
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా క్లిష్ట సమయంలో సాధారణ పౌరులు, మధ్యతరగతి ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో వారికి ఉపశమనం కలిగించేలా సుప్రీంకోర్టులో ఓ వ్యాజ్యం దాఖలైంది. ఆగస్ట్ 31తో ముగియనున్న మారటోరియం గడువును కోవిడ్ దృష్ట్యా డిసెంబర్ 31 వరకు పొడించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు న్యాయవాది విశాల్ తివారీ తన పిటిషన్ పలు కీలక అంశాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. కరోనా వైరస్ ధాటికి ప్రజల జీవితాలు అతలాకుతలం అయ్యాయని వివిధ అవసరాల కోసం తీసుకున్న లోన్లు చెల్లించే పరిస్థితిలో వారు లేరని పేర్కొన్నారు. లాక్‌డౌక్ కారణంగా పరిశ్రమలు మూతపడటంతో కార్మికులు ఉపాధి అవకాశాలు కోల్పోయారని వివరించారు. ఈ నేపథ్యంలో మారిటోరియం గడువును డిసెంబర్ 31 వరకు పెంచేలా కేంద్ర ప్రభుత్వాన్ని, ఆర్‌బీఐ, వివిధ బ్యాంకులను ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై వచ్చే వారం ధర్మాసనం విచారణ చేపట్టే అవకాశం ఉంది.
కాగా బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్ల్‌ను తిరిగి చెల్లించేందుకు మారటోరియం రూపంలో కేంద్ర ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. ఆ గడువు కాస్తా ఆగస్ట్ 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో గడువును మరికొంత కాలం పొడించాలని పలు వర్గాల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. అయితే బ్యాంకింగ్ రంగాలు మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా ఎస్‌బీఐ మారటోరియం పొడిగింపుకు ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు కావడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై సుప్రీం, కేంద్ర ప్రభుత్వాల స్పందన ఏ విధంగా ఉంటుందనేది ఆసక్తిరేపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment