వరుసగా మూడో రోజు హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 192 పాయింట్లు పెరిగి 38,721కు చేరగా.. 47 పాయింట్లు బలపడిన నిఫ్టీ 11,432 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా మౌలిక సదుపాయాల కంపెనీ దిలీప్ బిల్డ్‌కాన్, ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..
దిలీప్ బిల్డ్‌కాన్
పీఎస్‌యూ.. రైల్ వికాస్ నిగమ్ నుంచి ఉత్తరాఖండ్‌లో ప్రాజెక్టును గెలుపొందినట్లు దిలీప్ బిల్డ్‌కాన్ తాజాగా పేర్కొంది. రూ. 1335 కోట్ల విలువైన ఈ కాంట్రాక్టులో భాగంగా రిషీకేష్- కరణ్‌ప్రయాగ్‌ల మధ్య 125 కిలోమీటర్ల పరిధిలో సొరంగాలు, బ్రిడ్జిల నిర్మాణంసహా వివిధ పనులు చేపట్టవలసి ఉన్నట్లు వెల్లడించింది. 50 నెలల్లో పూర్తి చేయవలసిన ఈ ఆర్డర్‌ను హెచ్‌సీసీతో ఏర్పాటు చేసిన జేవీ ద్వారా సొంతం చేసుకున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో దిలీప్ బిల్డ్‌కాన్ షేరు 8 శాతం దూసుకెళ్లి రూ. 409 వద్ద ట్రేడవుతోంది.
యస్ బ్యాంక్
ప్రత్యేక లిక్విడిటీ సౌకర్యాలలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ నుంచి పొందిన రూ. 50,000 కోట్లలో రూ. 35,000 కోట్లను తిరిగి చెల్లించినట్లు యస్ బ్యాంక్ చైర్మన్ సునీల్ మెహతా తాజాగా వెల్లడించారు. మధ్యంతర మద్దతుకింద ఎస్‌ఎల్‌ఎఫ్ ద్వారా పొందిన నిధుల్లో రూ. 35,000 కోట్లను తాజాగా తిరిగి చెల్లించినట్లు పేర్కొన్నారు. మిగిలిన మొత్తాన్ని సైతం ఆర్‌బీఐ విధించిన గడువులోగా చెల్లించివేయనున్నట్లు వివరించారు. పునర్వ్యవస్థీకరణ తదుపరి ఎఫ్‌పీవో ద్వారా రూ. 15,000 కోట్లను విజయవంతంగా సమీకరించినట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో యస్ బ్యాంక్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 16 సమీపంలో ఫ్రీజయ్యింది. గత రెండు వారాల్లో ఈ షేరు 30 శాతం ర్యాలీ చేయడం విశేషం!
Comments
Please login to add a commentAdd a comment