిన నిధులను తానే సమకూర్చుకుంటుందని.. అందుకే అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ కేపిటల్ అని సీఎం చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. అందులో ఏమాత్రం వాస్తవం లేదు. ఎందుకంటే.. ఇప్పటికే అమరావతి నిర్మాణానికి తెచ్చిన రుణాల చెల్లింపునకు ఈ బడ్జెట్‌లో రూ.836 కోట్లు, రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు కౌలు కింద ఇచ్చేందుకు రూ.297.82 కోట్లు కేటాయించారు. అమరావతి అభివృద్ధికి రూ.6 వేల కోట్ల విదేశీ రుణాన్ని కేటాయించారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే రాజధానికే రూ.7,133.82 కోట్లు కేటాయించినట్లు స్పష్టమవుతోంది.
కేంద్ర ప్రాయోజిత పథకాలే దిక్కు..
మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లు, నగర పంచాయతీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులే దిక్కయ్యాయి. అమృత్ 2.0 కింద కేంద్రం ఇచ్చే నిధులకు రాష్ట్ర వాటా జత చేసి రూ.751.72 కోట్లతో మురుగు నీటి వ్యవస్థ మెరుగుదల, వరద కాలువలు వంటి మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టనున్నారు.
స్వచ్ఛభారత్ కింద వచ్చే 1031.25 కోట్లతో నగరాలు, పట్టణాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని బడ్జెట్‌లో పేర్కొంది. కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రూ.450.44 కోట్లు వస్తాయని అంచనా వేసిన ప్రభుత్వం.. వాటిని మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయించింది.
నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సహా వివిధ అభివృద్ధి పనులు చేపట్టినందుకు తెచ్చిన రుణాన్ని చెల్లించేందుకు రూ.150.87 కోట్లు, ఏపీ టిడ్కో రుణాలు చెల్లింపునకు రూ.1109 కోట్లు కేటాయించింది.
Comments
Please login to add a commentAdd a comment