కేరళలో వయనాడ్ విపత్తు బాధితుల పట్ల బ్యాంకులు వ్యవహరిస్తున్న తీరుపై కేరళ ప్రభుత్వం అసంతృప్తిని వ్యక్తం చేసింది. బాధితుల ఖాతాల నుంచి రుణాల ఈఎంఐలను కట్ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఈ రుణాలను బ్యాంకులు పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్ చేసింది.
ఈ రుణాలను మాఫీ చేయడం వల్ల బ్యాంకులకు భరించలేని నష్టమేమీ వాటిల్లదని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. తిరువనంతపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో సీఎం విజయన్ మాట్లాడుతూ.. బాధితుల వడ్డీ మొత్తాలలో సడలింపు లేదా నెలవారీ వాయిదాలను చెల్లించడానికి సమయాన్ని పొడిగించడం పూర్తి పరిష్కారం కాదన్నారు.
గత జులై 30న జరిగిన భయానక దుర్ఘటన ప్రభావాన్ని, మిగిల్చిన శోకాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ విపత్తులో 200 మందికి పైగా మరణించారు. అనేక మంది గాయపడ్డారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. రుణాలు తీసుకున్న వారిలో చాలా మంది చనిపోయారని, విపత్తు కారణంగా వారి భూమి నిరుపయోగంగా మారిందని ఆయన గుర్తు చేశారు. అలాగే ఇల్లు కట్టుకోవడానికి అప్పు తీసుకున్న వారు ఇంటినే పోగొట్టుకున్నారని తెలిపారు. అలాంటి వారు ఇప్పుడు ఈఎంఐలు చెల్లించే పరిస్థితి లేదు. బాధితులు తీసుకున్న మొత్తం రుణాలను మాఫీ చేయడమే మన చేయగల మేలు అని సీఎం విజయన్ సూచించారు.
సాధారణంగా బ్యాంకులు మాఫీ చేసిన మొత్తానికి సంబంధించిన బిల్లును ప్రభుత్వం చెల్లించాలని ఆశిస్తాయనీ, అయితే ఈ సమస్యపై అలాంటి వైఖరి తీసుకోవద్దని సీఎం విజయన్ అన్నారు. ఈ మొత్తాన్ని బ్యాంకులు సొంతంగా భరించాలని ఆయన కోరారు. కొండచరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయిన కొందరి ఖాతాల నుంచి ఈఎంఐలు కట్ చేసిన కేరళ గ్రామీణ బ్యాంకుపై నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సమయంలో యాంత్రికంగా ఉండకూడదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment