న్యూఢిల్లీ: డోక్లామ్ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో చేపట్టిన మౌలిక ప్రాజెక్టులను చైనా నిర్లక్ష్యం చేస్తోందా? అంటే భారత రైల్వే వర్గాలు అవుననే జవాబిస్తున్నాయి. దాదాపు 492 కి.మీ పొడవున్న చెన్నై–బెంగళూరు–మైసూరు హైస్పీడ్ రైల్వే కారిడార్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం పూర్తిచేసి ఏడాది అయినప్పటికీ.. చైనా రైల్వే పనుల్లో ఎలాంటి పురోగతి చూపలేదని అధికారులు తెలిపారు.
ఇందుకు భారత్–చైనాల మధ్య డోక్లామ్‌లో తలెత్తిన ఉద్రిక్తతే కారణమై ఉండొచ్చని రైల్వే శాఖ మొబిలిటి డైరెక్టరేట్ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ‘చైనా రైల్వే ఎరియువన్ ఇంజనీరింగ్ గ్రూప్ కంపెనీ లిమిటెడ్(సీఆర్‌ఈఈసీ) 2016 నవంబర్‌లో నివేదిక సమర్పించిన అనంతరం రైల్వే బోర్డు అధికారులతో నేరుగా సమావేశం అవుతామని విజ్ఞప్తి చేసింది. ఆ తరువాత వారివైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ విషయమై సీఆర్‌ఈఈసీ స్పందన కోసం గత 6 నెలలుగా ఈ–మెయిల్స్ పంపిస్తూనే ఉన్నాం. చివరికి ఇక్కడి చైనా ఎంబసీ ద్వారా కూడా ప్రయత్నించాం.
కానీ వారి నుంచి ఎలాంటి జవాబు రాలేదు’ అని ఓ రైల్వే ఉన్నతాధికారి తెలిపారు. కేవలం హైస్పీడ్ కారిడార్ మాత్రమే కాకుండా పలు ప్రాజెక్టుల్లో భాగస్వామ్యానికి చైనా రైల్వే ఆసక్తి చూపినప్పటికీ..డోక్లామ్ ఘటనతో వాటన్నింటిపై నీలినీడలు కమ్ముకున్నాయన్నారు. దేశవ్యాప్తంగా రైళ్ల వేగాన్ని ప్రస్తుతమున్న 80 కి.మీ/గంట నుంచి 160 కి.మీ/గంటకు పెంచేందుకు వీలుగా చెన్నై–బెంగళూరు–మైసూరు వంటి 9 హైస్పీడ్ కారిడార్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment