సాక్షి, రాజమహేంద్రవరం: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (daggubati purandeswari), మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు (somu veerraju) మధ్య తూర్పుగోదావరి జిల్లా బీజేపీ (bjp) అధ్యక్షుడి నియామకం అంశంలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎవరికి వారు పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచేశారు. తన మాట నెగ్గాలంటే.. తన మాట నెగ్గాలంటూ పావులు కదిపారు.
చివరకు వీర్రాజు జాతీయ నేతలను ఒప్పించి తన అనుచరుడైన కొవ్వూరుకు చెందిన పక్కి నాగేంద్రకు జిల్లా అధ్యక్షుడి పగ్గాలు అప్పగించడం.. పురందేశ్వరి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా, రాజమహేంద్రవరం సిట్టింగ్ ఎంపీగా ఉండీ కూడా తన అనుచరురాలైన ఎన్.హారికను జిల్లా అధ్యక్షురాలిగా నియమించలేక పోవడం చర్చనీయాంశమైంది. అధిష్టానం వద్ద పురందేశ్వరి మాట చెల్లుబాటు కాకపోవడం పార్టీ శ్రేణులను ఆశ్చర్యపరుస్తోంది.
ఈ నేపథ్యంలో బుధవారం తూర్పుగోదావరి జిల్లా బీజేపీ నూతన అధ్యక్షుడిగా పిక్కి నాగేంద్ర ఉత్తర్వులు స్వీకరించే కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి సోము వీర్రాజు, పురందేశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడచినట్లు సమాచారం. బీజేపీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చేయాలని నూతన అధ్యక్షుడికి సోము వీర్రాజు సూచించారు. ఇదే విషయమై పురందేశ్వరి స్పందిస్తూ.. పార్టీ ఇప్పటికే క్షేత్ర స్థాయిలో బలంగా ఉంది కాబట్టే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించారని స్పష్టం చేశారు. ఈ పరిణామంతో పార్టీ శ్రేణులు విస్మయానికి గురైనట్లు సమాచారం.
టీడీపీతో అంటకాగుతున్నందుకేనా?
పురందేశ్వరి బీజేపీలో ఉన్నా, ఆమె మనసంతా టీడీపీలోనే ఉందన్న ఆరోపణలున్నాయి. సార్వత్రిక ఎన్నికల సమయం నుంచి టీడీపీ బలోపేతం, అధికారంలోకి తీసుకురావడానికి సొంత పార్టీ ప్రయోజనాలను సైతం తాకట్టు పెట్టారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నికల సమయంలో అనపర్తి ఎమ్మెల్యే స్థానానికి కూటమి అభ్యరి్థగా బీజేపీ నేత శివరామకృష్ణంరాజును బీజేపీ అధిష్టానం ప్రకటించింది.
ఈ నిర్ణయంతో టీడీపీ ప్రస్తుత ఎమ్మెల్యే నల్లమిల్లి వర్గంలో అప్పట్లో అలజడి రేగింది. నల్లమిల్లి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలో సొంత పార్టీ అభ్యర్థి శివరామకృష్ణం రాజుకు మద్దతు ఇవ్వాల్సింది పోయి.. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పక్షాన పురందేశ్వరి నిలబడటం అప్పట్లో ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలా తన మరిది (సీఎం చంద్రబాబు) ప్రయోజనాల కోసమే చేశారని అప్పట్లో చర్చ జరిగింది. అందువల్లే ఆమె సిఫారసులను కమలం పెద్దలు పట్టించుకోవడం లేదని తెలిసింది. పురందేశ్వరి, సోము వీర్రాజుల మధ్య ఆది నుంచి సయోధ్య కుదరడం లేదు. ఎన్నికల సమయంలో రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్‌లో ఏ స్థానం ఇచ్చినా ఫర్వాలేదని వీర్రాజు కోరారు. ఇందుకు టీడీపీ అధినేత నిరాకరించారు. ఈ నిర్ణయం వెనుక చిన్నమ్మ ఉన్నట్లు భావించిన సోము వర్గం అప్పటి నుంచి ఆమెను విభేదిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment