మరిన్ని అస్త్రాలు రెడీ..! | India is banking sector needs more reforms says RBI governor Shaktikanta Das | Sakshi
Sakshi News home page

మరిన్ని అస్త్రాలు రెడీ..!

Published Fri, Aug 28 2020 4:02 AM | Last Updated on Fri, Aug 28 2020 9:50 AM

India is banking sector needs more reforms says RBI governor Shaktikanta Das - Sakshi

ముంబై: కరోనా వైరస్‌ వల్ల ఏర్పడిన ఆర్థిక ప్రతికూల పరిస్థితులపై పోరు విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) అస్త్రాలు అయిపోలేదని గవర్నర్‌ శక్తికాంతదాస్‌ స్పష్టం చేశారు. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 4 శాతం)సహా తగిన చర్యలన్నింటినీ సకాలంలో తీసుకోడానికి ఆర్‌బీఐ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. తగిన సమయంలో చర్యలు తీసుకోడానికి అవసరమైన విధానాలు ఆర్‌బీఐ దగ్గర ఉన్నాయని సూచించిన ఆయన, అయితే వీటిని వినియోగించడానికి తగిన సమయం కోసం సెంట్రల్‌ బ్యాంక్‌ వేచిచూస్తుందని తెలిపారు.

ఈ నెల 6వ తేదీ ద్రవ్య, పరపతి విధాన ప్రకటన సందర్భంగా రెపో రేటును యథాతథంగా కొనసాగించాలన్న ఆర్‌బీఐ నిర్ణయాన్నీ ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. సరళతర ద్రవ్య, పరపతి విధానానంవైపే ఆర్‌బీఐ ఇప్పటికీ మొగ్గుచూపుతోందని ప్రకటించిన ఆయన, అవసరమైన సమయంలో ఈ మేరకు రేటు కోత నిర్ణయాలు ఉంటాయని సూచించారు. ప్రస్తుత అనిశ్చితి పరిస్థితుల్లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ), ద్రవ్యోల్బణంపై ఒక అంచనాకు రాలేకపోతున్నామని ఆయన వెల్లడించారు. కరోనా ప్రభావం తగ్గడంతోనే దీనిపై ఒక నిర్ణయానికి రాగలమని పేర్కొన్నారు. ఒక ఫైనాన్షియల్‌ దినపత్రిక నిర్వహించిన వెబినార్‌లో ఆయన చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...

► రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చర్యలు ఆర్థిక వ్యవస్థపై పనిచేయడం లేదనీ, వడ్డీరేట్లు పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయని ఈ పరిస్థితి మాంద్యానికి దారితీస్తుందని పేర్కొనడం సరికాదు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఏవీ చోటుచేసుకోకుండా తగిన  చర్యలు ఉంటాయి. తగిన సమయంలో రెపోరేటు కోత నిర్ణయం ఉంటుంది.
 
► వడ్డీరేట్ల తగ్గింపు ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధికి దోహదపడుతుంది. రేటు కోత ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించడానికి బ్యాంకులు మరిన్ని చర్యలు తీసుకోవాలి.  

► కోవిడ్‌–19 సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి కేంద్రం చర్యలు పటిష్టంగా ఉన్నాయి.  సెంట్రల్‌ బ్యాంక్‌ పరిశీలనలోకి వచ్చిన అంశాన్నే నేను చెబుతున్నాను.
 
► ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన వ్యూహం హర్షణీయం. భారీ బ్యాలెన్స్‌ షీట్స్‌ ఉన్న బ్యాంకుల వల్ల ప్రయోజనం ఉంటుంది. గ్లోబల్‌ బ్యాంకులకు భారత్‌ బ్యాంకింగ్‌ పోటీ ఇవ్వగలుగుతుంది.  

► మొండిబకాయిలను దృష్టిలో ఉంచుకుని రుణాల మంజూరు, పంపిణీ విషయంలో  బ్యాంకింగ్‌ మరీ ఆందోళన చెందాల్సిన పనేమీలేదు. అది ‘‘తనంతట తానుగా ఓడిపోవడం లాంటిదే. (రుణ వృద్ధి రేటు 6 శాతం దిగువకు పడిపోవడం వల్ల మొండిబకాయిల భయాలతో బ్యాంకులు మరీ భయపడిపోయి, రుణ మంజూరీలకు వెనుకడుగువేస్తున్నాయా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యం). ఇలాంటి ధోరణి వల్ల బ్యాంకింగ్‌ తన ఆదాయ వనరులను తానే అడ్డుకున్నట్లు అవుతుంది. దీనితో తన కనీస అవసరాలను సైతం సమీకరించుకోలేకపోతుంది. ఇలాంటి ధోరణి బ్యాంకింగ్‌లో ఎంతమాత్రం మంచిదికాదు.   

► రుణాల మంజూరీకి ముందు ఆయా వ్యాపారాల పరిస్థితి ఎలా ఉందన్న విషయాలను ఒక్కసారి గమనించండి. దీనివల్ల రుణాలు పొందే విషయాల్లో జరిగే మోసాలను ముందు పసిగట్టవచ్చు. 2018–19లో రూ.71,500 కోట్ల బ్యాంకింగ్‌ మోసాలు జరిగితే, అటు తర్వాత 2020 జూన్‌ నాటికి ఈ మొత్తం రూ.1.85 లక్షల కోట్లకు చేరాయి.

► భారత్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ ఎప్పుడూ పటిష్టంగా, స్థిరంగా కొనసాగుతోంది. అయితే కోవిడ్‌–19 నేపథ్యంలో బ్యాంకింగ్‌ వద్ద మూలధన సమస్యలు తలెత్తాయి.  

► ఈ నెలాఖరుతో ముగిసిపోనున్న ‘‘మారటోరియం’’ తాత్కాలిక పరిష్కార మార్గమే. దీనిని దీర్ఘకాలికంగా కొనసాగించలేము. ఆరు నెలల మారటోరియం ముగిసిపోతే, మొండిబకాయిలు భారీగా పెరిగిపోతాయన్న ఆందోళన ఉంది. అయితే ఒక కొత్త ప్రణాళిక కింద  కొత్త మారటోరియం విధానం తీసుకురావడం, లేదా అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత మారటోరియంనే కొనసాగించడం వంటి చర్యలను బ్యాంకులు చేపట్టవచ్చు.  

► కంపెనీల రుణ పునర్‌వ్యవస్థీకరణ విషయంలో నియమించిన నిపుణుల కమిటీ త్వరలో తన  సిఫారసులను చేయనుంది. అనంతరం ఈ విషయంలో అనుసరించాల్సిన విధానాలను సెప్టెంబర్‌ 6 లోపు ప్రకటిస్తాం.

రుణానికి–డిమాండ్‌కు సంబంధం...
రుణ వృద్ధికీ, డిమాండ్‌కు సంబంధం ఉంటుంది. గతంలో వలెనే బ్యాంకింగ్‌ ఇప్పుడూ రుణాలు ఇవ్వడం లేదన్న సాధారణ అభిప్రాయాన్ని గవర్నర్‌ తెలియజేశారు. అయితే రుణానికి డిమాండ్‌ తగినంతలేదు. పెట్టుబడులు తక్కువగా ఉన్న పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు దీనికి నేపథ్యం.  

– రజ్‌నీష్‌ కుమార్, ఎస్‌బీఐ చైర్మన్‌  

డిమాండ్‌ లేకపోవడమే ఇబ్బంది...
రుణాల మంజూరీకి బ్యాం కులు వెనుకంజ  వేయడం లేదు. డిమాండ్‌ లేకపోవడమే అసలు సమస్య. 2016లో మొండిబకాయిలపై ఆర్‌బీఐ కఠిన నిబంధనలు తెచ్చిననాటి సమస్య మొదలైంది. దివాలా కోడ్‌ (ఐబీసీ) పరిస్థితిని ఇంకాస్త దిగజార్చింది. ఇప్పుడు కరోనా మిగిలిన డిమాండ్‌ను చంపేసింది.  

– ఎస్‌ మల్లిఖార్జున రావు,  పీఎన్‌బీ సీఈఓ

బ్యాంకింగ్‌ను అనడం సరికాదు...
రుణాలు ఇవ్వడానికి భయపడిపోవద్దని చెబుతూ, ఈ విషయంలో బ్యాంకింగ్‌పైనే ఎందుకు బాధ్యత పెడుతున్నారో నాకు తెలియడంలేదు. మేము మంచి ప్రాజెక్టులకే రుణాలను ఇస్తున్నాము. ఇక్కడ ఏ బ్యాంకునూ అనడానికి లేదు. రుణాలను తేలిగ్గా మంజూరు చేసే మొత్తం వ్యవస్థే దెబ్బతింది.  

– రాజ్‌కిరణ్‌  రాయ్, యూనియన్‌ బ్యాంక్‌ సీఈఓ

మా బ్యాంక్‌లో 20 శాతం వృద్ధి...
జూన్‌ త్రైమాసికంలో మా బ్యాంక్‌ కీలక వడ్డీ ఆదాయంలో 20 శాతం వృద్ధిని నమోదుచేసింది. బ్యాంక్‌ భారీ రుణ వృద్ధిని ఇది ప్రతిబింబిస్తోంది. ఇక్కడ రుణాల మంజూరీ విషయంలో వెనుకంజవేయడమనే ప్రశ్నేలేదు. బ్యాంకింగ్‌ పటిష్ట, సమర్థవంతమైన విధానాలను అవలంబించడమే కీలకం.  

– ఆదిత్య పురి, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సీఈఓ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement