
వరసగా రెండోసారి ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతా రామన్ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్.. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బాటలోనే సాగింది. దేశ ఆర్థిక వ్యవస్థను అయిదేళ్లలో ఇప్పుడున్న 2.7 లక్షల కోట్ల డాలర్ల నుంచి 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ప్రకటించారు. కనుకనే తక్షణం కళ్లముందు కనబడే ఫలితాలకంటే దీర్ఘకాల ప్రయోజనాలపైనే నిర్మలా సీతారామన్ ఎక్కువగా దృష్టి సారించినట్టు కనబడుతోంది. బడ్జెట్ ప్రసంగం ప్రతిని బ్రీఫ్ కేసులో తెచ్చే పాత సంప్రదాయాన్ని విడనాడి ఉత్తరాది సంప్రదాయం ఉట్టిపడేవిధంగా ఉన్న ఎర్ర రంగు వస్త్రంతో రూపొందించిన బ్యాగ్‌తో ఆమె పార్లమెంటుకు వచ్చారు. ప్రతి రంగానికీ ఓటాన్ అకౌంట్‌లో చేసిన కేటాయింపుల్నే దాదాపుగా ఆమె కొనసాగించారు. కేంద్రం ముందున్న సవాళ్లు సామాన్యమైనవి కాదు. దేశంలో నిరుద్యోగిత ఎప్పుడూ 45 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. శరవేగంతో అభివృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థగా ఇన్నాళ్లుగా మనకున్న గుర్తింపు ఈ ఆఖరి త్రైమాసిక ఫలితాల తర్వాత మాయమైంది. దేశంలో వినిమయం బాగా మందగించిందని ఆ ఫలితాలు వెల్లడించాయి.
అందుకే కావొచ్చు... ఈ బడ్జెట్‌లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు అవసరమైన ప్రతి పాదనలు చేశారు. ముఖ్యంగా బీమా, విమానయానం, సింగిల్ బ్రాండ్ రిటైల్ రంగాల్లో ఈ పెట్టుబడులను ముమ్మరం చేయడంపై ప్రభుత్వం దృష్టిసారించబోతోంది. అలాగే మధ్య, చిన్న, లఘు పరిశ్రమలకు(ఎంఎస్‌ఎంఈలు) లబ్ధికి చర్యలు ప్రకటించారు. ముఖ్యంగా 25 శాతం కార్పొరేట్ పన్ను చెల్లించడానికి ఇప్పుడున్న వార్షిక టర్నోవర్ పరిమితి రూ. 250 కోట్లను రూ. 400 కోట్లకు పెంచారు. ఫలితంగా చాలా సంస్థలు ఈ పన్ను నుంచి విముక్తమవుతాయి. జీఎస్‌టీలో రిజి స్టరైన సంస్థలు తీసుకునే రుణాలపై 2 శాతం వడ్డీ రాయితీనిచ్చేందుకు రూ. 350 కోట్లు కేటా యించారు. కోటిన్నరకన్నా తక్కువ వార్షిక టర్నోవర్ ఉండే రిటైల్ వ్యాపారులు, చిన్న దుకాణ దారులకు కొత్తగా పింఛన్ పథకాన్ని ప్రకటించారు. సేవా పన్ను, జీఎస్‌టీకి ముందున్న ఎక్సయిజ్ సుంకాలకు సంబంధించిన వ్యాజ్యాల్లో చిక్కుకున్న రూ. 3.75 లక్షల కోట్లకుపైగా మొత్తాన్ని విడుదల చేసేందుకు అనువైన వివాద పరిష్కార పథకాన్ని అమలు చేయబోతున్నారు.
గ్రామీణ సడక్ యోజనతోసహా పలు పథకాలకు కేటాయింపులు పెంచడం మౌలికరంగ సదుపాయాల పటిష్టతకు దోహదపడతాయి. రాగలకాలంలో రూ. 80,000 కోట్లతో 1,25,000 కి.మీ. వేయడం లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. సంప్రదాయ పరిశ్రమల బలోపేతానికి ఇందులో ప్రతిపాదనలు న్నాయి. వెదురు, తేనె, ఖాదీ వంటి రంగాలకు ప్రయోజనం చేకూరేలా వంద క్లస్టర్‌లు ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ ఎంఎస్‌ఎంఈలకు ఆర్థికంగా తోడ్పడి ఉద్యోగ కల్పనకు దారితీస్తుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత, జీఎస్‌టీ అమల్లోకొచ్చాక ఈ పరిశ్రమల కార్యకలాపాలు మందగించాయి. వీటిల్లో పనిచేసే చాలామంది ఉపాధికి దూరమయ్యారు. తాజాగా చేసిన ప్రతిపాదనలు అవి మెరుగుకావడానికి దోహదపడతాయని భావించాలి. ఈ తరహా పరిశ్రమలు ఎక్కువగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంటాయి.
బంగారం, స్థిరాస్తులు వగైరాలపై పెట్టుబడులు పెట్టే అలవాటున్నవారు ఈక్విటీ రంగానికి మళ్లడమే లక్ష్యంగా స్టాక్ మార్కెట్‌లో లిస్టయిన కంపెనీల్లో ప్రజల వాటాను ఇప్పుడున్న 25 శాతం నుంచి 35శాతానికి పెంచారు. అయితే ఇది ఏమేరకు ప్రయోజనం చేకూరుస్తుందన్నది చూడాల్సి ఉంది. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు కాగితాల రూపంలో ఉండేవి. బంగారం, స్థిరాస్తుల తరహాలో ఇవి కళ్లెదుట కనబడేవి కాదు. అందువల్ల మన దేశంలో ప్రజానీకం ఈక్విటీ పెట్టుబడులకు అంతగా అలవాటు పడలేదు. పైగా అత్యంత చంచలస్వభావంతో ఉండే ఈక్విటీల జోలికెళ్లాలంటే చాలా మంది భయపడతారు. జాతీయంగానో, అంతర్జాతీయంగానో ఏర్పడే పరిణామాల ప్రభావంతో ఈక్విటీల విలువ హఠాత్తుగా పడిపోతే తమ పరిస్థితేమిటని ఆలోచిస్తారు. మరో సంగతేమంటే మన ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పుడున్న 25 శాతం నిబంధన పాటించడానికే ముందుకు రావడం లేదు. కొత్త నిబంధన అమల్లోకొస్తే పెద్ద సంస్థలన్నీ కలిసి దాదాపు 4 లక్షల కోట్ల ఈక్విటీలను మార్కెట్‌కు విడిచిపెట్టాలి. ఒక్కసారిగా ఆ స్థాయిలో విడుదలైతే వాటి ధర పడిపోతుందన్న భయాందోళనలు చాలా సంస్థలకున్నాయి. అయితే ఈ పరిస్థితి తలెత్తకుండా ప్రభుత్వం ఎలాంటి నియమనిబంధనలు రూపొందిస్తుందో చూడాలి.
సంపన్నులపై పన్ను విధింపు ఈ బడ్జెట్‌లో చెప్పుకోదగిన మరో అంశం. ఏడాదికి రూ.2.5 కోట్లు సంపాదన దాటినవారు చెల్లించే ఆదాయపు పన్నును అదనంగా 3 శాతం... రూ. 5 కోట్ల సంపాదన దాటినవారు చెల్లించే పన్నుపై మరో 7 శాతం పెంచుతూ ప్రతిపాదించారు. కానీ ఆ స్థాయి సంపాదనపరుల సంఖ్య మన దేశంలో మరీ ఎక్కువేమీ కాదు. అందువల్ల ఖజానాకు వచ్చే ఆదాయం రూ. 12,000 కోట్లుమించదు. రూ. 5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపు ఇవ్వడం మినహా మధ్య తరగతికి ఈ బడ్జెట్‌లో పెద్దగా చేసింది లేదు. పైగా పెట్రోల్‌పైనా, డీజిల్‌పైనా లీటర్‌కు రూపాయి సెస్ విధించడం ద్వారా ఆ వర్గానికి షాకిచ్చారు. నిజానికి రవాణారంగంపై తీవ్ర ప్రభావం చూపే ఈ నిర్ణయం వల్ల మొత్తంగా అన్నిటి ధరలూ పెరుగుతాయి. అసలు బడ్జెట్ అంటేనే పరస్పర విరుద్ధ ప్రయోజనాల మధ్య సామరస్యత చేకూర్చే కసరత్తు. అందుకే ఏదైనా ఇవ్వాలంటే ఎక్కడో అక్కడ తీసుకోకతప్పదు. అందుకే అమెరికా రాజకీయ నేత ఒకరు చాన్నాళ్లక్రితం బడ్జెట్ కసరత్తును చమత్కరిస్తూ ‘పన్నుల తగ్గింపు, బడ్జెట్ సమతుల్యత అనేవి అద్దంలో ప్రతిబింబంవంటివి. అవి కనబడతాయిగానీ... ఎవరికీ అందవు’ అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment