ఇపుడు యావద్దేశమూ బడ్జెట్లో పెంచిన ఆదాయపు పన్ను పరిమితి గురించే మాట్లాడుతోంది. తాము భారతదేశ మధ్య తరగతికి ఎనలేని మేలు చేశామని, యావత్తు మధ్య తరగతికీ ఊరటనిచ్చామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. మరి ఇది నిజమేనా? వాస్తవానికి 145 కోట్ల మంది భారతదేశ జనాభాలో 2024–25లో ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసినవారి సంఖ్య దాదాపుగా 8.09 కోట్లు. అందులో దాదాపుగా 6 కోట్ల మంది రూ.7 లక్షల లోపు వార్షికాదాయం ఉండి జీరో రిటర్నులు వేసినవారే.
మిగిలిన వారిలో కోటి మంది రూ.12 లక్షలకన్నా ఎక్కువ వార్షికాదాయం ఉన్నవారు. అంటే మిగిలిన 1.09 కోట్ల మందికే తాజా నిర్ణయంతో ఎక్కువ మేలు కలుగుతుందన్న మాట. ఎందుకంటే వారు మాత్రమే ప్రస్తుతం రూ.7 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్య ఆదాయం ఉండి పన్ను రిటర్నులు దాఖలు చేస్తున్నవారు. కాకుంటే.. శ్లాబుల మార్పు వల్ల రూ. 12 లక్షల నుంచి రూ. 24 లక్షల మధ్య ఆదాయం ఉండేవారికి కూడా కొంత ప్రయోజనం కలుగుతుండటం గమనార్హం.
మరి ఈ 1.09 కోట్ల మందికి లబ్ధి కలిగించే నిర్ణయం తీసుకుని యావత్తు మధ్య తరగతికీ మేలు చేశామని చెప్పటం కరెక్టేనా? అసలు పన్ను పరిధిలోకే రాని 138 కోట్ల మంది సంగతేంటి? వారి బతుకు తెరువేంటి? అలాంటి వారందరినీ కూడా మధ్య తరగతిలోకో కనీసం ఆదాయ పు పన్ను పరిధిలోకో తేవాలంటే వారందరికీ తగిన ఉద్యోగాలు, ఉపాధి ఉండాలి కదా? కాకపోతే ఆ దిశగా ఈ బడ్జెట్లో తీసుకున్న చర్యలేవీ కనిపించలేదు.
కాకపోతే ఉద్యోగులంటేనే ఎక్కువగా మాట్లాడేవాళ్లు. వివిధ వేదికలపై వినిపించేది వారి గొంతే. సమాజాన్ని ఎక్కువగా ప్రభావితం చేసేదీ వాళ్లే. అందుకే మోదీ వారిని లకి‡్ష్యంచారు. కాబట్టే ఇపుడు దేశమంతా బడ్జెట్లో మిగతా విష యాలు పక్కనబెట్టి ఆదాయపు పన్ను గురించి మాట్లాడుతోంది.
లక్ష కోట్లు నష్టపోయి మరీ... ఎందుకిలా?
ప్రభుత్వం తీసుకున్న తాజా చర్య వల్ల ఏడాదికి లక్ష కోట్లు నష్టపోవాల్సి వస్తుందని ఆర్థిక మంత్రి నిర్మల చెప్పారు. మామూలుగా ఎప్పుడూ ఇంతటి నష్టం వచ్చే చర్యలు తీసుకోరు. ఎందుకంటే ఇప్పటికే రుణాలు పెరిగిపోతున్నాయి. మరి లక్ష కోట్ల ఆదాయాన్ని కోల్పోవటమంటే మాటలు కాదు కదా? కాకపోతే ప్రభుత్వ ఉద్దేశం వేరు. తాత్కాలికంగా ఉద్యోగుల్ని సంతృప్తి పరచటం ద్వారా తక్షణ ప్రయోజనాలు పొందటమే కాక... పాత పన్ను విధానాన్ని పూర్తిగా తొలగించి, ప్రతి ఒక్కరినీ కొత్త పన్ను విధానంలోకి తేవటమన్నది ప్రభుత్వ అసలు లక్ష్యం. ఇందులో భాగంగానే ఈ పరిమితి పెంపు.
ప్రభుత్వ తాజా నిర్ణయంతో పాత పన్ను విధానం నిరర్ధకమైపోతుంది. పన్ను కోసం చేసే సేవింగ్స్, అలవెన్సులు, పన్ను కోసం చేసే బీమా చెల్లింపుల వంటివన్నీ తెరమరుగైపోతాయి. మొత్తంగా అలవెన్సుల వ్యవస్థే కనిపించకుండా పోతుంది. దీనికితోడు మినహాయింపులేవీ ఉండవు కనక అత్యధిక శాతం మందికి పన్ను రిటర్నులు దాఖలు చేయటం అత్యంత సులభమైపోతుంది. రకరకాల ఆదాయాలుండి, వాటిని మేనేజ్ చేయాల్సిన పరిస్థితి ఉన్నవారికి తప్ప.. ఒక్క జీతంపైనే ఆధారపడ్డ వారెవ్వరికీ పన్ను రిటర్నులు వేయటానికి ట్యాక్స్ అసిస్టెంట్లు, ఆడిటర్ల అవసరం ఉండదు.
ఇక ఆదాయపు పన్ను విభాగంలో కూడా రిఫండ్ల వంటి ప్రక్రియ ఉండదు. పన్నుల వ్యవస్థ సరళమైపోతుంది కనక ఆదాయపు పన్ను విభాగాన్ని మరింత సమర్థంగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. పైపెచ్చు సరళమైన పగడ్బందీ పన్ను విధానం అమల్లోకి వస్తుంది. రిబేట్ పరిమితి 12 లక్షల వరకూ ఉంటుంది కనక వృత్తి నిపుణులతో సహా ఎక్కువ మంది రిటర్నులు వేయటానికి ముందుకొస్తారు. ట్యాక్స్ బేస్ పెరుగుతుంది. మున్ముందు వీరంతా పన్ను చెల్లిస్తే ఆదాయ వృద్ధి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment