
న్యూఢిల్లీ: కరోనా కష్టకాలంలో నెలవారీ రుణ (ఈఎంఐ) చెల్లింపులపై ఆగస్టు వరకూ విధించిన ఆరు నెలల మారటోరియం సమయంలో వడ్డీ వసూలు అంశంపై కేంద్రం రెండు, మూడు రోజుల్లో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇందుకు సంబంధించిన పిటిషన్ విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అత్యున్నత న్యాయస్థానానికి సోమవారం ఈ విషయాన్ని తెలిపారు. అక్టోబర్ 1న ఈమేరకు అఫిడవిట్‌ను దాఖలు చేస్తామని కూడా కేంద్రం తరఫున ఆయన న్యాయస్థానానికి తెలిపారు. దీనితో జస్టిస్ అశోక్ భూషన్, జస్టిస్ ఆర్ సుభాషన్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం కేసు తదుపరి విచారణను అక్టోబర్ 5కు వాయిదా వేసింది.
ఈ కేసుకు సంబంధించి పారిశ్రామిక, వాణిజ్య వర్గాలు, వ్యక్తులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై కూడా అక్టోబర్ 5న విచారణ జరుపుతామని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. అక్టోబర్ 5వ తేదీన ఆయా వర్గాల వాదనలకు వీలుగా కేంద్రం అక్టోబర్ 1న సుప్రీంకోర్టులో దాఖలు చేయనున్న అఫిడవిట్‌ను ఈ కేసులో ఇతర పార్టీలకూ ముందుగానే అందజేయాలన్న బెంచ్ సూచనను పాటిస్తామని సొలిసిటర్ జనరల్ పేర్కొన్నారు. అక్టోబర్ 5వ తేదీనే ఈ కేసులో తుది తీర్పు ఇస్తామని కూడా సుప్రీంకోర్టు సూచించింది. మారటోరియం సమయంలో వడ్డీని అసలుకు కలిపి, అటుపై ఈఎంఐలను లెక్కిస్తే, అది వడ్డీపై వడ్డీగానే భావించాల్సి ఉంటుందని ఇప్పటికే సుప్రీకోర్టు వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment