
చెరో అభ్యర్థికి మద్దతు ఇస్తున్న టీడీపీ, బీజేపీ నేతలు
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి నేతల మధ్య విభేదాలు గుప్పుమంటున్నాయి. పార్టీలకు సంబంధంలేకుండా జరిగే ఈ ఎన్నికల్లోనూ టీడీపీ, బీజేపీ నేతలు చెరో అభ్యర్థికి మద్దతు ప్రకటించడం కూటమి శ్రేణులను అయోమయానికి గురిచేస్తోంది. ఏపీటీఎఫ్కు చెందిన పాకలపాటి రఘువర్మ నామినేషన్ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి పాల్గొన్నారు.
కూటమి పార్టీలన్నీ రఘువర్మకు మద్దతుగా నిలుస్తున్నట్లు మీడియా ముందు ఎమ్మెల్సీ చిరంజీవి ప్రకటించారు. ఆయనను గెలిపించడానికి టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు కృషిచేయాలని పిలుపునిచ్చారు. కానీ, శుక్రవారం పీఆర్టీయూకు చెందిన గాదె శ్రీనివాసులనాయుడు నామినేషన్ వేశారు. ఈయనకు బీజేపీ మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ మద్దతు తెలిపారు.
శ్రీనివాసులనాయుడికే బీజేపీ మద్దతు..
మరోవైపు.. శ్రీనివాసులనాయుడు నామినేషన్ సమర్పించిన అనంతరం మాధవ్ ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. తమ మద్దతు శ్రీనివాసులనాయుడికే ఉంటుందని తేల్చిచెప్పారు. ఈయన విజయానికి ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించారు. అలాగే, మరో అభ్యర్థికి కూటమి మద్దతు ఉందని ఒకరు ప్రకటించడాన్ని ఖండిస్తున్నామని.. టీడీపీ ఎమ్మెల్సీ చిరంజీవిపై పరోక్షంగా విమర్శలు చేశారు. దీనిపై కూటమి ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయలేదని ఆయన స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment