Railway Projcet
-
దిలీప్ బిల్డ్‌కాన్- యస్ బ్యాంక్.. భల్లేభల్లే
వరుసగా మూడో రోజు హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 192 పాయింట్లు పెరిగి 38,721కు చేరగా.. 47 పాయింట్లు బలపడిన నిఫ్టీ 11,432 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా మౌలిక సదుపాయాల కంపెనీ దిలీప్ బిల్డ్‌కాన్, ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. దిలీప్ బిల్డ్‌కాన్ పీఎస్‌యూ.. రైల్ వికాస్ నిగమ్ నుంచి ఉత్తరాఖండ్‌లో ప్రాజెక్టును గెలుపొందినట్లు దిలీప్ బిల్డ్‌కాన్ తాజాగా పేర్కొంది. రూ. 1335 కోట్ల విలువైన ఈ కాంట్రాక్టులో భాగంగా రిషీకేష్- కరణ్ప్రయాగ్ల మధ్య 125 కిలోమీటర్ల పరిధిలో సొరంగాలు, బ్రిడ్జిల నిర్మాణంసహా వివిధ పనులు చేపట్టవలసి ఉన్నట్లు వెల్లడించింది. 50 నెలల్లో పూర్తి చేయవలసిన ఈ ఆర్డర్‌ను హెచ్సీసీతో ఏర్పాటు చేసిన జేవీ ద్వారా సొంతం చేసుకున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో దిలీప్ బిల్డ్‌కాన్ షేరు 8 శాతం దూసుకెళ్లి రూ. 409 వద్ద ట్రేడవుతోంది. యస్ బ్యాంక్ ప్రత్యేక లిక్విడిటీ సౌకర్యాలలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ నుంచి పొందిన రూ. 50,000 కోట్లలో రూ. 35,000 కోట్లను తిరిగి చెల్లించినట్లు యస్ బ్యాంక్ చైర్మన్ సునీల్ మెహతా తాజాగా వెల్లడించారు. మధ్యంతర మద్దతుకింద ఎస్ఎల్ఎఫ్ ద్వారా పొందిన నిధుల్లో రూ. 35,000 కోట్లను తాజాగా తిరిగి చెల్లించినట్లు పేర్కొన్నారు. మిగిలిన మొత్తాన్ని సైతం ఆర్బీఐ విధించిన గడువులోగా చెల్లించివేయనున్నట్లు వివరించారు. పునర్వ్యవస్థీకరణ తదుపరి ఎఫ్‌పీవో ద్వారా రూ. 15,000 కోట్లను విజయవంతంగా సమీకరించినట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో యస్ బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 16 సమీపంలో ఫ్రీజయ్యింది. గత రెండు వారాల్లో ఈ షేరు 30 శాతం ర్యాలీ చేయడం విశేషం! -
రెడ్ సిగ్నల్ హైదరాబాద్‌లో ఆగని రైలు
జంటనగరాల నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికుల డిమాండ్‌కు సరిపడా రైళ్లు అందుబాటులో లేవు. దీంతో ప్రయాణం కోసం మూడు నెలల ముందు నుంచే ప్రణాళికలను రూపొందించుకోవాల్సి వస్తోంది. ముఖ్యంగా షిరిడీ, శబరి, బెంగళూరు, విశాఖ, తిరుపతి, ముంబై, పాట్నాలకు డిమాండ్ అధికంగా ఉంది. పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్లను ఏర్పాటు చేయాలని చాలాకాలంగా నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. ప్రయాణికుల సంక్షేమ సంఘాలు సైతం ఇప్పటికే అనేక సార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేదు. సాక్షి, సిటీబ్యూరో: కేంద్ర బడ్జెట్ నగరానికి మొండి చెయ్యి చూపించింది. రైల్వే ప్రాజెక్టులపై ఊరించి ఉసూరుమనిపించింది. ఒక్క యాదాద్రి ఎంఎంటీఎస్ రెండో దశకు విదిలించిన రూ.20 కోట్లు మినహా ఎక్కడా సిటీ ప్రాజెక్టుల ప్రస్తావన లేదు. పైగా యాదాద్రికి కేటాయించిన ఈ నిధులు సైతంగత మధ్యంతర బడ్జెట్లోప్రకటించినవే. ఇప్పుడు పింక్‌బుక్‌లో చేర్చారు. నాలుగు రోజుల ఉత్కంఠ తరువాత కేంద్ర బడ్జెట్లో రైల్వేలకు అందిన కేటాయింపులను బుధవారం విడుదల చేశారు. చర్లపల్లి రైల్వే టర్మినల్ విస్తరణ, వట్టినాగులపల్లి టర్మినల్ నిర్మాణం వంటి కీలకమైన ప్రాజెక్టులు ఈ బడ్జెట్లో కనీసం ప్రస్తావనకు కూడా రాకపోవడం గమనార్హం. మరోవైపు ఐదేళ్ల క్రితం చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశ ఇప్పటికీ సాగుతూనే ఉంది. అది ఎప్పటికి పూర్తవుతుంది, రెండో దశ రైళ్లు ఎప్పటి వరకు పట్టాలెక్కుతాయనే అంశాన్ని పూర్తిగా విస్మరించారు. నిధుల కొరత కారణంగా నిలిచిపోతున్న రెండో దశకు ఈ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు జరగలేదు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి, ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్లలో మౌలిక సదుపాయాలు, అదనపు టిక్కెట్ బుకింగ్ కేంద్రాల ఏర్పాటు వంటి వాటికి స్థానం లేకుండా పోయింది. మొత్తంగా ఈ ఏడాది రైలు నగరంలో ఆగకుండానే పరుగులు తీసింది. చర్లపల్లి టర్మినల్‌కు కేటాయింపులేవీ.. నగరంలో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లలో పెరిగిన రద్దీ, రైళ్ల ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి స్టేషన్‌ను 4వ టర్మినల్‌గా విస్తరించేందుకు మూడేళ్ల క్రితం బడ్జెట్లోనే ప్రతిపాదించారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రతి రోజు సుమారు 200 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. 1.8 లక్షల మంది ప్రయాణికులు ఈ స్టేషన్ నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరుతున్నారు. కాచిగూడ, నాంపల్లి స్టేషన్ల నుంచి మరో వందకు పైగా రైళ్లు, లక్ష మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ మూడింటిపైన పెరిగిన ఒత్తిడి, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లిని అభివృద్ధి చేయాలని భావించారు. సుమారు రూ.200 కోట్ల అంచనాలతో ప్రణాళికలను రూపొందించారు. 50 ఎకరాల భూమి అదనంగా అవరమని గుర్తించారు. ఈ టర్మినల్ నిర్మిస్తే సుమారు 10 ప్లాట్‌ఫామ్‌లతో ప్రతి రోజు కనీసం 200 రైళ్ల రాకపోకలకు అవకాశం లభిస్తుందని అప్పట్లో ప్రతిపాదించారు. విజయవాడ నుంచి, కాజిపేట్ వైపు నుంచి వచ్చే రైళ్లన్నింటినీ చర్లపల్లి ద్వారా రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉంటుంది. అవుటర్ రింగ్ రోడ్డుకు దగ్గరగా ఉండడం వల్ల ట్రాఫిక్ చిక్కులు తప్పుతాయి.కానీ ఈ ప్రాజెక్టుకు తాజా బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా దక్కలేదు. వట్టినాగుల పల్లి టర్మినల్ ప్రస్తావన కూడా లేకపోవడం గమనార్హం. యాదాద్రికి రూ.20 కోట్లు.... ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టులో భాగంగా ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు 33 కిలోమీటర్ల మార్గాన్ని నిర్మించి యాదాద్రికి రైల్వే సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలని 2016–17 బడ్జెట్లో ప్రతిపాదించిన యాదాద్రి ఎంఎంటీఎస్‌కు రూ, 20 కోట్లు కేటాయించారు. ఇది కూడా గత మధ్యంతర బడ్జెట్లో ప్రకటించిందే. ఈ సారి పింక్ బుక్‌లో చేర్చారు అంతే. ఇది మినహాయించి ఈ బడ్జెట్ వల్ల నగరానికి ఎలాంటి ప్రయోజనం లభించలేదు. యాదాది మార్గం అందుబాటులోకి వస్తే ప్రతి రోజు హైదరాబాద్ నుంచి యాదాద్రికి వెళ్లే లక్షలాది మంది ప్రయాణికులకు అతి తక్కువ చార్జీలతో రవాణా సదుపాయం లభిస్తుంది. అప్పట్లో రాష్ట్రప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.సుమారు రూ. 412 కోట్ల అంచనాలతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్రం 59 శాతం వాటా చొప్పున, రైల్వే 41 శాతం భరించవలసి ఉంది. కానీ దీనికి ఇప్పటి వరకు టెండర్లను పిలవకపోవడం గమనార్హం. -
రైల్వే ప్రాజెక్టులపై నీలినీడలు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైల్వే ప్రాజెక్టులపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఏళ్లుగా ఎలాంటి పురోగతి లేకుండా పెండింగ్ జాబితాకే పరిమితమవుతున్న ప్రాజెక్టులపై అప్పుడప్పుడు అధికారుల స్థాయిలో సంప్రదింపులు, చర్చలు మినహా ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుల్లో సింహభాగం రాష్ట్రం అందజేసే నిధులు, వనరులపైనే ఆధారపడి ఉన్నాయి. కానీ కేటాయింపుల్లో సమన్వయలేమి కనిపిస్తోంది. ఇరువర్గాల మధ్య చర్చలు జరిగినప్పటికీ అవి అధికారుల స్థాయికే పరిమితం కావడంతో నిధులు కేటాయింపులో ప్రభుత్వాన్ని కదిలించలేకపోతున్నాయి. దీంతో రైల్వే ప్రాజెక్టులపై చాలా కాలంగా నిర్లక్ష్యం కొనసాగుతోంది. ప్రజల మౌలిక అవసరాలను, రవాణా సదుపాయాలను దృష్టిలో పెట్టుకొని చేపట్టిన ప్రాజెక్టులు సైతం అతీగతీ లేకుండా పోతున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్రాజెక్టుల ప్రాధాన్యతపై తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. కానీ ఫలితాలు మాత్రం కనిపించడం లేదు. ఎదురుచూపులే మిగులుతున్నాయి. టర్మినల్ విస్తరణకు భూమి కొరత... నగరంలోని మూడు ప్రధాన రైల్వేస్టేషన్లలో పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకొని చేపట్టిన చర్లపల్లి రైల్వే టర్మినల్‌కు భూమి కొరత పెద్ద సమస్యగా మారింది. పది ప్లాట్‌ఫామ్‌లతో చర్లపల్లి విస్తరణకు ప్రతిపాదనలు రూపొందించారు. ప్రస్తుతం రైల్వేకు అందుబాటులో ఉన్న భూమికి మరో 100 ఎకరాల వరకు కేటాయించేందుకు మూడేళ్ల క్రితం ప్రభుత్వం అంగీకరించింది. ఇక్కడ టర్మినల్ నిర్మించడంతో విశ్వనగర నిర్మాణానికి అనుకూలమైన రవాణా సదుపాయాలను విస్తరించేందుకు అవకాశం ఉంటుందని భావించారు. నగర శివారు ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు చర్లపల్లి నుంచి ఔటర్‌రింగ్ రోడ్డు మీదుగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. మరోవైపు ట్రాఫిక్ రద్దీ కారణంగా రైలు అందుకోలేకపోవడం అనే ఇబ్బందులు ఉండవు. సుమారు రూ.85 కోట్ల అంచనాలతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు రైల్వేశాఖ ఇప్పటి వరకు రూ.15 కోట్ల వరకు నిధులను అందజేసింది. కానీ ఇంకా పనులు మొదలు కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగినంత భూమి లభిస్తే తప్ప ఈ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. చర్లపల్లి వినియోగంలోకి వస్తే ప్రతిరోజు 200 రైళ్లు, సుమారు 2.5 లక్షల మంది ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్‌పై 50 శాతం ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణికులకు కూడా మెరుగైన, నాణ్యమైన సదుపాయాలు లభిస్తాయి. రైళ్లు ఒక్కటే పరిష్కారం... ఇక ఎంఎంటీఎస్ రెండో దశ ‘ఇంకా ఎంతెంత దూరం...’ అన్నట్లుగా మారింది. అనేక రకాల అడ్డంకులను అధిగమించి ఈ ప్రాజెక్టు ఒక కొలిక్కి వచ్చినప్పటికీ రైళ్లు మాత్రం పట్టాలెక్కలేకపోతున్నాయి. 2013లో చేపట్టిన రెండో దశకు నిధుల కొరత పెద్ద సవాల్‌గా మారింది. ఆ తరువాత భూమి లభ్యత మరో సవాల్‌గా నిలిచింది. ఈ రెండింటిని అధిగమించి క్రమంగా పనుల్లో వేగం పెంచారు. ఇప్పటి వరకు రెండు మార్గాలు మాత్రం పూర్తయ్యాయి. మరో 4 లైన్లలో నిర్మాణ దశలో ఉన్నాయి. పనులు పూర్తయిన సికింద్రాబాద్–బొల్లారం, పటాన్చెరు–తెల్లాపూర్‌లలో ఎంఎంటీఎస్ రైళ్లను నడిపేందుకు అవకాశం ఉన్నప్పటికీ మళ్లీ నిధుల కొరత ముందుకొచ్చింది. రూ.850 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం మూడొంతుల నిధులు ఇవ్వాల్సి ఉంది. రెండో దశ కోసం కనీసం 9 రైళ్లు అవసరమని గుర్తించారు. ఇందుకోసం రూ.250 కోట్ల (ప్రాజెక్టు వ్యయంలో భాగంగానే) మేరకు ప్రతిపాదించారు. జనరల్ మేనేజర్ స్థాయిలో గతంలోనే ఈ అంశంపై సంప్రదింపులు జరిగాయి. కానీ పురోగతి లేదు. లైన్లు ఉన్నా రైళ్లు పట్టాలెక్కని పరిస్థితి. పురోగతి లేని యాదాద్రి... యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం తుది దశకు చేరింది. త్వరలోనే అత్యంత వైభవోపేతంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తెలంగాణలోనే గొప్ప పుణ్యక్షేత్రంగా, ఎంతో అందమైన ఆధ్మాత్మికమైన ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన యాదాద్రికి రోడ్డు రవాణా మార్గంతో పాటు రైల్వే సదుపాయం కూడా ఉండాలని ప్రభుత్వమే మూడేళ్ల క్రితం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన రైల్వేబోర్డు అప్పటికప్పుడు సర్వేలు పూర్తి చేసి ప్రాజెక్టు అంచనాలను రూపొందించింది. ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు రెండో దశను పొడిగించేందుకు రూ.330 కోట్ల వరకు అంచనాలు వేశారు. భూమి, ఇతర వనరులతో పాటు, ప్రాజెక్టు వ్యయంలో 59 శాతం రాష్ట్రం ఇవ్వాల్సి ఉంది. మిగతా 41 శాతాన్ని రైల్వే శాఖ భరిస్తుంది. యాదాద్రి కోసం కేంద్రం ఇప్పటి వరకు రూ.50 కోట్ల మేర కేటాయించింది. ఇటీవల టెండర్లను రద్దు చేశారు. మరోసారి ఆహ్వానించాల్సి ఉంది. కానీ అది రాష్ట్ర ప్రభుత్వ స్పందనపైనే ఆధారపడి ఉంటుందని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఏప్రిల్‌లో ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి బడ్జెట్లోనైనా రైల్వే ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. -
హైస్పీడ్ రైలుకు ‘డోక్లామ్’ సెగ
న్యూఢిల్లీ: డోక్లామ్ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో చేపట్టిన మౌలిక ప్రాజెక్టులను చైనా నిర్లక్ష్యం చేస్తోందా? అంటే భారత రైల్వే వర్గాలు అవుననే జవాబిస్తున్నాయి. దాదాపు 492 కి.మీ పొడవున్న చెన్నై–బెంగళూరు–మైసూరు హైస్పీడ్ రైల్వే కారిడార్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం పూర్తిచేసి ఏడాది అయినప్పటికీ.. చైనా రైల్వే పనుల్లో ఎలాంటి పురోగతి చూపలేదని అధికారులు తెలిపారు. ఇందుకు భారత్–చైనాల మధ్య డోక్లామ్‌లో తలెత్తిన ఉద్రిక్తతే కారణమై ఉండొచ్చని రైల్వే శాఖ మొబిలిటి డైరెక్టరేట్ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ‘చైనా రైల్వే ఎరియువన్ ఇంజనీరింగ్ గ్రూప్ కంపెనీ లిమిటెడ్(సీఆర్‌ఈఈసీ) 2016 నవంబర్‌లో నివేదిక సమర్పించిన అనంతరం రైల్వే బోర్డు అధికారులతో నేరుగా సమావేశం అవుతామని విజ్ఞప్తి చేసింది. ఆ తరువాత వారివైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ విషయమై సీఆర్‌ఈఈసీ స్పందన కోసం గత 6 నెలలుగా ఈ–మెయిల్స్ పంపిస్తూనే ఉన్నాం. చివరికి ఇక్కడి చైనా ఎంబసీ ద్వారా కూడా ప్రయత్నించాం. కానీ వారి నుంచి ఎలాంటి జవాబు రాలేదు’ అని ఓ రైల్వే ఉన్నతాధికారి తెలిపారు. కేవలం హైస్పీడ్ కారిడార్ మాత్రమే కాకుండా పలు ప్రాజెక్టుల్లో భాగస్వామ్యానికి చైనా రైల్వే ఆసక్తి చూపినప్పటికీ..డోక్లామ్ ఘటనతో వాటన్నింటిపై నీలినీడలు కమ్ముకున్నాయన్నారు. దేశవ్యాప్తంగా రైళ్ల వేగాన్ని ప్రస్తుతమున్న 80 కి.మీ/గంట నుంచి 160 కి.మీ/గంటకు పెంచేందుకు వీలుగా చెన్నై–బెంగళూరు–మైసూరు వంటి 9 హైస్పీడ్ కారిడార్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. -
రాష్ట్రానికి ఎప్పుడూ అన్యాయమే..
రాష్ట్ర ఎంపీ రైల్వే సహాయ మంత్రిగా ఉన్నా ఫలితం శూన్యం సాక్షి, హైదరాబాద్: అసలే అంతంత మాత్రం.. ఆపై నిర్లక్ష్యం.. ఎప్పుడు పూర్తవుతాయో తెలియదు.. అసలు పూర్తవుతాయో? లేదో? తెలియదు.. రాష్ట్రానికి మంజూరైన రైల్వే ప్రాజెక్టుల దుస్థితి ఇది. రైల్వే మంత్రులుగా ఉన్నవారు రాష్ట్రంపై చూపే నిర్లక్ష్యానికి తోడు.. మన ఎంపీలు, నేతలు ఏ మాత్రం పట్టించుకోకపోవడమే ఈ దుస్థితికి కారణం. గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో నాటి రైల్వే మంత్రి పవన్‌కుమార్ బన్సల్ మన రాష్ట్రానికి పలు ప్రాజెక్టులను ప్రకటించినా.. మంత్రిగా ఉన్న కొద్దికాలం వాటిని పట్టించుకోలేదు. ఆ తర్వాత రైల్వే బాధ్యతలు స్వీకరించిన మల్లికార్జున ఖర్గే అయితే అసలు మన రాష్ట్రం వైపే చూడలేదు. ఇక మన రాష్ట్రానికే చెందిన కోట్ల సూర్యప్రకాశరెడ్డి రైల్వే సహాయ మంత్రిగా ఉన్నా... ఫలితం శూన్యం. చివరకు తన సొంత పట్టణం కర్నూలుకు మంజూరు చేయించుకున్న ‘కోచ్ మిడ్ లైఫ్ రిహాబిలిటేషన్ ప్రాజెక్టు’కు కూడా నిధులు విడుదల చేయించుకోలేకపోయారు. ఖర్గే మాత్రం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తన గుల్బర్గా నియోజకవర్గం పరిధిలోని యద్గిర్లో బడ్జెట్ కేటాయింపుతో కూడా సంబంధం లేకుండా రైల్వే కోచ్ విడిభాగాల తయారీ ఫ్యాక్టరీ నిర్మాణానికి చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత బడ్జెట్లో పేర్కొన్న రాష్ట్ర ప్రాజెక్టుల పరిస్థితిని పరిశీలిస్తే... పట్టాలెక్కని రైళ్లు.. ఐదు గత బడ్జెట్లో దక్షిణమధ్య రైల్వేకు 11 కొత్త రైళ్లు మంజూరు చేశారు. వాటిలో ఇప్పటికీ 5 రైళ్లు పట్టాలెక్కలేదు. కాచిగూడ-మంగళూరు ఎక్స్‌ప్రెస్ వయా డోన్, గుత్తి, రేణిగుంట; కాచిగూడ- యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్; చెన్నై -నాగర్సోల్ ఎక్స్‌ప్రెస్; తిరుపతి - చెన్నై; సికింద్రాబాద్ - తాండూరు ప్యాసింజర్ సర్వీసులు మొదలే కాలేదు. సర్వేలు గోవిందా.. కొత్త మార్గాలు, ఉన్నవాటిని డబ్లింగ్ చేసేందుకు పలు ప్రాజెక్టులకు సర్వేలు చేయాలని నిర్ణయించారు. నామమాత్రంగా నిధులు కేటాయించారు. కానీ, ఆ పనులేవీ మొదలు కాలేదు. మంచిర్యాల- ఆదిలాబాద్, సిద్దిపేట - అక్కంపేట, వాశిం- ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ - గుత్తి, సికింద్రాబాద్ - ఆదిలాబాద్, తిరుపతి - కాట్పాడి రైల్వేలైన్ల సర్వేలు కాగితాలకే పరిమితమయ్యాయి. నిధులు దక్కని ఆదర్శ స్టేషన్లు.. పలాస, పార్వతీపురం, విశాఖపట్నం, ఆదోని, శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం స్టేషన్లను ఆదర్శ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తామన్న రైల్వే శాఖ.. నిధులు మాత్రం రాల్చలేదు. కొత్త ప్రాజెక్టులు కలే.. కంభం-ప్రొద్దుటూరు, కొండపల్లి-కొత్తగూడెం, మణుగూరు-రామగుండం, చిక్‌బళ్లాపూర్-పుట్టపర్తి, శ్రీనివాసపుర-మదనపల్లి తదితర కొత్త ప్రాజెక్టులను గత బడ్జెట్లో పేర్కొన్నారు. ఒక్కోదానికి ప్రాథమికంగా రూ. 10 లక్షలు చొప్పున కేటాయించారు. కానీ, ఆ నిధులకూ దిక్కులేదు.