కరోనా కారక సంక్షోభంలో రుణగ్రహీతలు ఇక్కట్లు పడకుండా ఉండేందుకు రుణాల ఈఎంఐ చెల్లింపులపై విధించిన మారిటోరియాన్ని మరో మూడునెలలు పొడిగిస్తున్నట్లు ఆర్‌బీఐ తాజాగా ప్రకటించింది. దీంతో కస్టమర్లకు మొత్తం ఆరునెలల పాటు ఈఎంఐలపై మారిటోరియం విధించినట్లు కానుంది. ఇది కస్టమర్లకు కొంతమేర సంతోషం కలిగించే అంశమైనా, బ్యాంకులకు ఇబ్బందికలిగించే విషయమని, దీని కారణంగా డిఫాల్టులు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం బ్యాంకులు రిటైల్ కస్టమర్లకు ఆప్ట్‌అవుట పద్ధతిపై హోల్‌సేల్ కస్టమర్లకు ఆప్ట్ ఇన్ పద్దతిపై మారిటోరియం సదుపాయం కల్పిస్తున్నాయి.
ఎంత ఉన్నాయి?
బ్యాంకులవారీగా చూస్తే ప్రస్తుతం బంధన్‌బ్యాంకు ఇచ్చిన రుణాల విలువలో 71 శాతం మారిటోరియం కింద ఉన్నాయి. ఆర్‌బీఎల్ రుణాల విలువలో 35 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్, కోటక్‌బ్యాంకుల్లాంటి దిగ్గజాల రుణాల విలువలో 26-30 శాతం మేర మారిటోరియం కిందకు వస్తున్నాయి. 2008 సమయంలో ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయడంతో సాగు రంగంలో ఎన్‌పీఏలు 2012నాటికి 18 శాతానికి పెరిగాయి. నోట్లరద్దువేళ ఇచ్చిన మారిటోరియంతో ఎంఎఫ్‌ఐల ఆస్తుల నాణ్యత దెబ్బతిన్నది. ఇప్పుడు పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని, ప్రస్తుతం ఎకానమీ పూర్తిగా స్తంభించిందని, అన్ని రంగాలు ఒత్తిడిలో ఉన్నాయని నిపుణులు గుర్తు చేస్తున్నారు. దీనివల్ల రుణాల చెల్లింపు మరింత ఆలస్యం కావచ్చంటున్నారు.
ఎందుకు కష్టం?
ఆరునెలల మారిటోరియం అనంతరం ఏడో నెల ఆరంభంలో రుణగ్రహీత ఆరునెలల వడ్డీని కలిపి చెల్లించాల్సిఉంటుందని, దీంతో చాలామంది కట్టకుండా ఎగ్గొట్టవచ్చని ప్రభుదాస్‌లీలాధర నిపుణుడు అజయ్ హెచ్చరించారు. వేతనాలు లేని ఈ వేళ అంతమొత్తం ఒకేసారి కట్టాలంటే కస్టమర్లకు ఇబ్బంది అవుతుందని, ఇది బ్యాంకుల పద్దులపై ప్రభావం చూపుతుందని చెప్పారు. ఈఎంఐల మారిటోరియం కన్నా రుణ పునర్‌వ్యవస్థీకరణకు ఆర్‌బీఐ అనుమతించిఉండాల్సిందన్నారు. రిటైల్ ఇన్వెస్టర్లకు ప్రధాన ఆదాయ వనరు జీతమేనని, ఇప్పుడున్న సందర్భంలో సరైన వేతనాల్లేక పెద్ద మొత్తాలు కట్టడం ఇబ్బందిగామారి రిటైలర్లు ఎక్కువగా డిఫాల్ట్ కావచ్చని కొందరి అంచనా. ఇందుకే రిటైల్ రుణాలెక్కువున్న బ్యాంకు షేర్లలో అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. లాక్‌డౌన్ పూర్తయి ఎకానమీలో అన్ని కార్యకలాపాలు పుంజుకుంటేనే బ్యాంకులకు తగిలిన ఎదురుదెబ్బలపై స్పష్టత వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అసలేంటీ మారిటోరియం?
మార్చి ప్రకటన అనంతరం చాలామంది కస్టమర్లు ఈ సదుపాయం వినియోగించుకున్నట్లు బ్యాంకులు తెలిపాయి. ముఖ్యంగా అగ్రి, మైక్రో, కమర్షియల్ వాహనాలు, క్రెడిట్ కార్డుల బకాయిలకు మారిటోరియం విజ్ఞప్తులు అధికంగా వచ్చాయి. లాక్‌డౌన్ కారణంగా ఆదాయాలు నిలిచిపోవడంతో కస్టమర్లు రుణ వాయిదాలు కట్టేందుకు ఇబ్బంది పడకూడదని ఆర్‌బీఐ ఈ వెసులుబాటు ఇచ్చింది. మారిటోరియం సదుపాయం వినియోగించుకున్న వాళ్లు ఈ వాయిదాలను తర్వాత కాలంలో చెల్లించాల్సిఉంటుంది. ఈ సదుపాయం వినియోగించుకొని వాయిదాలు చెల్లించలేకపోతే క్రెడిట్ స్కోర్‌పై ఎలాంటి నెగిటివ్ ప్రభావం ఉండదు. ఈ సదుపాయాన్ని ఈఎంఐ హాలిడే అని కూడా అంటారు. లాక్‌డౌన్ పూర్తయిన తర్వాత కస్టమర్లు తిరిగి ఈఎంఐలు చెల్లించేందుకు సమయం పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
మారిటోరియం పొడిగింపుతో మరిన్ని డిఫాల్ట్స్!
Published Fri, May 22 2020 12:05 PM | Last Updated on Fri, May 22 2020 12:05 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment