
సాక్షి, న్యూఢిల్లీ: నిజాయితీగా పన్నులు చెల్లిస్తున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అత్యంత కీలకమైన ఆదాయం, పన్నులపై బడ్జెట్ ప్రసంగ భాగాన్ని ప్రారంభించారు. ఆదాయ పన్ను సమర్పణ సమయంలో పాన్ కార్డు లేనివారికి ఊరట కల్పించే వార్త అందించారు. పాన్ కార్టు లేకపోయినా.. కేవలం ఆధార్ కార్డు ద్వారా ఆదాయ రిటర్న్స్‌ను ఫైల్ చేయవచ్చని సీతారామన్ తెలిపారు. తద్వారా రిటర్న్స్ దాఖలు ప్రక్రియను మరింత సులభతరం చేయాలని భావిస్తున్నట్టు ప్రకటించారు. 120 కోట్లకు పైగా భారతీయులు ఇప్పుడు ఆధార్ కార్డును కలిగి ఉన్నారు, అందువల్ల పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం ఈ ప్రతిపాదన చేసినట్టు చెప్పారు.
వ్యాపార లావాదేవీల్లో నగదు చెల్లింపులను అరికట్టడమే లక్ష్యంగా డిజిటల్ చెల్లింపులపై ఎలాంటి పన్నులు విధించడం లేదన్నారు. అలాగే గృహ రుణం తీసుకున్న వారికి అదనంగా మరో లక్షన్నర వడ్డీ రాయితీ ఇస్తామనంటూ నూతన గృహ కొనుగోలుదారులకు భారీ ఊరటనిచ్చారు నిర్మలా సీతారామన్.
బ్యాంక్ అకౌంట్ నుంచి ఏడాదిలో రూ. కోటి విత్‌డ్రా చేస్తే 2 శాతం పన్ను వసూలు చేస్తామని చెప్పారు. ఎంజెల్ టాక్స్ విధానంలో సరళీకరణను ఆర్థికమంత్రి ప్రతిపాదించారు. ప్రధానంగా స్టార్ట్‌అప్ కంపెనీలకు భారీ ప్రోత్సాహాన్నిస్తామని చెప్పారు స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెటేటవారికి పన్ను నుంచి మినహాయింపునిస్తామని చెప్పారు. ఐటీ స్క్రూట్నీ నుంచికూడా మినహాయింపునిస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం సభ సోమవారానికి వాయిదా పడింది.