అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై లంచం ఆరోపణల కేసు నమోదైనందున ఇకపై రుణదాతల ధోరని మారుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అదానీ గ్రూప్‌నకు భారీగా రుణాలు మంజూరు చేసిన బ్యాంకుల్లో ఎస్‌బీఐ మొదటి స్థానంలో ఉంది. అయితే ఎస్‌బీఐతోపాలు వివిధ బ్యాంకులు అదానీ గ్రూప్‌నకు గతంలో జారీ చేసిన రుణాలు, తాజాగా విడుదల చేసిన అప్పులకు సంబంధించి సమీక్ష ప్రారంభించించాయి. ఎస్‌బీఐ తర్వాత అదానీ గ్రూప్‌నకు అధిక మొత్తంలో లోన్లు ఇచ్చిన బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్‌లు అప్పుల వివరాలను సమీక్షిస్తున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వెల్లడించాయి.
పాత అప్పులపై మార్పులు ఉండకపోవచ్చు..
ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్ వివరాల ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) అదానీ గ్రూప్‌నకు సుమారు రూ.33,500 కోట్ల అప్పు ఇచ్చింది. ఈ అప్పుతో ప్రారంభించిన పలు ప్రాజెక్ట్‌లు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. అయితే ఈ దశలో అప్పులపై రివ్యూ చేసి వాటిని నిలిపివేసే అవకాశాలు ఎస్‌బీఐకు లేవని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ తాజాగా బ్యాంకులు అందించిన అప్పులపై మాత్రం కొంత మార్పులు చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
కేరళ-అదానీ పోర్ట్స్ ఒప్పందం
అదానీ గ్రూప్‌పై పలు ఆరోపణలు చెలరేగుతున్న తరుణంలో కేరళ ప్రభుత్వం అదానీ పోర్స్ట్ కంపెనీతో కీలక ఒప్పందం చేసుకుంది. కేరళ ప్రభుత్వం తిరువనంతపురంలోని విజింజామ్ పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి కోసం అదానీ గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. 2028 వరకు దీని పనులు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు.
ఇదీ చదవండి: నకిలీ షాపింగ్ వెబ్‌సైట్లు.. తస్మాత్ జాగ్రత్త!
అదానీకి బాసటగా..
మరోవైపు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్‌నకు కొందరు ఇన్వెస్టర్లు బాసటగా నిలుస్తున్నారు. గౌతమ్ అదానీ తదితరులపై అమెరికాలో ఆరోపణలు వచ్చినప్పటికీ తమ పెట్టుబడుల విషయంలో పునరాలోచనేమీ లేదని అబు ధాబీకి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ (ఐహెచ్‌సీ) వెల్లడించింది. హరిత ఇంధనం, పర్యావరణ అనుకూల రంగాల్లో అదానీ గ్రూప్ చేస్తున్న కృషిపై తమకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొంది. ఐహెచ్‌సీ 2022లో అదానీ గ్రీన్ ఎనర్జీ (ఏజీఈఎల్), అదానీ ట్రాన్స్‌మిషన్‌లో (ఏటీఎల్) 500 మిలియన్ డాలర్లు(రూ.4151 కోట్లు), అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో 1 బిలియన్ డాలర్లు(రూ.83,020 కోట్లు) ఇన్వెస్ట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment