ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి తప్పుడు మార్గాల్లో రూ.28వేల కోట్లకు పైగా రుణాలు పొంది బురిడీ కొట్టించారని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్లు పైబడిన 79 మోసాల కేసుల్లో మొత్తం రూ.28,797.03 కోట్ల మేర మోసాలకు గురైనట్లు తెలిపింది. ఇందులో అత్యధికంగా
పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.7,111.52 కోట్ల మోసం జరిగింది.
నిధుల మళ్లింపు, ఖాతా పుస్తకాల్లో వివరాలు తప్పుగా సూచించడం, తారుమారు చేయడం, రుణగ్రహీతలు తప్పుడు ఆర్థిక నివేదికలు సమర్పించడం, నిర్దేశించిన ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని పాటించకపోవడమే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మోసాలకు ప్రధాన కారణంగా తేలిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. రుణగ్రహీతలు మూడో పార్టీ ఏజెన్సీలు, న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్లు కుమ్మక్కు కావడం కూడా ప్రధాన కారణమని తెలిపింది.
ఈ నేపథ్యంలో.. బ్యాంకు మోసాలను నివారించేందుకు ఆన్‌లైన్‌లో శోధించదగిన డేటాబేస్, సెంట్రల్ ఫ్రాడ్ రిజిస్ట్రీ రూపంలో గుర్తించనున్నట్లు పేర్కొంది. మోసాలను నియంత్రించడం క్రెడిట్ మంజూరు ప్రక్రియలో తగిన శ్రద్ధ వహించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేసినట్లు వివరించింది. అలాగే, బ్యాంకుల్లో జరిగిన మోసాల కేసులను లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు, పోలీసుస్టేషన్లు, సీబీఐ తదితరాల ద్వారా విచారణకు ఆదేశిస్తున్నట్లు ఆ శాఖ తెలిపింది. అంతేకాక.. ప్రత్యేక కమిటీ ద్వారా కేసులను పర్యవేక్షించడంతో పాటు బ్యాంకు బోర్డుల ఆడిట్ కమిటీల ముందు త్రైమాసిక సమాచారాన్ని ఉంచడం ద్వారా ఈ మోసాలపై వార్షిక సమీక్ష చేస్తున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది.
2021–22లో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ.100 కోట్లు అంతకంటే ఎక్కువ జరిగిన మోసాలు.. (రూ.కోట్లలో)
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
బ్యాంకు మోసాలు విలువ
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
బ్యాంక్ ఆఫ్ బరోడా 9 2,860.85
బ్యాంక్ ఆఫ్ ఇండియా 15 4,668.00
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 2 896.30
కెనరా బ్యాంక్ 6 2,774.26
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 388.24
ఇండియన్ బ్యాంక్ 7 1,628.36
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 3 874.76
పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్ 2 364.03
పంజాబ్ నేషనల్ బ్యాంక్ 13 7,111.52
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 12 4,856.71
యూకో బ్యాంక్ 1 374.96
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6 1,999.31
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
Comments
Please login to add a commentAdd a comment