సాక్షి, హైదరాబాద్: మహిళా సంఘాలకు రుణాలు అందడమే కష్టంగా మారుతుంటే, బ్యాంకులు వారిని మరింత ఇబ్బంది పెడుతున్నాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్ల సేకరణలో భాగంగా తమ ప్రతాపాన్ని మహిళా సంఘాలపై చూపిస్తున్నాయి. రుణాలిచ్చే సమయంలోనే పది శాతం మొత్తాన్ని బలవంతంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయించుకుంటున్నాయి. ఇలా ఎందుకు డిపాజిట్ చేయాలని అడిగితే, అ దంతే అన్న సమాధానం ఒక్కటే బ్యాంకర్ల నుంచి వస్తోందని మహిళా సంఘాలు చెబుతున్నాయి.
ఈ విషయంలో గట్టిగా నిలదీస్తే మరోసారి రుణం ఇవ్వరేమో అనే అనుమానంతో వారు చెప్పినట్టే చేస్తున్నామని పేర్కొంటున్నాయి. ఈ ఏడాది రూ. 12 వేల కోట్ల మేర రుణాలను మహిళా సంఘాలకు ఇవ్వాలని బ్యాంకులు నిర్ణయించాయి. ఈ లెక్కన అందులో దాదాపు రూ.వెయ్యి కోట్ల మేరకు తిరిగి బ్యాంకులే ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో అట్టిపెట్టుకునే అవకాశం ఉంది. ప్రధాన జాతీయ బ్యాంకులు ఈ విధంగా వ్యవహరిస్తున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మహిళా సంఘాలకు ఇచ్చే రుణాల నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్లు వసూ లు చేసుకోవడం సరికాదని రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులు బ్యాంకర్లకు ఎన్నిమార్లు స్పష్టంచేసినా వారి తీరు మారడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లే కాదు.. మహిళా సంఘాల నుంచి వడ్డీ కూడా కట్టించుకోవద్దని బ్యాంకర్ల సమావేశాల్లో ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో బ్యాంకర్లు మాత్రం పట్టించుకోవడం లేదు. అసలుతోపాటు వడ్డీని కూడా వసూలు చేస్తున్నాయి.
దీంతో వడ్డీలేని రుణాలు అమలు కావడంలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం బ్యాంకులకు తర్వాత వడ్డీ చెల్లిస్తున్నా.. తాము వడ్డీతోనే వాయిదాలు చెల్లిస్తున్నామని మహిళా సంఘాల సభ్యులు చెబుతున్నారు. బ్యాంకులకు చెల్లించాల్సిన వడ్డీని ముందస్తుగా చెల్లించాలని బ్యాంకర్లు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోకుండా మూడు లేదా నాలుగు నెలలకోమారు వడ్డీ చెల్లిస్తుండడం ఇబ్బందులు కలిగిస్తోందని పేర్కొంటున్నారు. మహిళా సంఘాలు, ప్రభుత్వం కలిపి నిర్వహిస్తున్న ‘స్త్రీనిధి’ సంస్థ సైతం సర్కారు నుంచి సకాలంలో వడ్డీ అందకపోవడంతో బ్యాంకులకు అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. గత మార్చి నుంచి చెల్లించాల్సిన రూ.23 కోట్ల వడ్డీని అక్టోబర్ చివరి వరకు ఇవ్వకపోవడంతో రూ.1.29 కోట్ల అధిక వడ్డీని బ్యాంకులకు చెల్లించాల్సి వచ్చిందని ఆ సంస్థ ప్రభుత్వానికి వివరించింది.
మహిళా సంఘాలపై బ్యాంకుల ప్రతాపం!
Published Tue, Nov 26 2013 12:24 AM | Last Updated on Thu, Apr 4 2019 5:22 PM
Advertisement