సాక్షి, కర్నూలు: కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు నిధులు రాబట్టడంలో సీఎం చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆక్షేపించారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో మన రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 12 మంది ఎంపీలతోనే బీహార్ కేంద్ర బడ్జెట్‌లో సింహభాగం నిధులను సాధించగలిగిందని, 16 మంది ఎంపీలు ఉన్నా, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడంలో సీఎం చంద్రబాబు అసమర్థుడిగా నిల్చారని గుర్తు చేశారు. చివరకు రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవం ప్రాజెక్టు ఎత్తుపైనా సీఎం రాజీపడుతున్నారని, దీని వల్ల చాలా నష్టం జరుగుతుందని కర్నూలులో మీడియాతో మాట్లాడిన బుగ్గన ధ్వజమెత్తారు.
బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:
చంద్రబాబు దారుణ వైఫల్యం:
ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో సీఎం చంద్రబాబు దారుణంగా విఫలమయ్యారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో ఆయన ఏ మాత్రం చొరవ చూపలేకపోయారు. ఫలితంగా ఈ బడ్జెట్‌లో కేంద్రం మన రాష్ట్రానికి దాదాపు మొండిచేయి చూపింది. నిజానికి టీడీపీ మద్దతులో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోంది. ఆ పార్టీకి 16 మంది ఎంపీలు ఉన్నారు. ప్రభుత్వంలోనూ టీడీపీ కొనసాగుతోంది. అయినా కేంద్ర బడ్జెట్ నుంచి ఏపీకి ఏ మాత్రం నిధులు దక్కించుకుందని చూస్తే తీవ్ర నిరాశే కనిపిస్తోంది.
నాడు వైఎస్సార్‌సీపీపై నిందలు:
గతంలో కేంద్ర బడ్జెట్ సందర్భాల్లో.. వైయస్సార్‌సీపీకి 23 మంది ఎంపీలు ఉన్నారు. కేంద్రం నుంచి ఎక్కువ నిధులు దక్కించుకోవడంలో విఫలమవుతున్నారంటూ చంద్రబాబు పలుసార్లు పెద్ద ఎత్తున విమర్శించారు. అయితే అప్పుడు కేంద్రానికి మా సీట్లతో, మా మద్దతుతో ఏ మాత్రం అవసరం లేని పరిస్థితి ఉంది. కానీ నేడు కేంద్రానికి ఎపీకి చెందిన ఎంపీల మద్దతు చాలా కీలకం. దీన్ని వినియోగించుకుని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పెద్ద ఎత్తున నిధులు తెచ్చుకునే స్థితిలో టీడీపీ ఉంది. కేవలం 12 మంది ఎంపీలు ఉన్న జేడీయూ బీహార్ రాష్ట్రానికి ఎన్నో సాధించగలిగితే, 16 సీట్లు ఉన్న తెలుగుదేశం పార్టీ ఇంకెంత సాధించాలి? కానీ ఈ విషయంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు.
పోలవరం ప్రాజెక్టుకూ నష్టం:
పోలవరం ప్రాజెక్ట్‌ను 41.15 మీటర్ల ఎత్తుతోనే పూర్తి చేసేందుకు రూ.5,936 కోట్లు ఇస్తామని కేంద్ర బడ్జెట్‌లో చెప్పారు. వాస్తవానికి పోలవరం ప్రాజెక్ట్‌ను 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మించాల్సి ఉంది. అలా నిర్మిస్తేనే పోలవరం ద్వారా 200 టిఎంసీల నీరు లభిస్తుంది. ఈ నీటి వల్ల కృష్ణా, గోదావరి జిల్లాల్లోని కొన్ని లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ, కొత్త ఆయకట్టుకు నీరు లభిస్తుంది. అలాగే 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, విశాఖ నగరానికి తాగునీరు, 600 గ్రామాలకు నీరు అందుతుంది.
ఇన్ని ఉపయోగాలు అందాలంటే 150 అడుగుల మేర నిర్మిస్తేనే సాధ్యపడుతుంది. కానీ ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేస్తున్నారు. దీన్ని కూటమి ప్రభుత్వం అంగీకరిస్తోందా? కూటమి ప్రభుత్వానికి తెలియకుండానే పోలవరం ఎత్తు 41.15 అడుగులే అని కేంద్రం ఎలా ఖరారు చేస్తుంది? నాడు 2017–18లో చంద్రబాబు ప్రభుత్వం అలాంటి పొరపాటే చేస్తే, దాన్ని సరిదిద్దేందుకు మా ప్రభుత్వానికి నాలుగేళ్ళు పట్టింది.
ఈరోజు గొప్పగా రూ.12,500 కోట్లు కేంద్రం ద్వారా వచ్చిందని చంద్రబాబు చెబుతున్నారు. అది మా ప్రభుత్వం సాధించినదే. ఆనాడు కేంద్ర ప్రభుత్వానికి చాలా స్పష్టంగా పోలవరం ఎత్తుపై వివరణ ఇచ్చాం. తొలి ఏడాది 41.15 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేపట్టి నీటిని నిల్వ చేస్తాం, తరువాత రెండేళ్లలో నీటి నిల్వ పెరుగుతున్న కొద్దీ ముంపు ప్రాంతాల్లో భూసేకరణ చేసుకుంటూ పోయి, ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్లకు పెంచుతామని చెప్పాం. అంటే పోలవరం ప్రాజెక్టు పనులను రెండు దశల్లో.. ఒకటి 41.15 మీటర్లు, రెండో దశలో 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మించాలని నిర్ణయించడం జరిగింది.
అది ప్రాజెక్టు మాన్యువల్‌లోనూ ఉంది. కాగా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అవేమీ లేకుండా పోలవరం ప్రాజెక్ట్‌ను 41.15 మీటర్ల ఎత్తుతోనే నిర్మాణం పూర్తి కోసం అంటూ బడ్జెట్‌లో రాయించుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? తక్షణం దీనిపై కేంద్రానికి క్లారిటీ ఇవ్వకపోతే పోలవరం ప్రాజెక్ట్‌కు, రాష్ట్ర ప్రజలకు తీరని నష్టం జరుగుతుంది. రాష్ట్రంలో నాలుగు పోర్టులు నిర్మాణంలో ఉన్నాయి. వాటికి కూడా నిధులు కోరలేదు? ఈ విషయంలోనూ కేంద్రంపై ఒత్తిడి తేవడంలో విఫలమయ్యారు.
బీహార్‌కు అత్యధిక ప్రాధాన్యం:
టీడీపీ కంటే తక్కువగా 12 మంది ఎంపీలు మాత్రమే ఉన్న జేడీయూ, తమ రాష్ట్రం బీహార్‌కు ఈ బడ్జెట్‌లో అత్యధిక ప్రాధాన్యం దక్కించుకుంది. బీహార్‌లో మఖనా బోర్డ్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌లు, పాత పాట్నా ఎయిర్‌పోర్ట్ విస్తరణ, మిథులాంచల్‌కు చెందిన కోషీ కెనాల్ అభివృద్ధి, పాట్నా ఐఐటీ అభివృద్ధికి బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చారు. బీహార్‌కు సంబంధించి గత బడ్జెట్‌లో పూర్వోదయ ప్రాంతంలోని గయలో అమృత్‌సర్–కోల్‌కత్తా పారిశ్రామికవాడ, పాట్నా పూర్ణియా ఎక్స్‌ప్రెస్‌వే, బక్సర్–బగల్‌పూర్ ఎక్స్‌ప్రెస్ వే, బోద్ గయా–రాజ్ ఘీర్–వైశాలీ–దర్భాంగ, బక్సర్‌లో గంగానదిపై రూ.26 వేల కోట్లతో రెండు లైన్ల వంతెన సాధించుకున్నారు. అలాగే 2400 మెగావాట్ల పీర్ పాంటీ పవర్ ప్రాజెక్ట్స్‌కు రూ.21,400 కోట్లు సాధించుకున్నారు. కొత్త మెడికల్ కాలేజీలు, ఎయిర్ పోర్ట్స్, బీహార్‌లో శాశ్వతమైన నిర్మాణ పనులకు క్యాపిటల్ వ్యయం కోసం కేంద్రం నుంచి సాయం దక్కించుకున్నారు. టీడీపీ మాదిరిగా జేడీయూ కూడా ఎన్డీఏలో భాగస్వామి. టీడీపీ కంటే ఆ పార్టీకి తక్కువ మంది ఎంపీలు. అయినా బడ్జెట్‌లో అధిక శాతం నిధులు దక్కించుకుంది.
తలసరి ఆదాయంపైనా చంద్రబాబు తప్పుడు లెక్కలు:
ఇటీవల నీతి అయోగ్ నివేదికపై మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు తలసరి ఆదాయంపై చెప్పిన విశ్లేషణను విన్న ఒక ఎన్‌ఆర్‌ఐ.. చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన సీఎం లెక్కల్లోని తప్పులను ఎత్తి చూపారు. 2018–19లో ఏపీలో తలసరి ఆదాయం రూ.1.54 లక్షలు ఉంటే 2022–23 నాటికి రూ.2.20 లక్షలు అయ్యింది. అంటే చంద్రబాబు హయాం కంటే వైయస్ జగన్ గారి హయాంలో తలసరి ఆదాయం పెరిగింది.
సీఎంగా ఉన్న వ్యక్తే ఇలా తప్పుడు లెక్కలు చెబితే, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఏ పారిశ్రామికవేత్త అయినా వస్తారా? నీతి అయోగ్ నివేదికను చూస్తే 2014–19 వరకు చంద్రబాబు ప్రభుత్వ పాలన, 2019–24 వైయస్ జగన్ పాలనను పోల్చడం అనేది హేతుబద్దంగా ఉంటుంది. కానీ చంద్రబాబు మాత్రం తన పాలనలో ఒక ఏడాదిని ఎంచుకుని, జగన్ గారి పాలనలో ఒక ఏడాదిని ఎంచుకుని వాటిని పోల్చడం చూస్తుంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వారు ఇలా కూడా చేస్తారా? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
వైఎస్సార్‌సీపీ విధానాలే కేంద్రంలోనూ..:
వైఎస్ జగన్ హయాంలో అమలు చేసిన విద్యా ప్రమాణాల పెంపు విధానాలనే నేడు కేంద్రం అనుసరించబోతోంది. బడ్జెట్ కేటాయింపులు, విధానాలు చూస్తే అది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. విదేశీ భాగస్వామ్యంతో దేశంలో 5 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. సెకండరీ, ప్రైమరీ పాఠశాలలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ ఇవ్వబోతున్నారు.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్‌పీ) ఏర్పాటు చేసి, బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ అందించాం. 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్‌లు పంపిణీ చేశాం. దాన్ని నాడు టీడీపీతో పాటు, ఎల్లో మీడియా తీవ్రంగా తప్పు పట్టాయి, ట్యాబ్‌ల వల్ల విద్యార్థులు చెడిపోతున్నారంటూ ఎల్లో మీడియా కథనాలు వండి వార్చింది. ఇప్పుడు సరిగ్గా కేంద్ర ప్రభుత్వం అవే విధానాలు అమలు చేస్తోంది. విద్యార్ధులకు బ్రాడ్‌బ్యాండ్ అందుబాటులోకి తెస్తున్నారు. మరి దీన్ని కూటమి పార్టీలు ఎలా చూస్తున్నాయి? ఇది కూడా తప్పేనని ఇప్పుడు విమర్శించగలరా?
మెడికల్ కాలేజీలు.. సీట్లు:
రాబోయే 5 ఏళ్లలో దేశంలో 75 వేల మెడికల్ సీట్లు అందుబాటులోకి తేవాలన్న నిర్ణయాన్ని కేంద్ర బడ్జెట్‌లో వెల్లడించారు. అందులో భాగంగా ఈ ఏడాది 10 వేల సీట్లు ఇవ్వాలని నిర్ణయించారు. నిజానికి రాష్ట్రంలో మెడికల్ సీట్ల ఆవశ్యకత గుర్తించిన నాటి సీఎం శ్రీ వైయస్ జగన్, ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలుపెట్టి, వాటిలో 5 కాలేజీలను గత విద్యా సంవత్సరంలోనే పూర్తి చేశారు. వాటి వల్ల రాష్ట్రంలో కొత్తగా 750 మెడికల్ సీట్లు అందుబాటులోకి రాగా, అన్ని కాలేజీలు పూరై్త ఉంటే, మొత్తం 2450 మెడికల్ సీట్లు రాష్ట్రానికి దక్కేవి.
అయితే ఆ కాలేజీల నిర్మాణం పూరై్తతే జగన్‌గారికి మంచి పేరొస్తుందని కుట్ర చేసిన చంద్రబాబు, ఇప్పుడు వాటన్నింటిని ప్రైవేటీకరించాలని నిర్ణయించారు. గత విద్యా సంవత్సరంలో పులివెందుల మెడికల్ కాలేజీలో అనుమతి ఇచ్చిన సీట్లు కూడా వద్దని చెప్పడంతో పాటు, కొత్త కాలేజీలకు అనుమతి కోరుతూ, ఈ ఏడాది జాతీయ వైద్య మండలికి లేఖ రాయొద్దని నిర్ణయించారు. ఆ వి«ధంగా వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారు. మెడికల్ కాలేజీలు, సీట్లకు కేంద్రం ఒకవైపు ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. ఇవే కాలేజీలను పూర్తి చేసుకుంటూ పోతే కేంద్రం ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకున్న 10 వేల సీట్లలో నాలుగో భాగం ఆంధ్రప్రదేశ్ నుంచే సమకూరేవి.
ఆదాయపన్నుతో మధ్య తరగతికి ఊరట:
మధ్యతరగతి వారికి మేలు చేసేలా పన్ను విధానాలను తీసుకువచ్చారు. ఆదాయపన్నుకు సంబంధించి గత ఏడాది రూ.3 లక్షల ఆదాయం వరకు పన్ను లేదు. ఈ ఏడాది రూ.4 లక్షల వరకు పన్ను లేకుండా నిర్ణయం తీసుకున్నారు. దాదాపు రూ.12 లక్షల ఆదాయం వరకు రిబేట్ రూపంలో ఆదాయపన్ను నుంచి ఉపశమనం లభించేలా నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల వేతన జీవులకు, మధ్యతరగతి వారికి మేలు జరుగుతుంది.
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు చూస్తే..:
దేశంలో తొలిసారి రూ.50,65,365 కోట్లు కేంద్ర బడ్జెట్ దాటింది. దీనిలో రెవెన్యూ రిసీట్స్ రూ.34,20,409 కోట్లు కాగా, క్యాపిటల్ రిసీట్స్ రూ.16,44,936 కోట్లు. రెవెన్యూ రాబడి, అప్పు రెండూ కలిపితే రూ.50 లక్షల కోట్లు దాటింది. దీనిలో క్యాపిటల్ వ్యయం రూ.11,21,090 కోట్లుగా చూపించారు. రాష్ట్రాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కలుపుకుంటే రూ.15,48,282 కోట్లు. అదే గత ఏడాది రివైజ్డ్ అంచనాలను చూస్తే ఖర్చు రూ.47,16,487 కోట్లుగా ఉంది. మరోవైపు రెవెన్యూ రాబడి రూ.30,00,087 కోట్లుగా చూపించారు. అప్పు మాత్రం దాదాపు రూ.16,28,527 కోట్లు ఉంది. అంటే అప్పులు య«థాతథంగా కొనసాగిస్తున్నారు. వాస్తవాలు చూస్తే కేంద్ర బడ్జెట్‌లో అప్పులు పెద్దగా పెరగలేదు. ఇది మంచి పరిణామం.
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రాబడి, ఖర్చులు మాత్రం దాదాపు మూడు లక్షల కోట్లు పెరిగింది. గత ఏడాది పెట్టుబడి వ్యయం రూ.10.18,000 కోట్లు అయితే, ఈ ఏడాది రూ.11,21,090 కోట్లుగా చూపించారు. అంటే దాదాపు లక్ష కోట్లు ఎక్కువ ఖర్చు చేయనున్నారు. అలాగే రాష్ట్రాలకు సహయం అందించే దాన్ని కూడా కలుపుకుంటే ఈ బడ్జెట్‌లో గత ఏడాదితో పోలిస్తే మూడు లక్షల కోట్లు పెరిగింది. గత ఏడాది ఆ మొత్తం రూ.15,69,527 కోట్లు కాగా, ఈ ఏడాది అది రూ.15,68,000 కోట్లుగా ఉంది. అంటే ద్రవ్యలోటు, స్థూల ఉత్పత్తిని నిష్పత్తిగా చూస్తూ.. గత ఏడాది అది 4.8 ఉంటే ఈ ఏడాది 4.4 గా బడ్జెట్‌లో ప్రతిపాదించడం మంచి పరిణామం. కోవిడ్ నుంచి ఇది తగ్గుతూ వచ్చింది.
బడ్జెట్‌లో నాలుగు విభాగాలకు ప్రాధాన్యత:
కేంద్ర బడ్జెట్ లో నాలుగు భాగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. వ్యవసాయం, ఎంఎస్‌ఎంఇ, పెట్టుబడి, ఎగుమతులకు ప్రాధాన్యత ఇచ్చారు. వ్యవసాయ పరంగా ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అనే కొత్త స్కీం ప్రారంభించబోతున్నారు. 1.70 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చేలా దీన్ని అమలు చేయబోతున్నారు. స్వల్పకాలిక రుణాలను రూ.5 లక్షలకు పెంచనున్నారు. చిన్న పరిశ్రమలు పెట్టేవారికి క్రెడిట్‌కార్డును రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచనున్నారు.
తొలిసారిగా పరిశ్రమను పెట్టే వారికి దీర్ఘకాలిక అప్పుగా టర్మ్‌లోన్‌ను రూ.2 కోట్ల వరకు ఇవ్వడం జరుగుతుంది. గ్యారెంటీ లేకుండా ఇచ్చే అప్పును ఎంఎస్‌ఎంఈ లకు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు పెంచారు. స్టార్టప్‌లకు కూడా రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంచారు. ఇది మంచి నిర్ణయం. ఎంఎస్‌ఎంఈగా క్లాసిఫై చేసే పరిమితిని కూడా పెంచబోతున్నారు. భారతీయ భాషా పుస్తక్ స్కీం కింద ఇంగ్లిష్ నుంచి వారి స్థానిక భాషల్లో అర్థం చేసుకునే విధంగా ఒక పథకం అమలు చేయబోతున్నారు.
దేశంలో శాశ్వత అభివృద్ధి కార్యక్రమాల కోసం స్పెషల్ అసిస్టెంట్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ కింద రాష్ట్రాలకు రూ.1.50 లక్షల కోట్లు మంజూరు చేయడం మంచిది. రాబోయే 10 ఏళ్లలో కొత్తగా 120 విమానాశ్రయాలు ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. భారత ట్రేడ్‌నెట్ కింద ఎగుమతిదార్లకు ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తున్నారు. ఇంకా36 లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌కు పన్ను మినహాయింపు ఇవ్వడం సంతోషకరమని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment