నకిలీ షాపింగ్‌ వెబ్‌సైట్లు.. తస్మాత్‌ జాగ్రత్త! | Fake shopping websites are a growing concern especially in the holiday season | Sakshi
Sakshi News home page

నకిలీ షాపింగ్‌ వెబ్‌సైట్లు.. తస్మాత్‌ జాగ్రత్త!

Published Mon, Nov 25 2024 2:17 PM | Last Updated on Mon, Nov 25 2024 2:17 PM

Fake shopping websites are a growing concern especially in the holiday season

సునీల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఫార్మల్‌షాప్‌’ పేరుతో ఓ యాడ్‌ చూశాడు. ‘బ్రాండెడ్‌ దుస్తులు తక్కువ ధరకే అందిస్తున్నాం. ఈ ఆఫర్‌  లిమిడెట్‌ పీరియడ్‌ మాత్రమే. స్టాక్‌ అయిపోయిందంటే మాత్రం మీరు నష్టపోతారు. త్వరపడండి’ అంటూ ప్రకటన సారాంశం. వెంటనే సునీల్‌ లింక్‌పై క్లిక్‌ చేశాడు. తనుకు కావాల్సిన దుస్తులు సెలక్ట్‌ చేసుకున్నాడు. 10 రోజుల రిటర్న్‌ పాలసీ, క్యాష​్‌ ఆన్‌ డెలివరీ సదుపాయం ఉండడంతో ఎలాంటి అనుమానం చెందకుండా ఆర్డర్‌ బుక్‌ చేశాడు. ఇంటికి డెలివరీ అయిన తన ఆర్డర్‌ను తీసుకుని డబ్బు చెల్లించాడు. తీరా ప్యాక్‌ ఓపెన్‌ చేసి చిరిగిన, క్వాలిటీ లేని దుస్తులు ఉన్నాయని గ్రహించాడు. వెంటనే లింక్‌పై క్లిక్‌ చేసి రిటర్న్‌ పెట్టేందుకు ప్రయత్నించాడు. కానీ అసలు ఆ ఆప్షన్‌ కనిపించలేదు. మెయిల్‌ చేసినా స్పందన కరవైంది. హెల్ప్‌లైన్‌ నంబర్‌ పనిచేయకపోవడంతో మోసపోయానని గ్రహించాడు.

ఆన్‌లైన్‌ షాపింగ్‌ పెరుగుతుండడంతో ఇలాంటి మోసాలు ఎక్కువవుతున్నాయి. సైబర్‌ కేటుగాళ్లు నకిలీ వెబ్‌సైట్లు రూపొందించి ఆకర్షణీయ ఆఫర్లంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇస్తూ వాట్సప్‌కు లింక్‌లు పంపుతున్నారు. కస్టమర్లకు ఏమాత్రం అనుమానం రాకుండా వ్యవహరిస్తున్నారు. తీరా బుక్‌ చేస్తే నకిలీ ఉత్పత్తులను పంపి మోసిగిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో కింది జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

పాటించాల్సిన జాగ్రత్తలు

  • ఆన్‌లైన్‌ షాపింగ్‌ కోసం ప్రముఖ వెబ్‌సైట్లనే వినియోగించాలి.

  • అధికారిక పోర్టల్స్, యాప్‌లను మాత్రమే వినియోగించాలి. ఎలాంటి లింక్‌లపై క్లిక్‌ చేయకూడదు.

  • ప్రతి వెబ్‌సైట్‌లో ‘కాంటాక్ట్‌ అజ్‌’ అనే విభాగంలో సంస్థకు చెందిన చిరునామా, అధికారిక మెయిల్‌ చిరునామా వివరాలు ఉంటాయి. అవిలేని సంస్థ సేవలు వినియోగించకూడదు.

  • కొన్ని సంస్థలు తప్పుడు చిరునామాను కూడా వెబ్‌సైట్‌లో ఉంచే ప్రమాదం ఉంది. ఆ అడ్రస్‌ను నెట్‌లో సెర్చ్‌ చేస్తే కార్పొరేట్‌ కార్యాలయం వివరాలు వస్తాయి. అలా ఒకసారి సరిచూసుకోవాలి.

  • ‘క్యాష్‌ ఆన్‌ డెలివరీ’ విధానంలోనే ఆర్డర్‌ బుక్‌ చేసుకోవడం మేలు. డెలివరీ బాయ్‌ ఆర్డర్‌ డెలివరీ అందించి దాన్ని ఓపెన్‌ చేసేలా చూసుకోవాలి.

    పార్శిల్‌ తెరిచేటప్పుడు కచ్చితంగా వీడియో రికార్డు చేయండి. ఇది మనకు ఆధారంగా ఉంటుంది.

  • మోసం జరిగితే  consumerhelpline.gov.in కు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. నేషనల్‌ కన్జూమర్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1800-11-4000 (ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 5:30 మధ్య) ఫోన్‌ చేయవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement