రాష్ట్రాల ప్రయోజనాలు పట్టని బడ్జెట్‌ | A budget that does not benefit the states | Sakshi
Sakshi News home page

రాష్ట్రాల ప్రయోజనాలు పట్టని బడ్జెట్‌

Published Sun, Jul 7 2019 4:03 AM | Last Updated on Sun, Jul 7 2019 4:03 AM

A budget that does not benefit the states - Sakshi

కడప కార్పొరేషన్‌: 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ నిరుపయోగంగా మారిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య విమర్శించారు. శనివారం కడపలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాల ప్రయోజనాలను మోదీ దృష్టిలో పెట్టుకోలేదన్నారు. ఆదాయ పెంపే లక్ష్యంగా ఎడా పెడా పన్నులు వేయడం దారుణమన్నారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం ఎప్పుడూ జరగలేదన్నారు. ప్రత్యేక హోదా ప్రస్తావనే లేకపోవడం విచారకరమన్నారు.

విభజన చట్టంలోని గిరిజన, సెంట్రల్, పెట్రోలియం యూనివర్సిటీలకు నామమాత్రంగా నిధులు కేటాయించారన్నారు. పోలవరానికి రూ.52వేల కోట్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, రాజధానికి నిదుల కేటాయింపు జరగలేదన్నారు. దక్షిణ మధ్య రైల్వే ఆధునికీకరణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. విధాన పరమైన చర్యలు చేపట్టకపోగా, పెట్రోల్, డీజిల్‌పై సుంకం విధించి సామాన్యుని జీవితం దుర్భరం చేశారని మండిపడ్డారు. రైతాంగానికి అదనంగా చేసిందేమీ లేదని పెదవి విరిచారు. దేశంలో ఉన్న కోట్లాది మంది నిరుద్యోగ యువతకు ఏ విధంగా ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తారో చెప్పలేదన్నారు. సామాన్య మానవుని జీవన ప్రమాణాలు పెంచే వ్యవస్థను తీసుకురాకుండా ఆదాయం ఎలా పెంచుతారని ప్రశ్నించారు.  

బాబుకు ప్రతిపక్షనేతగా ఉండే అర్హత లేదు
తాను ఎందుకు ఓటమిపాలయ్యాడో తెలుసుకోలేని చంద్రబాబుకు ప్రతిపక్షనేతగా ఉండే అర్హత లేదని సీఆర్‌సీ అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ నిర్ణయాల పట్ల అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తుంటే,  చంద్రబాబు అప్పుడే విమర్శలు చేస్తూ తన నైజాన్ని చాటుకున్నారన్నారు. మీడియాను ఎదుర్కొనే సత్తా లేక లోకేష్‌ ట్వీట్లపైన బతికేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ప్రచార విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మలకుంట శివశంకర్‌ పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement