Moratorium
-
Go First bankruptcy: 30 రోజుల్లో పునరుద్ధరణ ప్రణాళిక ఇవ్వండి
న్యూఢిల్లీ: కార్యకలాపాల పునరుద్ధరణకు సంబంధించిన ప్రణాళికను 30 రోజుల్లోగా సమర్పించాలంటూ విమానయాన సంస్థ గో ఫస్ట్‌కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సూచించింది. అందుబాటులో ఉన్న విమానాలు .. పైలట్లు ..ఇతర సిబ్బంది, నిర్వహణ ఏర్పాట్లు, నిధులు .. వర్కింగ్ క్యాపిటల్, లీజుదార్లతో ఒప్పందాలు తదితర వివరాలు అందులో పొందుపర్చాలని డీజీసీఏ పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రణాళికను సమీక్షించిన తర్వాత డీజీసీఏ తగు నిర్ణయం తీసుకోవచ్చని వివరించాయి. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న గో ఫస్ట్ మే 2న స్వచ్ఛందంగా దివాలా పరిష్కార ప్రక్రియ చేపట్టాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ముందుగా మే 3, 4 తారీఖుల్లో రద్దు చేసిన విమాన సేవలను ఆ తర్వాత మరిన్ని రోజులకు పొడిగించింది. ఈలోగా సర్వీసుల నిలిపివేతపై డీజీసీఏ షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీంతో మారటోరియం వ్యవధిని ఉపయోగించుకుని పునరుద్ధరణ ప్రణాళికను సమర్పించేందుకు సమయం ఇవ్వాలంటూ గో ఫస్ట్ తన సమాధానంలో కోరింది. మరోవైపు లీజుదార్లు వ్యతిరేకిస్తున్నప్పటికీ.. గో ఫస్ట్ దివాలా పరిష్కార పిటిషన్‌ను అనుమతించాలని ఎన్సీఎల్టీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ మే 22న జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఉత్తర్వులు జారీ చేసింది. -
గో ఫస్ట్‌కు ఎన్సీఎల్టీ ఊరట
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న విమానయాన సంస్థ గో ఫస్ట్‌కు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) కాస్త ఊరటనిచ్చింది. కంపెనీ స్వచ్ఛందంగా దాఖలు చేసిన దివాలా పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. అలాగే ఆర్థిక వ్యవహారాలు, చెల్లింపులకు సంబంధించి మారటోరియం విధించింది. మే 4న ఉత్తర్వులను రిజర్వ్ చేసిన ఎన్సీఎల్టీ దాదాపు వారం రోజుల ఉత్కంఠకు తెరదించుతూ తాజాగా బుధవారం నాడు ఆదేశాలను వెలువరించింది. మధ్యంతర పరిష్కార నిపుణుడిగా (ఐఆర్పీ) అభిలాష్ లాల్‌ను నియమించడంతో పాటు ఏ ఉద్యోగినీ తీసివేయకూడదని ఆదేశించింది. అలాగే, రద్దయిన మేనేజ్మెంటు.. తక్షణ ఖర్చుల కోసం రూ. 5 కోట్ల మొత్తాన్ని ఐఆర్పీ వద్ద డిపాజిట్ చేయాలని సూచించింది. తమ విజ్ఞప్తులను కూడా తెలుసుకున్న తర్వాతే గో ఫస్ట్ దివాలా పిటీషన్‌పై తగు నిర్ణయం తీసుకోవాలంటూ సంస్థకు విమానాలను లీజుకిచ్చిన కంపెనీల అభ్యంతరాలను ఎన్సీఎల్టీ తోసిపుచ్చింది. గో ఫస్ట్ తాను బాకీల విషయంలో డిఫాల్ట్ అయ్యానని, రుణదాతల నుంచి వచ్చిన డిమాండ్ నోటీసులను కూడా సమర్పించిందని, లీజు సంస్థలు కూడా దీన్ని ఖండించడం లేదని ద్విసభ్య ఎన్సీఎల్టీ బెంచ్ పేర్కొంది. ఈ నేపథ్యంలో దివాలా చట్టంలోని సెక్షన్ 10 కింద కంపెనీ పిటిషన్‌ను విచారణకు స్వీకరించడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని తెలిపింది. దీనితో దివాలా విచారణ పూర్తయ్యే వరకూ ఇతరత్రా దావాల నుంచి గో ఫస్ట్‌కు రక్షణ లభించనుంది. సంస్థ ఆస్తులను బదిలీ చేయడానికి గానీ రుణ దాతలు రికవరీ చేసుకోవడానికి గానీ ఉండదు. గో ఫస్ట్‌కు రూ. 11,463 కోట్ల ఆర్థిక భారం ఉండగా, 7,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. -
వేలకోట్ల రుణ భారం, వొడాఫోన్ ఐడియా కీలక నిర్ణయం!
న్యూఢిల్లీ: రుణ భారంతో ఉన్న వొడాఫోన్ ఐడియా రూ.8,837 కోట్ల ఏజీఆర్ బకాయిల చెల్లింపును నాలుగేళ్ల పాటు వాయిదా వేసింది. 2016–17కు అవతల రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఏజీఆర్ బకాయిలు చెల్లించాలంటూ టెలికం శాఖ జూన్ 15న డిమాండ్ చేసినట్టు స్టాక్ ఎక్సేంజ్‌లకు తెలియజేసింది. ఇవి సుప్రీంకోర్టు తీర్పు పరిధిలోకి రానివిగా పేర్కొంది. దీంతో ఏజీఆర్ బకాయిల చెల్లింపు వాయిదా ఆప్షన్‌ను తక్షణం వినియోగించుకోవాలని కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. 2026 మార్చి 31 తర్వాత ఆరు సమాన వాయిదాల్లో రూ.8,837 కోట్ల బకాయిలను చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. 2018–19 ఆర్థిక సంవత్సరం వరకు అన్ని ఏజీఆర్ బకాయిల చెల్లింపులపై టెలికం శాఖ మారటోరియం (విరాం) ఆఫర్ చేసిందని.. వాస్తవానికి ఇవి సుప్రీంకోర్టు ఆదేశాల పరిధిలో లేవని వివరించింది. ఏజీఆర్ బకాయిలపై వడ్డీ చెల్లింపులను ఈక్విటీగా మార్చుకునే ఆప్షన్‌ను టెలికం శాఖ ఆఫర్ చేసినట్టు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వొడాఫోన్ ఐడియా బకాయిలపై వడ్డీ రూ.16,000 కోట్లను ఈక్విటీగా మార్చుకునేందుకు అనుమతించింది. దీంతో కంపెనీలో కేంద్ర ప్రభుత్వానికి 33 శాతం వాటా లభించనుంది. 2018–19 సంవత్సరం వరకు అన్ని టెలికం కంపెనీలు ఉమ్మడిగా చెల్లించాల్సిన ఏజీఆర్ బకాయిలు రూ.1.65 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. -
మారటోరియం మరో రెండేళ్లు
సాక్షి, అమరావతి: దేశంలో కొత్తగా ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ తదితర ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించి విద్యాసంస్థల ఏర్పాటుకు అనుమతులపై గతంలో విధించిన తాత్కాలిక నిషేధాన్ని (మారటోరియం)ను కొన్ని షరతులతో ఏఐసీటీఈ మరో రెండేళ్లు పొడిగించింది. దేశంలో ఇంజనీరింగ్ తదితర సాంకేతిక, వృత్తి విద్యా సంస్థలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై హైదరాబాద్ ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఏఐసీటీఈ ఓ కమిటీని నియమించింది. కమిటీ నివేదిక మేరకు కొత్త కాలేజీల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వకుండా తాత్కాలిక నిషేధాన్ని రెండేళ్ల క్రితం అమల్లోకి తెచ్చింది. డిమాండ్‌కు మించి కాలేజీలు, సీట్లు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈసారి మారటోరియంలో కొన్ని మినహాయింపులు కల్పించారు. పీపీపీ మోడ్‌తో సంప్రదాయ కోర్సులతో పాటు మల్టీ డిసిప్లినరీలతో ఉపాధి అవకాశాలున్న ప్రాంతాల్లో కొత్త పాలిటెక్నిక్ కాలేజీలపై రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలిపింది. ట్రస్టు, సొసైటీ, కంపెనీగా నమోదైన మూడేళ్లలో రూ.5 వేల కోట్ల వార్షిక టర్నోవర్ కలిగిన పరిశ్రమలు స్థాపించే సంస్థలకు మినహాయింపు వర్తిస్తుంది. గత ఏడాది 100 లోపు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్కు (ఎన్ఐఆర్ఎఫ్)లో చోటు సాధించి 10 వేల మంది విద్యార్ధులతో 25 ఏళ్లుగా ఇతర విద్యాసంస్థలు నడుపుతున్న దాతృత్వ సంస్థలకు కూడా మినహాయింపునివ్వనున్నారు. ప్రాంతీయ భాషల్లోకి సాంకేతిక పదాలు సాంకేతిక విద్యా కోర్సులను ఆంగ్లంలోనే కాకుండా ప్రాంతీయ భాషల్లోనూ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో శాస్త్రీయ, సాంకేతిక పదాలను ఆయా భాషల్లోకి అనువదించేలా ఏఐసీటీఈ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈమేరకు కమిషన్ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ టెర్మినాలజీ (సీఎస్టీటీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. స్థానిక భాషల్లో సాంకేతిక విద్యా కోర్సులను బోధించే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. (చదవండి: ‘టెలిస్కోపిక్’తో తక్కువ బిల్లులు) -
డిపాజిట్ బీమాతో బ్యాంకులపై ధీమా
న్యూఢిల్లీ: ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిపాజిట్ బీమా సంస్కరణలు .. బ్యాంకింగ్ వ్యవస్థపై ఖాతాదారుల్లో విశ్వాసాన్ని మరింతగా పెంచగలవని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భవిష్యత్తులో బ్యాంకు విఫలమైనా, డిపాజిటర్ల సొమ్ము భద్రంగా ఉంటుందనే భరోసా ఈ సంస్కరణలతో లభించిందని ’డిపాజిటర్స్ ఫస్ట్’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. బ్యాంకు డిపాజిట్లకు సంబంధించి బీమా పరిమితిని ప్రభుత్వం ఇటీవల రూ. 5 లక్షలకు పెంచిన సంగతి తెలిసిందే. సంక్షోభంలో ఉన్న బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం విధించిన పక్షంలో ఈ స్థాయి వరకూ డిపాజిట్లు ఉన్న వారు.. 90 రోజుల్లోగా తమ డబ్బు పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. సంబంధిత చట్టాన్ని అమల్లోకి తెచ్చాక గత కొద్ది రోజుల్లో సుమారు 1 లక్ష మంది పైగా ఖాతాదారులకు రూ. 1,300 కోట్ల పైచిలుకు అందిందని ప్రధాని చెప్పారు. ఆర్బీఐ మారటోరియం ఆంక్షలు ఎదుర్కొంటున్న మిగతా బ్యాంకుల్లోని మరో 3 లక్షల మంది ఖాతాదారులకు కూడా త్వరలో వారి డిపాజిట్ మొత్తం లభించగలదని ఆయన తెలిపారు. 16 పట్టణ సహకార బ్యాంకుల డిపాజిట్‌దారుల నుంచి వచ్చిన క్లెయిమ్స్‌కు సంబంధించి తొలి విడత చెల్లింపులను డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఇటీవలే విడుదల చేసిందని మోదీ చెప్పారు. రెండో విడత డిసెంబర్ 31న విడుదల కానున్నట్లు పేర్కొన్నారు. డిపాజిటర్ల ప్రయోజనాలపై ప్రత్యేక దృష్టి..: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖాతాదారుల ప్రయోజనాలను పరిరక్షించడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశ పురోగతిలో బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తాయని, బ్యాంకులు బాగుండాలంటే డిపాజిటర్ల సొమ్ము సురక్షితంగా ఉండటం కూడా చాలా ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. అటు మధ్యతరగతి గృహ కొనుగోలుదారుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని .. ఆర్థిక సమస్యలతో నిల్చిపోయిన పలు హౌసింగ్ ప్రాజెక్టులకు నిధులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. అధిక వడ్డీలకు ఆశపడితే రిస్కు: ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అధిక వడ్డీ రాబడుల కోసం ఆశపడితే అసలుకే ఎసరు వచ్చే ముప్పు ఉంటుందని డిపాజిట్‌దారులను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ హెచ్చరించారు. అధిక రాబడులు లేదా అధిక వడ్డీ రేట్లతో రిస్కులు కూడా ఎక్కువగానే ఉంటాయన్న సంగతి గుర్తుంచుకోవాలని ’డిపాజిటర్స్ ఫస్ట్’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సూచించారు. -
ఆటో ‘మొబైల్’కు బూస్ట్!
న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వొడాఫోన్ ఐడియా వంటి టెల్కోలకు ఊపిర్లూదే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంది. టెలికం రంగంలో భారీ సంస్కరణలకు తెర తీస్తూ టెల్కోలకు ఉపశమన ప్యాకేజీ ప్రకటించింది. ఆపరేటర్లు చెల్లించాల్సిన బకాయిలపై నాలుగేళ్ల దాకా మారటోరియం విధించడం, ఏజీఆర్ (సవరించిన స్థూల ఆదాయం) నిర్వచనాన్ని సవరించడం, స్పెక్ట్రం యూసేజీ చార్జీలు తొలగించడం, టెలికం రంగంలో ఆటోమేటిక్ విధానం ద్వారా 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించడం తదితర చర్యలు ఇందులో ఉన్నాయి. కేంద్ర కేబినెట్ బుధవారం ఈ ప్యాకేజీకి ఆమోదముద్ర వేసింది. వ్యవస్థాగతంగా తొమ్మిది సంస్కరణలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. టెల్కోల ఆర్థిక పరిస్థితులు గణనీయంగా మెరుగుపడేందుకు ఈ ప్యాకేజీ తోడ్పడగలదని పరిశ్రమ వర్గాలు, విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఉపాధి, పోటీకి ఊతం: టెలికం మంత్రి వైష్ణవ్ ‘‘టెలికం పరిశ్రమలో ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించేందుకు, కస్టమర్లకు ప్రత్యామ్నాయాలను అందుబాటులో ఉంచేందుకు, కొత్త సంస్థలు వచ్చేలా దారి ఏర్పర్చేందుకు తొమ్మిది వ్యవస్థాగతమైన సంస్కరణలను కేబినెట్ ఆమోదించింది’’ అని కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరుల సమావేశంలో తెలిపారు. 5జీ స్పెక్ట్రం వేలం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశం ఉందన్నారు. ప్యాకేజీలో..: సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) నిర్వచన పరిధి నుంచి టెలికంయేతర ఆదాయాలను మినహాయించారు. ఇది .. ఇక నుంచి అమలవుతుంది. నిబంధనల ప్రకారం ఏజీఆర్‌లో నిర్దిష్ట శాతాన్ని టెలికం కంపెనీలు.. కేంద్రానికి చట్టబద్ధమైన సుంకాల రూపంలో కట్టాల్సి ఉంటుంది. టెలికంయేతర ఆదాయాలను కూడా ఏజీఆర్‌లో కలపడం వల్ల వొడాఫోన్ ఐడియా వంటి టెల్కోలు కట్టాల్సిన బాకీలు వేల కోట్ల రూపాయల మేర పేరుకుపోయాయి. దీంతో అవి దివాలా తీసే పరిస్థితికి చేరుకున్నాయి. తాజాగా టెలికంయేతర ఆదాయాలను ఏజీఆర్ నుంచి మినహాయించడంతో టెల్కోలకు ఊరట లభిస్తుంది. మరోవైపు, ప్రభుత్వానికి టెల్కోలు గత బాకీలను చెల్లించేందుకు నాలుగేళ్ల దాకా మారటోరియం (వార్షిక చెల్లింపులను వాయిదా వేసుకునే వీలు) ఇవ్వడానికి ప్రభుత్వం ఓకే చెప్పింది. అయితే, ఈ వ్యవధిలో స్వల్పంగా వడ్డీ కట్టాల్సి ఉంటుంది. టెలికంలో ఆటోమేటిక్ మార్గంలో 100%ఎఫ్‌డీఐలకు అనుమతినిచ్చారు. ఇప్పటిదాకా ఇది 49%గానే ఉంది. దానికన్నా మించితే ప్రభుత్వ అనుమతి ద్వారా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటోంది. ► స్పెక్ట్రం యూజర్ చార్జీలను (ఎస్‌యూసీ) క్రమబదీ్ధకరించారు. ఎస్‌యూసీ బాకీలపై నెలవారీ చక్ర వడ్డీ విధానం స్థానంలో వార్షిక చక్రవడ్డీ విధానాన్ని ప్రకటించారు. అలాగే వడ్డీ రేటును కూడా తగ్గించారు. ఇకపై టెల్కోలు పదేళ్ల తర్వాత స్పెక్ట్రంను సరెండర్ చేయొచ్చు, అలాగే ఇతర సంస్థలతో పంచుకోవచ్చు. సెల్ఫ్ అప్రూవల్ ప్రాతిపదికన టవర్ల ఏర్పాటు ప్రక్రియను సరళతరం చేశారు. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థలు కేంద్రానికి రూ. 92,000 కోట్లు లైసెన్సు ఫీజు, రూ. 41,000 కోట్లు స్పెక్ట్రం యూసేజీ చార్జీలు బాకీ పడ్డాయి. ► ఇతర సుంకాలను, లైసెన్సు ఫీజుకు సంబంధించి చూపాల్సిన బ్యాంక్ గ్యారంటీలను తగ్గించారు. లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల (ఎస్‌యూసీ) చెల్లింపులో జాప్యానికి గాను విధించే పెనాలీ్టలను తొలగించారు. వడ్డీ రేట్లను క్రమబదీ్ధకరించారు. భవిష్యత్తులో నిర్వహించే వేలానికి బ్యాంక్ గ్యారంటీ అవసరం ఉండదు. ► స్పెక్ట్రం కాలపరిమితిని 20 ఏళ్ల నుంచి 30 ఏళ్లకు పొడిగించారు. 10 సంవత్సరాల తర్వాత స్పెక్ట్రంను సరెండర్ చేయవచ్చు. భవిష్యత్తులో నిర్వహించే వేలంలో కొనుగోలు చేసే స్పెక్ట్రంపై ఎస్‌యూసీ ఉండదు. ► ప్రక్రియపరమైన సంస్కరణలు చూస్తే..స్పెక్ట్రం వేలం నిర్వహణకు నిర్దిష్ట క్యాలెండర్ రూపకల్పన, వైర్లెస్ పరికరాల కోసం క్లిష్టతరమైన లైసెన్సు ప్రక్రియ తొలగింపు, యాప్ ఆధారిత సెల్ఫ్–కేవైసీ, పేపర్ రూపంలో ఉండే కస్టమర్ అక్విజిషన్ ఫారమ్‌ల (సీఏఎఫ్) స్థానంలో డేటాను డిజిటల్‌గా భద్రపర్చడం వంటివి ఉన్నాయి. అలాగే ఈ–కేవైసీ రేటును రూ.1కి సవరించారు. ఉభయతారకంగా సంస్కరణలు.. ఈ సంస్కరణలు.. టెలికం రంగానికి, వినియోగదారులకు ఉభయతారకంగా ఉంటాయి. పరిశ్రమ అభివృద్ధికి, ఉద్యోగావకాశాలకు తోడ్పడతాయి. వాహనాలు, డ్రోన్ పరిశ్రమకు ప్రకటించిన పీఎల్ఐ స్కీముతో తయారీకి ఊతం లభిస్తుంది. – నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి డిజిటల్ లక్ష్య సాకారానికి దోహదం.. ఎకానమీకి తోడ్పాటు అందించడంతో పాటు డిజిటల్ ఇండియా లక్ష్యాల సాకారానికి తోడ్పడేలా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంస్కరణలు, చర్యలను స్వాగతిస్తున్నాను. సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు – ముకేశ్ అంబానీ, చైర్మన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్ చేసేందుకు తోడ్పాటు.. పరిశ్రమ నిర్భయంగా పెట్టుబడులు పెట్టేందుకు, డిజిటల్ ఇండియా ఆకాంక్షల సాధనకు కేంద్రం ప్రకటించిన సంస్కరణలు తోడ్పడతాయి. టెల్కోలు నిలదొక్కుకునేందుకు ఇవి దోహదపడగలవు. ప్రధాని పిలుపు మేరకు పెట్టుబడులు పెట్టేందుకు ఎయిర్టెల్ సిద్ధం. – సునీల్ మిట్టల్, చైర్మన్, భారతి ఎయిర్టెల్ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం.. పరిశ్రమ ఆరోగ్యకరంగా ఎదిగేలా చూసేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందనడానికి ఈ సంస్కరణలు నిదర్శనం. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వ్యవహరించడాన్ని ఈ చర్యలు ప్రతిబింబిస్తున్నాయి. – కుమార మంగళం బిర్లా, చైర్మన్, ఆదిత్య బిర్లా గ్రూప్ ఎగుమతులకు జోష్... సవరించిన పీఎల్ఐ పథకం ఎగుమతులకు భారీ అవకాశాలను కలి్పంచనుంది. దేశీ ఆటో పరిశ్రమ ప్రపంచవ్యాప్త సప్లై చైన్‌తో మమేకమయ్యేందుకు దోహదపడుతుంది. మన కంపెనీల అవకాశాలకు తోడ్పడుతుంది. –విపిన్ సొం«దీ, ఎండీ, సీఈఓ, అశోక్ లేలాండ్ పరిశ్రమకు దన్ను.. తాజాగా సవరించిన పీఎల్ఐ పథకం ఆటో పరిశ్రమకు అవసరమైన జోష్‌నివ్వనుంది. ప్రత్యామ్నాయ ఇంధనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఆధునిక సాంకేతిక ఆవిష్కరణలకు దారి చూపనుంది. –వేణు శ్రీనివాసన్, చైర్మన్, టీవీఎస్ మోటార్ ఇవి అత్యధిక నిధులు.. ప్రభుత్వం ప్రకటించిన పీఎల్ఐ పథకాలలోకెల్లా తాజాగా కేటాయించిన నిధులు అత్యధికం. ఎలక్ట్రిక్, హైడ్రోజన్ వాహనాలు, విడిభాగాలకు ప్రోత్సాహకాల ద్వారా దేశీ ఆటో పరిశ్రమకు మద్దతివ్వడం.. ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం. –కెనిచి అయుకవా, ప్రెసిడెంట్, సియామ్ -
టెలికం రంగంలో సంస్కరణలు తేవాలి
న్యూఢిల్లీ: సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న టెలికం రంగాన్ని ఆదుకోవాలని, ఆర్థిక సంస్కరణలు అమలు చేయాలని కేంద్రానికి టెల్కోలు విజ్ఞప్తి చేశాయి. పరిశ్రమ లాభసాటిగా మారాలంటే సుంకాలు తగ్గించాలని, వేలం వేసిన స్పెక్ట్రం హోల్డింగ్ కాలావధిని రెట్టింపు చేయాలని, స్పెక్ట్రం చెల్లింపులపై 7–10 ఏళ్ల పాటు మారటోరియం ఇవ్వాలని కోరాయి. టెల్కోల సమాఖ్య సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) ఈ మేరకు టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్‌కు లేఖ రాసింది. అత్యధిక పన్నుల భారం పడే రంగాల్లో టెలికం పరిశ్రమ కూడా ఒకటని అందులో పేర్కొంది. ఆదాయాల్లో 32 శాతం భాగం పన్నులు, సుంకాల రూపంలో కట్టాల్సిన ప్రస్తుత విధానంతో కంపెనీలు మనుగడ సాగించడం కష్టంగా మారిందని వివరించింది. పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీల దగ్గర నిరంతరం మిగులు నిధులు ఉండే పరిస్థితి లేనందున ఇంతటి భారీ స్థాయి పన్నులనేవి పరిశ్రమ వృద్ధికి ప్రతికూలమని సీవోఏఐ తెలిపింది. వొడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో తదితర సంస్థలు ఇందులో సభ్యులుగా ఉన్నాయి. లేఖ కాపీలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు కూడా సీవోఏఐ పంపింది. పలు ప్రతిపాదనలు.. టెలికం రంగాన్ని తిరిగి పటిష్టమైన, నిలకడైన వృద్ధి బాట పట్టించడానికి ప్రాథమిక ఆర్థిక సంస్కరణలు అత్యవసరమని సీవోఏఐ పేర్కొంది. ఇందులో భాగంగా తీసుకోతగిన విధానపరమైన చర్యలకు సంబంధించి పలు ప్రతిపాదనలు చేసింది. పన్నులు, సుంకాలు తగ్గించడం, స్పెక్ట్రంనకు సంబంధించి ధరను సహేతుకంగా నిర్ణయించడం, చెల్లింపులకు సులభతరమైన నిబంధనలు విధించడం, హోల్డింగ్ వ్యవధిని పెంచడం వంటివి వీటిలో ఉన్నాయి. అలాగే, సవరించిన స్థూల రాబడి (ఏజీఆర్) నిర్వచనాన్ని పునఃసమీక్షించడం, కనీస ధరను నిర్ణయించడం, ఆర్థిక..పనితీరుపరమైన బ్యాంక్ గ్యారంటీల నుంచి మినహాయింపునివ్వడం వంటి ఇతర ప్రతిపాదనలు ఉన్నాయి. రుణాలు, నష్టాల భారంతో వొడాఫోన్ ఐడియా అస్తిత్వం ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో సీవోఏఐ ఈ లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవేళ సంక్షోభంలో చిక్కుకున్న వొడాఫోన్ ఐడియాను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల అది గానీ మూతబడితే పరిశ్రమలో రెండు సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదముందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఆఖరు నాటికి వొడాఫోన్ ఐడియా మొత్తం రుణభారం రూ. 1,91,590 కోట్లుగా ఉంది. ఇందులో స్పెక్ట్రం చెల్లింపు బకాయి రూ. 1,06,010 కోట్లు, ఏజీఆర్ బాకీ రూ. 62,180 కోట్లుగా ఉంది. -
బ్యాంకు ఖాతాదారులకు కేంద్రం శుభవార్త
-
బ్యాంకు ఖాతాదారులకు కేంద్రం శుభవార్త!
బ్యాంకు ఖాతాదారులకు కేంద్రం శుభవార్త అందించింది. డిపాజిట్ ఇన్స్యూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్(డీఐసీజీసీ) 1961 చట్ట సవరణలకు నేడు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గం డీఐసీజీసీ బిల్లు 2021ను ఆమోదించిన విషయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. బ్యాంకులపై మారటోరియం విధించిన 90 రోజుల్లోగా ఖాతాదారులు తమ డిపాజిట్లపై ₹ 5 లక్షల వరకు బీమా పొందవచ్చు అని అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మారటోరియం విధించిన కూడా బ్యాంకు ఖాతాదారులకు డిపాజిట్ బీమా వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. భారతదేశంలోని విదేశీ బ్యాంకు శాఖలు కూడా దీని పరిధిలోకి వస్తాయని ఆమె అన్నారు. తాజా చట్టం వల్ల 98.3 శాతం బ్యాంకు ఖాతాదారులు ఊరట కలుగుతుందని సీతారామన్ తెలిపారు. "సాధారణంగా, బీమా కింద డబ్బు పొందడానికి పూర్తి లిక్విడేషన్ తర్వాత ఎనిమిది నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. కానీ, కొత్త చట్టం వల్ల ఇప్పుడు మారటోరియం విధించినప్పటికి 90 రోజుల్లోగా ఈ ప్రక్రియ ఖచ్చితంగా పూర్తవుతుందని డిపాజిటర్లకు ఈ చట్టం ఉపశమనం ఇస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు. 2020లో ఈ బీమా మొత్తాన్ని రూ.1 లక్ష నుంచి రూ. 5లక్షలకు పెంచారు. అయితే ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం బ్యాంకు లైసెన్సు రద్దు చేసి, లిక్విడేషన్ చర్యలు ప్రారంభించిన తర్వాతే డీఐసీజీసీ నుంచి బీమా మొత్తాన్ని పొందేందుకు వీలు ఉండేది. తాజాగా ఈ డీఐసీజీసీ చట్టాన్ని సవరించడంతో దివాలా అంచున ఉన్న బ్యాంకుల ఖాతాదారులు తమ నగదును వెనక్కి తీసుకునేందుకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. -
విధాన నిర్ణయాల్లో... మా జోక్యం ఉండదు
న్యూఢిల్లీ: విధానపరమైన నిర్ణయాల్లో తమ జోక్యం ఉండబోదని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే.. బ్యాంకులు రుణ అకౌంట్లను మొండిబకాయిలుగా (ఎన్పీఏ) ప్రకటించడాన్ని నిలుపుచేస్తూ తాను ఇచ్చిన స్టేను మార్చి 23వ తేదీన సుప్రీంకోర్టు తొలగించింది. అయితే ఎన్పీఏగా ప్రకటించడానికి సంబంధించి మరిన్ని అంశాలను సమీక్షించాలని దాఖలైన తాజా పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేస్తూ విధానపరమైన నిర్ణయాల్లో న్యాయస్థానం జోక్యం ఉండబోదని పేర్కొంది. విశాల్ తివారీ అనే న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు. ‘‘ఇప్పటికే వచ్చిన తీర్పులో పేర్లు, సంబంధిత పొరపాట్లు ఏదైనా జరిగితే సవరణలకు ఈ తరహా పిటిషన్లు దాఖలు చేయవచ్చు. మీరు దాఖలు చేసిన పిటిషన్లో అలాంటి అంశాలు ఏవీ లేవు. దీనిని మేము విచారించలేము’’ అని డీవై చంద్రచూడ్, ఎంఆర్ షాలతో కూడిన డివిజనల్ బెంచ్ స్పష్టం చేసింది. దీనితో ఈ అప్లికేషన్ ఉపసంహరణకు న్యాయవాది ధర్మాసనం అనుమతి కోరారు. దీనికి బెంచ్ అంగీకరించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో రుణ చెల్లింపులపై గత ఏడాది ఆగస్టు 31 వరకూ 6 నెలల పాటు ఆర్బీఐ మారటోరియం విధించింది. ఈ కాలంలో బ్యాంకింగ్ చక్రవడ్డీ వసూళ్లపై జరిగిన విచారణ సందర్భంగా సెప్టెంబర్ 3వ తేదీన సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇస్తూ, ఆగస్టు 31 వరకూ మొండిబకాయిలుగా ప్రకటించిన ఖాతాలను తన తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ యథాతథంగా కొనసాగించాలని పేర్కొంది. ఇరు పక్షాల వాదనల అనంతరం ఈ స్టేను వెకేట్ చేస్తూ, ఈ ఏడాది మార్చి 23న తీర్పును ఇచ్చింది. అలాగే మారటోరియం కాలంలో చక్రవడ్డీ తగదనీ ఆదేశా లు ఇచ్చింది. దీనితో తీర్పునకు అనుగుణంగా ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. అప్పటికే వసూలు చేసిన వడ్డీ మొత్తాలను రిఫండ్ చేసేలా లేదా రుణ అకౌంట్ల తదుపరి వాయిదాల్లో సర్దుబాటు జరిగేలా బ్యాంకింగ్‌కు ఆదేశాలిచ్చింది. -
వోడాఫోన్ ఐడియా మూతపడనుందా?
ఆదిత్య బిర్లా గ్రూప్, వొడాఫోన్ గ్రూప్ సంయుక్త కంపెనీ వొడాఫోన్ ఐడియా లిమిటెడ్(వీఐఎల్) టెలికాం కంపెనీ మూతపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (వీఐఎల్) షేర్లు జూన్ 30 పడిపోయిన దానికంటే కంటే జూలై 1న భారీగా పడిపోయాయి. వొడాఫోన్ ఐడియా షేర్లు జూలై 1న 8.54శాతం క్షీణించి రూ.9.1 వద్ద ముగిసింది. ఈ టెలికాం సంస్థకు ఎఫ్ వై21 క్యూ4లో రూ.7,022.8 కోట్ల ఏకీకృత నికర నష్టం కలిగింది. మొత్తం 2021 ఆర్ధిక సంవత్సరంలో మొత్తం రూ.44,233 కోట్ల నష్టాన్ని చవి చూసింది. ఇందులో జనవరి-మార్చి త్రైమాసిక నష్టాలు(రూ.6,985 కోట్లు) కూడా ఉన్నాయి. మరో పక్క చందాదారుల సంఖ్య కూడా భారీగా తగ్గిపోతుంది. కేవలం 2021 జనవరి-మార్చి త్రైమాసికంలోనే 20 లక్షల చందాదారులు ఇతర నెట్ వర్క్ లకు మారారు. 2021 ఆర్ధిక సంవత్సరం ముగిసే నాటికి మొత్తం చందాదారుల సంఖ్య 27 కోట్లకు పడిపోయింది. ఆర్ధిక సమస్యలు ఎదుర్కొంటున్న టెల్కో వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) తాజాగా స్పెక్టం వాయిదాల చెల్లింపునకు సంబంధించి ఏడాది పాటు మారటోరియం ఇవ్వాలంటూ టెలికం శాఖ (డాట్)కు విజ్ఞప్తి చేసింది. జూన్ 25న డాట్ కార్యదర్శికి ఈ మేరకు లేఖ రాసింది. తమ దగ్గరున్న నగదును సవరించిన ఏజీఆర్ (సవరించిన స్థూల అదాయం) బాకీలకు చెల్లించాల్సి వస్తున్నందున వచ్చే ఏడాది ఏప్రిల్ 9న కట్టాల్సిన రూ.8,292 కోట్లు స్పెక్ట్రమ్ వాయిదా మొతాన్ని కట్టే పరిస్థితి లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో తాము చెల్లించాల్సిన వాయిదాలకు మరో ఏడాది పాటు 2023 ఏప్రిల్ దాకా మారటోరియం ఇవ్వాలంటూ వీఐఎల్ కోరింది. గత అరు నెలలుగా కొత్త పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఇన్వెస్టర్లు ముందుకు, రావడం లేదని తెలిపింది. టారిఫ్‌లు పెరిగితే తప్ప టెలికం పరిశ్రమ కోలుకోలేకపోవచ్చని, తాము నష్టపోతామని ఇన్వెస్టర్లు భావిస్తుండటమే ఇందుకు కారణమని వివరించింది. ఒకవేల ప్రభుత్వం నుంచి సహాయం అందకపోతే వొడాఫోన్ ఐడియా లిక్విడేషన్ కు వెళ్లనున్నట్లు గ్లోబల్ సీఈఓ నిక్ రీడ్ ఇప్పటికే చెప్పారు. చదవండి: జీఎస్టీతో పన్ను చెల్లింపుదారులు రెట్టింపు -
మార్కెట్‌కు ‘సుప్రీం’ జోష్
ముంబై: రుణాల మారిటోరియంపై సుప్రీంకోర్టు తీర్పు స్టాక్ మార్కెట్‌కు జోష్‌నిచ్చింది. కరోనా కాలంలో కేంద్రం ప్రకటించిన రుణాల మారటోరియం గడువును పెంచడానికి అత్యున్నత న్యాయస్థానం విముఖత చూపింది. అలాగే పూర్తిగా వడ్డీ మాఫీ సాధ్యం కాదని, అసలు ఈ అంశంలో కేంద్రానికి తాము ఎలాంటి ఆదేశాలను జారీ చేయలేమని తేల్చి చెప్పింది. కోర్టు తీర్పుతో బ్యాంకు రుణాలు, వడ్డీకి సంబంధించి ఇన్నాళ్ళూ కొనసాగిన ప్రతిష్టంభనకు తెరపడింది. దీంతో బ్యాంకింగ్, ఆర్థిక రంగాల షేర్లకు భారీగా కొనుగోళ్ల మద్దతు లభించింది. అధిక వెయిటేజీ కలిగిన ఈ రంగ షేర్లు రాణించడంతో ఇండెక్సులు లాభాలను ఆర్జించగలిగాయి. సెన్సెక్స్ 280 పాయింట్లు లాభంతో 50 వేలపైన 50,051 వద్ద ముగిసింది. నిఫ్టీ 78 పాయింట్లు పెరిగి 14,815 వద్ద ముగిసింది. అలాగే దేశవ్యాప్తంగా ఈ వారం ఆరంభం నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోవడంతో కరోనా కేసులు అదుపులోకి రావచ్చని ఆశాభావం ట్రేడర్లలో నెలకొంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు మూడున్నర తగ్గడం, దేశీయంగా బాండ్ ఈల్డ్స్ తగ్గడం తదితర అంశాలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఆటో, ఐటీ, ఫార్మా, రియల్టీ షేర్లకు సైతం స్వల్ప కొనుగోళ్ల మద్దతు లభించింది. మరోవైపు మెటల్, ఎఫ్ఎంసీజీ, మీడియా రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 603 పాయింట్ల పరిధిలో కదలాడగా, నిఫ్టీ 171 పాయింట్ల రేంజ్లో ట్రేడైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.108 కోట్ల విలువైన షేర్లను అమ్మగా, దేశీయ ఇన్వెస్టర్లు సైతం రూ. 529 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అమెరికా కాంగ్రెస్ ఎదుట యూఎస్ దేశ ఆర్థిక స్థితిగతులపై వివరణ(టెస్టిమోనీ)ఇచ్చేందుకు ఫెడరల్ ౖచైర్మన్ పావెల్‌తో పాటు ట్రెజరీ సెక్రటరీ జానెట్ ఎలెన్ సిద్ధమైన తరుణంలో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు స్వల్ప నష్టాలతో కదలాడుతున్నాయి. ‘‘మారిటోరియంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత ఇన్వెస్టర్లు ప్రభుత్వరంగ బ్యాంకుల్లోని నాణ్యమైన షేర్లను కొనేందుకు ఆసక్తి చూపారు. ఎంఎండీఆర్ చట్ట సవరణకు లోక్‌సభ ఆమోదం తెలపడంతో సిమెంట్ షేర్ల ర్యాలీ రెండోరోజూ కొనసాగింది. ప్రభుత్వం నుంచి సబ్సీడి నిధులు విడుదల కావడంతో ఫెర్టిలైజర్ షేర్లకు డిమాండ్ లభించింది’’ అని ఎల్కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ ఎస్ రంగనాథన్ తెలిపారు. 603 పాయింట్ల పరిధిలో సెన్సెక్స్... అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో మార్కెట్ లాభాలతో మొదలైంది. సెన్సెక్స్ 105 పాయింట్ల లాభంతో 49,876 వద్ద, నిïఫ్టీ 24 పాయింట్ల పెరుగుదలతో 14,768 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపు లాభాల్లో కదలాడిన సూచీలు ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో నష్టాల బాటపట్టాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 49,662 వద్ద, నిఫ్టీ 14,707 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదుచేశాయి. నష్టాల్లో కదలాడుతున్న సూచీలకు సుప్రీం తీర్పు ఉత్సాహాన్నిచ్చింది. బ్యాంకింగ్, ఆర్థిక రంగ షేర్లకు భారీ కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ట్రేడింగ్ ముగింపు వరకు ర్యాలీని కొనసాగించాయి. సెన్సెక్స్ ఇంట్రాడే కనిష్టం (49,662) నుంచి 603 పాయింట్ల పాయింట్లు పెరిగి 50,265 వద్ద, నిఫ్టీ 171 పాయింట్లు ఎగసి 14,879 వద్ద ఇంట్రాడే గరిష్టస్థాయిలను నమోదుచేశాయి. -
మారటోరియం : సుప్రీం కీలక తీర్పు
సాక్షి, ఢిల్లీ: కరోనా, లాక్డౌన్ సమయంలో రుణాలపై విధించిన మారటోరియం పొడిగింపు, మొత్తం వడ్డీని మాఫీ చేయడం లాంటి అంశాలపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పును వెలువరించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించే ఆరు నెలల రుణ మారటోరియంను పొడిగించాలని కోరుతూ వివిధ వాణిజ్య సంఘాలు, కార్పొరేట్ సంస్థల పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మంగళవారం తన తీర్పును ప్రకటించిన సుప్రీం వడ్డీని పూర్తిగా మాఫీ చేయలేమని పేర్కొంది. అలాగే మాలాఫైడ్, ఏకపక్షంగా ఉంటే తప్ప కేంద్రం ఆర్థిక నిర్ణయాలను న్యాయ సమీక్ష చేయలేమని పేర్కొంది. ప్రత్యేక ఆర్థిక ఉపశమనం లేదా ప్యాకేజీలను ప్రకటించమని ప్రభుత్వాన్ని లేదా కేంద్ర బ్యాంకును ఆదేశించలేమని, ప్రత్యేక రంగాలకు ఉపశమనం అడగలేమని కూడా సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది. చక్రవడ్డీ వసూలును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన జస్టిస్ అశోక్ భూషణ్, సుభాష్ రెడ్డి, ఆర్షా కూడిన అత్యున్నత ధర్మాసనం ఈ ఆదేశాల్చింది. వడ్డీ మినహాయింపుపై వడ్డీని రూ .2 కోట్ల వరకు కేంద్రం పరిమితం చేసిందని సుప్రీం గుర్తు చేసింది. అలాగే ఈ ఆరు నెలల కాలానికి రుణ గ్రహీతలనుంచి చక్రవడ్డీ వసూలు చేయొద్దని తెలిపింది. మారటోరియం కాలాన్ని పొడిగించడం, మొత్తం వడ్డీ మాఫీ సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఖాతాదారులకు, పెన్షనర్లకు బ్యాంకులు వడ్డీ చెల్లిస్తాయి, మరి అలాంటప్పుడు బ్యాంకులు రుణాలపై పూర్తిగా వడ్డీని ఎలా మాఫీ చేయగలవని సుప్రీం ప్రశ్నించింది. గతేడాది భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) విధించిన మారటోరియం 2020 ఆగస్టుతో ముగిసింది. రుణాలపై వడ్డీ వసూళ్ల మీద మారటోరియం పొడిగించడానికి కేంద్ర ఆర్ధికశాఖ, ఆర్బీఐ నిరాకరించాయి. ఇప్పటికే రూ.2 కోట్ల వరకు రుణాలపై కేంద్రం వడ్డీ మాఫీ చేసిన సంగతి తెలిసిందే. -
చక్రవడ్డీ మాఫీ : వారికి సుప్రీం షాక్
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి, లాక్డౌన్ కాలంలో విధించిన ఆరు నెలల మారటోరియం కాలానికి సంబంధించి క్రెడిట్ కార్డు వినియోగదారులకు సుప్రీంకోర్టు షాకిచ్చింది.క్రెడిట్ కార్డు వినియోగదారులు కార్డ్ రుణాల ద్వారా ఉత్పత్తులను కొనుగోలు చేశారని, వారికి మారటోరియం ప్రయోజనాలు అవసరమా అంటూ అత్యున్నత న్యాయస్థానం గురువారం కేంద్రాన్ని ప్రశ్నించింది. క్రెడిట్ కార్డుదారులు రుణగ్రహీతల కిందకు రారని చక్రవడ్డీ మాఫీ ప్రయోజనం క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఇవ్వకూడదని అభిప్రాయపడింది వాస్తవానికి వారు రుణాలు పొందలేదని, దానికి బదులుగా వస్తువులు కొనుగోళ్లు చేశారని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అలాగే ప్రీ-కోవిడ్ డిఫాల్టర్లు కూడా చక్రవడ్డీ మాఫీ పొందలేరని తెలిపింది. లోన్ మారటోరియం, ప్రయోజనాలకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. వడ్డీ మినహాయింపు ప్రణాళికలో ఇప్పటివరకు 13.12 కోట్ల ఖాతాలకు రూ .5270 కోట్లు జమ అయ్యాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేశారు. కరోనా నేపథ్యంలో ఉద్యోగులకు, వ్యాపారులకు, సామాన్యులకు ఊరట కల్పించేందుకు ప్రభుత్వం మార్చినుంచి ఆగస్ట్ వరకు లోన్ మారటోరియం వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే. ఈ కాలంలో రూ .2 కోట్ల వరకు ఉన్న అన్ని రుణాలపై వడ్డీవడ్డీని రద్దు చేసింది. ఈ భారాన్ని భరించేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన చెల్లింపులను కూడా ప్రారంభించింది. SG: banks havs to lodge claim to SBI for which a separate nodal agency is created, they’ll verify, take it from Government and then pay it SG: I am a credit card holder and I received SMS for ex gratia credit Sc: but do you need it? People like you should not get the benefit — Bar & Bench (@barandbench) November 19, 2020 -
ఆర్బీఐ షాక్ : ఎల్వీబీ షేర్లు ఢమాల్
సాక్షి, ముంబై: బ్యాంకు కార్యకలాపాలపై కేంద్ర ప్రభుత్వం దాదాపు నెల రోజులపాటు మారటోరియంను విధించిన నేపథ్యంలో ప్రయివేట్ రంగ బ్యాంకు లక్ష్మీ విలాస్ బ్యాంక్ కౌంటర్లో ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూ కట్టడంతో ఎన్ఎస్ఈలో ఈ షేరు 20 శాతం డౌన్ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు అధికంకాగా.. కొనేవాళ్లు కరవుకావడంతో రూ. 3.10 నష్టంతో రూ. 12.45 వద్ద ఫ్రీజయ్యింది. తద్వారా ఇంతక్రితం మార్చి 31న నమోదైన ఏడాది కనిష్టం రూ. 10.40కు చేరువైంది. ట్రేడింగ్ ప్రారంభమైన తొలి అర్ధగంటలోనే కౌంటర్లో 3.5 కోట్లకుపైగా షేర్ల విక్రయానికి సెల్ ఆర్డర్లు(బీఎస్ఈ, ఎన్ఎస్ఈ) నమోదైనట్లు మార్కెట్ విశ్లేషకులు తెలియజేశారు. ఏం జరిగిందంటే? చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్వీబీ)పై కేంద్రం మంగళవారం మారటోరియం విధించింది. ఈ నెల 17 నుంచి డిసెంబర్ 16 వరకూ 30 రోజులపాటు మారటోరియం అమల్లో ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. బ్యాంక్ ఖాతాదారుడు తన ఖాతాలో ఎంత మొత్తం ఉన్నాగానీ రూ.25,000 వరకూ మాత్రమే వెనక్కు తీసుకోగలుగుతాడు. అయితే ఆరోగ్య వ్యయాలు, ఉన్నత విద్యకు చెల్లింపులు, వివాహ ఖర్చుల వంటి అత్యవసరాలకు ఆర్బీఐ ముందస్తు అనుమతితో ఖాతాదారుడు రూ.25,000కు మించి తన డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు వీలుంటుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. బ్యాంక్ బోర్డ్‌ను పక్కనబెట్టి కేంద్రం తాజా నిర్ణయాన్ని తీసుకుంది. బ్యాంక్ ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) సలహా మేరకు అత్యవసర ప్రాతిపదికన కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్‌గా కెనరాబ్యాంక్ మాజీ నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్ టీఎన్ మనోహరన్‌ను నియమించింది. తొలిసారి దేశీ బ్యాంకింగ్ చరిత్రలో తొలిసారి విదేశీ బ్యాంకుకు చెందిన దేశీ యూనిట్‌తో దేశీయ బ్యాంకును విలీనం చేసేందుకు ఆర్బీఐ ప్రతిపాదించినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఇందుకు ప్రధానంగా డీబీఎస్ బ్యాంకు ఆర్థికంగా పరిపుష్టంగా ఉండటం, విలీనంతో ఎల్వీబీ ఖాతాదారులు, ఉద్యోగులకు ప్రయోజనం కలిగే వీలుండటం వంటి అంశాలను ఆర్బీఐ పరిగణనలోకి తీసుకుని ఉండవచ్చని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. గతంలో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఇందుకు ఆర్బీఐను సంప్రదించినప్పటికీ అనుమతించకపోవడం గమనార్హం. ఇదే విధంగా క్లిక్స్ క్యాపిటల్ ప్రతిపాదనకు సైతం నో చెప్పింది. విలీనానికి సంబంధించి రెండు సంస్థల మధ్య ప్రతిపాదించిన వేల్యుయేషన్స్ సక్రమంగా లేవన్న కారణం ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. డీబీఎస్ బ్యాంక్‌తో విలీనం తాజా పరిణామాల నేపథ్యంలో లక్ష్మీ విలాస్ బ్యాంక్‌ను సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న బ్యాంకింగ్ సేవల దిగ్గజం... డీబీఎస్ బ్యాంక్ ఇండియా (డీబీఐఎల్)తో విలీనానికి ఆర్బీఐ ముసాయిదా పథకాన్ని వెలువరించింది. లక్ష్మీ విలాస్ బ్యాంక్ విలీన ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ లభిస్తే.. భారత్‌లో తమ అనుబంధ సంస్థ డీబీఐఎల్ రూ. 2,500 కోట్ల మేర నిధులు ఇవ్వనున్నట్లు డీబీఎస్ వెల్లడించింది. దేశీయంగా డీబీఎస్ బ్యాంకు 26 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 13 రాష్టాలు, 24 పట్టణాలలో సేవలు విస్తరించింది. ఎల్‌వీబీకి ఎన్ఆర్ఐ కస్టమర్లు అధికంగా ఉన్నట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఆసియాలో కార్యకలాపాలు విస్తరించిన డీబీఎస్ ఈ కస్టమర్లకు మరింత సులభంగా సర్వీసులు అందించగలుగుతుందని అభిప్రాయపడ్డాయి. డీబీఎస్ బ్యాంకులో సింగపూర్ ప్రభుత్వానికి చెందిన టెమాసెక్ వాటాదారుకావడంతో ఆర్థిక పరిపుష్టిని కలిగి ఉన్నట్లు తెలియజేశాయి. దీంతో ఎల్వీబీ విలీనం తదుపరి అవసరమైతే మరిన్ని నిధులతో బ్యాంకు కార్యకలాపాలను విస్తరించగలదని పేర్కొన్నాయి. డీబీఎస్ బ్యాంకు ఇంతక్రితం దేశీయంగా మురుగప్ప గ్రూప్‌తో ఏర్పాటు చేసిన ఎన్బీఎఫ్సీ జేవీ చోళమండలం ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్స్‌లోనూ 37.5 శాతం వాటాను సొంతం చేసుకుంది. కాగా.. ఎల్వీబీని విలీనం చేసుకుంటే దక్షిణాదిలో కార్యకలాపాలను విస్తరించేందుకు వీలు కలుగుతుందని విశ్లేషకులు తెలియజేశారు. ఎల్వీబీ ప్రస్తుతం 563 బ్రాంచీలు, 974 ఏటీఎంలను కలిగి ఉంది. డీబీఎస్ బ్యాంకులో ఎల్వీబీ విలీనమైతే సంయుక్త సంస్థ 12.51 శాతం సీఆర్ఏఆర్ను, 9.61 శాతం సీఈటీ-1 క్యాపిటల్‌నూ సమకూర్చుకోగలదని వివరించారు. -
ఆర్బీఐ గుప్పిట్లోకి.. లక్ష్మీ వి‘లాస్’!
ముంబై: ప్రైవేటు రంగంలోని లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్వీబీ)పై కేంద్రం మంగళవారం మారటోరియం అ్రస్తాన్ని ప్రయోగించింది. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఈ బ్యాంక్‌పై మంగళవారం నుంచి (17వ తేదీ) నుంచి 30 రోజులపాటు– డిసెంబర్ 16 వరకూ మారటోరియం అమల్లో ఉంటుంది. ఆర్థికశాఖ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం, ఒక బ్యాంక్ ఖాతాదారుడు తన ఖాతాలో ఎంత మొత్తం ఉన్నా, కేవలం రూ.25,000 వరకూ మాత్రమే (30 రోజుల వరకూ) వెనక్కు తీసుకోగలుగుతాడు. అయితే ఆరోగ్య వ్యయాలు, ఉన్నత విద్యకు చెల్లింపులు, వివాహ ఖర్చుల వంటి అత్యవసరాలకు ఆర్బీఐ ముందస్తు అనుమతితో ఖాతాదారుడు రూ.25,000కు మించి తన డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు వీలుంటుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. బ్యాంక్ బోర్డ్‌ను పక్కనబెట్టి కేంద్రం తాజా నిర్ణయాన్ని తీసుకుంది. బ్యాంక్ ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సలహా మేరకు కేంద్రం ఈ అత్యవసర నిర్ణయాన్ని తీసుకుంది. బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్‌గా కెనరాబ్యాంక్ మాజీ నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్ టీఎన్ మనోహరన్ నియమితులయ్యారు. ప్రత్యామ్నాయం లేకే...: ఆర్బీఐ ‘‘బ్యాంకుకు సంబంధించి విశ్వసనీయ పునరుద్ధరణ ప్రణాళికలేని పరిస్థితుల్లో డిపాజిటర్ల ప్రయోజనాలు, బ్యాంకింగ్ స్థిరత్వం, ఫైనాన్షియల్ వ్యవహారాల పటిష్టత ముఖ్యం. ఈ పరిస్థితుల్లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 సెక్షన్ 45 కింద బ్యాంక్‌పై మారటోరియం విధించాలని కేంద్రానికి సిఫారసు చేయడం మినహా వేరే ప్రత్యామ్నాయం లేదు. ఆర్బీఐ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం 17వ తేదీ నుంచి 30 రోజులపాటు... అంటే డిసెంబర్ 16వ తేదీ వరకూ అమలుజరిగే విధంగా బ్యాంక్‌పై మారటోరియం విధించింది’’ అని ఈ పరిణామానికి సంబంధించి వెలువడిన ఆర్బీఐ ప్రకటన ఒకటి తెలిపింది. తాజా మారటోరియం ప్రకారం, సేవింగ్స్, కరెంట్ లేదా మరే డిపాజిట్ అకౌంట్ నుంచీ లక్ష్మీ విలాస్ బ్యాంక్ తనకు తానుగా, ఆర్బీఐ నుంచి అనుమతి పొందకుండా రూ.25,000 మించి ఖాతాదారుకు చెల్లించలేదని కూడా స్పష్టం చేసింది. డీబీఎస్ బ్యాంక్‌తో విలీన ప్రతిపాదన తాజా పరిణామాల నేపథ్యంలో లక్ష్మీ విలాస్ బ్యాంక్‌ను సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న బ్యాంకింగ్ సేవల దిగ్గజం... డీబీఎస్ బ్యాంక్ ఇండియా (డీబీఐఎల్)తో విలీనానికి సంబంధించి ముసాయిదా పథకాన్ని కూడా ఆర్బీఐ వెలువరించింది. లక్ష్మీ విలాస్ బ్యాంక్ విలీన ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ లభిస్తే.. భారత్‌లో తమ అనుబంధ సంస్థ డీబీఐఎల్ రూ. 2,500 కోట్ల మేర నిధులు ఇవ్వనున్నట్లు డీబీఎస్ వెల్లడించింది. సర్వత్రా అనిశ్చితి నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ఈ విలీన డీల్‌తో ఎల్వీబీ డిపాజిటర్లు, కస్టమర్లు, ఉద్యోగులకు కొంత ఊరట లభించగలదని పేర్కొంది. అలాగే డీబీఐఎల్ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తన నెట్‌వర్క్‌ను మరింతగా పెంచుకునేందుకు ఇది తోడ్పడగలదని తెలిపింది. బీఎస్ఈలో బ్యాంక్ షేరు మంగళవారం 1% నష్టంతో రూ. 15.50 వద్ద ముగిసింది. ట్రేడింగ్ ముగిసిన తర్వాత ఆర్బీఐ మారటోరియం ఆదేశాలు వెలువడ్డాయి. బ్యాంక్ వ్యాపారం ఇలా... రిటైల్, మిడ్–మార్కెట్, కార్పొరేట్ రంగాల్లో బిజినెస్ చేస్తున్న లక్ష్మీ విలాస్ బ్యాంకు– వీఎస్ఎన్ రామలింగ చెట్టియార్ నేతృత్వంలో ఏడుగురు వ్యాపారవేత్తలు 1926లో స్థాపించారు. 2019 జూన్ 30వ తేదీ నాటికి 569 బ్రాంచీలు ఉన్నాయి. ఇందులో ఏడు కమర్షియల్ బ్యాంక్ బ్రాంచీలుకాగా, ఒకటి శాటిలైట్ బ్రాంచ్. ఐదు ఎక్స్టెన్షన్ కౌంటర్లు, ఏడు ప్రాంతీయ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. మొత్తం 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో బ్యాంకుకు బ్రాంచీలు ఉన్నాయి. దాదాపు 1,047 ఏటీఎంలు సేవలు అందిస్తున్నాయి. 2020 సెప్టెంబర్‌తో ముగిసిన కాలానికి బ్యాంక్ వ్యాపారం రూ.37,595 కోట్లు. నికర నష్టాలు రూ.397 కోట్లు. స్థూల మొండిబకాయిల (ఎన్పీఏ)ల పరిమాణం 24.45 శాతంగా ఉంటే, నికరంగా చూస్తే ఇది 7.01 శాతంగా ఉంది. బ్యాంకులో దాదాపు నాలుగువేల మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. -
లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఆర్బీఐ కీలక ప్రతిపాదన
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగం బ్యాంకు లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్వీబీ)కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఒక నెల తాత్కాలిక నిషేధం ముగిసిన వెంటనే ఈ బ్యాంకును డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్ (డీబీఐఎల్) తో విలీనం చేయనుంది. ఈ మేరకు ఒక ముసాయిదా పథకాన్ని ఆవిష్కరించినట్లు మంగళవారం వెల్లడించింది.ఇందుకు డీబీఐఎల్ 2,500 కోట్ల రూపాయల అదనపు మూలధనాన్ని ముందస్తుగా సమకూరుస్తుందని ఆర్బీఐ తెలిపింది. డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడటానికే ఈ చర్య తీసుకున్నామని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే కెనరా బ్యాంక్ మాజీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ టీఎన్‌మనోహరన్‌ను బ్యాంక్ నిర్వాహకుడిగా నియమించింది. ముసాయిదా పథకంపై ఇరు బ్యాంకుల సభ్యులు, డిపాజిటర్లు ఇతర రుణదాతల నుండి సూచనలు, అభ్యంతరాలను ఆహ్వానిస్తోంది. ఇవి 2020 నవంబర్ 20 న సాయంత్రం 5 గంటలలోపు తమకు చేరాలని ఆర్బీఐ తన నోటీసులో తెలిపింది. మరోవైపు లక్ష్మి విలాస్ బ్యాంక్‌పై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం మారటోరియం విధించింది. ఈ రోజు (నవంబరు, 17వ తేదీన) సాయంత్రం 6 గంటల నుంచి డిసెంబర్ 16 వరకు మారటోరియం అమలులో ఉండనుంది. మారటోరియం సమయంలో విత్‌డ్రా లిమిట్‌ను 25వేలకు కుదించింది. ఈ వెంటనే ఆర్బీఐ విలీన ప్రతిపాదనని ప్రకటించడం గమనార్హం. కాగా ఇటీవల జరిగిన బ్యాంక్ వార్షిక సర్వ సభ్య సమావేశం (ఏజీఎం)లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బ్యాంకు తీరుపై ఆగ్రహంతో ఉన్న వాటాదారులు (దాదాపు 60 శాతం) భారత బ్యాంకింగ్ చరిత్రలోనే తొలిసారిగా ప్రస్తుతం తాత్కాలిక ఎండీ, సీఈఓగా ఉన్న సుందర్‌ను తిరిగి ఆ పదవిలో తిరిగి నియమించే తీర్మానాన్ని తిరస్కరించారు. దీంతో పాటు మొత్తం ఏడుగురు డైరెక్టర్లు ఎన్ సాయిప్రసాద్, గోరింక జగన్మోహన్ రావు, రఘురాజ్ గుజ్జర్, కేఆర్ ప్రదీప్, బీకే మంజునాథ్, వైఎన్ లక్ష్మీ నారాయణలను ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా తిరిగి నియమించే తీర్మానాన్ని కూడా భారీ మెజార్టీతో వ్యతిరేకించిన సంగతి విదితమే. -
చక్రవడ్డీ మాఫీ.. అకౌంట్లలో జమ ప్రారంభం!
న్యూఢిల్లీ: మారటోరియం సమయంలో నిర్దిష్ట రుణ అకౌంట్లపై చార్జీ చేసిన చక్రవడ్డీ రుణ గ్రహీతలకు రిఫండ్ చేయడం ప్రారంభమైనట్లు తెలుస్తోంది.. ‘‘కోవిడ్–19 రిలీఫ్ ఎక్స్‌గ్రేషియా మీ అకౌంట్లో నవంబర్ 3న క్రెడిట్ అయ్యింది’’ అని ఒక ప్రభుత్వ రంగ బ్యాంక్ నుంచి ఒక మెస్సేజ్ వచ్చినట్లు ఒక కస్టమర్ తెలిపారు. రూ.2 కోట్ల రుణం వరకూ ఆరు నెలల మారటోరియం (2020 మార్చి 1– ఆగస్టు 31 మధ్య) సమయంలో అమలు చేసిన చక్రవడ్డీ రద్దు పథకాన్ని నవంబర్ 5వ తేదీలోపు అమలు చేయాలని గత వారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకింగ్యేతర ఫైనాన్షియల్ సంస్థలుసహా అన్ని బ్యాంకులకు సూచించింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో నిర్దిష్ట రుణ అకౌంట్లలో ఆరు నెలల కాలానికి చార్జ్ చేసిన చక్రవడ్డీ–సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసాన్ని రుణ గ్రహీతలకు ఎక్స్‌గ్రేషియో గ్రాంట్‌గా అందించే పథకాన్ని గత నెల్లో కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ పరిధిలోకి గృహ, విద్యా, క్రెడిట్ కార్డ్, ఆటో, లఘు చిన్న మధ్య తరహా పరిశ్రమలు, కన్జూమర్ డ్యూరబుల్స్, వినియోగ రుణాలు వస్తున్నాయి. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ క్రియాశీలతకు సంబంధించిన రుణాలకు ఈ పథకం వర్తించదు. అక్టోబర్ 23న ఆర్థిక మంత్రిత్వశాఖ ఇందుకు సంబంధించి ఒక నిర్వహణా పరమైన మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. తొలుత ఈ పరిహారాన్ని బ్యాంకింగ్ రుణ గ్రహీతలకు చెల్లిస్తుంది. అటు తర్వాత కేంద్రం నుంచి తిరిగి పొందుతుంది. ఎక్స్‌గ్రేషియా లెక్కింపునకు ఫిబ్రవరి 29 నాటికి బాకీ ఉన్న అసలు మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఫిబ్రవరి ఆఖరు నాటికి ఇవి మొండిపద్దులుగా మారి ఉండకూడదు. మార్చి 1 నుంచి ఆగస్టు 21 దాకా కాలానికి (184 రోజులు) రిఫండ్ చేస్తారు. మారటోరియం ఎంచుకున్న వారికి, ఎంచుకోని వారికి, పాక్షికంగా ఉపయోగించుకున్న వారికి కూడా ఎక్స్‌గ్రేషియాను చెల్లిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోనక్కర్లేదు. (చదవండి: కామత్ కమిటీ ఏం సూచించింది..?) నేపథ్యం ఇది... కరోనా వైరస్‌పరమైన ప్రతికూల పరిణామాలతో కుదేలైన రుణగ్రహీతలకు కాస్త వెసులుబాటునిచ్చే విధంగా రుణ బాకీల చెల్లింపును కొంత కాలం వాయిదా వేసుకునే వీలు కలి్పస్తూ ప్రభుత్వం మార్చి 1 నుంచి ఆగస్టు 31 దాకా ఆరు నెలల పాటు రెండు విడతలుగా మారటోరియం ప్రకటించింది. అయితే, ఈ వ్యవధిలో అసలుపై వడ్డీ మీద వడ్డీ కూడా వడ్డించే విధంగా బ్యాంకుల నిబంధనలు ఉన్నాయి. ఈ చక్రవడ్డీ భారాన్ని సవాలు చేస్తూ రుణగ్రహీతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో వారికి ఊరటనిచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది. సామాన్యుడి దీపావళి పండగ మీ చేతుల్లోనే ఉందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తాజా స్కీమ్ రూపొందించింది. -
చక్రవడ్డీ మాఫీపై ఆర్థిక శాఖ వివరణ
న్యూఢిల్లీ: మారటోరియం వ్యవధిలో రుణాలపై చక్రవడ్డీ మాఫీపై కేంద్ర ఆర్థిక శాఖ వివరణ ఇచ్చింది. సాధారణ వడ్డీ, చక్రవడ్డీకి మధ్య వ్యత్యాసాన్ని రుణ గ్రహీతల ఖాతాల్లో బ్యాంకులు జమ చేసే అంశంపై స్పష్టతనిచ్చింది. ఎక్స్‌గ్రేషియా లెక్కింపునకు ఫిబ్రవరి 29 నాటికి బాకీ ఉన్న అసలు మొత్తాన్ని పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని పేర్కొంది. రూ. 2 కోట్ల దాకా ఎంఎస్ఎంఈ, విద్య, గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డుల బకాయిలు మొదలైన వాటికి ఈ స్కీము వర్తిస్తుంది. ఫిబ్రవరి ఆఖరు నాటికి ఇవి మొండిపద్దులుగా మారి ఉండకూడదు. మార్చి 1 నుంచి ఆగస్టు 21 దాకా కాలానికి (184 రోజులు) రీఫండ్ చేస్తారు. మారటోరియం ఎంచుకున్న వారికి, ఎంచుకోని వారికి, పాక్షికంగా ఉపయోగించుకున్న వారికి కూడా ఎక్స్‌గ్రేషియాను చెల్లిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోనక్కర్లేదు. నవంబర్ 5 కల్లా రుణగ్రహీతల ఖాతాల్లో ఎక్స్‌గ్రేషియా జమ చేయాలంటూ బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మొత్తాన్ని బ్యాంకులకు కేంద్రం తర్వాత రీయింబర్స్ చేస్తుంది. -
లోన్ కస్టమర్లకు గుడ్ న్యూస్!
సాక్షి, న్యూఢిల్లీ : రుణ కస్టమర్లకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. మారటోరియం కాలంలో అన్ని రుణాలపై చక్రవడ్డీకి బదులు సాధారణ వడ్డీయే వసూలు చేస్తామని, వడ్డీపై వడ్డీని వెనక్కు ఇస్తామని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం సమర్పించిన అవిడఫిట్‌లో పేర్కొన్న దిశగా చర్యలు చేపట్టింది. మారటోరియం అమలైన ఆరు నెలల కాలంలో ఈఎంఐలను చెల్లించిన వారికి చక్రవడ్డీ, సాధారణ వడ్డీల మధ్య వ్యత్యాసాన్ని నవంబర్ 5లోగా రుణగ్రహీతల ఖాతాల్లో జమచేయనున్నారు. బ్యాంకులు రుణగ్రహీతల ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేయనుండగా, తర్వాత ప్రభుత్వం బ్యాంకులకు రీఎంబర్స్ చేస్తుంది. మారటోరియం సమయంలో ఈఎంఐలపై చక్రవడ్డీ కాకుండా సాధారణ వడ్డీనే వసూలు చేయాలని ఈ వ్యత్యాసాన్ని అర్హులైన రుణగ్రహీతల ఖాతాల్లో వేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని ఈనెల 21న కేంద్ర కేబినెట్ ఆమోదించింది. రూ.2 కోట్లలోపు రుణాలపై చక్రవడ్డీని రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. గృహ, విద్యా, ఆటో, వ్యక్తిగత, క్రెడిట్ కార్డు బకాయిలు, సూక్ష్మ, చిన్న, మధ్యశ్రేణి సంస్థల రుణాలకుగాను మార్చి 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు వాయిదాలకు ఇది వర్తిస్తుంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలో ఈఎంఐల చెల్లింపులపై ఆర్బీఐ మూడు నెలల పాటు మారటోరియం విధించింది. ఆ తర్వాత జూన్‌లో మరో మూడు నెలల పాటు మారటోరియం వ్యవధిని పొడిగించింది. ఈ వ్యవధిలో ఈఎంఐలపై చక్రవడ్డీ వసూలు చేయరాదని పలువురు పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సర్వోన్నత న్యాయస్ధానం ఆదేశాలతో వడ్డీపై వడ్డీని వెనక్కితీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొంది. కాగా ఈ పిటషన్లపై నవంబర్ 2న సుప్రీంకోర్టులో తదుపరి విచారణ జరగనుంది. కాగా, మారటోరియం పధకాన్ని ఉపయోగించుకోకుండా ఈఎంఐలను యథావిథిగా చెల్లిస్తున్న వారికీ చక్రవడ్డీ, సాధారణ వడ్డీల మధ్య వ్యత్యాసాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నారు. చదవండి : లోన్లపై వడ్డీ మాఫీ : పండుగ కానుక -
రుణాలపై చక్రవడ్డీ మాఫీ
న్యూఢిల్లీ: పండుగ సీజన్లో రుణగ్రహీతలకు ఊరట కల్పించే నిర్ణయాన్ని కేంద్రం శుక్రవారం అర్ధరాత్రి ప్రకటించింది. రూ.2 కోట్లలోపు రుణాలపై చక్రవడ్డీని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. గృహ, విద్యా, ఆటో, వ్యక్తిగత, క్రెడిట్ కార్డు బకాయిలు, సూక్ష్మ, చిన్న, మధ్యశ్రేణి సంస్థల రుణాలకుగాను మార్చి 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు వాయిదాలకు ఇది వర్తిస్తుంది. కోవిడ్–19 సమయంలో ప్రకటించిన మారటోరియంను ఉపయోగించుకున్న వారితోపాటు యథాప్రకారం వాయిదాలు చెల్లించిన వారికీ ఈ నిర్ణయం వర్తిస్తుందని స్పష్టతనిచ్చింది. ఈ పథకం అమలుతో కేంద్రంపై రూ.6,500 కోట్ల మేర భారం పడనుంది. రూ.2 కోట్ల రుణగ్రహీతలకు లబ్ధి కలిగేలా సాధ్యమైనంత త్వరగా వడ్డీ మాఫీ పథకాన్ని ప్రకటించాలనీ, ‘సామాన్యుడి దీపావళి’ కేంద్రం చేతుల్లోనే ఉందంటూ ఈ నెల 14వ తేదీన సుప్రీంకోర్టు సూచించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆర్థిక సేవల విభాగం పలు మార్గదర్శకాలను ప్రకటించింది. ఫిబ్రవరి 29వ తేదీ వరకు రూ.2 కోట్లలోపు బకాయి ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుంది. ఫిబ్రవరి 29వ తేదీ నాటికి వాటిని నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ)గా ప్రకటించి ఉండకూడదు. ఆ మొత్తాన్ని ఈ ఏడాది మార్చి 27వ తేదీన ఆర్బీఐ ప్రకటించిన మారటోరియం పథకాన్ని పూర్తిగా గానీ పాక్షికంగా గానీ వినియోగించుకున్న వారి ఖాతాల్లో రుణ సంస్థలు జమ చేయాల్సి ఉంది. మారటోరియం అవకాశాన్ని వినియోగిం చుకోని, ఎప్పటి మాదిరిగా వాయిదాలు చెల్లించే వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. చెల్లించిన మొత్తానికి సంబంధించిన వివరాలతో ఆయా సంస్థలు కేంద్రం నుంచి రీయింబర్స్మెంట్ పొందవచ్చు. కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో రుణాల చెల్లింపులపై కేంద్రం విధించిన 6 నెలల మారటోరియం అమలుపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసుపై తదుపరి విచారణ నవంబర్ 2వ తేదీన జరగనుంది. -
లోన్లపై వడ్డీ మాఫీ : పండుగ కానుక
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా, లౌక్‌డౌన్ కాలంలో అమలు చేసిన రుణాల మారటోరియం సమయంలో మాఫీకి సంబంధించిన కేంద్రం శుభవార్త అందించింది. రుణగ్రహీతలకు పండుగ కానుకగా మారటోరియం వడ్డీ మీద వడ్డీ మాఫీ రద్దుకు సంబంధించిన మార్గదర్శకాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసింది. కోవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ ప్రకటించిన మారటోరియం పథకం కింద రూ .2 కోట్ల వరకు రుణాలపై "వీలైనంత త్వరగా" వడ్డీ మినహాయింపును అమలు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిన తరువాత ఈ మార్గదర్శకాలు వచ్చాయి. ఆర్థిక శాఖ తాజా మార్గదర్శకాల ప్రకారం ఆరు నెలల కాలానికిగాను (మార్చి 1 నుండి ఆగస్టు 31, 2020 వరకు) 2 కోట్ల రూపాయలకు మించని హౌసింగ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, క్రెడిట్ కార్డు రుణాలు, వెహికల్ లోన్స్, ఎంఎస్ఎంఈ రుణాలపై వడ్డీ మీద వడ్డీ మాఫీ అందుబాటులో ఉంటుంది. బ్యాంకులు, ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థలు వడ్డీ డబ్బులను కస్టమర్ల లోన్ అకౌంట్లో జమ చేస్తాయి. దీన్ని అనంతరం కేంద్రం నుంచి ఆయా బ్యాంకులు వసూలు చేసుకుంటాయి. రుణగ్రహీత పూర్తిగా లేదా పాక్షికంగా తాత్కాలిక నిషేధాన్ని పొందారా అనే దానితో సంబంధం లేకుండా చక్రవడ్డీకి, సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసాన్ని చెల్లిస్తుంది. ఈ నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వానికి రూ.6,500 కోట్లు అదనపు భారం పడనుంది. -
ఈఎంఐలు కట్టిన వారికి కేంద్రం శుభవార్త?
న్యూఢిల్లీ : మారటోరియంలో వెసులుబాటు కల్పించిన కాలంలోనూ నెలవారీ వాయిదాలు (ఈఎంఐ)లు కట్టిన వారికి కేంద్రం శుభవార్త చెప్పనుంది. వారు తీసుకున్న రుణాలకు సంబంధించి వడ్డీపై వడ్డీని మాఫీ చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. దీపావళి వరకల్లా దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కరోనా లౌక్‌డౌన్ కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్లన్నటిపైనా మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. (రుణాలపై చక్రవడ్డీ మాఫీకి ఓకే) మార్చి 1 నుంచి ఆగస్ట్ 31 వరకు ఇది అమల్లో ఉండగా చాలామంది తమ ఈఎంఐలను సమయానికి చెల్లించలేదు. మరికొందరు ఎప్పటిలాగానే చెల్లింపులు చేశారు. ఈ క్రమంలో రూ.2 కోట్ల లోపు పర్సనల్, హోమ్ లోన్లు వంటివి తీసుకుని, ఈఎంఐలు సమయానికి చెల్లించిన రుణగ్రహీతల వడ్డీపై వడ్డీ మాఫీ చేసే దిశగా కేంద్రం సమాలోచనలు చేస్తున్నట్టు ఆర్థిక శాఖ వర్గాల సమాచారం. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రాజీవ్ మహర్షి ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ సూచనల మేరకు కేంద్రం దీనిని ఆరు నెలల కాలానికి అమలు చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. -
సామాన్యుడి దీపావళి మీ చేతుల్లోనే.!
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి ప్రేరిత సమస్యల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మారటోరియం పథకం కింద రూ.2 కోట్ల వరకూ రుణాలపై నెలవారీ వాయిదాల(ఈఎంఐ)కు చక్రవడ్డీ మాఫీని ‘సాధ్యమైనంత త్వరగా’ అమలు చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. ‘‘సామాన్యుని దీపావళి మీ చేతుల్లోనే ఉంది’’ అని ఈ సందర్భంగా ప్రభుత్వ, బ్యాంకుల తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులను ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నవంబర్ 14వ తేదీ దీపావళి నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘‘సామాన్యుని ఇబ్బందులు అర్థం చేసుకుంటామని, చక్రవడ్డీ భారం లేకుండా చూసే అంశంపై తగిన నిర్ణయం తీసుకుంటామని కేంద్రం పేర్కొంది. ఇది ఆహ్వానించదగిన అంశం. అయితే ఇందుకు సంబంధించి అధికారులు ఇంకా ఎటువంటి ఉత్తర్వునూ జారీ చేయలేదు. మీరు మాకు కేవలం ఒక్క అఫిడవిట్ అందజేశారు అంతే. వడ్డీ రద్దు ప్రయోజనాన్ని ఎలా అందిస్తున్నారన్న అంశమే మాకు ఇప్పుడు ప్రధానం. ఇందుకు తగిన ఆదేశాలను ఇచ్చారా? లేదా అని మాత్రమే మేము ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాం’’ అని జస్టిస్ అశోక్ భూషన్, జస్టిస్ ఆర్ సుభాషన్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కేంద్రం తరఫున వీడియో–కాన్ఫరెన్సింగ్ ద్వారా వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఉద్దేశించి ధర్మాసనం ప్రశ్నించింది. ‘‘తగిన పటిష్ట నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’ అని కూడా ధర్మాసనం పేర్కొంది. కేసు తదుపరి విచారణను నవంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది. కరోనా కష్టకాలం నేపథ్యంలో ఈఎంఐల చెల్లింపులపై ఆర్బీఐ మార్చి నుంచి ఆగస్టు వరకూ మారటోరియం విధించడం తెలిసిందే. అయితే కేంద్రం నిర్ణయం ఏదైనా అమలు చేయడానికి బ్యాంకులు సిద్ధమని బ్యాంక్స్ అసోసియేషన్ తరఫున సీనియర్ అడ్వొకేట్ హరీష్ సాల్వే ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు. మారటోరియం కాలానికి సంబంధించి ప్రస్తుత రుణాలపై వడ్డీమీద వడ్డీవేస్తూ, బ్యాంకులు సొమ్ము చేసుకోవడం తగదని పిటిషనర్ల తరఫు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది రాజీవ్ దత్తా న్యాయస్థానానికి విన్నవించారు. రూ.2 కోట్ల వరకూ రుణాలు తీసుకున్న వారిపై చక్రవడ్డీ తగదన్నారు. ‘‘తగిన ద్రవ్య విధానం, ప్రతిపాదనల అమలు లేకుండా ఆయా రుణా లను మొండిబకాయిగా వర్గీకరించవద్దంటూ ఇప్పటికే మేము ఆదేశాలు ఇచ్చాము’’ అని బెంచ్ స్పష్టం చేసింది. డిఫాల్ట్ కాని రుణాలకే పునరుద్ధరణ: ఆర్బీఐ ముంబై: రుణాల పునరుద్ధరణ అవకాశం ఈ ఏడాది మార్చి 1 నాటికి చెల్లింపుల్లో ఎటువంటి వైఫల్యాలు లేని ప్రామాణిక ఖాతాలకే ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన పరిస్థితులను పరిశీలించిన తర్వాత మార్చి నుంచి ఆగస్ట్ వరకు ఆరు నెలల పాటు రుణ చెల్లింపులపై విరామానికి (మారటోరియం) ఆర్బీఐ అవకాశం కల్పించింది. ఆగస్ట్ తర్వాత కూడా అనేక రంగాల్లో పరిస్థితులు కుదుటపడకపోవడంతో రుణాల పునరుద్ధరణకు అవకాశం ఇచ్చింది. ఈ క్రమంలో రుణ గ్రహీతలు, రుణదాతలకు స్పష్టతనిస్తూ ఆర్బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ► మార్చి 1 నాటికి 30 రోజులకు పైగా రుణ చెల్లింపులు బకాయి పడి, ఆ తర్వాత క్రమబద్ధీకరణ చేసుకున్నప్పటికీ అవి పునరుద్ధరణకు అర్హమైనవి కావు. ► ఇక అమలు దశలో ఉన్న ప్రాజెక్టులు, కార్యకలాపాలను వాయిదా వేసిన వాటికి సంబంధించిన రుణాలను కూడా ఈ పథకం నుంచి ఆర్బీఐ మినహాయించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 7 నాటి ఆదేశాలు, ఇతర మార్గదర్శకాలు వీటికి అమలవుతాయి. ► ఒకే సంస్థకు ఒకటికి మించిన సంస్థలు రుణమిచ్చినట్టయితే.. ఆ రుణ పునరుద్ధరణకు గాను అన్ని సంస్థలు సంయుక్తంగా కలసి ఇంటర్ క్రెడిటార్ ఒప్పందానికి రావాల్సి ఉంటుంది. ► జూన్ 26 నుంచి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) నిర్వచనం మారినప్పటికీ.. అదేమీ ఆయా పరిశ్రమల రుణాలపై ప్రభావం చూపించదని ఆర్ బీఐ స్పష్టం చేసింది. వీటికి సంబంధించిన రుణాల పరిష్కారానికి మార్చి 1 నాటికి అమల్లో నిర్వచనమే ఆధారంగా తీసుకోనున్నట్టు తెలిపింది. ► ప్రాపర్టీపై రుణాలకూ పునరుద్ధరణ అవకాశం ఉంటుంది. కాకపోతే అవి వ్యక్తిగత రుణాల్లోకి రాకూడదు. ► సాగుకు సంబంధించి అన్ని రుణాలు, ఎన్బీఎఫ్సీ రంగానికి సంబంధించినవీ ఈ పథకం కింద పునరుద్ధరించుకోవచ్చు. కాకపోతే పాడి, మత్స్య, పశు సంరక్షణ, పౌల్ట్రీలకు ఇచ్చిన రుణాలకు ఈ అవకాశం ఉండదు. -
ఉపశమనం ఇంతటితో సరి
న్యూఢిల్లీ: బ్యాంక్‌ల నుంచి రుణాలు తీసుకున్న వారికి చక్రవడ్డీని మాఫీ చేశామని, ఇంతకుమించిన ఉపశమనం ఇవ్వబోమని కేంద్రం స్పష్టంచేసింది. ఆర్థిక వ్యవహారాల్లో ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత పునరాలోచించే ప్రసక్తే లేదని తేల్చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి, తదనంతర పరిస్థితుల వల్ల ఆదాయం పడిపోయి, ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి మారటోరియంతో ఎంతో ఉపశమనం కలిగించామని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారికి చక్రవడ్డీ(వడ్డీపై వడ్డీ)ని మాఫీ చేశామని, ఇంతకంటే ఎక్కువ ఊరట కలిగించలేమని పేర్కొంది. ఒకవేళ అలా చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు హాని కలిగే ప్రమాదం ఉందని, బ్యాంకింగ్ రంగం సంక్షోభంలో చిక్కుకుంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. రూ.2 కోట్ల లోపు రుణాలు తీసుకున్నవారికి ఆరు నెలల మారటోరియం కాలానికి ఈ వెసులుబాటు లభిస్తుందని వెల్లడించింది. మారటోరియం గడువును ఆరు నెలల కంటే పొడిగించడం కుదరదని తెలిపింది. రుణాల చెల్లింపులపై ప్రతికూల ప్రభావాన్ని చూపే నిర్ణయాన్ని తీసుకోలేమని తేల్చిచెప్పింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి పంకజ్ జైన్ సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. రుణ గ్రహీతలకు చక్రవడ్డీని మాఫీ చేయడం కాకుండా ఇంకా ఇతర ఏ ఉపశమనాలూ కలిగించలేమని కేంద్రం తెలిపింది. ఆరు నెలల మారటోరియం కాలంలో చక్రవడ్డీని మాఫీ చేస్తామని, అంతకంటే ఇంకేం చేయలేమని కేంద్రం ప్రకటించడం తెల్సిందే. ఈ అంశంపై కేంద్రం తన వాదనను వినిపిస్తూ అక్టోబర్ 5న న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేసింది. పూర్తి వివరాలతో మరో అఫిడవిట్ సమర్పించాలని కోర్టు ఆదేశించింది. దీంతో పంకజ్ జైన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) వేర్వేరుగా అఫిడవిట్లు దాఖలు చేశారు. మారటోరియం గడువును పొడిగిస్తే రుణగ్రహీతలపై మరింత భారం పడుతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ అఫిడవిట్లపై సుప్రీంకోర్టు అక్టోబర్ 13న తదుపరి విచారణ జరపనుంది. కరోనా నేపథ్యంలో కేంద్రం మార్చి 1 నుంచి మే 31వ తేదీ వరకు మారటోరియం విధించింది. రుణాలు, వడ్డీలపై ఇన్స్టాల్మెంట్ల చెల్లింపులను వాయిదా వేసుకోవచ్చని సూచిస్తూ ఆర్బీఐ మార్చి 27న తెలిపింది. తర్వాత కరోనా వ్యాప్తి తగ్గకపోవడంతో మారటోరియం గడువును ఆగస్టు 31వ తేదీ వరకు పొడిగించారు. కేంద్ర సర్కారు నిర్ణయం వల్ల తమపై భారం తగ్గదని, వడ్డీపై వడ్డీ చెల్లించాల్సి వస్తుందని పేర్కొంటూ పలువురు రుణగ్రహీతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రూ.2 కోట్ల లోపు రుణాలు తీసుకున్న వారికి ఆరు నెలల మారటోరియం కాలానికి చక్రవడ్డీని మాఫీ చేస్తామని కేంద్రం సమాధానమిచ్చింది. -
మారటోరియం పొడిగింపు
-
మారటోరియం పొడిగింపు : కేంద్రం, ఆర్బీఐ క్లారిటీ
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారి కాలంలో రుణ గ్రహీతలకు కల్పించిన రుణ మారటోరియం పరిధిని ఇక మీదట పొడిగించడం సాధ్యం కాదని కేంద్రం తేల్చి చెప్పింది. రుణ మారటోరియం కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో కేంద్రం, ఆర్బీఐ పేర్కొంది. ఆరు నెలలకు మించి ఉపశమనం ఇవ్వడం సాధ్యం కాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా అఫిడవిట్లో స్పష్టం చేసింది. దెబ్బతిన్న ఆయా రంగాలకు మరింత ఆర్థిక ఉపశమాన్ని అందించలేదని వెల్లడించింది. మారటోరియం కాలంలో 2 కోట్ల రూపాయల వరకు రుణాలపై 'వడ్డీపై వడ్డీని' వదులుకోవడంపై ప్రభుత్వం గతంలో ఇచ్చిన అఫిడవిట్ సంతృప్తికరంగా లేదని, క్రెడాయ్ లాంటి సంఘాల వాదనలను పరిశీలించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో కేంద్రం ఈ క్లారిటీ ఇచ్చింది. (మారటోరియం వడ్డీ మాఫీ: విచారణ వాయిదా) నిర్దిష్ట సెక్టార్ ఆధారిత ఆర్థిక ఉపశమన వివరాల్లోకి కోర్టు వెళ్లకూడదంటూ తాజా అఫిడవిట్లో ఆర్బీఐ, ప్రభుత్వం పేర్కొన్నాయి. మారటోరియం వ్యవధి ఆరునెలలకు మించితే మొత్తం చెల్లింపుల తీరు, ప్రక్రియపై ప్రభావం చూపుతుందని ఆర్బీఐ తెలిపింది. ఈ చర్య రుణ గ్రహీతలపై ఒత్తిడిని పెంచుతుందని కూడా వాదించింది. వడ్డీ మీద మాఫీ చేయడమే కాకుండా, మరే ఇతర ఊరట కల్పించినా దేశ ఆర్థిక వ్యవస్థకు, బ్యాంకింగ్ రంగానికి తీరని నష్టం వాటిల్లుతుందని ప్రభుత్వం వెల్లడించింది. కోవిడ్-19 కి ముందు రియల్ ఎస్టేట్, విద్యుత్ రంగాలు సంక్షోభంలో పడ్డాయని తెలిపింది. ఈ నేపథ్యంలోఈ రంగ కష్టాలను బ్యాంకింగ్ నిబంధనల ద్వారా పరిష్కరించలేమని తెలిపింది. రియల్ ఎస్టేట్, విద్యుత్ రంగాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ వివరణ ఇచ్చాయి. కాగా ఆరు నెలల రుణ తాత్కాలిక నిషేధ కాలంలో వడ్డీపై వడ్డీ మాఫీకి కేంద్రం అంగీకారం తెలిపిన నేపథ్యంలో అదనపు అఫిడవిట్లు దాఖలు చేయడానికి ఆర్బీఐకి, కేంద్రానికి అక్టోబర్ 5న ఒక వారం సమయం ఇచ్చింది. రియల్ ఎస్టేట్ అసోసియేషన్లు క్రెడాయ్, విద్యుత్ ఉత్పత్తిదారులు లేవనెత్తిన సమస్యలను కూడా పరిశీలించాలంటూ తదుపరి విచారణ ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. -
కామత్ కమిటీ ఏం సూచించింది..?
న్యూఢిల్లీ: రుణాల పునర్నిర్మాణానికి సంబంధించి కేవీ కామత్ కమిటీ సిఫారసులను తమ ముందు రికార్డుల రూపంలో ఉంచాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అదే విధంగా రుణాల మారటోరియం విషయమై ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేసిన నోటిఫికేషన్లు, ఉత్తర్వులను కూడా కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్ట్ వరకు రుణ చెల్లింపులపై విరామానికి (మారటోరియం) ఆర్బీఐ అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అయితే, ఇలా ఈఎంఐలు చెల్లించని కాలానికి వడ్డీతోపాటు.. వడ్డీపై వడ్డీ విధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తున్న విషయం తెలిసిందే. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన ధర్మాసనం సోమవారం కూడా ఈ కేసులో తన విచారణను వీడియో కాన్ఫరెన్స్ రూపంలో కొనసాగించింది. వ్యక్తిగత రుణ గ్రహీతలతోపాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు రూ.2 కోట్ల వరకు రుణాలకు గాను వడ్డీపై వడ్డీ భారం వేయకుండా.. ఆ భారాన్ని తాము భరిస్తామంటూ కేంద్ర ఆర్థిక శాఖ అఫిడవిట్ సమర్పించింది. కేంద్రం, ఆర్బీఐ ఈ విషయమై ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాల వివరాలను తమ ముందుంచాలంటూ సెప్టెంబర్ 10నాటి తమ ఆదేశాలను ధర్మాసనం గుర్తు చేస్తూ.. కేంద్రం స్పందనలో అవి లేవంటూ వారం రోజుల్లో ఆ వివరాలను తమ ముందు ఉంచాలని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ తాజా ప్రతిపాదన కింద రియల్టీ రంగానికి ఎటువంటి ఉపశమనం లభించదంటూ ఆ రంగం తరఫున సీనియర్ న్యాయవాది సీఏ సుందరం కోర్టుకు తెలియజేశారు. దీంతో రియల్ ఎస్టేట్, విద్యుదుత్పత్తి తదితర రంగాల అభ్యంతరాలను సైతం పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రానికి ధర్మాసనం సూచించింది. మరిన్ని వివరాల దాఖలు కు గడువు ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది వి.గిరి కోర్టును కోరారు. కేంద్రం స్పందనపై పూర్తి స్థాయి అఫిడవిట్‌ను దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని మరో న్యాయవాది కపిల్ సిబల్ కోర్టును కోరారు. సమతూకం అవసరం.. బ్యాంకులు, రుణ గ్రహీతల అవసరాల మధ్య సమతూకం అవసరమని, ఈ విషయంలో అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేస్తూ.. విచారణను ఈ నెల 13కు సుప్రీంకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. కేంద్రం నిర్ణయంపై స్పందన తెలియజేయవచ్చంటూ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) సహా భాగస్వామ్య పక్షాలన్నింటికీ సూచించింది. ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసిన 24 గంటల్లోగా బ్యాంకులు ప్రణాళికను అమలు చేయగలని ఐబీఏ తరఫు న్యాయవాది హరీష్ సాల్వే తెలియజేశారు. కొన్ని రంగాలకు కేంద్రం తాజా ప్రతిపాదనలో చోటు లేకపోవడాన్ని.. మొత్తం పరిస్థితులను సమగ్రంగా పరిశీలించిన మీదట తీసుకున్న నిర్ణయంగా సొలిసిటర్ జనరల్ తుషార్‌మెహతా పేర్కొన్నారు. ఆగస్ట్‌తో మారటోరియం గడువు తీరిపోవడంతో.. కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. 26 రంగాలకు రుణ పునర్నిర్మాణ అవకాశం కల్పించాలంటూ కామత్ కమిటీ సూచించడం గమనార్హం. -
మారటోరియం వడ్డీ మాఫీ: విచారణ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: మారటోరియం సమయంలో రుణాల పై వడ్డీ మాఫీ కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ మరోసారి వాయిదా పడింది. సోమవారం (అక్టోబర్, 5) దీనిపై వాదనలను విన్న జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆరు నెలల రుణ తాత్కాలిక నిషేధ కాలంలో వడ్డీని వదులుకోవాలని విజ్ఞప్తి చేసింది. వడ్డీపై వడ్డీ మాఫీకి కేంద్రం అంగీకారం తెలిపిన నేపథ్యంలో అదనపు అఫిడవిట్లు దాఖలు చేయడానికి ఆర్బీఐకి, కేంద్రానికి ఒక వారం సమయం మంజూరు చేసింది.రియల్ ఎస్టేట్ అసోసియేషన్లు క్రెడాయ్, విద్యుత్ ఉత్పత్తిదారులు లేవనెత్తిన సమస్యలను కూడా పరిశీలించాలని సుప్రీం కోరింది. అనంతరం తదుపరి విచారణ ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది. అయితే గత నెల 10న దాఖలు చేసిన అఫిడవిట్ సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు సంబంధించి అవసరమైన వివరాలను ఇవ్వలేదని ధర్మాసనం పేర్కొంది.(మారటోరియం : భారీ ఊరట) కాగా కరోనా మహమ్మారి నేపథ్యంలో విధించిన మారటోరియం కాలంలో వ్యక్తిగత రుణగ్రహీతలు, చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలకు కేంద్రం భారీ ఊరట లభించింది. కోవిడ్ నేపథ్యంలో ప్రకటించిన వాయిదాల చెల్లింపుపై మారటోరియంలో ఆయా రుణాల వడ్డీపై వడ్డీ (చక్రవడ్డీ)ని మాఫీ చేసేందుకు కేంద్రం అంగీకరించింది. రూ.2 కోట్ల వరకు రుణాలపై మారటోరియం విధించిన ఆరు నెలల కాలానికి ఈ రద్దు వర్తింపజేయనున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ మేరకు ఆర్థిక శాఖ అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
టీసీఎస్ ఫలితాలు, అంతర్జాతీయ సంకేతాలు కీలకం
ఐటీ కంపెనీ టీసీఎస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఈ వారం మార్కెట్‌కు కీలకం కానున్నది. దీంతో పాటు మారటోరియం రుణాలపై వడ్డీ మాఫీ అంశంపై సుప్రీం కోర్టు విచారణ... తదనంతర పరిణామాలు, కరోనా కేసులు, వ్యాక్సిన్ సంబంధిత వార్తలు, అంతర్జాతీయ సంకేతాలు కూడా మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కరోనా సోకడం... ఆయన ఆరోగ్య స్థితిగతులు కూడా ఈ వారం ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్‌పై కూడా ప్రభావం చూపుతాయి. ఈ నెల 7న టీసీఎస్ ఫలితాలు.... మారటోరియం రుణాలపై, వడ్డీ మాఫీపై సుప్రీం కోర్టులో నేడు(సోమవారం) విచారణ జరగనున్నది. ఈ కేసు విషయమై సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పు బ్యాంక్ రంగ షేర్లపై ప్రభావం చూపనున్నది. సోమవారం నాడే∙సేవల రంగం పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎమ్ఐ) గణాంకాలు వస్తాయి. ఇక ఈ నెల 7 (బుధవారం) టీసీఎస్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నది. గత వారం సెన్సెక్స్, నిఫ్టీలు బాగా పెరిగినందున ఈ వారం లాభాల స్వీకరణకు అవకాశముందని కొందరు నిపుణులంటున్నారు. మూడు నెలల తర్వాత ‘విదేశీ’ అమ్మకాలు.... విదేశీ ఇన్వెస్టర్ల మూడు నెలల కొనుగోళ్లకు సెప్టెంబర్‌లో బ్రేక్‌పడింది. కరోనా కేసులు పెరుగుతుండటం, అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో మార్కెట్లో అనిశ్చితి నెలకొనడం దీనికి కారణం. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.7,783 కోట్ల నికర అమ్మకాలు జరపగా, డెట్ సెగ్మెంట్లో రూ. 4,364 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు. వెరశి మన క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.3,419 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకుంటే, భారత మార్కెట్ విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఆకర్షించగలదని నిపుణులంటున్నారు. మెరుగుపడుతున్న వ్యాపార సెంటిమెంట్ సీఈవోలతో సీఐఐ సర్వే క్రమంగా దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీపై ఆశలు రేకెత్తిస్తూ.. వ్యాపార సంస్థల్లో సెంటిమెంట్ మెరుగుపడుతోంది. కంపెనీల పనితీరు కూడా క్రమేపీ మెరుగుపడగలదని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు (సీఈవో) భావిస్తున్నారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన సీఈవోల సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మెటల్స్, మైనింగ్, తయారీ, ఆటో, ఫార్మా, ఇంధనం, ఇన్ఫ్రా, నిర్మాణ తదితర రంగ సంస్థల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు ఇందులో పాల్గొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో సామర్థ్యాల వినియోగం 50 శాతానికి పైగా ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. అంటువ్యాధుల కట్టడిలో లాక్డౌన్ల ప్రయోజనాలు తక్కువగా ఉంటాయని సర్వే అభిప్రాయపడింది. ఎకానమీని పూర్తిగా తెరిస్తేనే డిమాండ్ మెరుగుపడుతుందని, తద్వారా ఉత్పత్తికి ఊతం లభిస్తుందని పేర్కొంది. -
రుణాలపై చక్రవడ్డీ మాఫీకి ఓకే
న్యూఢిల్లీ: వ్యక్తిగత రుణగ్రహీతలు, చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలకు భారీ ఊరట లభించింది. కోవిడ్ నేపథ్యంలో ప్రకటించిన వాయిదాల చెల్లింపుపై మారటోరియంలో ఆయా రుణాల వడ్డీపై వడ్డీ(చక్రవడ్డీ)ని మాఫీ చేసేందుకు కేంద్రం అంగీకరించింది. రూ.2 కోట్ల వరకు రుణాలపై మారటోరియం విధించిన ఆరు నెలల కాలానికి ఈ రద్దు వర్తింపజేయనున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ మేరకు ఆర్థిక శాఖ అఫిడవిట్ దాఖలు చేసింది. కోవిడ్ నేపథ్యంలో మార్చి 1 మొదలు ఆగస్టు 31వరకు చెల్లించాల్సిన రుణ వాయిదాలపై మారటోరియం విధిస్తూ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మార్చిలో సర్క్యులర్ జారీచేయడం తెల్సిందే. అయితే, వడ్డీపై వడ్డీ విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. మారటోరియం కాలంలో రుణాల వడ్డీపై వడ్డీని వసూలు చేయడానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటామని సెప్టెంబర్ 28న కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. తన అఫిడవిట్లో ఆర్థిక శాఖ.. రూ.2 కోట్ల లోపు రుణ గ్రహీతలు మారటోరియంను ఉపయోగించుకున్న వారికి మాఫీ వర్తింప జేస్తామని తెలిపింది. మారటోరియం వాడుకోనివారికీ సంబంధిత ప్రయోజనాలను వర్తింపజేస్తామని తెలిపింది. సూక్ష్మ, చిన్న, మధ్య పారిశ్రామిక సంస్థ(ఎంఎస్ఎంఈ)లు, విద్యా, గృహ, వినియోగ వస్తువులు, క్రెడిట్ కార్డు బకాయిలు, ఆటో, వ్యక్తిగత, వినియోగ తదితర 8 కేటగిరీల కింద ఈ రుణాలను గుర్తించినట్లు పేర్కొంది. ప్రస్తుత ప్రత్యేక పరిస్థితుల్లో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని చిన్న రుణగ్రహీతలకు చేయూత అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొంది. అయితే, రూ.2 కోట్లకు మించిన వ్యక్తిగత, సంస్థాగత రుణాలకు మాఫీ వెసులుబాటు వర్తించదని స్పష్టం చేసింది. రుణ మాఫీకి, మారటోరియంకు తేడా తెలిసిన చాలా మంది రుణ గ్రహీతలు మారటోరియంను వినియోగించు కోలేదనీ, ఇలా ఎప్పటి మాదిరిగానే రుణ వాయిదాలు చెల్లించిన వారి సంఖ్య 50 శాతంపైనే ఉంటుందని తెలిపింది. చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలకు సంబంధించి రూ.3.7 లక్షల కోట్లు, గృహ, తదితర రుణాలకు సంబంధించిన రూ.70 వేల కోట్ల చక్రవడ్డీ భారం భరిస్తామని తెలిపింది. ఇందుకు సంబంధించిన గ్రాంట్ల కోసం పార్లమెంట్ అనుమతి పొందనున్నట్లు వెల్లడించింది. అన్ని కేటగిరీలు, తరగతుల రుణాలపై మారటోరియం కాలానికి చక్రవడ్డీ మాఫీ చేస్తే రూ.6 లక్షల కోట్లకు పైగానే భారం పడుతుందని పేర్కొంది. -
మారటోరియం : భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ఆరు నెలల రుణ మారటోరియం కాలానికి వడ్డీని మాఫీ చేసే అంశంపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది. రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాలపై 'వడ్డీపై వడ్డీని' మాఫీ చేస్తామని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. బ్యాంకులపై ప్రభావం చూపుతుందంటూ వడ్డీ మాఫీ చేయడానికి నిరాకరించిన కేంద్రం, తాజా నిర్ణయంతో పలు రుణ గ్రహీతలకు భారీ ఊరట కల్పించనుంది. దీనిపై తదుపరి వాదనలు సోమవారం జరగనున్నాయి. ఆరు నెలల మారటోరియం కాలం (మార్చి1- ఆగస్టు 31)లో వడ్డీని వదులుకునే భారాన్ని ప్రభుత్వం భరించడమే ఏకైక పరిష్కారం అని కేంద్రం సుప్రీంకోర్టుకు శుక్రవారం సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. దీంతో సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఇ)లతో పాటు, వ్యక్తిగత, విద్య, గృహ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, క్రెడిట్ కార్డ్ బకాయిలు, ఆటో మొదలైన చిన్నరుణగ్రహీతలకు ఈ మినహాయింపు భారీ ఉపశమనం లభించనుంది. తాత్కాలిక నిషేధాన్ని పొందారా అనే దానితో సంబంధం లేకుండా వడ్డీపై మాఫీ అమలు కానుంది. ఈ మేరకు, మాజీ కంట్రోలర్ ఆండ్ ఆడిటర్ జనరల్ రాజీవ్ మహర్షి కమిటీ ఇచ్చిన సూచనలను కేంద్రం ఆమోదించింది. దేశం ఎదుర్కొంటున్న సంక్షోభ స్థితిలో రుణగ్రహీతలకు సహాయం చేసేందుకు మారటోరియం కాలంలో వడ్డీపై వడ్డీని వదులుకోవడం వల్ల కలిగే భారాన్ని భరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వడ్డీని మాఫీ చేస్తే బ్యాంకులపై 6 లక్షల కోట్ల భారం పడుతుందని పేర్కొంది. కాగా కరోనా మహమ్మారి సంక్షోభం, లాక్డౌన్ కారణంగా అన్ని రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆరు నెలల తాత్కాలిక నిషేధాన్ని విధించింది. అయితే వడ్డీ మీదవడ్డీ వసూళ్లపై సుప్రీం దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సీరియస్ గా స్పందించింది. ఆర్బీఐ వెనక దాక్కుంటారా, వ్యాపారమే ముఖ్యం కాదు, ప్రజలకు ఊరట కలిగించడం ప్రధానమే అంటూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన సంగతి తెలిసిందే. -
మారటోరియంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ
-
ఈఎంఐ... మారటోరియం వడ్డీపై... 3 రోజుల్లో ‘కేంద్రం’ నిర్ణయం..!
న్యూఢిల్లీ: కరోనా కష్టకాలంలో నెలవారీ రుణ (ఈఎంఐ) చెల్లింపులపై ఆగస్టు వరకూ విధించిన ఆరు నెలల మారటోరియం సమయంలో వడ్డీ వసూలు అంశంపై కేంద్రం రెండు, మూడు రోజుల్లో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇందుకు సంబంధించిన పిటిషన్ విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అత్యున్నత న్యాయస్థానానికి సోమవారం ఈ విషయాన్ని తెలిపారు. అక్టోబర్ 1న ఈమేరకు అఫిడవిట్‌ను దాఖలు చేస్తామని కూడా కేంద్రం తరఫున ఆయన న్యాయస్థానానికి తెలిపారు. దీనితో జస్టిస్ అశోక్ భూషన్, జస్టిస్ ఆర్ సుభాషన్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం కేసు తదుపరి విచారణను అక్టోబర్ 5కు వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి పారిశ్రామిక, వాణిజ్య వర్గాలు, వ్యక్తులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై కూడా అక్టోబర్ 5న విచారణ జరుపుతామని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. అక్టోబర్ 5వ తేదీన ఆయా వర్గాల వాదనలకు వీలుగా కేంద్రం అక్టోబర్ 1న సుప్రీంకోర్టులో దాఖలు చేయనున్న అఫిడవిట్‌ను ఈ కేసులో ఇతర పార్టీలకూ ముందుగానే అందజేయాలన్న బెంచ్ సూచనను పాటిస్తామని సొలిసిటర్ జనరల్ పేర్కొన్నారు. అక్టోబర్ 5వ తేదీనే ఈ కేసులో తుది తీర్పు ఇస్తామని కూడా సుప్రీంకోర్టు సూచించింది. మారటోరియం సమయంలో వడ్డీని అసలుకు కలిపి, అటుపై ఈఎంఐలను లెక్కిస్తే, అది వడ్డీపై వడ్డీగానే భావించాల్సి ఉంటుందని ఇప్పటికే సుప్రీకోర్టు వ్యాఖ్యానించింది. -
మారటోరియం వడ్డీ మాఫీ విచారణ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ నేపథ్యంలో మారటోరియం కాలంలో వడ్డీ మాఫీ అంశంపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ వాయిదా పడింది. గత విచారణలో కోర్టు కోరిన వివరాలు ఇచ్చేందుకు సొలిసిటరీ జనరల్ తుషార్ మెహతా మరి కొంత సమయం కావాలని కోరారు. రుణాల మారటోరియంకు సంబంధించి కేంద్రం, ఆర్బీఐ తీసుకున్న సమగ్ర వివరాలను సమర్పించాలని జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం ఎస్జీని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై కేంద్రం నిర్ణయం తీసుకునే ప్రక్రియ తుదిదశలో ఉందని కోర్టుకు ఎస్జీ తెలిపారు. అదేవిధంగా సమగ్ర వివరాలు అందించేందుకు మరికొంత గడువు ఇవ్వాలని కోరారు. కేంద్రానికి గడువు ఇచ్చేందుకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఆదేశాలు కొనసాగుతాయని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణను సుప్రీం కోర్టు అక్టోబర్ 5కి వాయిదా వేసింది. చదవండి: (ఆర్బీఐ, ప్రపంచ పరిణామాలే కీలకం!) -
రుణగ్రహీతలకు ‘సుప్రీం’ ఊరట!
న్యూఢిల్లీ: తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఆగస్టు 31వరకు మొండిపద్దుల కిందకు రాని అకౌంట్లు వేటినీ ఎన్పీఏలుగా ప్రకటించవద్దని గతంలో ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను సుప్రీంకోర్టు మరో రెండు వారాలు పొడిగించింది. మారటోరియం సమయంలో చెల్లించని వాయిదాలపై వడ్డీ విధింపు అంశాన్ని పరిశీలించేందుకు ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేశామని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది. రెండు వారాల్లో ఈ విషయమై అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆర్బీఐ, కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది. అన్ని అంశాలను సమగ్రంగా పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాలని సూచిస్తూ విచారణను ఈనెల 28కి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఈ విషయంలో తుది నిర్ణయానికి ఇదే ఆఖరు అవకాశమని, ఆపై ఈ అంశాన్ని వాయిదా వేయడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది. కరోనా సంక్షోభం వేళ ఈఎంఐలపై మారటోరియం విధిస్తూ గతంలో ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సమయంలో చెల్లించని వాయిదాలపై వడ్డీ వేయడాన్ని సవాలు చేస్తూ రుణగ్రహీతలు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు, తుది ఆదేశాలు ఇచ్చేవరకు ఆగస్టు 31వరకు ఎన్పీఏలు కాని ఏ అకౌంట్లనూ ఎన్పీఏలుగా ప్రకటించవద్దని ఆదేశించింది. వడ్డీపై వడ్డీతో ఇబ్బంది..: ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న రుణ పునర్వ్యవస్థీకరణతో 95 శాతం మంది రుణగ్రహీతలకు న్యాయం జరగదని క్రెడాయ్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టు దృష్టికి తెచ్చారు. బ్యాంకులు రుణగ్రహీతల అకౌంట్ల డౌన్‌గ్రేడింగ్ చేస్తూనే ఉన్నాయని, దీన్ని నిలిపివేయాలని, మారటోరియంను పొడిగించాలని కోరారు. బ్యాంకులు మారటోరియం సమయానికి చక్రవడ్డీలు లెక్కకడుతున్నాయని మరో న్యాయవాది రాజీవ్ దత్తా చెప్పారు. లక్షలాది మంది కరోనా కారణంగా ఆస్పత్రుల పాలయ్యారని, అనేకమంది ఉపాధి కోల్పోయారని, ఈ సమయంలో వడ్డీ మీద వడ్డీ అడగడం సబబు కాదని వాదించారు. అయితే ఉన్న నియమాల ప్రకారమే డౌన్‌గ్రేడింగ్ జరుగుతోందని ఆర్బీఐ న్యాయవాది వీ గిరి చెప్పారు. అన్ని అంశాలను అత్యున్నత స్థాయిలో పరిశీలిస్తున్నందున రెండువారాల సమయం ఇవ్వాలని కోరారు. తాజా విచారణలో కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ప్రభుత్వం అన్ని అంశాలనూ అత్యున్నత స్థాయిలో పరిశీలిస్తోందని చెప్పారు. సరైన నిర్ణయం తీసుకొనేందుకు రెండువారాల సమయం ఇవ్వాలని కోరారు. వాదనలన్నీ విన్న కోర్టు 2 వారాల్లో సరైన పరిష్కారంతో రావాలని, ఆపై తాము తుది నిర్ణయం తీసుకుంటామంది. రాజీవ్ మహర్షి నేతృత్వం మారటోరియం సమయంలో రుణాలపై వడ్డీ రద్దు అంశాన్ని సమీక్షించి, సిఫారసులు చేయడానికి రాజీవ్ మహర్షి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం గురువారం ప్రకటించింది. -
ఈఎంఐలపై మారటోరియం : 2 వారాల్లోగా తేల్చండి
సాక్షి, న్యూఢిల్లీ : మారటోరియం వ్యవధిలో నిలిచిపోయిన ఈఎంఐలపై వడ్డీ వసూలు చేయరాదని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్రప్రభుత్వం, ఆర్బీఐ, బ్యాంకులకు రెండు వారాల సమయం ఇచ్చింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈఎంఐల చెల్లింపుపై ఆర్బీఐ ఆరు నెలల మారటోరియం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మారటోరియం వ్యవధిలో నిలిచిపోయిన ఈఎంఐలపై వడ్డీ వసూలు చేస్తామని బ్యాంకులు ప్రకటించాయి. వడ్డీపై వడ్డీ వసూలు సరైంది కాదని సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇక రుణగ్రహీతలపై భారం పడకుండా రెండు వారాల్లోగా కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు, ఆర్బీఐ ఓ నిర్ధిష్ట విధానంతో కోర్టు ముందుకు రావాలని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది. ఈ కేసును మరోసారి వాయిదా వేసేందుకు నిరాకరించిన సర్వోన్నత న్యాయస్ధానం ఇదే చివరి అవకాశమని రెండు వారాల్లోగా రుణగ్రహీతలకు భారం పడనివిధంగా పరిష్కారంతో అఫిడవిట్ సమర్పించాలని కోరింది. రుణగ్రహీతలకు ఊరట ఇచ్చేలా బ్యాంకులతో ఉన్నతస్ధాయిలో సంప్రదింపులు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు వివరించింది. మరోవైపు సెప్టెంబర్ చివరివారంలో కేసు విచారణ తిరిగి ప్రారంభమయ్యేవరకూ ఆయా ఖాతాలను నిరర్ధక ఆస్తులుగా పరిగణించరాదని కోర్టు స్పష్టం చేసింది. మారటోరియం వ్యవధిలో ఈఎంఐలపై వడ్డీ మాఫీ చేస్తే అది బ్యాంకింగ్ వ్యవస్ధను బలహీనపరుస్తుందని బ్యాంకులు వాదిస్తున్నాయి. కాగా కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్బీఐ రుణాల చెల్లింపుపై ఈ ఏడాది మార్చిలో మూడు నెలల మారటోరియం ప్రకటించి ఆపై ఆగస్ట్ 31 వరకూ పొడిగించిన సంగతి తెలిసిందే. చదవండి : ఉద్యోగాలు, అడ్మిషన్లలో కోటాపై కీలక నిర్ణయం -
15లోపు రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక
న్యూఢిల్లీ: రుణాల చెల్లింపులపై విధించిన ఆరునెలల మారటోరియం గడువు ఆగస్టు 31వ తేదీతో ముగియడంతో బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు (ఎన్బీఎఫ్సీ) ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలక సూచన చేశారు. రుణ పునర్వ్యవస్థీకరణలకు సంబంధించి సెప్టెంబర్ 15లోపు ఒక సుస్పష్ట ప్రణాళికను ప్రకటించాలన్నది ఆ సూచన సారాంశం. ఇందుకు సంబంధించి బ్యాంక్ బోర్డులు తీసుకున్న నిర్ణయాలపై రుణ గ్రహీతలకు అవగాహన కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఆమె విజ్ఞప్తి చేశారు. కోవిడ్–19 నేపథ్యంలో ఒత్తిడిలో ఉన్న రుణ గ్రహీతలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సైతం ఆమె సూత్రప్రాయంగా పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె గురువారం షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల చీఫ్‌లతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. దాదాపు మూడు గంటలపాటు ఈ సమావేశం జరిగింది. సమావేశంలో ఆమె ఇంకా ఏమన్నారంటే... కరోనా ప్రేరిత కష్టాల్లో ఉన్న అర్హత కలిగిన రుణ గ్రహీతలను గుర్తించాలి. వారి రుణాలకు సమర్థవంతమైన రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను అందించాలి. ఆర్థిక ఒత్తిడిలేని పరిస్థితిలో వ్యాపార పునరుద్ధరణకు వీలుకలిగించే బ్యాంకింగ్ పునర్వ్యవస్థీకరణ రుణ విధానం ఉండాలి. పునర్వ్యవస్థీకరణ ప్రణాళికపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని హిందీ, ఇంగ్లిష్, ప్రాంతీయ భాషల్లో బ్యాంకింగ్ తమ వెబ్సైట్లలోని ఎఫ్ఏక్యూ (ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్) విభాగంలో అప్డేట్ చేయాలి. అలాగే సంబంధిత ప్రణాళికను తమ ప్రధాన, బ్రాంచ్ కార్యాలయాల్లో సర్క్యులేట్ చేయాలి. అంతా సిద్ధం: బ్యాంకర్లు... కాగా, ఆర్బీఐ ఆగస్టు 6న జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఇప్పటికే రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలను దాదాపు సిద్ధం చేసినట్లు బ్యాంకర్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే ఈ ప్రణాళికకు వాస్తవ అర్హత కలిగిన రుణ గ్రహీతల గుర్తింపు ప్రక్రియ జరుగుతోందన్నారు. ఆర్బీఐ నిర్దేశించిన విధంగా నిర్దిష్ట కాల వ్యవధిలో ఈ ప్రక్రియను పూర్తిచేస్తామని తెలిపారు. త్వరలో కామత్ కమిటీ నివేదిక ఇదిలావుండగా, రుణ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ప్రముఖ బ్యాంకర్, బ్రిక్స్ బ్యాంక్ మాజీ చైర్మన్, కేవీ కామత్ నేతృత్వంలో ఆర్బీఐ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ త్వరలో తన నివేదికను సమర్పించాల్సి ఉంది. నిజానికి నివేదిక సమర్పణకు గడువు నెలరోజులుకాగా, ఈ గడువు ఈ నెల 7వ తేదీతో ముగిసిపోనుంది. కరోనా వైరస్ నేతృత్వంలో మొండిబకాయిల పరిధిలోకి జారిపోయే ఖాతాల పరిస్థితి ఏమిటి? ఈ తరహా ఒత్తిడిలో ఉన్న రుణ సమస్యల పరిష్కారానికి అనుసరించాల్సిన విధానాలు, ప్రమాణాలు ఏమిటి? రుణ పునర్వ్యవస్థీకరణలు ఏ ప్రాతిపదిక జరగాలి? వంటి అంశాలపై కమిటీ సిఫారసులు చేయనుంది. దివాకర్ గుప్తా, టీఎన్ మనోహరన్ కమిటీలో ఇతర సభ్యులు. అశ్విన్ పరేఖ్ వ్యూహాత్మక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సీఈఓ ప్యానల్ మెంబర్ సెక్రటరీగా ఉన్నారు. ఈ నివేదికను సమర్పించిన అనంతరం, దీని ప్రాతిపదికన బ్యాంకింగ్ రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలు మరింత పటిష్టంగా రూపుదిద్దుకునే వీలుంది. మొండి బాకీల భారం తీవ్రం... భారత్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల (ఎస్సీబీ) మొండి బకాయిల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు ఇటీవలి ద్వైవార్షిక ఆర్థిక వ్యవహారాల స్థిరత్వ నివేదికలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్వయంగా ప్రకటించిన విషయం గమనార్హం. 2021 మార్చి నాటికి మొత్తం అన్ని బ్యాంకుల రుణాల్లో స్థూల మొండి బకాయిలు (జీఎన్‌పీఏ) 12.5 శాతానికి పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఆర్థిక అనిశ్చిత పరిస్థితి మరింత విషమిస్తే, ఈ రేటు ఏకంగా 14.7 శాతానికీ పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని విశ్లేషించింది. 2020 మార్చి నాటికి మొత్తం బ్యాంకింగ్ జీఎన్‌పీఏ రేటు కేవలం 8.5 శాతంగా ఉన్న విషయం గమనార్హం. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలకు, కామత్ కమిటీ ఇవ్వనున్న నివేదికకు ప్రాధాన్యత సంతరించుకుంది. -
ఆ ఖాతాలకు సుప్రీం రక్షణ
న్యూఢిల్లీ: ఆగస్ట్ 31 వరకు నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ (ఎన్పీఏ)గా గుర్తించని ఖాతాలకు సుప్రీం కోర్టు రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఆ ఖాతాలను తాము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ‘ఎన్పీఏ’లుగా ప్రకటించవద్దని బ్యాంకులను ఆదేశించింది. కోవిడ్–19 కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రుణగ్రహీతలకు ఊరట కల్పించేందుకు ఉద్దేశించిన మారటోరియం సమయంలోనూ.. రుణ వాయిదాలపై బ్యాంకులు వడ్డీ విధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లకు సంబంధించి జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం పై ఆదేశాలిచ్చింది. కనీసం 2 నెలల పాటు ఏ ఖాతాను కూడా ఎన్పీఏగా నిర్ధారించబోమని బ్యాంక్స్ అసోసియేషన్ తెలిపింది. ఆర్థిక రంగానికి బ్యాంకింగ్ వ్యవస్థ వెన్నెముక వంటిదని, కరోనా కారణంగా అన్ని రంగాలు కుదేలై ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వివరించారు. ఆర్థిక రంగ పునరుత్తేజాన్ని రుణాల వడ్డీ మాఫీ నిర్ణయం దెబ్బతీస్తుందన్న విషయం ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందిన విషయమన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. తమ ఆందోళన అంతా వడ్డీపై వడ్డీకి సంబంధించి అని స్పష్టం చేసింది. వాదనల అనంతరం తదుపరి విచారణను 10కి వాయిదా వేసింది. మారటోరియం సందర్భంగా ఇన్స్టాల్మెంట్ చెల్లింపులను వాయిదా వేసుకున్న ఖాతాలపై వడ్డీ మాఫీ ఆర్థిక విధానాలకు వ్యతిరేకమని గతంలో కేంద్రం తెలిపింది. -
మారటోరియం రెండేళ్లు ఉండొచ్చు
న్యూఢిల్లీ: బ్యాంకు అప్పులపై విధించిన మారటోరియం రెండేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపాయి. కోవిడ్–19 లాక్డౌన్, ఆంక్షల మూలంగా ఆర్థికవ్యవస్థ మందగించిందని, ఏప్రిల్– జూన్ త్రైమాసికంలో స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)లో దాదాపు 24 శాతం లోటు నమోదైందని కేంద్రం, ఆర్బీఐల తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభావితవర్గాలకు సహాయపడేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో మార్చి నుంచి ఆర్నెళ్ల పాటు లోన్ల వాయిదాలపై కేంద్రం మారటోరియం విధించిన విషయం తెలిసిందే. ఇది ఆగస్టు 31తో ముగిసింది. ఈ నేపథ్యంలో మారటోరియంను రెండేళ్లు పొడిగించే అవకాశం ఉందని కేంద్రం... అత్యున్నత న్యాయస్థానానికి తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. కిస్తుల్లో వడ్డీ కలిపే ఉంటుందని, వాటి వసూలు వాయిదా వేసినందున బ్యాంకులు వడ్డీపై మళ్లీ వడ్డీ వేస్తున్నాయని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మారటోరియం కాలంలో వడ్డీ వేయకుండా కేంద్రం, ఆర్బీఐలను ఆదేశించాలని ఆగ్రావాసి గజేంద్ర శర్మ తన పిటిషన్లో కోరారు. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. వడ్డీపై మళ్లీ వడ్డీ వేస్తున్న అంశాన్ని బుధవారం విచారిస్తామని సుప్రీం పేర్కొంది. కేంద్రం ఇప్పటికే ఈ విషయంలో అఫిడవిట్‌ను దాఖలు చేసిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. తమకు ఆ అఫిడవిట్ ఇంకా అందలేదని కోర్టు తెలుపగా... బెంచ్ అఫిడవిట్‌ను పరిశీలించాలని, రెండు మూడు రోజుల తర్వాత విచారణ జరిపినా, బుధవారమే విచారణకు స్వీకరించినా నష్టమేమీలేదని మెహతా అన్నారు. వడ్డీపై వడ్డీ అంశాన్ని కేంద్రం, ఆర్బీఐ, బ్యాంకర్లు కలిసి పరిశీలించే అవకాశమివ్వాలన్నారు. మారటోరియం రెండేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉందని తెలిపారు. వాయిదా వేసిన కిస్తులపై వడ్డీని మాఫీ చేయడం ఆర్థిక సహజసూత్రాలకు విరుద్ధమని కేంద్రం తెలిపింది. ఒకవేళ వడ్డీ మాఫీ చేస్తే... క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించిన వారికి అన్యాయం చేసినట్లే అవుతుందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ను దాఖలు చేసింది. -
మారటోరియంపై రెండేళ్ల పాటు పొడిగింపు!
-
మారటోరియంపై రెండేళ్ల పాటు పొడిగింపు!
న్యూఢిల్లీ: మారటోరియం గడువు పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఎదుట హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. అన్ని లోన్లకు రెండేళ్ల వరకు మారటోరియం పెంచే యోచనలో ఉన్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ఆయన.. ఇప్పటికే ఈ విషయంపై కసరత్తు ప్రారంభమైందని, మార్చి 2021 వరకు మారటోరియం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇందుకు స్పందించిన న్యాయస్థానం.. చెల్లించని ఈఎంఐలపై ఎలాంటి అదనపు వడ్డీ గానీ, పెనాల్టీ గానీ విధించకూడదని ఆదేశించింది. ఈ కేసును బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.(చదవండి: ప్రశాంత్ భూషణ్‌కు ఒక్క రూపాయి ఫైన్) కాగా ఆగస్ట్ 31తో ముగియనున్న మారటోరియం గడువును కరోనా పరిస్థితుల దృష్ట్యా డిసెంబర్ 31 వరకు పొడించాలని కోరుతూ న్యాయవాది విశాల్ తివారీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా తలెత్తిన సంక్షోభం కారణంగా.. సాధారణ , మధ్య తరగతి ప్రజలు, ఉద్యోగుల జీవితాలు తలకిందులయ్యాయని, వివిధ అవసరాల కోసం తీసుకున్న లోన్లు చెల్లించే పరిస్థితిలో వారు లేరని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. మారిటోరియం గడువును ఈ ఏడాది చివరి వరకు పెంచేలా కేంద్ర ప్రభుత్వాన్ని, ఆర్బీఐ, వివిధ బ్యాంకులను ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం ఈరోజు విచారణ చేపట్టగా.. అన్ని రుణాలపై రెండేళ్ల వరకు మారటోరియం పొడిగిస్తామని కేంద్రం చెప్పడంతో బడుగు వర్గాలకు ఉపశమనం లభించినట్లయింది. -
మరిన్ని అస్త్రాలు రెడీ..!
ముంబై: కరోనా వైరస్ వల్ల ఏర్పడిన ఆర్థిక ప్రతికూల పరిస్థితులపై పోరు విషయంలో రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) అస్త్రాలు అయిపోలేదని గవర్నర్ శక్తికాంతదాస్ స్పష్టం చేశారు. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 4 శాతం)సహా తగిన చర్యలన్నింటినీ సకాలంలో తీసుకోడానికి ఆర్బీఐ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. తగిన సమయంలో చర్యలు తీసుకోడానికి అవసరమైన విధానాలు ఆర్బీఐ దగ్గర ఉన్నాయని సూచించిన ఆయన, అయితే వీటిని వినియోగించడానికి తగిన సమయం కోసం సెంట్రల్ బ్యాంక్ వేచిచూస్తుందని తెలిపారు. ఈ నెల 6వ తేదీ ద్రవ్య, పరపతి విధాన ప్రకటన సందర్భంగా రెపో రేటును యథాతథంగా కొనసాగించాలన్న ఆర్బీఐ నిర్ణయాన్నీ ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. సరళతర ద్రవ్య, పరపతి విధానానంవైపే ఆర్బీఐ ఇప్పటికీ మొగ్గుచూపుతోందని ప్రకటించిన ఆయన, అవసరమైన సమయంలో ఈ మేరకు రేటు కోత నిర్ణయాలు ఉంటాయని సూచించారు. ప్రస్తుత అనిశ్చితి పరిస్థితుల్లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ), ద్రవ్యోల్బణంపై ఒక అంచనాకు రాలేకపోతున్నామని ఆయన వెల్లడించారు. కరోనా ప్రభావం తగ్గడంతోనే దీనిపై ఒక నిర్ణయానికి రాగలమని పేర్కొన్నారు. ఒక ఫైనాన్షియల్ దినపత్రిక నిర్వహించిన వెబినార్‌లో ఆయన చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు ఆర్థిక వ్యవస్థపై పనిచేయడం లేదనీ, వడ్డీరేట్లు పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయని ఈ పరిస్థితి మాంద్యానికి దారితీస్తుందని పేర్కొనడం సరికాదు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఏవీ చోటుచేసుకోకుండా తగిన చర్యలు ఉంటాయి. తగిన సమయంలో రెపోరేటు కోత నిర్ణయం ఉంటుంది. ► వడ్డీరేట్ల తగ్గింపు ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధికి దోహదపడుతుంది. రేటు కోత ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించడానికి బ్యాంకులు మరిన్ని చర్యలు తీసుకోవాలి. ► కోవిడ్–19 సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి కేంద్రం చర్యలు పటిష్టంగా ఉన్నాయి. సెంట్రల్ బ్యాంక్ పరిశీలనలోకి వచ్చిన అంశాన్నే నేను చెబుతున్నాను. ► ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన వ్యూహం హర్షణీయం. భారీ బ్యాలెన్స్ షీట్స్ ఉన్న బ్యాంకుల వల్ల ప్రయోజనం ఉంటుంది. గ్లోబల్ బ్యాంకులకు భారత్ బ్యాంకింగ్ పోటీ ఇవ్వగలుగుతుంది. ► మొండిబకాయిలను దృష్టిలో ఉంచుకుని రుణాల మంజూరు, పంపిణీ విషయంలో బ్యాంకింగ్ మరీ ఆందోళన చెందాల్సిన పనేమీలేదు. అది ‘‘తనంతట తానుగా ఓడిపోవడం లాంటిదే. (రుణ వృద్ధి రేటు 6 శాతం దిగువకు పడిపోవడం వల్ల మొండిబకాయిల భయాలతో బ్యాంకులు మరీ భయపడిపోయి, రుణ మంజూరీలకు వెనుకడుగువేస్తున్నాయా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యం). ఇలాంటి ధోరణి వల్ల బ్యాంకింగ్ తన ఆదాయ వనరులను తానే అడ్డుకున్నట్లు అవుతుంది. దీనితో తన కనీస అవసరాలను సైతం సమీకరించుకోలేకపోతుంది. ఇలాంటి ధోరణి బ్యాంకింగ్‌లో ఎంతమాత్రం మంచిదికాదు. ► రుణాల మంజూరీకి ముందు ఆయా వ్యాపారాల పరిస్థితి ఎలా ఉందన్న విషయాలను ఒక్కసారి గమనించండి. దీనివల్ల రుణాలు పొందే విషయాల్లో జరిగే మోసాలను ముందు పసిగట్టవచ్చు. 2018–19లో రూ.71,500 కోట్ల బ్యాంకింగ్ మోసాలు జరిగితే, అటు తర్వాత 2020 జూన్ నాటికి ఈ మొత్తం రూ.1.85 లక్షల కోట్లకు చేరాయి. ► భారత్ బ్యాంకింగ్ వ్యవస్థ ఎప్పుడూ పటిష్టంగా, స్థిరంగా కొనసాగుతోంది. అయితే కోవిడ్–19 నేపథ్యంలో బ్యాంకింగ్ వద్ద మూలధన సమస్యలు తలెత్తాయి. ► ఈ నెలాఖరుతో ముగిసిపోనున్న ‘‘మారటోరియం’’ తాత్కాలిక పరిష్కార మార్గమే. దీనిని దీర్ఘకాలికంగా కొనసాగించలేము. ఆరు నెలల మారటోరియం ముగిసిపోతే, మొండిబకాయిలు భారీగా పెరిగిపోతాయన్న ఆందోళన ఉంది. అయితే ఒక కొత్త ప్రణాళిక కింద కొత్త మారటోరియం విధానం తీసుకురావడం, లేదా అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత మారటోరియంనే కొనసాగించడం వంటి చర్యలను బ్యాంకులు చేపట్టవచ్చు. ► కంపెనీల రుణ పునర్వ్యవస్థీకరణ విషయంలో నియమించిన నిపుణుల కమిటీ త్వరలో తన సిఫారసులను చేయనుంది. అనంతరం ఈ విషయంలో అనుసరించాల్సిన విధానాలను సెప్టెంబర్ 6 లోపు ప్రకటిస్తాం. రుణానికి–డిమాండ్‌కు సంబంధం... రుణ వృద్ధికీ, డిమాండ్‌కు సంబంధం ఉంటుంది. గతంలో వలెనే బ్యాంకింగ్ ఇప్పుడూ రుణాలు ఇవ్వడం లేదన్న సాధారణ అభిప్రాయాన్ని గవర్నర్ తెలియజేశారు. అయితే రుణానికి డిమాండ్ తగినంతలేదు. పెట్టుబడులు తక్కువగా ఉన్న పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు దీనికి నేపథ్యం. – రజ్నీష్ కుమార్, ఎస్బీఐ చైర్మన్ డిమాండ్ లేకపోవడమే ఇబ్బంది... రుణాల మంజూరీకి బ్యాం కులు వెనుకంజ వేయడం లేదు. డిమాండ్ లేకపోవడమే అసలు సమస్య. 2016లో మొండిబకాయిలపై ఆర్బీఐ కఠిన నిబంధనలు తెచ్చిననాటి సమస్య మొదలైంది. దివాలా కోడ్ (ఐబీసీ) పరిస్థితిని ఇంకాస్త దిగజార్చింది. ఇప్పుడు కరోనా మిగిలిన డిమాండ్‌ను చంపేసింది. – ఎస్ మల్లిఖార్జున రావు, పీఎన్బీ సీఈఓ బ్యాంకింగ్‌ను అనడం సరికాదు... రుణాలు ఇవ్వడానికి భయపడిపోవద్దని చెబుతూ, ఈ విషయంలో బ్యాంకింగ్‌పైనే ఎందుకు బాధ్యత పెడుతున్నారో నాకు తెలియడంలేదు. మేము మంచి ప్రాజెక్టులకే రుణాలను ఇస్తున్నాము. ఇక్కడ ఏ బ్యాంకునూ అనడానికి లేదు. రుణాలను తేలిగ్గా మంజూరు చేసే మొత్తం వ్యవస్థే దెబ్బతింది. – రాజ్‌కిరణ్ రాయ్, యూనియన్ బ్యాంక్ సీఈఓ మా బ్యాంక్‌లో 20 శాతం వృద్ధి... జూన్ త్రైమాసికంలో మా బ్యాంక్ కీలక వడ్డీ ఆదాయంలో 20 శాతం వృద్ధిని నమోదుచేసింది. బ్యాంక్ భారీ రుణ వృద్ధిని ఇది ప్రతిబింబిస్తోంది. ఇక్కడ రుణాల మంజూరీ విషయంలో వెనుకంజవేయడమనే ప్రశ్నేలేదు. బ్యాంకింగ్ పటిష్ట, సమర్థవంతమైన విధానాలను అవలంబించడమే కీలకం. – ఆదిత్య పురి, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఈఓ -
వడ్డీమాఫీపై స్పష్టత ఇవ్వండి
న్యూఢిల్లీ: కరోనా కారణంగా రుణవాయిదాలపై మారటోరియం విధించిన కేంద్ర ప్రభుత్వం ఆ వాయిదాలపై వడ్డీని మాఫీ చేసే విషయమై ఒక నిర్ణయానికి రావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద పలు అధికారాలు ఉన్నప్పటికీ ఆర్బీఐ సాకు చూపుతూ ఈ అంశంపై ఏ నిర్ణయమూ తీసుకోలేదని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని బెంచ్ కేంద్రాన్ని తప్పుపట్టింది. ఈ విషయంపై తగిన నిర్ణయం తీసుకునేందుకు సమయం కావాలన్న సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విజ్ఞప్తికి సానుకూలంగా స్పందిస్తూ వారం గడువు ఇచ్చింది. ఈ సందర్భంగా తుషార్ మెహతా మాట్లాడుతూ తాము ఈ అంశంపై ఆర్బీఐతో కలిసి పనిచేస్తున్నట్లు జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎం.ఆర్.షా లతో కూడిన బెంచ్‌కు తెలిపారు. కేంద్రం విపత్తు నిర్వహణ చట్టంపై స్పష్టత కల్పించాలని, ఇప్పటికే వసూలు చేస్తున్న వడ్డీపై అదనపు వడ్డీ వసూలు సాధ్యమవుతుందా? అని బెంచ్ ప్రశ్నించగా తుషార్ మెహతా స్పందిస్తూ... అన్ని సమస్యలకు సాధారణ పరిష్కారం ఉండదన్నారు. ఆగ్రాకు చెందిన గజేంద్ర శర్మ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేస్తూ మార్చి 27న ఆర్బీఐ జారీ చేసిన నోటిఫికేషన్‌లోని కొంత భాగాన్ని చట్టవిరుద్ధమైందిగా ప్రకటించాలని కోరారు. రుణ వాయిదాలపై నిషేధం విధించిన నేపథ్యంలో ఆ వాయిదాలపై వడ్డీ వసూలు చేయడం సరికాదని, దీనివల్ల తనకు సమస్యలు వస్తున్నాయని గజేంద్ర శర్మ ఆ పిటిషన్లో పేర్కొన్నారు. తను జీవించే హక్కుకు భంగం కలిగిస్తోందని గజేంద్ర శర్మ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. రుణ వాయిదాలపై మారటోరియం గడువును పొడిగించాలని కోరారు. తదుపరి విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబరు ఒకటవ తేదీకి వాయిదా వేసింది. -
ఆర్బీఐ పేరుతో కాలయాపన: సుప్రీం ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మంజూరు చేసిన మారటోరియం వ్యవధిలో వడ్డీ మాఫీ అంశంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఆరు నెలల రుణ మారటోరియం కాలానికి వడ్డీని మాఫీ చేసే అంశంపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని కోరింది. వడ్డీ మీద వడ్డీ విధిస్తారా అంటూ గతంలోనే ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం బుధవారం మరోసారి కేంద్రం వైఖరిపై మండిపడింది. ఆర్బీఐ పేరు చెప్పి ఎంతకాలం దాక్కుంటారని వ్యాఖ్యానించింది. ఆర్థిక ఉద్దీపన వల్ల ఎంత మందికి ప్రయోజనం, నిజంగా ప్రజలకు మేలు జరిగిందా అని ప్రశ్నించింది. వ్యాపార ఉద్దేశ్యాలు పక్కనబెట్టి ప్రజలకష్టాలు తీర్చాలని సూచించింది. దీనిపై సెప్టెంబర్ ఒకటవ తేదీ నాటికి పూర్తి నివేదిక సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇప్పటివరకూ పరిశ్రమకు సంబంధించిన ఆందోళనలతోనే ఆర్బీఐ సరిపెట్టుకుందని, ప్రభుత్వం కూడా ఆర్బీఐ వెనుక దాక్కుంటోందని సుప్రీం విరుచుకుపడింది. వడ్డీ మాఫీ, వడ్డీపై వడ్డీ మాఫీ అంశంపై విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని పేర్కొంది. వడ్డీ మాఫీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై స్పందన దాఖలు చేయాలని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. అనంతరం విచారణను సుప్రీం కోర్టు సెప్టెంబర్ 1 కి వాయిదా వేసింది. ప్రభుత్వం వ్యాపారం గురించి మాత్రమే కాకుండా ప్రజల దుస్థితి గురించి కూడా ఆలోచించాలని హితవు చెప్పింది. రెగ్యులేటర్‌గా ఆర్బీఐ నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. ఒత్తిడితో కూడిన ఖాతాలను గుర్తించి, తక్కువ వడ్డీ రేట్ల పరంగా ఉపశమనం కల్పించాలని ఆర్బీఐ చూస్తోందని కేంద్రం తరపున వాదిస్తున్నసొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. అలాగే ఇలాంటి అభిప్రాయానికి రావద్దని సుప్రీంకోర్టును కోరారు. దీనిపై సమీక్షించి,నివేదిక అందిస్తామని మెహతా తెలిపారు. కాగా కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్డౌన్ కారణంగా బ్యాంకు రుణాలపై రిజర్వు బ్యాంకు విధించిన మారిటోరియం గడువు ఆగస్టు 31తో ముగియనున్న సంగతి తెలిసిందే. -
కరోనా : మారటోరియం పొడిగించండి
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా క్లిష్ట సమయంలో సాధారణ పౌరులు, మధ్యతరగతి ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో వారికి ఉపశమనం కలిగించేలా సుప్రీంకోర్టులో ఓ వ్యాజ్యం దాఖలైంది. ఆగస్ట్ 31తో ముగియనున్న మారటోరియం గడువును కోవిడ్ దృష్ట్యా డిసెంబర్ 31 వరకు పొడించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు న్యాయవాది విశాల్ తివారీ తన పిటిషన్ పలు కీలక అంశాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. కరోనా వైరస్ ధాటికి ప్రజల జీవితాలు అతలాకుతలం అయ్యాయని వివిధ అవసరాల కోసం తీసుకున్న లోన్లు చెల్లించే పరిస్థితిలో వారు లేరని పేర్కొన్నారు. లాక్‌డౌక్ కారణంగా పరిశ్రమలు మూతపడటంతో కార్మికులు ఉపాధి అవకాశాలు కోల్పోయారని వివరించారు. ఈ నేపథ్యంలో మారిటోరియం గడువును డిసెంబర్ 31 వరకు పెంచేలా కేంద్ర ప్రభుత్వాన్ని, ఆర్బీఐ, వివిధ బ్యాంకులను ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై వచ్చే వారం ధర్మాసనం విచారణ చేపట్టే అవకాశం ఉంది. కాగా బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్ల్‌ను తిరిగి చెల్లించేందుకు మారటోరియం రూపంలో కేంద్ర ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. ఆ గడువు కాస్తా ఆగస్ట్ 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో గడువును మరికొంత కాలం పొడించాలని పలు వర్గాల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. అయితే బ్యాంకింగ్ రంగాలు మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా ఎస్బీఐ మారటోరియం పొడిగింపుకు ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు కావడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై సుప్రీం, కేంద్ర ప్రభుత్వాల స్పందన ఏ విధంగా ఉంటుందనేది ఆసక్తిరేపుతోంది. -
రూ.8.4 లక్షల కోట్ల రుణాల పునర్వ్యవస్థీకరణ
ముంబై: ఒక్కసారి రుణ పునర్వ్యవస్థీకరణకు అనుమతిస్తూ ఆర్బీఐ ఇటీవల పరపతి విధాన కమిటీ భేటీలో నిర్ణయం తీసుకోగా.. ఈ కారణంగా బ్యాంకులు సుమారు రూ.8.4 లక్షల కోట్ల మేర రుణాలను పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉందని ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ అంచనా వేసింది. వ్యవస్థలోని మొత్తం రుణాల్లో ఇది 7.7 శాతం అవుతుందని పేర్కొంది. ఒకవేళ రుణాల పునరుద్ధరణకు అవకాశం లేకపోతే ఈ రూ.8.4 లక్షల కోట్ల రుణాల్లో సుమారు 60 శాతానికి పైగా ఎన్ పీఏలుగా మారొచ్చని అంచనాకు వచ్చింది. పునర్ వ్యవస్థీకరణ బ్యాంకుల లాభాలను కాపాడుతుందని, చేయాల్సిన కేటాయింపులు తగ్గుతాయని పేర్కొంది. కరోనా కారణంగా లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఆర్బీఐ ఇప్పటికి రెండు విడతల పాటు మొత్తం ఆరు నెలలు (2020 మార్చి నుంచి ఆగస్ట్) రుణ చెల్లింపులపై మారటోరియం (విరామం)కు అవకాశం ఇచ్చింది. మూడో విడత మారటోరియం కాకుండా పునర్ వ్యవస్థీకరణకు అవకాశం ఇవ్వాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు చేసిన వినతుల నేపథ్యంలో ఆర్బీఐ ఈ దిశగా నిర్ణయం ప్రకటించడం గమనార్హం. అన్నిరంగాలకు చెందిన అన్ని రుణాలకు కాకుండా పునర్ వ్యవస్థీకరణ విషయంలో ఒక్కో ఖాతాను విడిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆర్బీఐ సూచించింది. గత సంక్షోభ సమయాల్లో మాదిరిగా కాకుండా ఈ విడత కార్పొరేట్, నాన్ కార్పొరేట్, చిన్న వ్యాపార సంస్థలు, వ్యవసాయ రుణాలు, రిటైల్ రుణాలకు ఈ విడత పునర్ వ్యవస్థీకరణలో అధిక వాటా ఉండనుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ తెలిపింది. ప్రపంచ ఆర్థిక మాంద్యం సమయంలో పునర్వ్యవస్థీకరించిన రుణాల్లో 90 శాతం కార్పొరేట్ రుణాలేనని పేర్కొంది. ఈ విడత (ఆగస్ట్ తర్వాత) పునర్వ్యస్థీకరణ రుణాల్లో రూ.2.1 లక్షల కోట్లు నాన్ కార్పొరేట్ విభాగాల నుంచే ఉంటాయని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ పేర్కొంది. కార్పొరేట్ లో ఎక్కువ రిస్క్ కార్పొరేట్ విభాగంలో రూ.4 లక్షల కోట్ల రుణాలు కరోనా ముందు నుంచే ఒత్తిడిలో ఉన్నాయని, ఇవి మరో రూ.2.5 లక్షల కోట్ల మేర పెరగనున్నాయని ఇండియా రేటింగ్స్ అంచనాగా ఉంది. ‘‘కార్పొరేట్ విభాగంలో పునర్ వ్యవస్థీకరించే రుణాల మొత్తం రూ.3.3 లక్షల కోట్ల నుంచి రూ.6.3 లక్షల కోట్ల వరకు ఉంటాయి. బ్యాంకులు అనుసరించే విధానాలపై ఈ మొత్తం ఆధారపడి ఉంటుంది. ఈ విభాగంలోని రుణాల్లో 53 శాతం అధికరిస్క్ తో కూడినవే. మరో 47 శాతం రుణాలకు మధ్యస్థ రిస్క్ ఉంటుంది. రియల్ ఎస్టేట్, ఎయిర్ లైన్స్, హోటల్స్, విచక్షణారహిత వినియోగ రంగాల్లో ఎక్కువ రుణాలను పునరుద్ధరించాల్సి రావచ్చు. అయితే విలువ పరంగా మౌలిక సదుపాయాలు, విద్యుత్, నిర్మాణ రంగానికి చెందిన రుణాలు ఎక్కువగా ఉండొచ్చు. నాన్ కార్పొరేట్ విభాగంలో పునరుద్ధరించాల్సిన రుణాల్లో సగం ఎంఎస్ఎంఈ విభాగం నుంచి ఉంటాయి. మొత్తం మీద బ్యాంకింగ్ రంగంలో కేటాయింపులు 16–17 శాతం తగ్గుతాయి’’అని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ తన నివేదికలో వివరించింది. -
అందరికీ మారిటోరియం అనవసరం: ఎస్బీఐ చీఫ్
ఆగస్ట్ తర్వాత అన్ని రంగాలకు మారిటోరియం కొనసాగింపు అవసరం లేదని ఎస్బీఐ ఛైర్మన్ రజినీష్ అభిప్రాయపడ్డారు. రానున్న నెలల్లో మారిటోరియం కొనసాగింపుపై ఆర్బీఐ సెక్టార్లవారీగా విశ్లేషించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని రజనీష్ తెలిపారు. ఎస్బీఐ నిర్వహించిన 2రోజుల వర్చువల్ ఇంటర్నల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘ఆర్బీఐ వద్ద మొత్తం ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన పూర్తి గణాంకాలు ఉన్నాయి. ఈ లెక్కలు ఆధారంగానే ఆర్బీఐ మారిటోరియం కొనసాగింపుపై నిర్ణయం తీసుకోవచ్చు. అత్యవరసమని భావించిన కొన్ని రంగాలకు తప్ప మారిటోరియం అనవసరమని తాను భావిస్తున్నట్లు తెలిపారు. కరోనా కట్టడికి దేశవ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో విధించిన మారిటోరియంను డిసెంబర్ వరకు కొనసాగించే అంశాన్ని ఆర్బీఐ పరిశీలిస్తున్నదని కొన్ని మీడియా వర్గాలు ప్రస్తావించిన నేపథ్యంలో రజినీష్ వ్యాఖ్యలు ఆసక్తిని సంతరించుకున్నాయి. ఎస్బీఐలో మారిటోరియం తక్కువే: ఎస్బీఐలో మారిటోరియం ఆప్షన్ ఎన్నుకొన్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని రజనీష్ తెలిపారు. మే చివరినాటికి ఎస్బీఐ మారిటోరియం ఉపయోగించుకున్న ఖాతాలు సుమారు 20శాతమని, రెండోదశ మారిటోరియంలో ఇది మరింత క్షీణించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఆరునెలల మారిటోరియం ఒక మినిరీకన్స్ట్రక్చన్ అని, కోవిడ్-19 కారణంగా నష్టాలను చవిచూసిన కంపెనీలకు వాస్తవ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని ఆయన సూచనాప్రాయంగా తెలిపారు. ‘‘ఏదైనా ఉపశమనం మూడు విధాలుగా చూడాలి. ఒకటి వర్కింగ్ క్యాపిటల్ రుణాలను అంచనా వేయడం, టర్మ్ లోన్ రిలీఫ్ ద్వారా క్యాష్‌ఫ్లోను సరిచేయడం, నష్టాలను చవిచూస్తున్న కార్పొరేట్లకు పటిష్టమైన పునర్ వ్యవస్థీకరణ చేయడం’’ అని రజనీష్ వివరించారు. జూన్‌లో రికవరి బాగుంది : ఫైనాన్షియల్ యాక్టివిటి ఏప్రిల్ కంటే మేలో మెరుగ్గా ఉంది. జూన్‌లో మంచి రికవరీని చూస్తున్నాము. గ్రామీణ ప్రాంతాల్లో ఈ రికవరి బాగుంది. అయితే పారిశ్రామిక హబ్‌లైన మహారాష్ట్ర, గుజరాత్, నేషనల్ క్యాపిటల్ రీజనల్(ఢిల్లీ, హర్యనా, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్)లో కోవిడ్-19 ప్రభావం అధికంగా ఉంది.’’ అని రజనీష్ అన్నారు. -
వడ్డీమీద వడ్డీనా..?
న్యూఢిల్లీ: కోవిడ్–19 కష్ట కాలంలో బ్యాంకింగ్ రుణ బకాయిల నెలవారీ చెల్లింపులపై (ఈఎంఐ) ప్రకటించిన మారటోరియం విధానం ఇందుకు సంబంధించిన ప్రయోజనం నెరవేరేట్లు లేదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇది వడ్డీమీద వడ్డీ విధింపులా ఉందని పేర్కొంటూ, ఇలాంటి విధానంలో ఔచిత్యం ఏదీ కనబడ్డంలేదని వ్యాఖ్యానించింది. కేసు తదుపరి విచారణను ఆగస్టు మొదటి వారానికి వాయిదా వేసిన జస్టిస్ అశోక్ భూషన్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం, మారటోరియం పథకాన్ని పునఃసమీక్షించాలని కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లకు సూచించింది. ఈ అంశాన్ని పరిశీలించాలని కేంద్రానికి ప్రత్యేకంగా సూచించిన అత్యున్నత న్యాయస్థానం, ఈ వ్యవహారాన్ని బ్యాంకులకు పూర్తిగా వదిలేయరాదనీ స్పష్టంచేసింది. ఇది కస్టమర్‌కు, బ్యాంకులకు మధ్య వ్యవహారమని కేంద్రం చెప్పనేరదనీ తెలిపింది. అసలు ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయని అత్యున్నత న్యాయస్థానం ఈ సందర్భంగా పేర్కొంది. ఇందులో మారటోరియం కాలంలో అసలు వడ్డీ విధించకపోవడం ఒకటికాగా, వడ్డీమీద వడ్డీ విధింపు (మారటోరియం కాలంలో వడ్డీని అసలుకు కలిపి, తిరిగి వడ్డీ విధించడం) రెండవదని అభిప్రాయపడింది. మొత్తం వడ్డీ రద్దుకాకపోయినా, వడ్డీమీద వడ్డీనైనా తొలగించే విధానం ఉండాలని సూచించింది. 21వ అధికరణకు విఘాతం కోవిడ్–19 నేపథ్యంలో బ్యాంకింగ్ రుణ బకాయిల నెలవారీ చెల్లింపులపై ఆగస్టు 31వ తేదీ వరకూ అమలుకానున్న మారటోరియం సమయంలో విధించే వడ్డీరేటు సమంజసం కాదంటూ, ఆగ్రాకు చెందిన గజేంద్ర శర్మ అనే వ్యక్తి దాఖలు చేసిన ఒక పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ అంశాన్ని విచారిస్తున్న త్రిసభ్య ధర్మాసనంలో జస్టిస్ అశోక్ భూషన్, జస్టిస్ ఎస్కే కౌల్, ఎంఆర్ షాలు ఉన్నారు. నిజానికి మే 31 వరకూ అమల్లో ఉన్న ‘మారటోరియం’ను ఆగస్టు 31 వరకూ పొడిగించిన సంగతి తెలిసిందే. మారటోరియం కాలంలో వడ్డీ భారం వేయడం రుణ గ్రహీతలకు శిక్ష విధించడమేనని పిటిషనర్ తరఫు న్యాయవాది అతున్నత న్యాయస్థానానికి విన్నవించారు. రాజ్యాంగంలోని 21వ అధికరణం కల్పిస్తున్న ‘జీవించే హక్కు’కు ఇది విఘాతం కలిగిస్తోందని కూడా కోర్టుకు తెలిపారు. మారటోరియం సమయంలో వడ్డీభారం లేని రుణ పునఃచెల్లింపులకు వీలుకల్పిస్తూ కేంద్రం, ఆర్బీఐలకు ఆదేశాలు ఇవ్వాలనీ ఆయన కోరారు.ఈ అంశంపై కొత్త మార్గదర్శకాలు తెచ్చే అవకాశం ఏదైనా ఉంటుందా? అన్న అంశంపై ఆలోచన చేయాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌కూ తాజాగా సుప్రీం సూచించింది. మా ప్రయోజనాలకు విఘాతం: డిపాజిటర్లు రుణ చెల్లింపులపై మారటోరియం కాలంలో వడ్డీని మాఫీ చేస్తే అది బ్యాంకు డిపాజిటర్ల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని అఖిల భారత డిపాజిటర్ల అసోసియేషన్ (ఏఐబీడీఏ) ఆందోళన వ్యక్తం చేసింది. ఎటువంటి వడ్డీ మాఫీ అయినా అది రుణ సంస్కృతిని దెబ్బతీస్తుందని, బ్యాంకుల ఆర్థిక పరిస్థితిపై దాని ప్రభావం ఉంటుందని పేర్కొంది. రుణాలపై వడ్డీ మాఫీకి అనుమతిస్తే.. అప్పుడు బ్యాంకులు అనివార్యంగా తమ వడ్డీ ఆదాయ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు డిపాజిట్లపై వడ్డీ రేట్లను మరింత తగ్గిస్తాయని ఏఐబీడీఏ ఆందోళన వ్యక్తం చేసింది. చారిత్రకంగా చూస్తే రుణాలపై వడ్డీ రేట్లను మాఫీ చేస్తే సార్వభౌమ (కేంద్ర ప్రభుత్వం) రక్షణ ఉంటుందని, కానీ ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయ నష్టాలున్న పరిస్థితుల్లో అందుకు అవకాశం ఉండదని పేర్కొంది. వడ్డీ రద్దు అంత తేలిక్కాదు: కేంద్రం, ఆర్బీఐ కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా త్రిసభ్య ధర్మాసనం ముందు తన వాదనలు వినిపిస్తూ, రుణాలపై వడ్డీ పూర్తి రద్దు బ్యాంకులకు అంత తేలిక్కాదని విన్నవించారు. బ్యాంకులు కూడా తమ డిపాజిట్లకు వడ్డీరేటు చెల్లించాలన్న విషయాన్ని గుర్తించాల్సి ఉంటుందని అన్నారు. రూ.133 లక్షల కోట్ల డిపాజిట్లు బ్యాంకుల వద్ద ఉన్నాయని సొలిసిటర్ జనరల్ వివరించారు. రుణాలపై వడ్డీని రద్దు చేస్తే, బ్యాంకింగ్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. ఆర్థిక స్థిరత్వానికీ ఇది ప్రతికూలమన్నారు. బ్యాంక్స్ అసోసియేషన్, ఎస్బీఐ న్యాయవాది ఈ అంశంపై విచారణను మూడు నెలలు వాయిదా వేయాలని సుప్రీంకోర్టును కోరారు. అసలు వడ్డీరద్దు అంశంపై ఇప్పటికిప్పుడు ఒక నిర్ణయం తీసుకోవడం ‘ముందస్తు’ నిర్ణయం అవుతుందని, ప్రతి ఖాతాకు సంబంధించి వేర్వేరుగా ఈ అంశాన్ని పరిశీలించాల్సి ఉంటుందనీ ఆయన అన్నారు. మారటోరియం కాలంలో వడ్డీ తొలగిస్తే, బ్యాంకింగ్‌పై ఆ ద్రవ్య భారం ఎంత ఉందన్న విషయంపైనా ఒక అంచనాకు రావాల్సి ఉందని న్యాయవాది పేర్కొన్నారు. -
మారిటోరియం మతలబు
-
వడ్డీ రద్దుపై కేంద్రం వివరణ కోరిన సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ : మారటోరియం సమయంలో ఈఎంఐలపై వడ్డీ భారంపై బదులివ్వాలని సర్వోన్నత న్యాయస్ధానం గురువారం ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరింది. మారటోరియం వ్యవధిలో ఈఎంఐలపై వడ్డీ వసూలు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆర్బీఐతో పాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఇక మారటోరియం సమయంలో రుణ వాయిదాలపై వడ్డీ రద్దుతో బ్యాంకుల ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని, డిపాజిటర్ల ప్రయోజనాలకు విఘాతం ఏర్పడుతుందని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ఆర్బీఐ పేర్కొంది. ఈ వ్యవహారంలో రెండు అంశాలను పరిశీలిస్తున్నామని సుప్రీంకోర్టు పేర్కొంటూ మారటోరియం వ్యవధిలో ఈఎంఐలపై వడ్డీ వసూలు చేయకపోవడం,వడ్డీపై వడ్డీ విధించకపోవడం పరిశీలించాలని కోరింది. ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో ఇది తీవ్రంగా చర్చించాల్సిన అంశమని..ఓ వైపు మారటోరియం వెసులుబాటు ఇస్తూనే మరోవైపు పేరుకుపోయిన ఈఎంఐలపై వడ్డీ వసూలు చేస్తున్నారని జస్టిస్ అశోక్ భూషణ్, సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన సర్వోన్నత న్యాయస్ధానం వ్యాఖ్యానించింది. చదవండి : 'భారత్'గా ఇండియా: కేంద్రాన్ని ఆశ్రయించండి ఈ అంశంపై సుప్రీంకోర్టులో తీవ్ర వాదోపవాదాలు సాగాయి. మహమ్మారి వైరస్‌తో ఆర్థికంగా చితికిపోయిన ప్రజలకు మారటోరియం వెసులుబాటు ఇచ్చినా వడ్డీ భారం మోపడం సరైంది కాదని పిటిషనర్ గజేంద్ర శర్మ తన పిటిషన్లో వాపోయారు. మరోవైపు ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలుకు కొంత సమయం కావాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. -
ఎస్బీఐ డిపాజిట్ రేట్లు 0.40% కోత
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అన్ని కాలపరిమితుల స్థిర డిపాజిట్లపై వడ్డీరేట్లను 40 బేసిస్ పాయింట్ల (0.40 శాతం) వరకూ తగ్గించింది. డిపాజిట్లపై ఎస్బీఐ రేట్లు తగ్గించడం ఇది వరుసగా రెండవసారి. తాజా నిర్ణయం బుధవారం నుంచే అమల్లోకి వస్తుందని బ్యాంక్ వెబ్సైట్ తెలిపింది. రెండు కోట్లు ఆపైబడిన బల్క్ డిపాజిట్లపై వడ్డీరేటును బ్యాంక్ ఏకంగా 50 బేసిస్ పాయింట్ల వరకూ తగ్గించడం గమనార్హం. ఈ కేటగిరీ కింద బ్యాంక్ ఆఫర్ చేస్తున్న గరిష్ట వడ్డీరేటు మూడు శాతం. ఈ నిర్ణయం కూడా తక్షణం అమలోకి వచ్చింది. సీనియర్ సిటిజన్లకు అదనం.. సీనియర్ సిటిజన్లకు పైన పేర్కొన్న వడ్డీరేటు కన్నా అరశాతం (50 బేసిస్ పాయింట్లు) అదనంగా అందుతుంది. సీనియర్ సిటిజన్ల విషయంలో 50 బేసిస్ పాయింట్ల అదనంతోపాటు, మరో 30 బేసిస్ పాయింట్ల వడ్డీరేటు ప్రీమియంగా ఇచ్చే ఒక ప్రత్యేక పథకాన్ని ‘ఎస్బీఐ వెల్ఫేర్’ పేరుతో ఇప్పటికే బ్యాంక్ ప్రకటించింది. ఐదేళ్లు, ఆపైన డిపాజిట్లకు వర్తించే ఈ పథకాన్ని తీసుకోడానికి గడువు ఈ ఏడాది సెప్టెంబర్ 30. ఎస్ఎంఎస్కు ‘ఎస్’ అంటే... వాయిదా కాగా రుణ బకాయిల ఈఎంఐ చెల్లింపులపై మారటోరియం అమలు విధానాన్ని మరింత సరళతరం చేస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. దీని ప్రకారం... దాదాపు 85 లక్షల మంది అర్హత కలిగిన రుణ గ్రహీతలకు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. ఎస్ఎంఎస్ కమ్యూనికేషన్‌కు ప్రతిగా కస్టమర్ ‘ఎస్’ అని సమాధానం ఇస్తే చాలు... నెలవారీ చెల్లింపులపై మారిటోరియం వారికి అమలవుతుంది. రేట్ల కోత ప్రయోజనం దక్కట్లేదు కస్టమర్లు, డెవలపర్లకు బదలాయించడం లేదు... బ్యాంకులపై ఆర్బీఐకి క్రెడాయ్ ఫిర్యాదు న్యూఢిల్లీ: రుణాలపై వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గినప్పటికీ బ్యాంకులు ఆ ప్రయోజనాలను కస్టమర్లు, నిధుల కొరతతో కటకటలాడుతున్న డెవలపర్లకు బదలాయించడం లేదంటూ రియల్టీ సంస్థల సమాఖ్య క్రెడాయ్ తాజాగా రిజర్వ్ బ్యాంక్‌కు ఫిర్యాదు చేసింది. రియల్ ఎస్టేట్ డెవలపర్ల నిధుల అవసరాలకు కీలకమైన నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ), గృహ రుణ సంస్థలకు (హెచ్ఎఫ్సీ) కూడా రేట్ల కోత ప్రయోజనాలను బ్యాంకులు అందించేలా చూడాలంటూ కోరింది. ఆర్బీఐకి క్రెడాయ్ ఈ మేరకు లేఖ రాసింది. ప్రస్తుత సంక్షోభ సమయంలో వ్యవస్థలో తగినంత ద్రవ్య లభ్యత ఉండేలా చూసేందుకు వడ్డీ రేట్లను తగ్గించడంతో పాటు రుణాల చెల్లింపుపై మారటోరియం వంటి చర్యలు కూడా తీసుకున్నప్పటికీ రియల్టీ రంగానికి మాత్రం ఆ ప్రయోజనాలేమీ దక్కడం లేదని క్రెడాయ్ పేర్కొంది. ‘2019 జనవరి నుంచి ఆర్బీఐ 2.50 శాతం మేర రెపో రేటును తగ్గించింది. కానీ గతేడాది ఆగస్టు నుంచి ఇప్పటిదాకా బ్యాంకులు గరిష్టంగా 0.7–1.3 శాతం స్థాయిలో మాత్రమే బదలాయించాయి’ అని క్రెడాయ్ పేర్కొంది. అధిక వడ్డీ రేటు కట్టాల్సి వస్తోంది.. గృహ రుణాలపై వడ్డీ రేట్లను ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్‌కు అనుసంధానించాలని బ్యాంకులకు సూచించినా ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలకు మాత్రం ఆర్బీఐ దీన్ని వర్తింపచేయడం లేదని తెలిపింది. బ్యాంకులు సైతం తగ్గిన వడ్డీ రేట్ల ప్రయోజనాలను ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలకు ఇవ్వకపోతుండటంతో వాటి నుంచి తాము తీసుకునే రుణాలపై భారీ వడ్డీ రేటు కట్టాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. -
‘ఆర్బీఐ’ నష్టాలు
ఆర్బీఐ అనూహ్యంగా రెపో రేటును తగ్గించినప్పటికీ, గురువారం స్టాక్ మార్కెట్ నష్టపోయింది. రెపో రేటును తగ్గించడంతో పాటు, రుణ చెల్లింపులపై మారటోరియాన్ని మరో మూడు నెలల పాటు పొడిగించడం తదితర ఆర్బీఐ చర్యలు స్టాక్‌మార్కెట్‌ను మెప్పించలేకపోయాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 34 పైసల మేర క్షీణించడం, అమెరికా–చైనాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరగడం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ రుణాత్మక వృద్ధిని నమోదు చేస్తుందన్న ఆర్బీఐ అంచనాలు.... ప్రతికూల ప్రభావం చూపించాయి. దీంతో మూడు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. ఇంట్రాడేలో 175 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ చివరకు 260 పాయింట్ల నష్టంతో 30,673 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 67 పాయింట్లు క్షీణించి 9,039 పాయింట్ల వద్దకు చేరింది. ఇక వారం పరంగా చూస్తే సెన్సెక్స్ 425 పాయింట్లు, నిఫ్టీ 98 పాయింట్ల మేర క్షీణించాయి. 633 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్... ఆసియా మార్కెట్ల బలహీనతతో సెన్సెక్స్ నష్టాల్లోనే మొదలైంది. ఆ తర్వాత లాభాల్లోకి వచ్చినా, మళ్లీ అరగంటకే నష్టాల్లోకి జారిపోయింది. అప్పటి నుంచి రోజంతా నష్టాలు కొనసాగాయి. ఒక దశలో 175 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ మరో దశలో 458 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 633 పాయింట్ల రంజ్‌లో కదలాడింది. ► యాక్సిస్ బ్యాంక్ షేర్ 6 శాతం మేర నష్టపోయి రూ.337 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► రుణ చెల్లింపులపై మారటోరియాన్ని మరో మూడు నెలల పాటు ఆర్బీఐ పొడిగించింది.ఈ నిర్ణయం వల్ల రుణ వసూళ్లలో జాప్యం జరగడమే కాకుండా, రికవరీ మరింత ఆలస్యమవుతుందనే భయాలతో బ్యాంక్, నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు 6 శాతం మేర నష్టపోయాయి. -
మరో 3 నెలలు... వాయిదా!
ముంబై: కరోనా వైరస్ రాక ముందే దేశ జీడీపీ వృద్ధి రేటు ఏడేళ్ల కనిష్టానికి పడిపోయింది. అదే సమయంలో వచ్చిన ‘కరోనా’.. ఆర్థిక వ్యవస్థను రెండు నెలలపాటు లాక్డౌన్ చేసేసింది. ఈ పరిస్థితుల్లో దేశ ఆర్థిక వృద్ధికి ప్రేరణగా ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. రుణ రేట్లు మరింత దిగివచ్చేందుకు వీలుగా రెపో రేటు (బ్యాంకులకు ఇచ్చే నిధులపై వసూలు చేసే రేటు)ను 40 బేసిస్ పాయింట్ల (0.40 శాతం) మేర కోత విధించి 4 శాతానికి తీసుకొచ్చింది. ఇది 20 ఏళ్ల (2000 తర్వాత) కనిష్ట స్థాయి. ఈ నిర్ణయంతో రెపో ఆధారిత గృహ, వాహన, వ్యక్తిగత, ఇతర టర్మ్ రుణాల రేట్లు దిగొస్తాయి. అటు రివర్స్ రెపో రేటు (బ్యాంకులు ఆర్బీఐ వద్ద ఉంచే నిధులపై చెల్లించే రేటు)ను కూడా 40 బేసిస్ పాయింట్లు తగ్గించి 3.75 శాతం నుంచి 3.35 శాతానికి తీసుకొచ్చింది. ఈ నిర్ణయం ఆర్బీఐ వద్ద నిధులు ఉంచడానికి బదులు రుణ వితరణ దిశగా బ్యాంకులను ప్రోత్సహించనుంది. మరోవైపు రుణగ్రహీతలకు మరింత ఉపశమనం కల్పిస్తూ.. రుణ చెల్లింపులపై మారటోరియంను మరో మూడు నెలలు పొడిగించింది. అవసరమైతే రేట్లను మరింత తగ్గించేందుకు వీలుగా ‘సర్దుబాటు ధోరణి’నే కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. ఎంపీసీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వీడియో సందేశం రూపంలో తెలియజేశారు. రుణగ్రహీతలపై పన్నీరు లాక్‌డౌన్‌ను చాలా వరకు సడలించినప్పడికీ సాధారణ పరిస్థితులు ఏర్పడడానికి ఎంతో సమయం పడుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రుణ చెల్లింపులపై మే వరకు ఇచ్చిన మారటోరియం (తాత్కాలిక విరామం)ను మరో 3 నెలల పాటు.. ఈ ఏడాది ఆగస్టు చివరి వరకు ఆర్బీఐ పొడిగించింది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, సూక్ష్మ రుణ సంస్థలు, కోఆపరేటివ్ బ్యాంకులు, క్రెడిట్‌కార్డు సంస్థలు జారీ చేసిన రుణాలకు ఇది అమలవుతుంది. కాకపోతే మారటోరియంను మే తర్వాత కొనసాగించాలా లేదా అన్నది ఆయా సంస్థల అభీష్టంపైనే ఆధారపడి ఉంటుంది. మారటోరియం కాలంలో చేయాల్సిన చెల్లింపులు తర్వాతి కాలంలో అసలుకు కలుస్తాయి. దీనివల్ల రుణ చెల్లింపుల కాల వ్యవధి పెరుగుతుంది. కంపెనీలకు మూలధన అవసరాకు ఇచ్చిన క్యాష్ క్రెడిట్/ఓవర్ డ్రాఫ్ట్‌లకు కూడా 3 నెలల మారటోరియం అమలవుతుందని ఆర్బీఐ పేర్కొంది. వృద్ధి ప్రతికూలం.. అంచనాల కంటే కరోనా వైరస్ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగానే ఉంటుందని ఆర్బీఐ ఎంపీసీ అభిప్రాయపడింది. దీంతో 2020–21 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి ప్రతికూల దిశలోనే (జీడీపీ వృద్ధి క్షీణత) ప్రయాణించొచ్చని పేర్కొంది. కాకపోతే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధం (అక్టోబర్–మార్చి)లో వృద్ధి పుంజుకోవచ్చన్నారు. డిమాండ్ క్షీణత, సరఫరా వ్యవస్థలో అవరోధాలు కలసి 2020–21 మొదటి ఆరు నెలల కాలంలో వృద్ధిని తగ్గించేస్తాయని.. క్రమంగా ఆర్థిక కార్యకలాపాల పునః ప్రారంభం, ద్రవ్య, పరపతి, పాలనాపరమైన చర్యల వల్ల వృద్ధి రేటు రెటు ఆర్థిక సంవత్సరం ద్విదీయ అర్ధ భాగంలో క్రమంగా పుంజుకోవచ్చని చెప్పారు. దేశ పారిశ్రామిక ఉత్పత్తిలో 60 శాతం వాటా కలిగిన ఆరు అగ్రగామి రాష్ట్రాలు రెడ్/ఆరెంజ్ జోన్లోనే ఉన్నాయని ఎంపీసీ పేర్కొంది. కార్పొరేట్ గ్రూపులకు మరిన్ని రుణాలు ఒక కార్పొరేట్ గ్రూపునకు ఒక బ్యాంకు ఇచ్చే రుణ పరిమితిని 25 శాతం నుంచి 30 శాతానికి ఆర్బీఐ పెంచింది. దీనివల్ల కార్పొరేట్ కంపెనీలకు ఒకే బ్యాంకు పరిధిలో మరింత రుణ వితరణకు వీలు కలుగుతుంది. డెట్, ఇతర క్యాపిటల్ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితుల కారణంగా చాలా కంపెనీలు నిధులు సమీకరణకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. ఎగ్జిమ్ బ్యాంకుకు రూ.15 వేల కోట్లు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎగ్జిమ్ బ్యాంకు)కు 15,000 కోట్ల క్రెడిట్లైన్ (అదనపు రుణం) సదుపాయాన్ని (90 రోజులకు) ఆర్బీఐ ప్రకటించింది. ‘‘ఎగ్జిమ్ బ్యాంకు తన కార్యకలాపాల కోసం విదేశీ కరెన్సీపై ఆధారపడుతుంది. కోవిడ్–19 మహమ్మారి కారణంగా నిధులు సమీకరించలేని పరిస్థితిని ఎదుర్కొంటోంది. కనుక నిధుల సదుపాయాన్ని విస్తరించాలని నిర్ణయం తీసుకున్నాం’’ అని ఆర్బీఐ పేర్కొంది. రాష్ట్రాలకు మరో 13 వేల కోట్లు కన్సాలిడేటెడ్ సింకింగ్ ఫండ్ (సీఎస్ఎఫ్) నుంచి రాష్ట్రాలు మరిన్ని నిధులను తీసుకునేందుకు వీలుగా ఆర్బీఐ నిబంధనలను సడలించింది. దీనివల్ల రాష్ట్రాలకు మరో రూ.13 వేల కోట్ల నిధులు అందుబాటులోకి వస్తాయి. రుణాలకు చెల్లింపులు చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్బీఐ వద్ద సీఎస్‌ఎఫ్‌ను నిర్వహిస్తుంటాయి. ద్రవ్యోల్బణంపై అస్పష్టత కరోనా మహమ్మారి కారణంగా ద్రవ్యోల్బణ గమనంపై తీవ్ర అస్పష్టత ఉందన్న అభిప్రాయాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. పప్పు ధాన్యాల ధరల పెరుగుదలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ధరలను తగ్గించేందుకు దిగుమతి సుంకాలను సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. 2020–21 మొదటి ఆరు నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం అధిక స్థాయిల్లోనే ఉండొచ్చంటూ.. ద్వితీయ ఆరు నెలల కాలంలో లక్షి్యత 4 శాతానికి దిగువకు రావొచ్చన్నారు. దివాలా చర్యలకు మరింత వ్యవధి ఇక మారటోరియం కాలానికి దివాలా చట్టంలోని నిబంధనల నుంచి ఆర్బీఐ మినహాయింపునిచ్చింది. ఐబీసీ చట్టంలోని నిబంధనల కింద రుణ గ్రహీత సకాలంలో చెల్లింపులు చేయకపోతే.. 30 రోజుల సమీక్షాకాలం, 180 రోజుల పరిష్కార కాలం ఉంటుంది. ఇవి మారటోరియం కాలం ముగిసిన తర్వాతే అమల్లోకి వస్తాయి. మరిన్ని నిర్ణయాలకు సదా సిద్ధం 2020 మార్చి నుంచి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ దెబ్బతిన్నట్టు సంకేతాలు తెలియజేస్తున్నాయి. ఆర్బీఐ ఇక ముందూ చురుగ్గానే వ్యవహరిస్తుంది. అవసరం ఏర్పడితే భవిష్యత్తు అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా అన్ని రకాల సాధనాలను, ఇటీవల తీసుకున్న విధంగా కొత్తవి సైతం అమలు చేసేందుకు ఆర్బీఐ సిద్ధంగా ఉంటుంది – శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్ ఆర్బీఐ అసాధారణ నిర్ణయాలు ► మార్చి 3: కరోనా వైరస్ ప్రవేశంతో, పరిస్థితులు సమీక్షిస్తున్నామని, తగి న నిర్ణయాలకు సిద్ధమని ప్రకటన. ► మార్చి 27: రెపో రేటు 75 బేసిస్ పాయింట్లు, సీఆర్ఆర్ 100 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. రుణ చెల్లింపులపై మూడు నెలల మారటోరియం విధింపు. ► ఏప్రిల్ 3: రోజువారీ మనీ మార్కెట్ ట్రేడింగ్ వేళలను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు పరిమితం చేసింది. ► ఏప్రిల్ 17: రివర్స్ రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గింపు. నాబార్డ్, సిడ్బి, నేషనల్హౌసింగ్ బ్యాంకులకు రూ.50వేల కోట్ల నిధుల వెసులుబాటు. 90 రోజుల్లోపు రుణ చెల్లింపుల్లేని ఖాతాలను ఎన్పీఏలుగా గుర్తించాలన్న నిబంధనల నుంచి మారటోరియం రుణాలకు మినహాయింపు. ► ఏప్రిల్ 27: మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు పెట్టుబడుల ఉపసంహరణ ఒత్తిళ్లను ఎదుర్కొంటుండడంతో (డెట్ ఫండ్స్‌కు సంబంధించి) వాటికి రూ.50వేల కోట్ల ప్రత్యేక విండోను (బ్యాంకుల ద్వారా) తీసుకొచ్చింది. ► మే 22: రెపో, రివర్స్ రెపో 40 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గింపు. మారటోరియం మరో మూడు నెలలు పొడిగింపు. ఇతర కీలక అంశాలు ► ఎగుమతులకు సంబంధించి ఇచ్చే రుణాల కాల వ్యవధిని ఏడాది నుంచి 15 నెలలకు ఎంపీసీ పొడిగించింది. ► దిగుమతులకు సంబంధించిన రెమిటెన్స్‌ల పూర్తికి సమయాన్ని 6 నెలల నుంచి 12 నెలలకు పొడిగించింది. ► 2020–21లో మే 15వరకు విదేశీ మారక నిల్వలు 9.2 బిలియన్ డాలర్లు పెరిగి 487 బిలియన్ డాలర్లకు చేరాయి. ► ఆరుగురు సభ్యులున్న ఎంపీసీలో గవర్నర్ దాస్ సహా ఐదుగురు 40 బేసిస్ పాయింట్లకు ఆమోదం తెలిపితే, చేతన్ ఘటే మాత్రం 25 బేసిస్ పాయింట్లకు మొగ్గు చూపించారు. ► రిజర్వ్ బ్యాంక్ ఎంపీసీ భేటీ వాస్తవానికి జూన్ 3–5 తేదీల మధ్య జరగాల్సి ఉంది. కాకపోతే తక్షణ అవసరాల నేపథ్యంలో ముందస్తుగా ఈ నెల 20–22 తేదీల మధ్య సమావేశమై నిర్ణయాలు తీసుకుంది. మారటోరియం తీసుకున్నది 20 శాతమే మా రుణ గ్రహీతల్లో 20 శాతం మందే మారటోరియం ఎంచుకున్నారు. వీరిలో అందరూ నిధుల సమస్యను ఎదుర్కోవడం లేదు. నగదును కాపాడుకునే వ్యూహాంలో భాగంగానే వారు మారటోరియం అవకాశాన్ని వినియోగించుకున్నారు నిధుల పరంగా ఎటువంటి సమస్యల్లేని వారు చెల్లింపులు చేయడమే మంచిది. – రజనీష్ కుమార్, ఎస్బీఐ చైర్మన్ మరిన్ని చర్యలు... భవిష్యత్తు ఆర్థిక వృద్ధిపై ఎంతో అనిశ్చితి ఉందన్న అంచనాలు, ఆర్బీఐ సైతం జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతికూల ధోరణిలో ఉం డొచ్చని అంగీకరిం చినందున.. ఆర్బీఐ, ప్రభుత్వం నుంచి ఇక ముందూ మరిన్ని మద్దతు చర్యలు అవసరం అవుతాయి. – సంగీతారెడ్డి, ఫిక్కీ ప్రెసిడెంట్ -
మారిటోరియం పొడిగింపుతో మరిన్ని డిఫాల్ట్స్!
కరోనా కారక సంక్షోభంలో రుణగ్రహీతలు ఇక్కట్లు పడకుండా ఉండేందుకు రుణాల ఈఎంఐ చెల్లింపులపై విధించిన మారిటోరియాన్ని మరో మూడునెలలు పొడిగిస్తున్నట్లు ఆర్బీఐ తాజాగా ప్రకటించింది. దీంతో కస్టమర్లకు మొత్తం ఆరునెలల పాటు ఈఎంఐలపై మారిటోరియం విధించినట్లు కానుంది. ఇది కస్టమర్లకు కొంతమేర సంతోషం కలిగించే అంశమైనా, బ్యాంకులకు ఇబ్బందికలిగించే విషయమని, దీని కారణంగా డిఫాల్టులు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం బ్యాంకులు రిటైల్ కస్టమర్లకు ఆప్ట్అవుట పద్ధతిపై హోల్‌సేల్ కస్టమర్లకు ఆప్ట్ ఇన్ పద్దతిపై మారిటోరియం సదుపాయం కల్పిస్తున్నాయి. ఎంత ఉన్నాయి? బ్యాంకులవారీగా చూస్తే ప్రస్తుతం బంధన్‌బ్యాంకు ఇచ్చిన రుణాల విలువలో 71 శాతం మారిటోరియం కింద ఉన్నాయి. ఆర్బీఎల్ రుణాల విలువలో 35 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్, కోటక్బ్యాంకుల్లాంటి దిగ్గజాల రుణాల విలువలో 26-30 శాతం మేర మారిటోరియం కిందకు వస్తున్నాయి. 2008 సమయంలో ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయడంతో సాగు రంగంలో ఎన్పీఏలు 2012నాటికి 18 శాతానికి పెరిగాయి. నోట్లరద్దువేళ ఇచ్చిన మారిటోరియంతో ఎంఎఫ్‌ఐల ఆస్తుల నాణ్యత దెబ్బతిన్నది. ఇప్పుడు పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని, ప్రస్తుతం ఎకానమీ పూర్తిగా స్తంభించిందని, అన్ని రంగాలు ఒత్తిడిలో ఉన్నాయని నిపుణులు గుర్తు చేస్తున్నారు. దీనివల్ల రుణాల చెల్లింపు మరింత ఆలస్యం కావచ్చంటున్నారు. ఎందుకు కష్టం? ఆరునెలల మారిటోరియం అనంతరం ఏడో నెల ఆరంభంలో రుణగ్రహీత ఆరునెలల వడ్డీని కలిపి చెల్లించాల్సిఉంటుందని, దీంతో చాలామంది కట్టకుండా ఎగ్గొట్టవచ్చని ప్రభుదాస్లీలాధర నిపుణుడు అజయ్ హెచ్చరించారు. వేతనాలు లేని ఈ వేళ అంతమొత్తం ఒకేసారి కట్టాలంటే కస్టమర్లకు ఇబ్బంది అవుతుందని, ఇది బ్యాంకుల పద్దులపై ప్రభావం చూపుతుందని చెప్పారు. ఈఎంఐల మారిటోరియం కన్నా రుణ పునర్వ్యవస్థీకరణకు ఆర్బీఐ అనుమతించిఉండాల్సిందన్నారు. రిటైల్ ఇన్వెస్టర్లకు ప్రధాన ఆదాయ వనరు జీతమేనని, ఇప్పుడున్న సందర్భంలో సరైన వేతనాల్లేక పెద్ద మొత్తాలు కట్టడం ఇబ్బందిగామారి రిటైలర్లు ఎక్కువగా డిఫాల్ట్ కావచ్చని కొందరి అంచనా. ఇందుకే రిటైల్ రుణాలెక్కువున్న బ్యాంకు షేర్లలో అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. లాక్డౌన్ పూర్తయి ఎకానమీలో అన్ని కార్యకలాపాలు పుంజుకుంటేనే బ్యాంకులకు తగిలిన ఎదురుదెబ్బలపై స్పష్టత వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అసలేంటీ మారిటోరియం? మార్చి ప్రకటన అనంతరం చాలామంది కస్టమర్లు ఈ సదుపాయం వినియోగించుకున్నట్లు బ్యాంకులు తెలిపాయి. ముఖ్యంగా అగ్రి, మైక్రో, కమర్షియల్ వాహనాలు, క్రెడిట్ కార్డుల బకాయిలకు మారిటోరియం విజ్ఞప్తులు అధికంగా వచ్చాయి. లాక్డౌన్ కారణంగా ఆదాయాలు నిలిచిపోవడంతో కస్టమర్లు రుణ వాయిదాలు కట్టేందుకు ఇబ్బంది పడకూడదని ఆర్బీఐ ఈ వెసులుబాటు ఇచ్చింది. మారిటోరియం సదుపాయం వినియోగించుకున్న వాళ్లు ఈ వాయిదాలను తర్వాత కాలంలో చెల్లించాల్సిఉంటుంది. ఈ సదుపాయం వినియోగించుకొని వాయిదాలు చెల్లించలేకపోతే క్రెడిట్ స్కోర్‌పై ఎలాంటి నెగిటివ్ ప్రభావం ఉండదు. ఈ సదుపాయాన్ని ఈఎంఐ హాలిడే అని కూడా అంటారు. లాక్డౌన్ పూర్తయిన తర్వాత కస్టమర్లు తిరిగి ఈఎంఐలు చెల్లించేందుకు సమయం పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. -
మారిటోయం మరో 3నెలల పొడిగింపు: బేర్మన్న బ్యాంకింగ్ షేర్లు
అన్ని రకాల టర్మ్‌లోన్లపై మారిటోరియం మరో 3నెలల పాటు పొడిగిస్తున్నట్లు శుక్రవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ ప్రకటించడంతో బ్యాంకింగ్ రంగ షేర్లలో అనూహ్యంగా అమ్మకాలు నెలకొన్నాయి. జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు టర్మ్ లోన్లపై మారటోరియం పొడిగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆర్బీఐ నిర్ణయంతో చాలామందికి ఊరట లభిస్తున్నప్పటికీ.., బ్యాంకులకు రుణాల వసూళ్లు ఆలస్యంతో పాటు డిఫాల్ట్ భయాలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయి. దీంతో బ్యాంకులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. బేర్మన్న బ్యాంకింగ్ రంగ షేర్లు: ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ శుక్రవారం ఇంట్రాడేలో 3శాతం పతనాన్ని చవిచూసింది. ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బీఐ ఏడాది కనిష్టస్థాయి(రూ.149.55)ని తాకింది. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు 4శాతం నష్టపోయాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ షేర్లు 3శాతం నుంచి 2శాతం పతనాన్ని చవిచూశాయి. ‘‘కరోనా కష్టాలను దృష్టిలో పెట్టుకుని ఆర్బీఐ రెపోరేటును 4.4శాతం నుంచి 4 శాతానికి తగ్గించింది. రివర్స్ రెపో రేటును 3.2 శాతానికి తగ్గించింది. దాంతో వడ్డీ రేట్లు 40 బేసిస్ పాయింట్లు తగ్గనున్నాయి. అలాగే, వృద్ధి పుంజుకునే వరకు ద్రవ్య విధానం అనుకూలంగా ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ స్పష్టంగా చెప్పారు. జీడీపీ వృద్ధి సంఖ్యను మాత్రం ఆర్బీఐ దాటవేసింది. ఇది ఆర్థిక వృద్ధిలో సంక్షిష్టతను తెలియజేస్తుంది. టర్మ్లోన్ల మారిటోయం మరో 3నెలల పాటు పొడగింపు కొంత ఉపశమనం కలిగించే అంశం. అయితే బ్యాంకింగ్ రంగంలో ఒత్తిడి మాత్రం కొనసాగుతుందని’’ జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ వ్యూహకర్త వీకే విజయ్‌కుమార్ తెలిపారు. -
మారటోరియంతో మీకేంటి లాభం...?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మరో మూడు నెలల పాటు మారటోరియంను పొడిగించింది. శుక్రవారం ఉదయం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..లోన్ ఈఎంఐలపై మరో మూడు నెలలు అంటే ఆగస్టు 31 వరకు మారటోరియాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. లాక్ డౌన్ కారణంగా మార్చి1వ తేదీ నుంచి మే 31 వరకు మారటోరియం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పొడిగించిన తాజా మారటోరియంతో మొత్తం లోన్ల ఈఎంఐలపై ఆరు నెలలపాటు మారటోరియం లభించింది. దీనిప్రకారం టర్మ్‌లోన్లపై ఈఎంఐ (వాయిదాలు) కట్టాల్సిన వారు ఆగస్టు 31 వరకు ఈఎంఐలు చెల్లించనవసరం లేదు. తాజా మారటోరియంతో కార్‌లోన్స్, గృహ రుణాలు వంటివి తీసుకున్నవారికి కొంత వెసులుబాటు లభిస్తుంది. లాక్డౌన్ కారణంగా ఆదాయం కోల్పోయిన వారు ఈ మారటోరియం ఉపయోగించుకోవడం వల్ల ఆర్థిక ఒత్తిడి కొంతమేర తగ్గుతుంది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ క్రమ పద్ధతిలో వాయిదా చెల్లించాల్సిందే. ఒక వేళ ఏదైనా కారణంతో వాయిదా చెల్లింపు జరగకపోతే సదరు ఖాతాదారుపై బ్యాంక్‌లు,రుణదాతలు చర్యలు చేపడతాయి. అంతేగాక ఖాతాదారు, క్రెడిట్ స్కోరు దెబ్బతింటుంది. దీంతో భవిష్యత్తులో బ్యాంకులు అందించే రుణసదుపాయాలు పొందలేరు. అందువల్ల మారటోరియం ఇటువంటి వారికి ఎంతో ఉపకరిస్తుంది. ఇటువంటి వారు మారటోరియం తీసుకుంటే పై సమస్యలేవీ ఎదుర్కొనే అవసరం ఉండదు. బుల్లెట్ రిపేమెంట్స్, ఈక్వెటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్, క్రెడిట్ కార్డ్ డ్యూలు వంటి వాటిపై తాజాగా పొడిగించిన మారటోరియం తీసుకోవచ్చు. వడ్డీమాత్రం తప్పదు.. మారటోరియంలో ఈఎంఐలు చెల్లించకపోయినప్పుడు ఆ నెల ఈఎంఐలో కట్టాల్సిన వడ్డీ మాత్రం తరువాతి నెలలో మొత్తం రుణంపై పడుతుంది. అంటే మనం మారటోరియం తీసుకున్న సదరు నెలల్లో ప్రతినెలా ప్రిన్స్‌పల్ మొత్తంపై వడ్డీ పడుతుంది.తద్వారా మారటోరియం కాలపరిమితి ముగిసాక చెల్లించే ఈఎంఐలో ఈ వడ్డీ అదనంగా చేరుతుంది. అందువల్ల అత్యవసరమైతే తప్ప, మారటోరియం తీసుకోవాలేగానీ, నగదు ఉన్న వారు, ఆర్థిక ఇబ్బందులు లేనివారు ఈఎంఐలు చెల్లించడమే మంచిదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ వెసులుబాటులేని వారు మారటోరియం తీసుకుని క్రెడిట్,సిబిల్ స్కోరులను కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. -
మరో మూడునెలలు మారటోరియం?
సాక్షి, ముంబై: ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగించడంతో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరోసారి కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. తాజా నివేదికల ప్రకారం రుణాలు చెల్లింపుపై ఇప్పటికే కల్పించిన మారటోరియంను మరోసారి పొడిగించనుంది. లాక్డౌన్ పొడగింపు నేపథ్యంలో రుణాల ఈఎంఐల చెల్లింపులపై తాత్కాలిక నిషేధాన్ని మరో మూడు నెలలు పొడిగించే అవకాశం ఉందని ఎస్బీఐ పరిశోధన నివేదిక తెలిపింది. కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆర్థిక కలాపాలు నిలిచిపోయాయి. చిన్నా, పెద్ద పరిశ్రమలు మూత పడ్డాయి. దీంతో అన్ని రకాల రుణాల చెల్లింపుపై ఆర్బీఐ ఊరటనిచ్చింది. మార్చి 1, 2020 , మే 31, 2020 మధ్య చెల్లించాల్సిన బకాయిలపై మూడు నెలల తాత్కాలిక నిషేధాన్ని అనుమతించింది. దీని ప్రకారం 2020 ఆగస్టు 31 వరకు కంపెనీలు చెల్లించనవసరం లేదు. అయితే తాజాగా లాక్డౌన్ మే 31 వరకు పొడిగించడంతో ఈ వెసులుబాటును మరో మూడు నెలలు పొడిగించాలని భావిస్తోంది. రుణ గ్రహీతలకు తక్షణమే తగు ఆదాయాలు వచ్చే అవకాశం లేకపోవడంతో గడువు లోపల (సెప్టెంబరులో) ఆయా కంపెనీలు చెల్లించాల్సినవి వడ్డీతో కలిపి చెల్లించే అవకాశాలు చాలా తక్కువగా వుంటాయని ఎస్బీఐ పరిశోధన అంచనా వేసింది.. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న రుణాల సమగ్ర పునర్నిర్మాణం, రీ క్లాసిఫికేషన్ కోసం బ్యాంకులకు 90 రోజుల గడువు ఇవ్వాల్సిన అవసరం ఉందని నివేదిక తెలిపింది. అయితే వడ్డీతో కలిపి లోన్లను తిరిగి చెల్లించడంలో విఫలమైతే, నిబంధనల ప్రకారం అలాంటి వారి ఖాతాను నిరర్ధక రుణాలుగా వర్గీకరించవచ్చు. వర్కింగ్ క్యాపిటల్ విస్తరణను కోవిడ్-19 అప్పుగా పరిగణిస్తుందో లేదో కూడా ఆర్బీఐ స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. దీనిపై ఆర్బీఐ అధికారికంగా ప్రకటించాల్సి వుంది. (వాళ్లను అలా వదిలేయడం సిగ్గు చేటు - కిరణ్ మజుందార్ షా) కరోనా వైరస్ మహమ్మారి కట్టడిగా గాను ముందుగా జనతా కర్ఫ్యూను , అనంతరం 21 రోజుల లాక్‌డౌన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. అయితే వైరస్ తగ్గుముఖం పట్టకపోడంతో దీన్ని మే 3 వరకు ఆ తర్వాత మళ్ళీ మే 17 వరకు పొడిగించింది. కేంద్రం తాజాగా లాక్డౌన్ 4.0ను మే 31వరకు పొడిగించిన విషయం తెలిసిందే. (శాశ్వతంగా ఇంటినుంచేనా? నో...వే..) -
తగ్గిపెరిగిన ఎస్బీఐ ‘రేటు’
ముంబై: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రెపో రేటు (బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4.4 శాతం) ఆధారిత గృహ రుణ రేటును 30 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచింది. కోవిడ్–19 నేపథ్యంలో రుణ గ్రహీతల నుంచీ, రియల్టీ సంస్థల నుంచీ క్రెడిట్ రిస్క్ (రుణ బకాయిల చెల్లింపుల సామర్థ్యంలో ఇబ్బంది) పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల నుంచి వస్తున్న విశ్లేషణలు ఎస్బీఐ తాజా నిర్ణయానికి నేపథ్యమని సంబంధిత ఉన్నత స్థాయి అధికారి ఒకరు తెలిపారు. ఆస్తిని తనఖా పెట్టుకుని ఇచ్చే వ్యక్తిగత రుణాలపై సైతం వడ్డీరేట్లను 30 బేసిస్ పాయింట్లమేర ఎస్బీఐ పెంచింది. మే 1వ తేదీ నుంచీ తాజా రేట్లు అమల్లోకి వస్తాయని బ్యాంక్ తెలిపింది. ఎస్బీఐ తాజా నిర్ణయం బాటలో మిగిలిన బ్యాంకులూ నడిచే అవకాశం ఉంది. గృహ రుణాల్లో భారీ మొత్తం అటు రెపో రేటుకో లేక ఎంసీఎల్ఆర్కో అనుసంధానమై ఉంటాయి. మరోపక్క, బెంచ్‌మార్క్ రుణ రేటు–ఎంసీఎల్ఆర్ను స్వల్పంగా 0.15% (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గించింది. ప్రస్తుతం 7.40% ఉంటే దీనిని 7.25%కి తగ్గించింది. మే 10వ తేదీ నుంచీ తాజా నిర్ణయం అమల్లోకి వస్తుంది. దీనిప్రకారం– ఒక వ్యక్తి 30 ఏళ్లలో తీర్చే విధంగా రూ.25 లక్షల గృహ రుణం తీసుకుంటే (ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన వడ్డీ రేటుకు) అతనికి నెలవారీ వాయిదా చెల్లింపులపై దాదాపు రూ.255 భారం తగ్గుతుంది. వృద్ధులకు ఊరట: రిటైల్ టర్మ్ డిపాజిట్ విభాగంలో సీనియర్ సిటిజన్లకోసం ‘ఎస్బీఐ వియ్‌కేర్ డిపాజిట్’ పథకం ఒకటి ప్రారంభమైంది. ఇటీవలి కాలంలో వడ్డీరేట్లు భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో వృద్ధులకు ఊరటనిచ్చే నిర్ణయం ఇది. ఐదేళ్లు, ఆపైన కాలపరిమితికి సీనియర్ సిటిజన్లు చేసే డిపాజిట్లకు మామూలుగా వచ్చే వడ్డీకన్నా 30 బేసిస్ పాయింట్ల అదనపు ప్రీమియం వడ్డీ చెల్లించడమే ఈ కొత్త ప్రొడక్ట్ ప్రత్యేకత. అయితే ఈ స్కీమ్ సెప్టెంబర్ 30వరకూ మాత్రమే అమల్లో ఉంటుంది. ఇప్పటికే మామూలుగా వచ్చే డిపాజిట్లరేటుకన్నా సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్ల వడ్డీరేటు అదనంగా అందుతుంది. తాజా నిర్ణయం ప్రకారం... ఐదుళ్లు, ఆపైన కాలపరిమితికి డిపాజిట్ చేస్తే 80 బేసిస్ పాయింట్ల వడ్డీరేటు (50 బేసిస్ పాయింట్లకు 30 బేసిస్ పాయింట్లు ప్రీమియం) అందుతుంది. మూడేళ్లలోపు రేటు తగ్గింపు: మరోపక్క, మూడేళ్ల కాలపరిమితిలోపు రిటైల్ డిపాజిట్లపై వడ్డీరేట్లను 20 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ఎస్బీఐ పేర్కొంది. మే 12వ తేదీ నుంచీ తాజా నిర్ణయం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఎన్బీఎఫ్సీలకూ ‘రుణ మారటోరియం’ వర్తింపు కోల్‌కతా: కరోనా కష్టాల నేపథ్యంలో రుణ బకాయిల చెల్లింపులపై మే 31వ తేదీ వరకూ మూడు నెలల పాటు విధించిన ‘మరటోరియం’ను ఎన్బీఎఫ్సీ (నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు)లకూ వర్తింపజేయాలని ఎస్బీఐ గురువారం నిర్ణయించింది. కరోనా కష్టాల్లో ఉన్న రుణ గ్రహీతలకు ఊరటనిచ్చేలా ‘బకాయిల చెల్లింపులపై’ 3 నెలలు(మార్చి–ఏప్రిల్–మే) మారటోరియం విధించడానికి ఆర్బీఐ బ్యాంకింగ్‌కు అనుమతి నిచ్చింది. అయితే ఈ మారటోరియంను ఎన్బీ ఎఫ్‌సీలకు వర్తింపజేసేలా ఆర్బీఐ అనుమతి నివ్వడంతో ఎస్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. ఇదే బాటలో మరికొన్ని బ్యాంకులూ నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ నిర్ణయం వల్ల ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) విషయంలో పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఎన్‌బీఎఫ్‌సీలకు ఊరట కలుగుతుంది. దీనితోపాటు 3 నెలల మారటోరియం ప్రయోజనాన్ని ఎన్‌బీఎఫ్‌సీలూ తమ కస్టమర్లకు అందించగలుగుతాయి. మేతో ముగియనున్న మూడు నెలల మారటోరియం మరో మూడు నెలలు పొడిగించవచ్చంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎస్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. -
‘వాయిదా’ మరో 3 నెలలు పొడిగింపు?
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడి కోసం లాక్‌డౌన్‌ను మరింతగా పొడిగించిన నేపథ్యంలో రుణాల వాయిదాలపై విధించిన మారటోరియంను కూడా మరో 3 నెలలు పొడిగించే అవకాశం రిజర్వ్ బ్యాంక్ పరిశీలనలో ఉంది. లాక్డౌన్ కొనసాగింపు కారణంగా ఇటు వ్యక్తులు, అటు సంస్థలకు ఆదాయాలొచ్చే మార్గాలు లేనందున మారటోరియంను పొడిగించాలంటూ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సహా వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను ఆర్బీఐ పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. లాక్డౌన్ నేపథ్యంలో మూడు నెలల పాటు వాయిదాల చెల్లింపులపై మారటోరియం విధిస్తూ మార్చి 27న ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీని గడువు మే 31తో ముగిసిపోనుంది. అయితే, లాక్డౌన్ పొడిగించడం, ఎత్తివేత తర్వాత కూడా రుణ గ్రహీతలకు తక్షణమే తగు ఆదాయాలు వచ్చే అవకాశం లేకపోవడం వంటి అంశాల కారణంగా మారటోరియంను పొడిగించడమే శ్రేయస్కరమని ప్రభుత్వ రంగ బ్యాంకు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కష్టకాలంలో ఇటు రుణగ్రహీతలకు, అటు బ్యాంకులకు ఇది ఊరటనివ్వగలదని పేర్కొన్నారు. -
మారటోరియం పక్కాగా అమలయ్యేలా చూడండి
న్యూఢిల్లీ: రుణాల వాయిదా చెల్లింపునకు సంబంధించి విధించిన మారటోరియం పక్కాగా అమలయ్యేలా చూడాలని రిజర్వ్ బ్యాంక్‌కు సుప్రీం కోర్టు సూచించింది. ఈఎంఐలను కొంతకాలం వాయిదా వేసుకునే వెసులుబాటును ఆర్బీఐ ఇచ్చినప్పటికీ.. రుణగ్రహీతలకు బ్యాంకులు ఆ ప్రయోజనాన్ని పూర్తిగా అందిస్తున్నట్లు కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలోనే మారటోరియంనకు సంబంధించిన మార్చి 27నాటి ఆదేశాలు సరిగ్గా అమలయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ అంశంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. కరోనా వైరస్‌పరమైన కష్టకాలంలో వాయిదాలు చెల్లించేందుకు ఆర్బీఐ మూడు నెలల పాటు మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. -
అన్ని ఇమిగ్రేషన్ వీసాలపై తాత్కాలిక నిషేధం
వాషింగ్టన్: అమెరికాలోకి అన్ని రకాల వలసలపై తాత్కాలికంగా నిషేధం విధించే అధికారిక ఉత్తర్వులపై త్వరలో సంతకం చేయనున్నట్లు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అదృశ్య శత్రువైన కరోనా వైరస్ దాడి నుంచి దేశ ప్రజలను కాపాడేందుకు, అమెరికన్ల ఉద్యోగాలకు భద్రత కల్పించేందుకు ఆ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం రాత్రి ట్వీట్ చేశారు. ట్రంప్ తాజా నిర్ణయంపై పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. కరోనాను అదుపు చేయడంలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ఉద్దేశంతోనే ట్రంప్ ఆ నిర్ణయం తీసుకున్నారని డెమొక్రాటిక్ పార్టీకి చెందిన భారతీయ అమెరికన్ సెనేటర్ కమల హారిస్ సహా పలువురు నేతలు విమర్శించారు. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యతను పక్కనబెట్టి, దేశానికి వలసదారులు అందిస్తున్న సేవలను విస్మరించి, ఈ విషయాన్ని ట్రంప్ రాజకీయం చేస్తున్నారని నేషనల్ ఇమిగ్రేషన్ ఫోరం డైరెక్టర్ అలీ నూరానీ ఆరోపించారు. హెచ్1బీ పైనా ప్రభావం ట్రంప్ సంతకం చేయనున్న ఉత్తర్వుల్లో ఏం ఉండబోతోందన్నది, ఆ ఉత్తర్వులపై ఆయన ఎప్పుడు సంతకం చేయనున్నారన్నది ఇంకా స్పష్టం కాలేదు. ఇమిగ్రేషన్ వీసాలపైననే తాత్కాలిక నిషేధం విధించబోతున్నట్లు ట్రంప్ ట్వీట్ చేసినప్పటికీ.. అమెరికన్ల ఉద్యోగ భద్రతపై కూడా ఆ ట్వీట్లో ప్రస్తావించినందువల్ల నాన్– ఇమిగ్రంట్ వీసా అయిన హెచ్1బీ పైనా ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే జరిగితే.. విదేశీయులపై ముఖ్యంగా భారతీయులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. గత అధ్యక్ష ఎన్నికల సమయం నుంచి యూఎస్ ఇమిగ్రేషన్ వ్యవస్థను ట్రంప్ లక్ష్యంగా చేసుకున్నారు. ఆ తరువాత కూడా పలు సందర్భాల్లో వీసా విధానాన్ని మార్చాలన్న తన ఆలోచనను ఆయన వెల్లడించారు. నిపుణులైన విదేశీయులకే అమెరికా స్వాగతం పలుకుతుందని స్పష్టం చేశారు. ఇమిగ్రేషన్ వీసాల నిషేధంపై కూడా ఆయన చాన్నాళ్లుగా ఆలోచిస్తున్నట్లు ఒక ఉన్నతాధికారి ఎన్బీసీ న్యూస్‌కు వెల్లడించారు. నిషేధ ప్రణాళిక, ఏయే దేశాలపై ప్రభావం చూపనుందనేది త్వరలో తెలుస్తుందన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అమెరికా ఇప్పటికే యూరోప్, చైనా, కెనడా, మెక్సికోల నుంచి విదేశీయులెవరూ దేశంలోకి రాకుండా నిషేధం విధించింది. అన్ని వీసా సేవలను నిలిపేసింది. కరోనా కారణంగా అమెరికా ఆర్థికంగా భారీగా దెబ్బ తిన్నది. ఇప్పటికే 2.2 కోట్ల మంది అమెరికన్లు నిరుద్యోగ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. -
రుణాల మారటోరియం మోసాలతో జాగ్రత్త
న్యూఢిల్లీ: రుణాల నెలవారీ వాయిదాల చెల్లింపుల (ఈఎంఐ)పై మారటోరియం అమలు నేపథ్యంలో మోసగాళ్ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఖాతాదారులను బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి. ఈఎంఐ మారటోరియం మోసాల గురించి అవగాహన పెంచుతున్నాయి. కీలకమైన ఓటీపీ, పిన్ నంబర్ల వివరాలను ఎవరికీ ఇవ్వొద్దని సూచిస్తున్నాయి. ఖాతాల వివరాలను చోరీ చేసేందుకు సైబర్ క్రిమినల్స్, మోసగాళ్లు అనుసరిస్తున్న కొంగొత్త విధానాల గురించి అవగాహన కల్పించే దిశగా యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర బ్యాంకులు గత కొద్ది రోజులుగా ఖాతాదారులకు ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ పంపిస్తున్నాయి. ఈఎంఐల మారటోరియంపై సహకరిస్తామనే పేరుతో మోసగాళ్లు .. ఓటీపీ, సీవీవీ, పాస్వర్డ్ లేదా పిన్ నంబర్ల వివరాలను ఇవ్వాలంటూ ఫోన్లు చేసే అవకాశాలు ఉన్నాయని బ్యాంకులు తెలిపాయి. ఇలాంటి విషయాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. అటు కరోనా వైరస్ బాధితులకు తోడ్పాటు అందించేందుకు ఉద్దేశించి ప్రధాని ప్రారంభించిన పీఎం–కేర్స్ నిధికి చందాల సేకరణ పేరుతో కూడా మోసాలు జరుగుతున్నాయని, వీటి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నాయి. ఎన్బీఎఫ్సీలకూ మారటోరియం... రుణాలపై మూడు నెలల మారటోరియం వెసులుబాటును నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలకు (ఎన్బీఎఫ్సీ) కూడా వర్తింపచేయాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) పరిధిలోని బ్యాంకులు యోచిస్తున్నాయి. తద్వారా కరోనా వైరస్ సంక్షోభం నుంచి అవి గట్టెక్కేందుకు తోడ్పాటు అందించాలని భావిస్తున్నాయి. తాము కూడా రుణగ్రహీతల కోవలోకే వస్తాం కాబట్టి తమకు కూడా మారటోరియం ఇవ్వాలంటూ ఎన్బీఎఫ్సీలు డిమాండ్ చేస్తున్నాయి. వివిధ వర్గాలకు రుణాలు ఇచ్చే ఎన్బీఎఫ్సీలు ప్రధానంగా నిధుల కోసం బ్యాంకులపైనే ఆధారపడుతుంటాయి. డిజిటల్ చెల్లింపులపై ప్రచారం... కరోనా వైరస్ కల్లోలాన్ని కట్టడి చేయడానికి కేంద్రం విధించిన లాక్డౌన్ సమయంలో డిజిటల్ చెల్లింపులను అనుసరించాలని ప్రజలను ఆర్బీఐ కోరింది. ఈ మేరకు అమితాబ్ బచ్చన్‌తో ట్విట్టర్ ప్రచారాన్ని ఆర్బీఐ ప్రారంభించింది. కరోనా వైరస్ విస్తరణకు అడ్డుకట్ట వేయడానికి సామాజిక దూరం పాటించడం సరైన చర్య అని ఆర్బీఐ తెలిపింది. -
కావాలంటే.. మీరే చెప్పండి
న్యూఢిల్లీ: రుణాలపై నెలవారీ వాయిదాలపై (ఈఎంఐ) మారటోరియం కావాలనుకునే రుణగ్రహీతలు .. వారంతట వారు కోరితేనే అమలు చేయాలని ప్రైవేట్ రంగ బ్యాంకులు భావిస్తున్నాయి. ఇందుకోసం ఆప్ట్–ఇన్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టాయి. ‘మూడు నెలల మారటోరియం వద్దనుకుంటే మీరు ఏమీ చేయనక్కర్లేదు. మీరిచ్చిన రీపేమెంట్ సూచనల మేరకు చెల్లింపులు యథావిధిగా జరిగిపోతాయి. కానీ, మారటోరియం కావాలనుకుంటే తెలియజేయండి‘ అంటూ ప్రైవేట్ రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తమ వెబ్సైట్లో రుణగ్రహీతలను ఉద్దేశించి పోస్ట్ పెట్టింది. మరోవైపు మారటోరియం కావాలనుకునే వారు (ఆప్టింగ్ ఇన్) నిర్దిష్ట ఈమెయిల్ ఐడీకి మెయిల్ పంపించాలంటూ కోటక్ మహీంద్రా బ్యాంక్ తమ కస్టమర్లకు సూచించింది. అటు రెండో అతి పెద్ద బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ దీన్ని కాస్త భిన్నంగా అమలు చేస్తోంది. వేతన జీవులకు సాధారణంగానే ఆప్ట్–ఇన్ ఆప్షన్‌ను, ఆదాయాలు గణనీయంగా దెబ్బతిన్న ట్రేడర్లు, చిన్న స్థాయి రుణగ్రహీతలకు ఆప్ట్–అవుట్ ఆప్షన్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. స్వయం సహాయక గ్రూపులు, ఆభరణాలపై రుణాలు .. అన్సెక్యూర్డ్ వ్యాపార రుణాలు .. ఓవర్‌డ్రాఫ్ట్‌లు తీసుకున్నవారు, క్రెడిట్ కార్డుహోల్డర్లు మొదలైనవారు ఆప్ట్–అవుట్ కేటగిరీలోకి వస్తారు. వీరు ఒకవేళ చెల్లింపులు కొనసాగించదల్చుకున్న పక్షంలో బ్యాంకుకు తెలియజేయాల్సి ఉంటుంది. మిగతా టర్మ్ లోన్లు తీసుకున్న వారు ఆప్ట్–ఇన్ కేటగిరీలోకి వస్తారు. ఇక, యాక్సిస్ బ్యాంక్.. తామింకా స్కీమ్ అమలుపై కసరత్తు చేస్తున్నామని, ఇది పూర్తయ్యాక కస్టమర్లకు తెలియజేస్తామని వెల్లడించింది. డబ్బుంటే కట్టేయండి.. చేతిలో నగదు ఉన్న కస్టమర్లు వీలైనంత వరకూ ఈఎంఐల చెల్లింపులు కొనసాగించేందుకే ప్రాధాన్యమివ్వాలంటూ హెచ్డీఎఫ్సీ బ్యాంకు సూచించింది. తద్వారా అదనపు వడ్డీ భారాన్ని, రుణ కాలవ్యవధి పొడిగింపునకు సమస్య ఉండదని పేర్కొంది. పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు చాలా మటుకు ఆప్ట్–అవుట్ ఆప్షన్నే అమలు చేస్తున్నాయి. చెల్లింపులు కొనసాగిస్తానని కస్టమర్లు ప్రత్యేకంగా తెలియజేస్తే తప్ప.. ఆటోమేటిక్‌గా మారటోరియం వర్తింపచేస్తున్నాయి. కరోనా సంబంధించిన లాక్‌డౌన్‌తో ప్రజల ఆదాయాలు గణనీయంగా దెబ్బతినే అవకాశం ఉండటంతో రుణాల ఈఎంఐల చెల్లింపులపై కొంత వెసులుబాటు కల్పిస్తూ రిజర్వ్ బ్యాంక్ మారటోరియం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం కట్టాల్సిన ఈఎంఐలను మూడు నెలల పాటు వాయిదా వేసుకోవచ్చు. ఐబీఏ వివరణ... అటు బ్యాంకుల అసోసియేషన్ (ఐబీఏ) కూడా మారటోరియం ప్రభావాల గురించి వివరించింది. ‘మీ ఆదాయాలు దెబ్బతిన్న పక్షంలో ఆర్బీఐ ప్యాకేజీతో ప్రయోజనం పొందవచ్చు. అయితే, ఆయా రుణాలపై వడ్డీ భారం ఉంటుంది. దీన్ని అప్పటికప్పుడు కట్టాల్సిన అవసరం లేకపోయినా.. అదనపు భారం పడుతుందని గుర్తుంచుకోవాలి‘ అని పేర్కొంది. అటు క్రెడిట్ కార్డు బాకీల గురించి కూడా వివరణ ఇచ్చింది. సాధారణంగా మినిమం అమౌంట్ కూడా కట్టకపోతే క్రెడిట్ బ్యూరోలకు బ్యాంకులు తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే, ఆర్బీఐ సర్క్యులర్ కారణంగా మూడు నెలల పాటు వెసులుబాటు ఉంటుందని వివరించింది. కానీ బాకీలపై భారీగా వడ్డీ ఉంటుందని హెచ్చరించింది. వడ్డీల వాయింపు... ఆర్బీఐ ప్రకటించిన మూడు నెలల మారటోరియం స్కీము.. పైకి కనిపించినంత ప్రయోజనకరమేమీ కాదని విశ్లేషకులు చెబుతున్నారు. తాత్కాలికంగా చెల్లింపుల నుంచి ఉపశమనం లభించినా.. ఆ తర్వాత అంతకు మించి చెల్లించుకోవాల్సి వస్తుందని, మరింత భారం తప్పదని పేర్కొన్నారు. దీంతో కరోనా దెబ్బకు ఆదాయాలు కోల్పోయిన వారు .. మారటోరియం ఎంచుకుంటే మరింత కాలం రుణాల భారం మోయాల్సి రానుంది. మారటోరియం వ్యవధిలో మిగతా బాకీపై వడ్డీల వడ్డన కొనసాగుతుందని ఖాతాదారులకు ప్రభుత్వ రంగ ఎస్బీఐ తెలియజేసింది. సోదాహరణంగా వివరించింది. ఉదాహరణకు రూ. 30 లక్షల గృహ రుణం చెల్లించడానికి మరో 15 ఏళ్ల వ్యవధి ఉందనుకుందాం. మూడు నెలల మారటోరియం తీసుకుంటే.. నికరంగా అదనంగా మరో రూ. 2.34 లక్షలు వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఇది సుమారు 8 నెలల ఈఎంఐలకు సమానం. అలాగే, రూ. 6 లక్షల వాహనం రుణం రీపేమెంట్‌కు 54 నెలలు మిగిలి ఉందనుకుందాం. దీనిపై అదనంగా రూ.19,000 అదనపు వడ్డీ భారం పడుతుంది. ఇది అదనంగా 1.5 ఈఎంఐకు సమానం. -
క్రెడిట్ కార్డు బకాయిలు కూడా కట్టక్కర్లేదా?
సాక్షి, ముంబై : కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 1.7లక్షల కోట్ల రూపాయల రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించిన మరుసటి రోజే (శుక్రవారం) కేంద్రం బ్యాంకు ఆర్బీఐ కీలక నిర్ణయాలను ప్రకటించింది. కీలక వడ్డీ రేట్లపై ముందస్తు కోతను విధించడంతోపాటు లాక్డౌన్ కష్టాల నుంచి బయటపడేందుకు రుణాలపై భారీ ఊరటనిచ్చింది. అన్ని రకాల రుణాలపై మూడు నెలల పాటు మారటోరియం విధించింది. దీని ప్రకారం గృహ, ఇతర రుణాలను తీసుకున్న వినియోగదారులకు ఈఎంఐ చెల్లింపుల నుంచి మూడు నెలల మినహాయింపునిచ్చింది. అంతేకాదు సదరు ఖాతాలను ఎన్పీఏలుగా పరిగణించరాదని కూడా ఆయా బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలకు ఆదేశాలిచ్చింది. సాధారణంగా రుణగ్రహీతలు 90 రోజులకు పైగా చెల్లింపులను చేయకపోతే బ్యాంక్ ఆ ఖాతాను ఎన్పీఏగా పరిగణిస్తాయి. (రుణ గ్రహీతలకు భారీ ఊరట) అయితే తాజా ఆర్బీఐ నిర్ణయం వెలువడిన తరువాత పలువురు వినియోగదారుల్లో క్రెడిట్ కార్డు రుణాల పరిస్థితిపై అనేక సందేహాలు వెల్లువెత్తాయి. దీనిపై ఆర్బీఐ వివరణ ఇచ్చింది. క్రెడిట్ కార్డు రుణాలు, లేదా బకాయిలకు కూడా మూడు నెలల మారటోరియం వర్తిస్తుందని స్పష్టం చేసింది. గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, విద్యా రుణాలు లాంటివి మాత్రమే టర్మ్ లోన్స్ పరిధిలోకి వస్తాయని చెప్పింది. (వచ్చే 3నెలలు ఈఎంఐలు కట్టకపోయినా ఫర్వాలేదు) మరోవైపు ఆర్బీఐ తాజా నిర్ణయంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆమె ట్విటర్ ద్వారా తన అభిప్రాయాన్ని షేర్ చేశారు. ఆర్బీఐ కల్పించిన వెసులుబాట్లపై అటు మార్కెట్ వర్గాలు, ఇటు విశ్లేషకులు కూడా సంతోషాన్ని ప్రకటించారు. Appreciate @RBI @DasShaktikanta’s reassuring words on financial stability. The 3 month moratorium on payments of term loan instalments (EMI) & interest on working capital give much-desired relief. Slashed interest rate needs quick transmission. #IndiaFightsCoronavirus — Nirmala Sitharaman (@nsitharaman) March 27, 2020 -
సంక్షోభాన్ని అధిగమించేందుకు ఆర్థిక చేయూత కావాలి...
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ ప్రభావాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం చేయూతనివ్వాలని దేశీయ పరిశ్రమలు కేంద్రాన్ని కోరాయి. రుణ చెల్లింపులపై మారటోరియం విధించడం, పన్నుల తగ్గింపు, ప్రజలకు రూ.2లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపనలు అందించాలని సూచించాయి. మన దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా వైరస్ రాకముందే మందగమనంలో ఉంది. గత డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు ఏడేళ్ల కనిష్ట స్థాయి 4.7 శాతానికి పడిపోయింది. తాజాగా కరోనా వైరస్‌తో దేశవ్యాప్తంగా అన్నీ మూతేయాల్సి వస్తుండడంతో ఆర్థిక వృద్ధి మరింత పడిపోయే ప్రమాదం ఉంది. విధానపరమైన చర్యలను ప్రభుత్వం వెంటనే అమల్లోకి తీసుకురాకపోతే 2020–21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 5 శాతం లోపునకు పడిపోవచ్చంటూ దేశీయ పరిశ్రమలు ఆందోళన వ్యక్తం చేశాయి. ద్రవ్య, పరపతి పరమైన ఉద్దీపన చర్యలను తక్షణమే ప్రకటించాలని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ కోరారు. దేశ జీడీపీలో ఒక శాతానికి సమానమైన రూ.2 లక్షల కోట్లను పేదలకు ఆధార్ ఆధారిత ప్రత్యక్ష నగదు బదిలీ రూపంలో అందించాలని సీఐఐ కోరింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది. స్టాక్ మార్కెట్లలో అస్థిరతలను తగ్గించేందుకు దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును తొలగించడాన్ని పరిశీలించాలని.. అలాగే, డివిడెండ్ పంపిణీ పన్నును 25 శాతంగా నిర్ణయించాలని కోరింది. రెపో రేటును 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించడంతోపాటు, వసూలు కాని రుణాలను ఎన్పీఏలుగా గుర్తించడానికి ప్రస్తుతమున్న 90 రోజుల గడువును తాత్కాలికంగా అయినా 180 రోజులకు పెంచాలని సీఐఐ సూచనలు చేసింది. ఏడాది చివరి వరకు విరామం.. కార్పొరేట్ కంపెనీలు, వ్యక్తులకు రుణ చెల్లింపులపై ఈ ఏడాది చివరి వరకు మారటోరియం (విరామం) ప్రకటించాలని అసోచామ్ కోరింది. ఎల్ఐసీ ద్వారా వెంటనే ఎన్‌బీఎఫ్‌సీలకు నిధులను అందించాలని సూచించింది. మన దేశంపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న అసోచామ్.. దురదృష్టవశాత్తూ దేశ రుణ మార్కెట్ బలహీనంగా ఉన్న, ఆర్థిక వ్యవస్థ మందగమనం సమయంలో ఈ సంక్షోభం వచ్చిందని వ్యాఖ్యానించింది. -
యస్ బ్యాంక్‌కు ఆర్బీఐ 60 వేల కోట్లు
న్యూఢిల్లీ: మారటోరియంపరమైన ఆంక్షలు తొలగి, పూర్తి స్థాయి సర్వీసులు ప్రారంభించిన యస్ బ్యాంక్‌కు అత్యవసరంగా నిధులు అవసరమైన పక్షంలో తోడ్పాటునిచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ చర్యలు తీసుకుంది. సుమారు రూ. 59,000 కోట్ల మేర రుణ సదుపాయం అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. డిపాజిట్‌దారులకు చెల్లింపులు జరపడంలో సమస్యలు తలెత్తకుండా యస్ బ్యాంక్‌కు ఇది తోడ్పడుతుంది. అయితే, దీనిపై యస్ బ్యాంక్ సాధారణంగా కంటే ఎక్కువ వడ్డీ రేటు చెల్లించాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2004లో గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు కూడా ఆర్బీఐ ఇదే తరహా రుణ సదుపాయం కల్పించింది. అటుపై 16 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలాంటి చర్య తీసుకోవడం ఇదే ప్రథమం. అప్పట్లో గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకును ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లో విలీనం చేశారు. గడిచిన కొన్నాళ్లుగా విత్‌డ్రాయల్స్ కన్నా డిపాజిట్లే అధికంగా ఉన్నాయని, యస్ బ్యాంక్ ఇప్పటిదాకానైతే రుణ సదుపాయం వినియోగించుకోలేదని .. అసలు ఆ అవసరం కూడా రాకపోవచ్చని ఆర్బీఐ వర్గాలు తెలిపాయి. మరోవైపు, ఖాతాదారుల సొమ్ము భద్రంగానే ఉందని యస్ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్ ప్రశాంత్ కుమార్ మరోసారి భరోసానిచ్చారు. బ్యాంకు వద్ద తగినన్ని నిధులు ఉన్నాయని, బైటి వనరులపై ఆధారపడాల్సిన అవసరం లేదని తెలిపారు. రుణ వితరణలో లొసుగులు, మొండిబాకీలు, నిధుల కొరతతో సంక్షోభంలో చిక్కుకున్న యస్ బ్యాంక్‌పై మార్చి 5న ఆర్బీఐ మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. ఎస్బీఐ సహా పలు బ్యాంకులు పెట్టుబడులు పెట్టడంతో బుధవారం నుంచి యస్ బ్యాంక్ కార్యకలాపాలు యధావిధిగా ప్రారంభమయ్యాయి. పూరి జగన్నాథుని డిపాజిట్లు ఎస్బీఐలోకి మళ్లింపు.. పూరి జగన్నాథస్వామి ఆలయానికి చెందిన రూ. 389 కోట్ల ఫిక్సిడ్ డిపాజిట్ ఖాతాను ఎస్బీఐకి బదలాయించినట్లు యస్ బ్యాంక్ తెలిపింది. ఈ ఎఫ్డీపై రూ. 8.23 కోట్ల మేర వడ్డీ జమైనట్లు వివరించింది. మరో రూ. 156 కోట్ల రెండు ఎఫ్డీలను ఈ నెలాఖరులోగా బదలాయించనున్నట్లు శ్రీ జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ కృష్ణన్ కుమార్‌కు యస్ బ్యాంక్ లేఖ రాసింది. ఈడీ విచారణకు అనిల్ అంబానీ.. యస్ బ్యాంక్ ప్రమోటర్ రాణా కపూర్ తదితరులపై మనీ ల్యాండరింగ్ కేసుకు సంబంధించి అడాగ్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. ఆయన్ను దాదాపు తొమ్మిది గంటలపాటు ప్రశ్నించినట్లు. ఈ నెల 30న మరోసారి హాజరు కావాలని సూచించినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. అంబానీ గ్రూప్‌నకు చెందిన తొమ్మిది కంపెనీలు యస్ బ్యాంక్ నుంచి రూ. 12,800 కోట్ల మేర రుణాలు తీసుకున్నాయి. బడా కార్పొరేట్లకు యస్ బ్యాంక్ ద్వారా రుణాలిప్పించినందుకు గాను రాణా కపూర్, ఆయన కుటుంబ సభ్యులు దాదాపు రూ. 4,300 కోట్ల పైగా ముడుపులు అందుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు, మార్చి 21న విచారణకు హాజరు కావాలంటూ ఎస్సెల్ గ్రూప్ చైర్మన్, రాజ్యసభ ఎంపీ సుభాష్ చంద్రకు ఈడీ తాజాగా మరోసారి సమన్లు జారీ చేసింది. -
యస్పై మారటోరియం ఎత్తివేత
ముంబై: ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ 13 రోజుల తర్వాత మారటోరియంపరమైన ఆంక్షల నుంచి బైటపడింది. బుధవారం సాయంత్రం 6 గం.ల నుంచి పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ సేవలను పునరుద్ధరించింది. గురువారం నుంచి మూడు రోజుల పాటు బ్యాంకింగ్ వేళలను కూడా పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీని ప్రకారం మార్చి 19 నుంచి 21 దాకా ఉదయం 8.30 గం.లకే శాఖలు తెరుచుకుంటాయి. సీనియర్ సిటిజన్ ఖాతాదారుల కోసం మార్చి 19 నుంచి 27 దాకా సాయంత్రం 4.30 గం.ల నుంచి 5.30 గం.ల దాకా సేవలు అందిస్తాయి. అయితే, సేవలు పునరుద్ధరించిన కాస్సేపటికే మొబైల్ యాప్ క్రాష్ కావడం, వెబ్సైట్ పనిచేయకపోవడంతో ఖాతాదారులు అసహనానికి లోనయ్యారు. సోషల్ మీడియాలో బ్యాŠంక్ను ట్యాగ్ చేస్తూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ సమస్యలిక పడలేమని, తాము డిపాజిట్లను మరో బ్యాంకుకు మార్చేసుకుంటామని సూచిస్తూ పలువురు పోస్ట్ చేశారు. దీంతో ఖాతాదారులకు కలిగిన అసౌకర్యానికి యస్ బ్యాంక్ క్షమాపణలు కోరింది. సమస్యను సత్వరం పరిష్కరిస్తున్నామని పేర్కొంది. మార్చి 5 నుంచి నెలరోజులపాటు యస్ బ్యాంక్‌పై ఆర్బీఐ మారటోరియం విధించడం, ఈ వ్యవధిలో రూ. 50,000కు దాటకుండా విత్డ్రాయల్స్పై ఆంక్షలు విధించడం తెలిసిందే. ఎస్బీఐ సహా ఇతరత్రా బ్యాంకులు.. యస్ బ్యాంక్‌లో ఇన్వెస్ట్ చేయడంతో మారటోరియం తొలగింది. మరోవైపు, యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌పై మనీ లాండరింగ్ కేసులో డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు మరోసారి విచారణకు గైర్హాజరయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి భయాలను ఇందుకు కారణంగా వారు చూపారు. ఇండస్ఇండ్ బ్యాంకు పటిష్టంగానే ఉంది బ్యాంకు యాజమాన్యం ప్రకటన న్యూఢిల్లీ: ఆర్థికంగా బలమైన స్థితిలో, తగినన్ని నిధులతో, లాభాలతో, బలమైన నిర్వహణతో నడుస్తున్నట్టు ఇండస్ఇండ్ బ్యాంకు ప్రకటించింది. యస్ బ్యాంకు సంక్షోభం అనంతరం ఇండస్ఇండ్ బ్యాంకు ఆర్థిక సామర్థ్యంపై పెద్ద స్థాయిలో మార్కెట్ వదంతులు, ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఈ వివరణ ఇచ్చింది. డిసెంబర్ త్రైమాసికం నాటికి బ్యాంకు స్థూల ఎన్పీఏలు 2.18%గా ఉన్నాయని, పెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో ఇది తక్కువగా ఉందని తెలిపింది. ‘‘క్రితం త్రైమాసికం స్థాయిలోనే స్థూల ఎన్పీఏలు ప్రస్తుత త్రైమాసికంలోనూ ఉండొచ్చు. అలాగే, క్రితం త్రైమాసికం నాటికి 1.05%ఉన్న నికర ఎన్పీఏలు ప్రస్తుత త్రైమాసికంలో 1%లోపునకు తగ్గనున్నాయి’’ అని బ్యాంకు తన ప్రకటనలో వివరించింది. ఫిబ్రవరి నాటికి వాణిజ్య, నివాస రియల్టీ, జెమ్స్, జ్యుయలరీ రంగాలకు ఎక్స్పోజర్ లేదని స్పష్టం చేసింది. -
‘యస్’పై 18న మారటోరియం ఎత్తివేత
న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ పునరుద్ధరణ ప్రణాళిక అమల్లోకి రావడంతో మార్చి 18న బ్యాంకుపై మారటోరియం తొలగిపోనుంది. ప్రస్తుతం ఆర్బీఐ నియమిత అడ్మినిస్ట్రేటరుగా ఉన్న ప్రశాంత్ కుమార్ ఆ తర్వాత సీఈవో, ఎండీగా బాధ్యతలు చేపడతారు. ఆయన సారథ్యంలో కొత్త బోర్డు ఏర్పాటవుతుంది. పునర్వ్యవస్థీకరించిన బోర్డులో సునీల్ మెహతా (పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాజీ నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్).. నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గాను, మహేష్ కృష్ణమూర్తి, అతుల్ భెడా నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఉంటారు. మార్చి 13 నుంచి యస్ బ్యాంక్ పునరుద్ధరణ స్కీమ్ 2020ని అమల్లోకి తెస్తూ జారీ చేసిన నోటిఫికేషన్లో ప్రభుత్వం ఈ అంశాలు పొందుపర్చింది. ‘ప్రణాళిక అమల్లోకి తెచ్చిన మూడో పని దినం సాయంత్రం 6 గం.లకు మారటోరియం తొలగిపోతుంది. ఆ పైన 7 రోజుల తర్వాత కొత్త బోర్డు ఏర్పాటవుతుంది’ అని నోటిఫికేషన్లో పేర్కొంది. ఏప్రిల్ 3 దాకా విత్‌డ్రాయల్స్‌ను రూ. 50,000కు పరిమితం చేస్తూ మార్చి 5న యస్ బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. ఎన్పీఏల ఒత్తిడి కొనసాగుతుంది.. మొండిబాకీలు తీవ్రం కావడంతో భారీనష్టాలు ప్రకటించిన యస్ బ్యాంక్ .. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ)పరమైన ఒత్తిడి కొనసాగుతుందని పేర్కొంది. అయితే, కొత్తగా వచ్చే రూ. 10,000 కోట్ల పెట్టుబడులతో బ్యాంక్ నిలదొక్కుకోగలదని, సమస్యలను అధిగమించగలదని ప్రశాంత్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. షేర్లకు మూడేళ్ల లాకిన్.. పునరుద్ధరణ ప్రణాళిక ప్రకారం.. యస్ బ్యాంక్‌లో 49 శాతం దాకా వాటాలు తీసుకునే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వచ్చే మూడేళ్లలో తన వాటాలను 26 శాతం లోపు తగ్గించుకోవడానికి వీల్లేదు. ఇతర ఇన్వెస్టర్లు, ప్రస్తుత షేర్‌హోల్డర్ల పెట్టుబడుల్లో 75 శాతం షేర్లకు మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. తమ దగ్గరున్న మొత్తం షేర్లలో 25 శాతానికి మించి విక్రయించుకోవడానికి వీలు ఉండదు. అయితే, 100 లోపు షేర్లు ఉన్న వారికి ఈ లాకిన్ పీరియడ్ వర్తించదు. నోటిఫికేషన్ ప్రకారం.. యస్ బ్యాంక్‌లో 49% వాటాలు తీసుకునే ఎస్బీఐ.. ఇద్దరు డైరెక్టర్లను నామినేట్ చేస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఒకరు లేదా అదనంగా మరింత మంది డైరెక్టర్లను నియమించవచ్చు. ఎస్బీఐ మినహా 15 శాతం వోటింగ్ హక్కులు ఉన్న ఇతర ఇన్వెస్టర్లు ఒక్కొక్క డైరెక్టరు చొప్పున యస్ బ్యాంక్ బోర్డుకు నామినేట్ చేయొచ్చు. పునరుదద్ధరణ ప్రణాళిక ప్రకారం.. యస్ బ్యాంక్ అధీకృత మూలధనం రూ. 6,200 కోట్లుగా ఉంటుంది. యస్ బ్యాంక్ ఉద్యోగులు గత జీతభత్యాలు, సర్వీస్ నిబంధనల ప్రకారమే కొనసాగుతారు. అయితే ‘మేనేజ్మెంట్లో కీలక ఉద్యోగుల’ సేవలను కొత్త బోర్డు ఎప్పుడైనా ఉపసంహరించవచ్చని నోటిఫికేషన్ పేర్కొంది. క్యూ3 నష్టాలు రూ.18,654 కోట్లు భారీగా పెరిగిన మొండి భారం ముంబై: కష్టాల్లో కూరుకుపోయిన యస్ బ్యాంక్ ను తాజాగా ప్రకటించిన ఆర్థిక ఫలితాలు మరింత నిరాశపరిచాయి. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(2019–20, క్యూ3)లో రూ.18,654 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.1,009 కోట్ల నికర లాభం నమోదైంది. మొండి బకాయిలు భారీగా పెరిగిపోవడంతో కేటాయింపులు కూడా బాగా పెరగడం, డిపాజిట్లు తరిగిపోవడంతో నికర నష్టాలు ఈ స్థాయిలో పెరిగాయి. కాగా ఈ ఏడాది క్యూ2లో నష్టాలు రూ.600 కోట్లు. స్థూల మొండి బాకీలు ఈ ఏడాది మూడో త్రైమాసికంలో రూ.40,709 కోట్లకు(18.87 శాతం) ఎగిశాయి. నికర మొండి బకాయిలు 5.97 శాతానికి చేరాయి. -
యస్ బ్యాంకు : సత్వర చర్యలు, కస్టమర్లకు ఊరట
సాక్షి, ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న యస్ బ్యాంకులో పునరుద్ధరణ చర్యలు చకా చకా జరిగిపోతున్నాయి. ఇప్పటికే ఆర్బీఐ పునరుద్ధరణ ప్రణాళిక ప్రతిపాదనలను ఆమోదించిన కేంద్ర కేబినెట్ తదుపరి చర్యల్ని కూడా అంతే వేగంగా పూర్తి చేస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే పాలనాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రశాంత్ కుమార్‌ను సీఈవో, ఎండీగా ఎంపిక చేసింది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం (మార్చి 14)న వెల్లడించింది. అంతేకాదు శుక్రవారం రాత్రి జారీ చేసిన నోటిషికేషన్ ప్రకారం పునరుద్ధరణ ప్రణాళిక అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మార్చి 18, సాయంత్రం 6 గంటల నుంచి తాత్కాలిక నిషేధం రద్దు అవుతుంది. అంటే యస్ బ్యాంకు ఖాతాదారుడు రూ. 50వేల కు మించి నగదు ఉపసంహరించుకునే వెసులుబాటు కలుగుతుంది. పీఎన్బీ మాజీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సునీల్ మెహతా యస్ బ్యాంకు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే మహేష్ కృష్ణమూర్తి, అతుల్ భేడా నాన్‌ఎగ్జిక్యూటివ్ డైరెర్టర్లుగా వ్యవహరించ నున్నారు. ఇదివరకే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన దాని ప్రకారం యస్ బ్యాంక్‌పై ప్రస్తుతం అమలు చేస్తున్ననిషేధాన్ని(మారటోరియం)ఎత్తివేసిన వారం రోజుల్లోగా వీరంతా బాధ్యతలు స్వీకరించ నున్నారు. తద్వారా యస్ బ్యాంకుకు కొత్త డైరెక్టర్ల బోర్డు ఏర్పాటు కానుంది. కాగా యస్ బ్యాంక్‌పై ఆంక్షలతోపాటు, ఖాతాదారుల నగదు ఉపసంహరణపై నెల రోజుల పాటు నిషేధాన్ని ఆర్బీఐ విధించింది. అలాగే స్టేట్ బ్యాంక్ మాజీ సీఎఫ్‌వో, డిప్యూటీ ఎండీగా పనిచేసిన ప్రశాంత్‌ను యస్ బ్యాంక్ పాలనాధికారిగా రిజర్వ్ బ్యాంక్ నియమించిన సంగతి తెలిసిందే. -
పునరుద్ధరణ ప్రణాళిక ‘యస్’!
ముంబై: సంక్షోభంలో చిక్కుకున్న యస్ బ్యాంక్‌ను పునరుద్ధరించే ప్రణాళికను రిజర్వ్ బ్యాంక్ ఖరారు చేసింది. మారటోరియం ఎత్తివేసినా నిధుల లభ్యతపరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగు పరిష్కారమార్గాలు ఇందులో పొందుపర్చింది. ప్రణాళిక ప్రకారం.. ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తిగా ఉన్న ప్రభుత్వ రంగ ఎస్బీఐతో పాటు ఇతరత్రా బ్యాంకుల నుంచి తుది మాట తీసుకున్నాక.. ఆర్బీఐ ముందుగా ఒక ప్రకటన చేయనుంది. ప్రకటన వచ్చిన రెండో రోజున బ్యాంకులు దాదాపు రూ. 20,000 కోట్ల నిధులను ఈక్విటీ కింద సమకూరుస్తాయి. మూడో రోజున ప్రభుత్వ రంగ బ్యాంకులు... సుమారు రూ. 30,000 కోట్ల మొత్తాన్ని యస్ బ్యాంక్ సర్టిఫికెట్స్ ఆఫ్ డిపాజిట్స్ (సీడీ)లో ఇన్వెస్ట్ చేస్తాయి. నాలుగో రోజున మారటోరియం తొలగిస్తారు. ఇన్వెస్ట్ చేస్తున్న బ్యాంకుల నుంచి హామీ వచ్చాక ఆర్బీఐ సత్వరమే ప్రణాళికను ప్రకటించనుంది. ప్రైవేట్ బ్యాంకులు కూడా రంగంలోకి.. ఎస్బీఐతో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి ప్రైవేట్ దిగ్గజాలు కూడా యస్ బ్యాంక్‌లో ఇన్వెస్ట్ చేసే ప్రతిపాదనలు ఉన్నాయి. తద్వారా యస్ బ్యాంకు సామర్థ్యంపై నమ్మకం పెరిగి, ఇతర బ్యాంకులు కూడా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రావచ్చని భావిస్తున్నారు. యస్ బ్యాంక్ సీడీల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు చేసే పెట్టుబడులు.. వాటి ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియోల్లో భాగంగా మారతాయి. కొత్తగా జారీ చేసే ఈక్విటీలో రూ. 20,000 కోట్లు ఇన్వెస్ట్ చేసే బ్యాంకులకు యస్ బ్యాంకులో 75 శాతం వాటాలు దక్కుతాయి. షేర్ల పరిమాణం భారీగా పెరగడంతో ప్రస్తుతమున్న షేర్‌హోల్డర్ల వాటా నాలుగో వంతుకు తగ్గుతుంది. మొండిబాకీలు, నిధుల కొరత, గవర్నెన్స్ లోపాలతో సంక్షోభంలో చిక్కుకున్న యస్ బ్యాంక్‌ను పునరుద్ధరించే క్రమంలో ఆర్బీఐ మారటోరియం విధించడం, బ్యాంక్ బోర్డును రద్దు చేయడం తెలిసిందే. ఇన్వార్డ్ ఆర్టీజీఎస్ సేవల పునరుద్ధరణ.. ఇన్వార్డ్ ఆర్టీజీఎస్ సేవలను కూడా యస్ బ్యాంక్ పునరుద్ధరించింది. దీంతో యస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాలు, క్రెడిట్ కార్డులకు సంబంధించి రూ. 2 లక్షలకు పైగా జరపాల్సిన చెల్లింపులను ఇతర బ్యాంకు ఖాతాల నుంచి చెల్లించవచ్చని బ్యాంక్ తెలిపింది. తమ బ్యాంకులో కరెంటు ఖాతాలున్న సంస్థలు.. ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించడంలో ఎలాంటి సమస్యలు ఉండబోవని వివరించింది. అయితే మారటోరియం ఎత్తివేసే దాకా యస్ బ్యాంక్ ఖాతాల నుంచి ఇతరత్రా ఆన్లైన్లో జరపాల్సిన చెల్లింపులపై ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొంది. మరోవైపు, మార్చి 14న (శనివారం) ప్రస్తుత ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు యస్ బ్యాంక్ తెలియజేసింది. యస్ బ్యాంక్ ఖాతాలపై ఐసీఏఐ సమీక్ష.. 2017–18, 2018–19 సంవత్సరాలకు సంబంధించి యస్ బ్యాంక్ ఆర్థిక ఫలితాలను తమ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ రివ్యూ బోర్డు (ఎఫ్‌ఆర్‌ఆర్‌బీ) సమీక్షించనున్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) తెలిపింది. ఒకవేళ ఏవైనా అవకతవకలు ఉన్నాయని తేలిన పక్షంలో ఆడిటర్లపై చర్యలు తీసుకునేలా డైరెక్టరుకు సిఫార్సు చేయనున్నట్లు పేర్కొంది. ఇక, అన్సెక్యూర్డ్ పెట్టుబడుల రద్దు విషయానికొస్తే.. ముందుగా ఈక్విటీ ఇన్వెస్టర్లు, ప్రిఫరెన్స్ షేర్‌హోల్డర్ల తర్వాతే అదనపు టియర్ 1 బాండ్ల విషయం పరిశీలించాలని సెబీ, ఆర్బీఐలను కోరినట్లు మ్యూచువల్ ఫండ్స్ సమాఖ్య యాంఫీ సీఈవో ఎన్ఎస్ వెంకటేష్ తెలిపారు. రుణాలు పూర్తిగా చెల్లిస్తాం: అడాగ్ వ్యాపార అవసరాల కోసం యస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాలన్నింటికీ పూర్తి పూచీకత్తు ఉందని, మొత్తం చెల్లించేస్తామని అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్(అడాగ్) వెల్లడించింది. రాణా కపూర్, ఆయన కుటుంబసభ్యులతో ఎలాంటి లావాదేవీలు లేవని తెలిపింది. అడాగ్‌లో భాగమైన తొమ్మిది సంస్థలు యస్ బ్యాంక్‌కు రూ. 12,800 కోట్ల దాకా రుణాలు చెల్లించాల్సి ఉంది. షేరు జూమ్.. పునరుద్ధరణ ప్రణాళిక వార్తలతో బుధవారం యస్ బ్యాంక్ షేరు బీఎస్ఈలో ఏకంగా 35 శాతం పెరిగి రూ. 28.80 వద్ద క్లోజయ్యింది. రుణాలివ్వాలంటూ కపూర్ ఒత్తిళ్లు: రవ్నీత్ గిల్ యస్ బ్యాంక్‌లో కీలక హోదా నుంచి రిజర్వ్ బ్యాంక్ తప్పించినా వ్యవస్థాపకుడు రాణా కపూర్ పలు మార్లు తన మాట నెగ్గించుకునే ప్రయత్నాలు చేశారు. నిష్క్రమణ తర్వాత కూడా అనేక కార్పొరేట్ సంస్థలకు భారీగా రుణాలిచ్చేలా అధికారులపై ఒత్తిళ్లు తెచ్చారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణలో యస్ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈవో రవ్నీత్ గిల్ ఈ విషయాలు వెల్లడించినట్లు సమాచారం. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్ఎఫ్ఎల్) మాత్రమే కాకుండా ఇతరత్రా కంపెనీలకు కూడా యస్ బ్యాంక్ ఇచ్చిన రుణాల గురించి ప్రశ్నించేందుకు ఈడీ ఆయన్ను పిలిపించింది. ఈ సందర్భంగా కపూర్ ఒత్తిళ్ల గురించి గిల్ చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వివిధ సంస్థలకు యస్ బ్యాంక్ జారీ చేసిన రుణాలకు ప్రతిగా కపూర్, ఆయన కుటుంబానికి దాదాపు రూ. 4,500 కోట్ల ముడుపులు లభించాయని ఆరోపణలు ఉన్నాయి. మిషన్ కపూర్.. రాణా కపూర్ అరెస్టు, యస్ బ్యాంక్‌ను గట్టెక్కించేందుకు ప్రభుత్వం ఎస్బీఐని రంగంలోకి దింపడం తదితర పరిణామాల వెనుక చాలా వ్యవహారమే నడిచింది. ఓవైపు యస్ బ్యాంక్ సంక్షోభం నుంచి బైటపడటం కోసం నిధులు సమీకరించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటే.. మరోవైపు స్వయంగా వ్యవస్థాపకుడు రాణా కపూరే వాటికి గండి కొడుతూ వచ్చారు. ప్రయత్నాలన్నీ విఫలమైతే ఆర్బీఐ చివరికి మళ్లీ తననే పిలిచి బాధ్యతలు అప్పగిస్తుందనే ఆశతో ఆయన ఇదంతా చేశారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన ఇన్వెస్టర్లంతా ఆఖరు దశలో తప్పుకుంటూ ఉండటంపై సందేహం వచ్చిన ఆర్బీఐ కూపీ లాగితే ఈ విషయాలు వెల్లడయ్యాయి. సంబంధిత వర్గాల కథనం ప్రకారం .. డీల్ కుదుర్చుకునేందుకు వచ్చిన ఇన్వెస్టర్ల దగ్గరకు కపూర్ అనుయాయులు వెళ్లి, ఏదో రకంగా దాన్ని చెడగొట్టేవారు. ఇదంతా గ్రహించిన ఆర్బీఐ .. యస్ బ్యాంక్‌ను మళ్లీ ఆయనకే అప్పగించేందుకు తాము సానుకూలంగా ఉన్నట్లుగా సంకేతాలు పంపి లండన్ నుంచి భారత్ రప్పించింది. ఆయన రాగానే వివిధ దర్యాప్తు ఏజెన్సీలు కపూర్‌పై అనుక్షణం నిఘా పెట్టాయి. కానీ ఆర్బీఐ, ప్రభుత్వం ఉద్దేశాలు కనిపెట్టిన కపూర్ మళ్లీ లండన్ వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్లు అధికారులకు తెలిసింది. దీంతో ముందు కపూర్‌ను అరెస్ట్ చేయాలా లేక బ్యాంకు పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెట్టాలా? అన్న మీమాంస తలెత్తింది. కపూర్‌ను అరెస్ట్ చేసిన పక్షంలో బ్యాంక్‌పై కస్టమర్ల నమ్మకం సడలి.. ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి తలెత్తే ముప్పుందని ప్రభుత్వం ఆలోచనలో పడిం ది. చివరికి సమయం మించిపోతుండటంతో.. ధైర్యం చేసి అన్ని చర్యలు ఒకేసారి తీసుకుంది. బ్యాంకుపై మారటోరియం, పునర్వ్యవస్థీకరణ ప్రణాళికల ప్రకటనతో పాటు కపూర్‌ను అరెస్ట్ కూడా చేశారు. ఈనెల 16 దాకా ఈడీ కస్టడీలో కపూర్.. యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్ .. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీని మరో అయిదు రోజులు పొడిగిస్తూ మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) ప్రత్యేక కోర్టు ఆదేశాలిచ్చింది. మూడు రోజుల కస్టడీ అనంతరం బుధవారం ఈడీ ఆయన్ను కోర్టులో హాజరుపర్చింది. విచారణ సందర్భంగా మార్చి 16 దాకా కస్టడీని పొడిగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది. -
‘యస్’బీఐ..!
ముంబై: సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్‌ను ఒడ్డున పడేసేందుకు రిజర్వ్ బ్యాంక్ చర్యలు చేపట్టింది. యస్ బ్యాంకులో ఇన్వెస్ట్ చేయడానికి ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆసక్తి చూపుతున్నట్లు శుక్రవారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో యస్ బ్యాంకు పునర్నిర్మాణ స్కీమ్ 2020 ముసాయిదాను ఆర్బీఐ రూపొందించింది. దీని ప్రకారం.. వ్యూహాత్మక ఇన్వెస్టర్లు యస్ బ్యాంక్‌లో 49 శాతం వాటాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పెట్టుబడులు పెట్టిన రోజు నుంచి మూడేళ్ల దాకా వాటాలను 26 శాతం లోపు తగ్గించుకోకూడదు. యస్ బ్యాంక్ షేరు ఒక్కింటికి రూ. 10 చొప్పున లెక్కించి వాటాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. యస్ బ్యాంకు షేరు ముఖ విలువ రూ. 2తో పోలిస్తే ఇది రూ. 8 అధికం. ఇక నిర్దేశిత తేదీ నుంచి బ్యాంక్ అధీకృత మూలధనాన్ని కూడా రూ. 5,000 కోట్లకు, ఈక్విటీ షేర్ల సంఖ్యను 2,400 కోట్లకు సవరించనున్నారు. ఈ ముసాయిదాపై సంబంధిత వర్గాలు మార్చి 9 దాకా అభిప్రాయాలు తెలపాల్సి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. మొండిబాకీలు, నష్టాలు, నిధుల కొరత సమస్యలతో సతమతమవుతున్న యస్ బ్యాంక్‌పై ఆర్బీఐ ఏప్రిల్ 3 దాకా నెల రోజులపాటు మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవధిలో డిపాజిట్‌దారులు రూ. 50,000కు మించి విత్‌డ్రా చేసుకోవడానికి లేదు. అటు బ్యాంకు.. ఇతరత్రా రుణాలు ఇవ్వడానికి గానీ పెట్టుబడులు పెట్టడానికిగానీ లేదు. మారటోరియం గడువులోగానే బ్యాంకును పునరుద్ధరించడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని ఆర్బీఐ నియమించిన అడ్మినిస్ట్రేటర్ ప్రశాంత్ కుమార్ వెల్లడించారు. డిపాజిటర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఆర్బీఐ చర్యలు తీసుకుందని, ఖాతాదారుల సొమ్ముకు ఢోకా లేదని భరోసా నిచ్చారు. ఖాతాదారుల సొమ్ము భద్రం: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యస్ బ్యాంక్‌లో గవర్నెన్స్ లోపాలు, నిబంధనలను పాటించకపోవడం, రిస్కుతో కూడుకున్న రుణాలివ్వడం వంటి ధోరణులను 2017 నుంచి రిజర్వ్ బ్యాంక్ గమనిస్తూనే ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే బ్యాంక్ మేనేజ్మెంట్ను కూడా మార్చాలని ఆర్బీఐ ఆదేశించినట్లు తెలిపారు. యస్ బ్యాంక్‌లో సమస్యలు, వాటికి బాధ్యులెవరన్న అంశాలన్నింటిపైనా విచారణ జరపాలంటూ ఆర్బీఐకి ప్రభుత్వం సూచించినట్లు ఆమె వివరించారు. ‘ఖాతాదారుల ప్రయోజనాలు పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆర్బీఐతో పాటు పరిస్థితులను నేను కూడా సమీక్షిస్తున్నాను. డిపాజిటర్ల సొమ్ము భద్రంగానే ఉంటుంది‘ అని నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. నిర్దిష్ట 30 రోజుల్లోగానే పునర్నిర్మాణ స్కీమ్ అమల్లోకి రాగలదని, ఇన్వెస్ట్ చేసేందుకు ఎస్బీఐ ముందుకొచ్చిందని మంత్రి చెప్పారు. ఏడాది పాటు యస్ బ్యాంక్ సిబ్బంది ఉద్యోగాలు, జీతభత్యాలకు ఎలాంటి సమస్య ఉండబోదని భరోసానిచ్చారు. అంబానీ గ్రూప్, ఎస్సెల్, ఐఎల్ఎఫ్ఎస్, డీహెచ్ఎఫ్ఎల్, వొడాఫోన్ వంటి సంస్థలకు ఇచ్చిన రుణాలు యస్ బ్యాంక్‌కు గుదిబండగా మారాయన్నారు. ఆందోళనలో కస్టమర్లు.. విత్డ్రాయల్స్పై ఆంక్షలతో యస్ బ్యాంక్ ఖాతాదారుల్లో ఆందోళన నెలకొంది. వార్త తెలిసినప్పట్నుంచీ ఏటీఎంలు, పలు శాఖల్లో కస్టమర్లు బారులు తీరారు. తమ డిపాజిట్ల పరిస్థితి గురించి వాకబు చేస్తూ కనిపించారు. నెట్ బ్యాంకింగ్ పనిచేయకపోవడం, ఏటీఎంలలో డబ్బు లేకపోవడం తదితర ఫిర్యాదులతో బ్యాంక్ హెల్ప్‌లైన్ హోరెత్తింది. కొందరు ట్విట్టర్ వంటి వేదికల ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ప్రయత్నించారు. ఆర్బీఐ ఆంక్షలు విధించడానికి రెండు రోజుల ముందునుంచే బ్యాంకు చిక్కుల్లో ఉన్న సంకేతాలు కనిపించాయని కొందరు ఖాతాదారులు చెప్పారు. బ్యాంకింగ్ సమస్యలపై మార్చి 3, 4 తారీఖుల నుంచే పలువురు కస్టమర్లు యస్ బ్యాంక్ ట్విట్టర్ హ్యాండిల్లో ఫిర్యాదులు చే శారు. షేరు 85 శాతం క్రాష్.. యస్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డ్‌ను రద్దు చేయడం, విత్ డ్రాయల్స్‌పై ఆంక్షల నేపథ్యంలో శుక్రవారం యస్ బ్యాంక్ షేర్ కుప్పకూలింది. శుక్రవారం ఒకానొక దశలో 85 శాతం దిగజారి రూ.5.55ను తాకింది. చివరకు 55 శాతం నష్టంతో రూ.16.55 వద్ద ముగిసింది. గత ఏడాది డిసెంబర్ 31 నాటికి యస్ బ్యాంక్ షేర్ రూ.47గా ఉంది. షేర్ ధర భారీగా నష్టపోవడంతో ఈ షేర్లో ఇన్వెస్ట్ చేసిన రిటైల్ ఇన్వెస్టర్లతో పాటు జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు కూడా భారీగా నష్టపోయారు. ఎల్ఐసీ మార్క్–టు–మార్కెట్ నష్టాలు రూ.617కోట్ల మేర ఉండగా, మ్యూచువల్ ఫండ్స్ మార్క్–టు–మార్కెట్నష్టాలు కూడా ఇదే రేంజ్లో ఉన్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,162 కోట్లు, రిటైల్ ఇన్వెస్టర్లు రూ.3,300 కోట్లు నష్టపోయారు. ఇక హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ నష్టాలు రూ.239 కోట్లుగా ఉన్నాయి. త్వరలో పరిష్కారమవుతుంది: ఎస్బీఐ చీఫ్ రజనీష్ కుమార్ ‘యస్ బ్యాంక్ సమస్య కేవలం ఆ బ్యాంకుకే పరిమితమైన అంశం. ఇది మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ సమస్య కాదు. యస్ బ్యాంక్ సంక్షోభానికి చాలా తొందర్లోనే పరిష్కారం లభిస్తుంది‘ అని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ చెప్పారు. బ్యాంకులో వాటాలు కొనుగోలు చేసే పక్షంలో తమకు ఇప్పటికే సూత్రప్రాయంగా అనుమతులు కూడా ఉన్నాయని తెలిపారు. సత్వర చర్యలు తీసుకుంటున్నాం: ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ దేశీ ఆర్థిక రంగంలో స్థిరత్వానికి సమస్యలు వాటిల్లకుండా యస్ బ్యాంక్ సంక్షోభాన్ని పరిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. బ్యాంకును పునరుద్ధరించడానికి అత్యంత వేగంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. 30 రోజుల మారటోరియం అన్నది గరిష్ట పరిమితి అని.. ఈలోగానే పరిష్కార ప్రణాళిక అమల్లోకి రాగలదని దాస్ ధీమా వ్యక్తం చేశారు. ఖాతాదారుల ప్రయోజనాలను పూర్తిగా పరిరక్షిస్తామన్నారు. స్వయంగా పరిస్థితి చక్కదిద్దుకునేందుకు బ్యాంకుకు తగినంత సమయం ఇచ్చినా ఫలితం కనిపించకపోవడంతోనే ఆర్బీఐ ప్రస్తుత చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని పరిశ్రమల సమాఖ్య అసోచాం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. ఇది తొందరపాటుతనం అని కొందరు .. చాలా ఆలస్యం చేశారని మరికొందరు వ్యాఖ్యానించవచ్చని, కానీ ఆర్బీఐ తగిన సమయంలోనే చర్యలు తీసుకుందని దాస్ చెప్పారు. డిజిటల్ పార్ట్నర్స్కు సెగ.. యస్ బ్యాంక్‌పై ఆంక్షలతో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు, దానిపై ఆధారపడిన ఫిన్టñ క్ సంస్థలకు సమస్యలొచ్చి పడ్డాయి. ప్రధానంగా ఫోన్‌పే వంటి డిజిటల్ పేమెంట్స్ సంస్థల లావాదేవీలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. అటు యస్ బ్యాంక్ ఖాతాల్లోకి యూపీఐ ప్లాట్‌ఫాం ద్వారా చేసే చెల్లింపులు సహా పలు లావాదేవీల సెటిల్మెంట్లపై పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఆంక్ష లు విధించింది. ఇక, యస్ బ్యాంక్ బాండ్లలో వివిధ స్కీమ్‌ల ద్వారా చేసిన పెట్టుబడుల విలువను సున్నా స్థాయికి తగ్గించేసినట్లు నిప్పన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ తెలిపింది. మరోవైపు, యస్ బ్యాంక్‌లో ఖాతాలున్న షేర్, బాండ్ హోల్డర్ల నిధులు చిక్కుబడిపోకుండా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. వారి షేర్లు, బాండ్లు మొదలైనవి విక్రయించిన పక్షంలో వచ్చే నిధులను వేరే బ్యాంకులో జమ చేసుకునే వీలు కల్పిస్తూ సత్వర చర్యలు తీసుకున్నాయి. పూరీ జగన్నాథునికీ కష్టాలు... యస్ బ్యాంకులో పూరీ జగన్నా«థ స్వామి ఆలయానికి సంబంధించి రూ. 545 కోట్ల మేర డిపాజిట్లు ఉన్నాయి. బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం విధించడంతో ఈ డిపాజిట్ల పరిస్థితిపై ఆందోళన నెలకొంది. ప్రైవేట్ బ్యాంకులో జగన్నాథుడి నిధులను డిపాజిట్ చేయడం అనైతికమని, ఈ విషయంలో శ్రీ జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్, గుడి మేనేజింగ్ కమిటీపై పోలీసులకు ఫిర్యాదు చేశామని జగన్నాథ సేన కన్వీనర్ ప్రియదర్శి పట్నాయక్ చెప్పారు. అయితే, అధికారులు చర్యలేమీ ఇంతవరకూ తీసుకోలేదన్నారు. మరోవైపు, ఈ మొత్తాన్ని మార్చి నెలాఖరులోనే ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకులోకి మళ్లించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుందని.. ఈలోగానే తాజా పరిణామం చోటు చేసుకుందని ఒడిశా న్యాయశాఖ మంత్రి ప్రతాప్ జెనా తెలిపారు. -
ఎస్ బ్యాంక్‌పై ఆర్బీఐ మానిటోరియం
-
విత్‌డ్రాయల్స్ ఆంక్షలు, ఆర్బీఐ గుప్పిట్లో ‘యస్’!
న్యూఢిల్లీ: కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు, మొండిబాకీల భారం, నిధుల కొరత కష్టాలతో సతమతమవుతున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంకుపై రిజర్వ్ బ్యాంక్ కొరడా ఝుళిపించింది. బ్యాంక్ బోర్డును రద్దు చేయడంతో పాటు ఖాతాదారులకు షాక్‌నిచ్చేలా విత్డ్రాయల్స్పై పరిమితులు విధించింది. ఖాతాదారులకు రూ. 50,000కు మించి చెల్లింపులు జరపకుండా 30 రోజుల మారటోరియం విధిస్తూ ఆర్బీఐ గురువారం ఆదేశాలు జారీ చేసింది. మార్చి 5 నుంచి అమల్లోకి వచ్చిన మారటోరియం ఏప్రిల్ 3 దాకా కొనసాగుతుంది. వైద్యం, ఉన్నత విద్య, వివాహం వంటి అత్యవసర సందర్భాల్లో మాత్రమే రూ. 50,000కు మించి విత్‌డ్రా చేసుకోవడానికి వీలుంటుంది. అటు యస్ బ్యాంకు ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దిగజారిన నేపథ్యంలో బోర్డును కూడా రద్దు చేసిన ఆర్బీఐ.. ప్రభుత్వ రంగ ఎస్బీఐ మాజీ సీఎఫ్‌వో ప్రశాంత్ కుమార్‌ను అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. భారీ స్కామ్‌తో కుదేలైన పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంకుపైనా ఆర్బీఐ కొన్నాళ్ల క్రితం ఇలాంటి ఆంక్షలే విధించింది. అది జరిగిన 6 నెలల వ్యవధిలోనే యస్ బ్యాంక్‌పైనా రిజర్వ్ బ్యాంక్ అటువంటి చర్యలే తీసుకోవడం గమనార్హం. ఆందోళన వద్దు .. డిపాజిట్లు భద్రమే.. మొండిబాకీల భారం, డిపాజిట్ల విత్‌డ్రాయల్స్, రేటింగ్ డౌన్‌గ్రేడ్స్ వంటి పలు ప్రతికూల అంశాలతో బ్యాంకు పరిస్థితి నానాటికి దిగజారిందని ఆర్బీఐ పేర్కొంది. ‘పరిస్థితి చక్కదిద్దుకోవడానికి, విశ్వసనీయమైన పునరుద్ధరణ ప్రణాళికతో నిధులు సమీకరించుకోవడానికి యస్ బ్యాంక్ మేనేజ్మెంట్కు తగినన్ని అవకాశాలు ఇచ్చాం. కానీ ప్రణాళికలు అమలు చేయడంలో అది విఫలమైంది. ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత.. ఖాతాదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం యస్ బ్యాంకుపై మారటోరియం విధించాలంటూ ప్రభుత్వానికి సూచించడం మినహా మరో మార్గాంతరం లేదని భావించాం. తదనుగుణంగానే కేంద్రం నిర్ణయం తీసుకుంది‘ అని ఆర్బీఐ పేర్కొంది. ఖాతాదారులు ఆందోళన చెందనక్కర్లేదన్న ఆర్బీఐ.. డిపాజిట్లు భద్రంగానే ఉంటాయని, డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడతామని భరోసానిచ్చింది. బ్యాంకింగ్ రంగ నియంత్రణ చట్ట నిబంధనల ప్రకారం యస్ బ్యాంక్ పునరుద్ధరణ లేదా మరో బ్యాంకులో విలీనం చేయడానికి సంబంధించి త్వరలోనే తగు ప్రణాళికను రూపొందిస్తామని ఆర్బీఐ పేర్కొంది. డిపాజిటర్లు సుదీర్ఘకాలం ఇబ్బందులు పడకుండా మారటోరియం ముగిసేలోగానే దీన్ని అమలు చేస్తామని తెలిపింది. ఎస్బీఐ చేతికి..? ఎల్ఐసీతో కలిసి టేకోవర్ వార్తలు రిజర్వ్ బ్యాంక్ మారటోరియం విధిస్తున్నట్లు ప్రకటించడానికి ముందు.. యస్ బ్యాంక్‌ను ఎల్ఐసీతో కలిసి ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సారథ్యంలోని కన్సార్షియం టేకోవర్ చేయనుందంటూ వార్తలు వచ్చాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కన్సార్షియం మొత్తం 49 శాతం వాటాలు కొనేలా ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం. నియంత్రణాధికారాలు దక్కే స్థాయిలో వాటాలు కొనుగోలు చేసేందుకు సంబంధించి త్వరలోనే అధికారికంగా ప్రకటన కూడా రావొచ్చని అధికార వర్గాలు పేర్కొన్నాయి. గురువారం ముంబైలో ఎస్బీఐ బోర్డు సమావేశం కావడం ఈ వార్తలకు ఊతమిచ్చింది. యస్ బ్యాంక్ మూతబడే పరిస్థితి ఉండబోదంటూ ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ వ్యాఖ్యలు చేసిన కొన్నాళ్లకే ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొటక్ మహీంద్రా వంటి ప్రైవేట్ దిగ్గజ బ్యాంకులు.. యస్ బ్యాంక్‌ను టేకోవర్ చేసేందుకు అనువైనవంటూ గతంలో ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు ఈ వార్తలపై వివరణనివ్వాలంటూ ఎస్బీఐ, యస్ బ్యాంకులకు స్టాక్ ఎక్సే్చంజీలు సూచించాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనల ప్రకారం అలాంటి పరిణామాలేమైనా ఉన్న పక్షంలో వెల్లడిస్తామంటూ ఎస్బీఐ తెలియజేసింది. అటు యస్ బ్యాంక్ కూడా .. ఇప్పటిదాకా తమకు దీనిపై ఆర్బీఐ లేదా ప్రభుత్వం లేదా ఇతరత్రా నియంత్రణ సంస్థలు, ఎస్బీఐ నుంచి ఏ విధమైన సమాచారమూ రాలేదని తెలిపింది. అటు, బ్రోకరేజీ సంస్థలు మాత్రం యస్ బ్యాంక్ పరిస్థితి ఆశావహంగా లేదంటూ వ్యాఖ్యానించాయి. ఒకవేళ ఇన్వెస్టర్లకు బలవంతంగా అంటగట్టినా.. మొండిబాకీల రిస్కులు భారీగా ఉన్నందున బ్యాంకు విలువను సున్నా కింద లెక్కగట్టి తీసుకోవడమే జరగవచ్చని జేపీ మోర్గాన్ వర్గాలు వ్యాఖ్యానించాయి. ‘యస్’ నుంచి ‘నో’ వరకూ...! ► జూన్ 12, 2018: యస్ బ్యాంక్ ఎమ్డీ, సీఈఓగా మూడేళ్లపాటు రాణా కపూర్ పునర్నియామకానికి వాటాదారుల ఆమోదం ► సెప్టెంబర్ 19, 2018: రాణా కపూర్ పదవీ కాలాన్ని జనవరి 31,2019 వరకే తగ్గించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ► సెప్టెంబర్ 21, 2018: యస్ బ్యాంక్ షేర్ ఒకే రోజు 30 శాతం పతనం, రూ.21,951 కోట్ల మార్కెట్ క్యాప్ ఆవిరి ► సెప్టెంబర్ 28, 2018: ప్రమోటర్ షేర్లను విక్రయించబోనని, కూతుళ్లకు ఇచ్చేస్తానని రాణా కపూర్ ప్రకటన. యస్ బ్యాంక్ డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌కు క్రెడిట్ వాచ్ రేటింగ్‌ను ఇస్తున్నామని కేర్ రేటింగ్స్ వెల్లడి ► అక్టోబర్ 17, 2018: రాణా కపూర్‌కు మరింత గడువును ఇవ్వడానికి నిరాకరించిన ఆర్బీఐ. 2019, ఫిబ్రవరి 1 కల్లా కొత్త సీఈఓను నియమించుకోవాలని ఆదేశం ► అక్టోబర్ 25, 2018: గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి. మార్క్‌టు మార్కెట్ నష్టాలు రెట్టింపు కావడం, మొండి బకాయిలకు కేటాయింపులు అధికంగా ఉండటంతో ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. రుణ నాణ్యత భారీగా క్షీణించింది. ► నవంబర్ 14, 2018: చైర్మన్ పదవికి అశోక్ చావ్లా రాజీనామా. ఇండిపెండెంట్ డైరెక్టర్ పదవి నుంచి వైదొలగిన వసంత్ గుజరాతీ ► నవంబర్ 19, 2018: మరో ఇండిపెండెంట్ డైరెక్టర్ రెంటాల చంద్రశేఖర్ రాజీనామా ► నవంబర్ 27, 2018: యస్ బ్యాంక్ రేటింగ్‌ను డౌన్ గ్రేడ్‌చేసిన మూడీస్ సంస్థ. ► మార్చి 1, 2019: యస్ బ్యాంక్ ఎమ్డీ, సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన రవ్నీత్ గిల్. 3 శాతం ఎగసిన షేర్ ధర ► మార్చి 5, 2019: స్విఫ్ట్ కార్యకలాపాల విషయంలో నిబంధనలు పాటించనందుకు రూ. 1 కోటి జరిమానా విధించిన ఆర్బీఐ ► ఏప్రిల్ 26, 2019: గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఆర్థిక ఫలితాలు వెల్లడి. రూ.1,507 కోట్ల నికర నష్టాలు ► ఏప్రిల్ 29, 2019: యస్ బ్యాంక్ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేసిన మాక్వైరీ బ్రోకరేజ్ సంస్థ. ► ఏప్రిల్ 30, 2019: క్యూ4 ఫలితాల ప్రభావంతో 30% పతనమైన షేర్ ► మే 9, 2019: యస్ బ్యాంక్ లాంగ్ టర్మ్ రేటింగ్‌ను ప్రధాన రేటింగ్ ఏజెన్సీలైన ఇండియా రేటింగ్స్, ఇక్రాలు డౌన్ గ్రేడ్ చేశాయి. ► మే 15, 2019: యస్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డ్‌లో అదనపు డైరెక్టర్‌గా ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఆర్. గాంధీ నియామకం ► జూలై 18, 2019: రాణా కపూర్ తన పూర్తి వాటా షేర్లను తనఖా పెట్టారన్న వార్తలు వచ్చాయి. భారీగా పతనమైన బ్యాంక్ షేర్ ► ఆగస్టు 10, 2019: సీఎఫ్ఓగా అనురాగ్ అద్లాఖ నియామకం ► సెప్టెంబర్ 21, 2019: యస్ బ్యాంక్‌లో 2.75 శాతం వాటా విక్రయించిన రాణా కపూర్. 6.89 శాతానికి తగ్గిన వాటా ► అక్టోబర్ 3, 2019: యస్ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ రజత్ మోంగా రాజీనామా ► నవంబర్ 1, 2019: ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో రూ.600 కోట్ల నష్టాలు ► డిసెంబర్ 6, 2019: యస్ బ్యాంక్‌కు నెగిటివ్ అవుట్ లుక్ ఇచ్చిన రేటింగ్ ఏజెన్సీ మూడీస్. 9 శాతానికి పైగా పతనమైన షేర్ ధర ► డిసెంబర్ 17, 2019: కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో యస్ బ్యాంక్ విలీనం కానున్నదని వినిపించిన వార్తలు ► జనవరి 10, 2020: కార్పొరేట్ గవర్నెన్స్ సరిగ్గా లేదంటూ రాజీనామా చేసిన బోర్డ్ మెంటర్ ఉత్తమ్ ప్రకాశ్ రాజీనామా ► జనవరి 13, 2020: ఇన్సైడర్ ట్రేడింగ్ చోటు చేసుకుందని, ఈ విషయమై సెబీ దర్యాప్తు చేయాలని లేఖ రాసిన ఉత్తమ్ ప్రకాశ్ అగర్వాల్. 6 శాతం పతనమైన షేర్ ధర ► మార్చి 5, 2020: ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్షియమ్... యస్ బ్యాంక్‌లో వాటా కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపిందని వార్తలు. 26 శాతం లాభంతో రూ.36.85కు ఎగసిన షేర్. షేరు టార్గెట్ @ రూ. 1 అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ, జేపీ మోర్గాన్ యస్ బ్యాంక్ షేర్ టార్గెట్ ధరను రూ.1కు (గతంలో రూ.55)కు తగ్గించింది. రేటింగ్‌ను అండర్ వెయిట్‌గా కొనసాగించింది. ప్రస్తుత ధర (రూ.37)కు బాగా ఎక్కువ డిస్కౌంట్‌కు కొత్త మూలధనం లభించే అవకాశాలున్నందున టార్గెట్ ధరను రూ.1కు తగ్గిస్తున్నామని జేపీ మోర్గాన్ వివరించింది. గురువారం 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోయిన యస్ బ్యాంక్ షేరు.. ఆ తర్వాత టేకోవర్ వార్తలతో బీఎస్ఈలో 26% పెరిగి రూ.36.85 వద్ద క్లోజయ్యింది. -
టెలికం ప్యాకేజీపై కమిటీ రద్దు
న్యూఢిల్లీ: స్పెక్ట్రం చార్జీలు చెల్లించడానికి కేంద్రం మారటోరియం రూపంలో వెసులుబాటు కల్పించిన నేపథ్యంలో టెలికం రంగ సమస్యలను అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన కార్యదర్శుల కమిటీ (సీవోఎస్) రద్దయింది. టెలికం రంగానికి ఊతమిచ్చేలా ప్రభుత్వం తీసుకోతగిన చర్యలపై పలు మార్లు సమావేశమైన సీవోఎస్ ఈ నెల తొలినాళ్లలో కేంద్రానికి నివేదిక ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కమిటీ సిఫార్సుల మేరకే స్పెక్ట్రం యూసేజీ చార్జీల చెల్లింపుపై రెండేళ్ల మారటోరియం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వివరించాయి. లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బాకీల చెల్లింపునకు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో కేంద్రం జోక్యం చేసుకోరాదని భావించిన నేపథ్యంలో సీవోఎస్ రద్దు ప్రాధాన్యం సంతరించుకుంది. సంక్షోభం నుంచి బయటపడేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని, వాయిస్ కాల్స్.. డేటా టారిఫ్‌లను పెంచడం మొదలైన అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేయాలని టెలికం సంస్థలకు ప్రభుత్వం సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) అంశంపై ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పునివ్వడంతో టెల్కోలు దాదాపు రూ. 1.4 లక్షల కోట్లు కేంద్రానికి చెల్లించాల్సి ఉన్న సంగతి తెలిసిందే. టెలికం రంగానికి ఇది మరింత భారమవుతుందని, తోడ్పాటు అందించాలని కేంద్రాన్ని టెల్కోలు కోరుతున్నాయి. భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు.. సుప్రీం ఉత్తర్వులపై అదే కోర్టులో రివ్యూ పిటీషన్ కూడా దాఖలు చేశాయి. -
ఐక్యరాజ్య సమితి ప్రతిపాదనను వ్యతిరేకించిన భారత్
ఐక్యరాజ్య సమతి: మరణశిక్షపై మారటోరియం విధించాలన్న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ తీర్మానం ముసాయిదాను భారత్ వ్యతిరేకించింది. ముసాయిదాకు వ్యతిరేకంగా భారత్ ఓటువేసింది. సొంత న్యాయవ్యవస్థపై నిర్ణయం, నేరస్థులకు శిక్ష వంటి అంశాలపై ఆయా దేశాల సార్వభౌమత్వ హక్కును గుర్తించడంలో ముసాయిదా విఫలమైనందున దానినివ్యతిరేకించినట్లు భారత్ పేర్కొంది. మరణశిక్షను పూర్తిగా రద్దుచేయాలన్న వైఖరితోనే ఈ ముసాయిదాను తెచ్చారని ఐక్యరాజ్య సమితిలో భారత దౌత్యప్రతినిధి మాయాంక్ జోషీ అభిప్రాయపడ్డారు. 'మరణశిక్ష అమలుపై మారటోరియం' పేరిట వచ్చిన తీర్మాన ముసాయిదాను ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ తృతీయ కమిటీ గత వారం ఆమోదించింది. ముసాయిదాను 114 దేశాలు సమర్థించగా, భారత్ సహా 36దేశాలు వ్యతిరేకించాయి. 34 దేశాలు గైర్హాజరయ్యాయి. ఇక ఈ తీర్మానంలోని నిబంధనల మేరకు మరణశిక్ష అమలుపై నియంత్రణతో వ్యవహరించాలని సభ్యదేశాలకు సర్వప్రతినిధి సభ విజ్ఞప్తిచేయనుంది. 18 ఏళ్ల లోపు వయస్సువారికి, గర్భిణీ స్త్రీలకు, మానసిక దౌర్బల్యం కలిగిన వారికి మరణశిక్ష విధించరాదని కూడా సభ్యదేశాలను కోరనుంది. ** -
120మండలాలకే రీ షెడ్యూల్
-
120మండలాలకే రీ షెడ్యూల్ వర్తింపు
* ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్బీఐ లేఖ సాక్షి, హైదరాబాద్: ఏపీలో వ్యవసాయ రుణాల రీ షెడ్యూల్‌కు రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) పరిమితంగానే అనుమతి ఇచ్చింది. 4 జిల్లాల పరిధిలోని 120 మండలాల రుణాల రీ షెడ్యూల్‌కే అంగీకరించింది. ఇందుకు సైతం కొన్ని పరిమితులు విధించింది. ఏపీలో రుణాల రీ షెడ్యూల్‌కు అనుమతిస్తున్నట్టు ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ దీపాలీ పంత్ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో తెలిపారు. రాష్ట్రంలో 653 మండలాలు ఉండగా కరువు, తుపాను వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా 575 మండలాల్లో రుణాలను రీ షెడ్యూల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐని కోరిన విషయం తెలిసిందే. దాంతో గత ఖరీఫ్‌లో ఆహార ఉత్పత్తుల వివరాలను అందించాలని ఆర్బీఐ రాష్ట్రాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ సమాచారం ఇవ్వకపోవడంతో ఆంధ్రప్రదేశ్ అర్థగణాంక విభాగం విడుదల చేసిన లెక్కలను పరిగణనలోకి తీసుకున్న ఆర్బీఐ వాటిని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి జవాబిచ్చింది. ఆహార ఉత్పత్తులు 50 శాతంకన్నా తక్కువగా వచ్చిన పక్షంలోనే వ్యవసాయ రుణాల రీ షెడ్యూల్‌కు ఆర్బీఐ నిబంధనలు అనుమతిస్తాయంటూ, ఆ వివరాలతో కూడిన సమాచారాన్ని కూడా రాష్ట్రానికి పంపింది. తాజాగా రాష్ట్రంలో ఎక్కడైతే ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా పరిస్థితులు ఉన్నాయో.. ఆ ప్రాంతాల్లోని వ్యవసాయ రుణాల రీ షెడ్యూల్‌కు అనుమతిస్తూ లేఖ రాసింది. పరిమిత రీ షెడ్యూల్‌పై ఆర్బీఐ ఏమన్నదంటే... * బంగారంపై తీసుకున్న పంట రుణాలకు రీ షెడ్యూల్ వర్తించదు. * పంటలను కుదవ పెట్టి తీసుకున్న పంట రుణాలకు రీ షెడ్యూల్ వర్తించదు. * చెరకు, పొగాకు తదితర వాణిజ్య పంటల రుణాలకు, మూసేసిన పంట రుణాల ఖాతాలకు రీ షెడ్యూల్ వర్తించదు. * ప్రామాణిక ప్రాతిపదిక మేరకు రీ షెడ్యూల్‌ను 4 జిల్లాలకు మాత్రమే పరిమితం. * శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లోని వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకే రీ షెడ్యూల్ వర్తిస్తుంది. * కేవలం స్వల్పకాలిక పంట రుణాలకు మాత్రమే వర్తింపు. * రీ షెడ్యూల్ మూడేళ్లకే పరిమితం. తొలి ఏడాది మారిటోరియం ప్రకటనకు, తర్వాత రెండేళ్లలో రీ షెడ్యూల్‌కు అనుమతి. * మూడేళ్లలో రైతులు రుణాలు చెల్లించకపోతే బ్యాంకులు ఆ బకాయి మొత్తాలను వడ్డీతో సహా రైతుల నుంచి వసూలు చేస్తాయి. * గత ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు తీసుకున్న పంట రుణాలకే రీ షెడ్యూల్ వర్తిస్తుంది. ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు వడ్డీతో కలిపి ఒక్కో రైతుకు లక్ష రూపాయల వరకు మాత్రమే పంట రుణం రీ షెడ్యూల్ వర్తిస్తుంది. వడ్డీతో కలిపి రుణం లక్ష రూపాయల కంటే ఎక్కువ ఉంటే ఆ మొత్తాన్ని ప్రభుత్వం నగదు రూపంలో రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమచేయాలి. * ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ పనుల విషయంలో రైతులు ఇక్కట్లకు గురికాకూడదని, రుణాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలనే సానుభూతితో రుణాల రీషెడ్యూల్కు నిర్ణయం తీసుకున్నాం. -
రీషెడ్యూల్ 3 జిల్లాలకే!
* రుణాలపై ప్రభుత్వానికి ఆర్బీఐ లేఖ * గత ఏడాది ఏప్రిల్-అక్టోబర్ మధ్య తీసుకున్న ఖరీఫ్ రుణాలకే వర్తింపు * అది కూడా వడ్డీతో కలిపి లక్ష వరకే.. బంగారం తాకట్టు రుణాలు, పాత బకాయిలకు వర్తించదు * తొలి ఏడాది మారటోరియం, తర్వాతి రెండేళ్లలో చెల్లింపునకు గడువు * సర్కారుకు మహా అయితే వెయ్యి కోట్ల వరకే వెసులుబాటు సాక్షి, హైదరాబాద్: రుణమాఫీపై ఇప్పటివరకు నాన్చుతూ వచ్చిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తాజాగా తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చింది. రైతుల రుణాలను రీషెడ్యూల్ చేయించుకుని వీలైనంత వెసులుబాటు పొందాలని భావించిన సర్కారుకు నిరాశే ఎదురైంది. కేవలం మూడు జిల్లాల్లోని మండలాలకే రీషెడ్యూల్‌ను వర్తింపజేస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. పైగా అసలు, వడ్డీ కలిపి లక్ష వరకు రుణాలకే దీన్ని పరిమితం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ నుంచి లేఖ అందింది. తొమ్మిది జిల్లాల్లో గత ఏడాది కరువు, తుపాను బారిన పడిన 415 మండలాల్లో రైతు రుణాలను రీషెడ్యూల్ చేయాలని రాష్ర్ట ప్రభుత్వం ఆర్బీఐని కోరిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన రుణ మాఫీని సాఫీగా అమలు చేసేందుకు ఎక్కువ మొత్తం రుణాలను రీషెడ్యూల్ చేయించుకోవాలని అధికార యంత్రాంగం విశ్వ ప్రయత్నాలు చేసింది. దాదాపు నెలన్నర రోజులుగా ఈ అంశంపై ఆర్బీఐతో సంప్రదింపులు జరుపుతూనే ఉంది. మొదట 337 మండలాలు, తర్వాత మరో 78 ప్రభావిత మండలాల జాబితాను అధికారులు పంపించారు. అయితే రుణ మాఫీ వంటి పథకాలతో బ్యాంకులు దివాళా తీస్తాయని ముందు నుంచీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఆర్బీఐ.. రీషెడ్యూల్‌పై గట్టిగానే కసరత్తు చేసింది. కరువు, తుపాను ప్రభావం ఆయా మండలాల్లో పంట ఉత్పత్తులపై ఏ మేరకు ఉందో అధ్యయనం చేసింది. గత ఏడాది సాగు పరిస్థితిని, పంటల దిగుబడుల వివరాలను సేకరించి చివరకు మూడు జిల్లాలకే రీషెడ్యూల్‌ను పరిమితం చేసింది. మెదక్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని కరువు మండలాల రైతుల రుణాలను మాత్రమే రీషెడ్యూల్ చేయడానికి నిర్ణయించింది. అదికూడా 2013 ఏప్రిల్-అక్టోబర్ మధ్య తీసుకున్న ఖరీఫ్ పంట రుణాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని... అలాగే అసలు, వడ్డీతో కలిపి లక్ష రూపాయల వరకే దీన్ని పరిమితం చేస్తున్నామని ఆర్బీఐ కార్యనిర్వాహక సంచాలకులు డాక్టర్ దీపాలీపంత్ జోషి తన లేఖలో స్పష్టం చేశారు. బంగారం తాకట్టు రుణాలు, వ్యవసాయ ఉత్పత్తులను ముందస్తుగా తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు, పాత బకాయిలు, దీర్ఘకాలికంగా చెల్లించని(క్లోజ్డ్ లోన్స్) వాటిని రీషెడ్యూల్ చేసేది లేదని కూడా తేల్చి చెప్పారు. మూడు జిల్లాల్లోని వాణిజ్యబ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, సహకారబ్యాంకులు ఇచ్చిన రుణాలు రీ షెడ్యూలవుతాయని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనల ఆధారంగా.. రిజర్వ్‌బ్యాంకు ప్రామాణిక నిబంధనలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రీషెడ్యూల్ అయిన రుణాలపై తొలి ఏడాది మారటోరియం విధిస్తామని, తర్వాతి రెండేళ్లలో వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మూడేళ్ల గడువు తర్వాత కూడా రుణం చెల్లించనిపక్షంలో బ్యాంకులు తమ రుణాన్ని రైతుల నుంచి వసూలు చేసుకునే హక్కు కలిగి ఉంటాయని వివరించారు. ఒకవేళ ఈ మొత్తాన్ని రైతులు కాకుండా ప్రభుత్వమే చెల్లించాలనుకుంటే.. రైతుల పేరిట పూర్తి నగదు రూపంలో బ్యాంకులకు ఇవ్వాల్సి ఉంటుందని దీపాలీపంత్ స్పష్టం చేశారు. ప్రస్తుత సీజన్లో రైతులకు వ్యవసాయ పనుల్లో ఇబ్బందులు తలెత్తకూడదన్న ఉద్దేశంతో రీషెడ్యూల్కు సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. రీషెడ్యూల్ అయిన జిల్లాల్లో రైతులకు కొత్త రుణాలు అందుబాటులోకి వస్తాయని లేఖలో పేర్కొన్నారు. రీషెడ్యూల్ అయ్యేది అంతంతే! ఆర్బీఐ తాజా నిర్ణయంతో రీషెడ్యూలయ్యే పంట రుణాలు రూ. వెయ్యి కోట్ల కు మించవని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. కనీసం 337 మండలాల్లో రుణాలు రీ షెడ్యూల్ అవుతాయని ఇప్పటివరకు అధికారులు విశ్వాసంతో ఉన్నారు. కానీ ఆర్బీఐ తాజా లేఖతో హతాశులయ్యారు. నిజానికి ప్రతిపాదిత కరువు మండలాలన్నింటికీ కలిపి కనీసం ఐదారు వేల కోట్ల మేరకు రుణాలు రీషెడ్యూల్ అవుతాయని భావించారు. కానీ ఆర్బీఐ పలు ఆంక్షలు విధిస్తూ.. 50 శాతం కంటే తక్కువ దిగుబడి వచ్చిన మండలాలనే పరిగణనలోకి తీసుకుంటామని నిబంధనలను తెరపైకి తేవడంతో పరిస్థితి తలకిందులైంది. లక్ష వరకు పంట రుణాలు మాఫీ చేస్తామన్న సీఎం కేసీఆర్ హామీ మేరకు ఖజానాపై దాదాపు రూ. 17,337 కోట్ల భారం పడుతుందని అంచనా. ఇప్పుడు వెయ్యి కోట్ల రుణాలకే రీషెడ్యూల్ అమలు కానున్న నేపథ్యంలో మిగిలిన రూ. 16 వేల కోట్లను ఎక్కడి నుంచి తీసుకురావాలన్నది ప్రభుత్వం ముందు న్న సవాలు. 3 జిల్లాల్లోనే రీ షెడ్యూల్ చేసి మిగి లిన జిల్లాల్లోని రైతులకు కొత్త రుణాలు రాకపోతే.. ఎదురయ్యే పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇంతకాలం ఆర్బీఐ రీషెడ్యూల్ కోసం నిరీక్షిస్తున్న కారణంగా రుణమాఫీ అమలు ప్రక్రియ ముందుకు సాగలేదు. మరోవైపు త్వరలోనే దీన్ని అమలు చేస్తామని గురువారం నిజామాబాద్ జిల్లా పర్యటనలో కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇక రుణ మాఫీపై మార్గదర్శకాలను విడుదల చేసి.. తక్షణ చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.