
రాష్ట్ర అప్పులపై మళ్లీ అబద్ధాలు చెబుతారా?
సీఎం చంద్రబాబును నిలదీసిన ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
మీ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు పదేపదే అవాస్తవాలు వల్లె వేస్తారా?
2024 నవంబరులో పెట్టిన తొలి బడ్జెట్‌లో రాష్ట్ర అప్పులు రూ.6.46 లక్షల కోట్లని మీరే చెప్పారు
అందులోనే 2019 నాటికి వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చేనాటికి ఉన్న అప్పు రూ.3.10 లక్షల కోట్లు
2014–19లో మీ హయాంలో అప్పుల పెరుగుదల 19.54 శాతం
2019–24 మధ్య వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పుల పెరుగుదల 15.61 శాతమే
గణాంకాలతో సహా అనేకసార్లు చెప్పాం.. మీరు ఎన్నడూ సమాధానం చెప్పలేదు
ఆనవాయితీ ప్రకారం ప్రస్తుత బడ్జెట్ వాల్యూమ్–6లో అప్పుల వివరాలు ఎందుకు చూపలేదు?
ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయనే ఆ వివరాలను చూపలేదన్నది వాస్తవం కాదా?
బడ్జెట్ వాల్యూమ్–6లో అప్పులపై ఏటా మాదిరిగానే ఇప్పుడు కూడా చూపండి
సాక్షి, అమరావతి: ‘‘టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024 నవంబరులో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్(AP Budget)లో రాష్ట్ర అప్పులను రూ.6.46 లక్షల కోట్లుగా చూపారు. ఇందులో 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం(YSRCP Govt) వచ్చే నాటికి ఉన్న రాష్ట్ర అప్పు రూ.3.10 లక్షల కోట్లు. 2024లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్న అప్పులు రూ.6.46 లక్షల కోట్లు. అందులో టీడీపీ ప్రభుత్వం 2019లో దిగిపోయేనాటికి రూ.3.10 లక్షల కోట్ల అప్పులు కూడా ఉన్నాయి.
ఇవన్నీ మీరు మీ తొలి బడ్జెట్‌లో చూపినవే. అయినా సరే రుణాలపై మళ్లీ అసత్య ప్రచారం చేస్తారా..?’’ అంటూ సీఎం చంద్రబాబును ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్(Buggana Rajendranath) నిలదీశారు. ‘‘మీ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి పదేపదే అసత్యాలు వల్లె వేస్తారా? బడ్జెట్ వాల్యూమ్–6 (బడ్జెట్ ఇన్ బ్రీఫ్)లో రాష్ట్ర అప్పుల వివరాలను ముద్రించడం ఆనవాయితీగా వస్తోంది.
ప్రస్తుత బడ్జెట్‌లో ఆ వివరాలను ఎందుకు ముద్రించలేదు? అప్పులపై వాస్తవాలు బహిర్గతమవుతాయనే ఆ వివరాలను మీరు ముద్రించలేదన్నది వాస్తవం కాదా?’’ అని బుగ్గన నిలదీశారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే తక్షణమే బడ్జెట్ వాల్యూమ్–6లో రాష్ట్ర అప్పుల వివరాలను ముద్రించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో బుగ్గన ఇంకా ఏమన్నారంటే..
⇒ రాష్ట్ర అప్పులపై టీడీపీ(TDP) కూటమి అదే పనిగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోంది. ఇష్టానుసారం మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ హయాంలో రాష్ట్ర అప్పులు రూ.14 లక్షల కోట్లకు చేరాయంటూ, పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారు. శనివారం కూడా చిత్తూరు జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు గత పాలకులు రాష్ట్రాన్ని అడవి పందుల్లా దోచుకు తిన్నారని, రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం ప్రజలపై మోపారని నిందిస్తూ, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై నిందలేశారు.
⇒ నిజానికి ఏనాడూ రాష్ట్ర అప్పులు ఆ స్థాయిలో లేవు. ఎవరి హయాంలో అప్పులు పెరిగాయి? అనేది ఆధారాలతో సహా మేం చాలాసార్లు మాట్లాడాం. స్పష్టంగా చూపాం. 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో అప్పుల పెరుగుదల కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (సీఏజీఆర్) 19.54 శాతం కాగా, 2019–24 మధ్య వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పుల పెరుగుదల సీఏజీఆర్ 15.61 శాతం మాత్రమే.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రెండేళ్లు కోవిడ్ వల్ల రాష్ట్ర ఆదాయం పడిపోయి, ఖర్చులు పెరిగినా కూడా, అప్పుల పెరుగుదల తక్కువే. అవన్నీ గణాంకాలతో సహా చెప్పాం. కానీ, చంద్రబాబు ఏనాడూ దానికి సమాధానం ఇవ్వలేదు. ఎందుకంటే, అవన్నీ వాస్తవాలు కాబట్టి. మరి అలాంటప్పుడు మళ్లీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం మోపిందని అంత అన్యాయంగా ఎలా మాట్లాడారు చంద్రబాబూ?.
⇒ ఇక ఈ ఏడాది బడ్జెట్‌లో చంద్రబాబు సర్కార్ అప్పులు చూపలేదు. బడ్జెట్ వాల్యూమ్–6లో రాష్ట్ర రుణాలపై అన్ని వివరాలు చూపడం ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ, సంప్రదాయం. కానీ, సీఎం చంద్రబాబు దాన్ని కాలరాసి, ఈ ఏడాది బడ్జెట్‌లో రాష్ట్ర అప్పులను చూపలేదు. వాటి వివరాలు వెల్లడించలేదు. దీన్నిబట్టి ఆయన ఉద్దేశం ఏమిటన్నది ప్రజలు అర్ధం చేసుకోవాలి.
⇒ బడ్జెట్ వాల్యూమ్–6లో రాష్ట్ర రుణాల వివరాలు ప్రకటిస్తే, వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయి. ఎవరి హయాంలో ఎంత అప్పు చేశారన్నది తెలుస్తుంది. చంద్రబాబు అసత్య ప్రచారం బయటపడుతుందని అర్ధమవుతుంది. ఈ ఉద్దేశంతోనే బడ్జెట్‌లో అప్పుల వివరాలు వెల్లడించకుండా, యథావిథిగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై నిందలు వేస్తూ, పచ్చి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు.కానీ, కాగ్ నివేదిక ఆధారంగా ప్రజలకు ఎలాగూ రాబోయే కాలంలో నిజం తెలుస్తుంది.
⇒ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా.. రాష్ట్రాన్ని అడవి పందుల్లా దోచుకుతిన్నారని, రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం ప్రజలపై మోపారని పచ్చి అసత్యాలతో నిందించడం మీ స్థాయికి భావ్యమా చంద్రబాబూ?. మీ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని వెంటనే ఆపాలి.
⇒ మీకు నిజంగా ప్రజలకు వాస్తవాలు తెలియాలని ఉంటే వాల్యూమ్–6లో ఆనవాయితీగా, సంప్రదాయబద్ధంగా దశాబ్దాల నుంచి వచ్చే పద్ధతిలో అన్ని వివరాలతో అప్పుల వివరాలు ప్రింట్ చేయండి చంద్రబాబూ? అప్పుడు నిజమేదో బయట పడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment