రెడ్‌ సిగ్నల్‌ హైదరాబాద్‌లో ఆగని రైలు | Union Budget Funds Delayed on Hyderabad Railway Project | Sakshi
Sakshi News home page

రెడ్‌ సిగ్నల్‌ హైదరాబాద్‌లో ఆగని రైలు

Published Thu, Jul 11 2019 11:10 AM | Last Updated on Tue, Jul 16 2019 11:27 AM

Union Budget Funds Delayed on Hyderabad Railway Project - Sakshi

జంటనగరాల నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికుల డిమాండ్‌కు సరిపడా రైళ్లు అందుబాటులో లేవు. దీంతో ప్రయాణం కోసం మూడు నెలల ముందు నుంచే ప్రణాళికలను రూపొందించుకోవాల్సి వస్తోంది. ముఖ్యంగా షిరిడీ, శబరి, బెంగళూరు, విశాఖ, తిరుపతి, ముంబై, పాట్నాలకు డిమాండ్‌ అధికంగా ఉంది. పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్లను ఏర్పాటు చేయాలని చాలాకాలంగా నగరవాసులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రయాణికుల సంక్షేమ సంఘాలు సైతం ఇప్పటికే అనేక సార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేదు.

సాక్షి, సిటీబ్యూరో: కేంద్ర బడ్జెట్‌ నగరానికి మొండి చెయ్యి చూపించింది. రైల్వే ప్రాజెక్టులపై ఊరించి ఉసూరుమనిపించింది. ఒక్క యాదాద్రి ఎంఎంటీఎస్‌ రెండో దశకు విదిలించిన రూ.20 కోట్లు మినహా ఎక్కడా సిటీ ప్రాజెక్టుల ప్రస్తావన లేదు. పైగా యాదాద్రికి కేటాయించిన ఈ నిధులు సైతంగత మధ్యంతర బడ్జెట్‌లోప్రకటించినవే. ఇప్పుడు పింక్‌బుక్‌లో చేర్చారు. నాలుగు రోజుల ఉత్కంఠ తరువాత కేంద్ర బడ్జెట్‌లో రైల్వేలకు  అందిన కేటాయింపులను బుధవారం విడుదల చేశారు. చర్లపల్లి రైల్వే టర్మినల్‌ విస్తరణ, వట్టినాగులపల్లి టర్మినల్‌ నిర్మాణం వంటి కీలకమైన ప్రాజెక్టులు ఈ బడ్జెట్‌లో కనీసం ప్రస్తావనకు కూడా రాకపోవడం గమనార్హం. మరోవైపు ఐదేళ్ల క్రితం చేపట్టిన ఎంఎంటీఎస్‌ రెండో దశ ఇప్పటికీ సాగుతూనే ఉంది. అది ఎప్పటికి పూర్తవుతుంది, రెండో దశ రైళ్లు ఎప్పటి వరకు పట్టాలెక్కుతాయనే అంశాన్ని పూర్తిగా విస్మరించారు. నిధుల కొరత కారణంగా నిలిచిపోతున్న రెండో దశకు ఈ బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు జరగలేదు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ అభివృద్ధి, ఎంఎంటీఎస్‌ రైల్వేస్టేషన్‌లలో మౌలిక సదుపాయాలు, అదనపు టిక్కెట్‌ బుకింగ్‌ కేంద్రాల ఏర్పాటు వంటి వాటికి స్థానం లేకుండా పోయింది. మొత్తంగా ఈ ఏడాది రైలు నగరంలో ఆగకుండానే పరుగులు తీసింది.

చర్లపల్లి టర్మినల్‌కు కేటాయింపులేవీ..
నగరంలో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్‌లలో పెరిగిన రద్దీ, రైళ్ల ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి స్టేషన్‌ను 4వ టర్మినల్‌గా విస్తరించేందుకు మూడేళ్ల క్రితం బడ్జెట్‌లోనే ప్రతిపాదించారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి ప్రతి రోజు సుమారు 200 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. 1.8 లక్షల మంది ప్రయాణికులు ఈ స్టేషన్‌ నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరుతున్నారు. కాచిగూడ, నాంపల్లి స్టేషన్‌ల నుంచి మరో వందకు పైగా రైళ్లు, లక్ష మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ మూడింటిపైన పెరిగిన ఒత్తిడి, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లిని అభివృద్ధి చేయాలని భావించారు. సుమారు రూ.200 కోట్ల అంచనాలతో  ప్రణాళికలను రూపొందించారు. 50 ఎకరాల భూమి అదనంగా అవరమని  గుర్తించారు. ఈ టర్మినల్‌ నిర్మిస్తే  సుమారు 10 ప్లాట్‌ఫామ్‌లతో ప్రతి రోజు కనీసం 200 రైళ్ల రాకపోకలకు అవకాశం లభిస్తుందని అప్పట్లో ప్రతిపాదించారు. విజయవాడ నుంచి,  కాజిపేట్‌ వైపు నుంచి వచ్చే రైళ్లన్నింటినీ చర్లపల్లి ద్వారా రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉంటుంది.  అవుటర్‌ రింగ్‌ రోడ్డుకు దగ్గరగా ఉండడం వల్ల ట్రాఫిక్‌ చిక్కులు తప్పుతాయి.కానీ  ఈ ప్రాజెక్టుకు  తాజా బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా దక్కలేదు. వట్టినాగుల పల్లి టర్మినల్‌ ప్రస్తావన కూడా లేకపోవడం గమనార్హం.

యాదాద్రికి రూ.20 కోట్లు....
ఎంఎంటీఎస్‌ రెండో దశ ప్రాజెక్టులో భాగంగా  ఘట్‌కేసర్‌ నుంచి రాయగిరి వరకు 33 కిలోమీటర్‌ల మార్గాన్ని నిర్మించి యాదాద్రికి రైల్వే సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలని 2016–17 బడ్జెట్‌లో  ప్రతిపాదించిన యాదాద్రి ఎంఎంటీఎస్‌కు  రూ, 20 కోట్లు కేటాయించారు. ఇది కూడా గత మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటించిందే. ఈ సారి పింక్‌ బుక్‌లో చేర్చారు అంతే. ఇది మినహాయించి  ఈ బడ్జెట్‌ వల్ల నగరానికి ఎలాంటి ప్రయోజనం లభించలేదు. యాదాది మార్గం అందుబాటులోకి వస్తే  ప్రతి రోజు  హైదరాబాద్‌ నుంచి యాదాద్రికి వెళ్లే లక్షలాది మంది ప్రయాణికులకు అతి తక్కువ చార్జీలతో రవాణా సదుపాయం లభిస్తుంది. అప్పట్లో  రాష్ట్రప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.సుమారు రూ. 412 కోట్ల అంచనాలతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్రం 59 శాతం  వాటా చొప్పున, రైల్వే 41 శాతం భరించవలసి ఉంది. కానీ  దీనికి ఇప్పటి వరకు టెండర్‌లను పిలవకపోవడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement