సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారి కాలంలో రుణ గ్రహీతలకు కల్పించిన రుణ మారటోరియం పరిధిని ఇక మీదట పొడిగించడం సాధ్యం కాదని కేంద్రం తేల్చి చెప్పింది. రుణ మారటోరియం కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో కేంద్రం, ఆర్‌బీఐ పేర్కొంది. ఆరు నెలలకు మించి ఉపశమనం ఇవ్వడం సాధ్యం కాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. దెబ్బతిన్న ఆయా రంగాలకు మరింత ఆర్థిక ఉపశమాన్ని అందించలేదని వెల్లడించింది. మారటోరియం కాలంలో 2 కోట్ల రూపాయల వరకు రుణాలపై 'వడ్డీపై వడ్డీని' వదులుకోవడంపై ప్రభుత్వం గతంలో ఇచ్చిన అఫిడవిట్ సంతృప్తికరంగా లేదని, క్రెడాయ్ లాంటి సంఘాల వాదనలను పరిశీలించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో కేంద్రం ఈ క్లారిటీ ఇచ్చింది. (మారటోరియం వడ్డీ మాఫీ: విచారణ వాయిదా)
నిర్దిష్ట సెక్టార్ ఆధారిత ఆర్థిక ఉపశమన వివరాల్లోకి కోర్టు వెళ్లకూడదంటూ తాజా అఫిడవిట్‌లో ఆర్‌బీఐ, ప్రభుత్వం పేర్కొన్నాయి. మారటోరియం వ్యవధి ఆరునెలలకు మించితే మొత్తం చెల్లింపుల తీరు, ప్రక్రియపై ప్రభావం చూపుతుందని ఆర్‌బీఐ తెలిపింది. ఈ చర్య రుణ గ్రహీతలపై ఒత్తిడిని పెంచుతుందని కూడా వాదించింది. వడ్డీ మీద మాఫీ చేయడమే కాకుండా, మరే ఇతర ఊరట కల్పించినా దేశ ఆర్థిక వ్యవస్థకు, బ్యాంకింగ్ రంగానికి తీరని నష్టం వాటిల్లుతుందని ప్రభుత్వం వెల్లడించింది. కోవిడ్-19 కి ముందు రియల్ ఎస్టేట్, విద్యుత్ రంగాలు సంక్షోభంలో పడ్డాయని తెలిపింది. ఈ నేపథ్యంలోఈ రంగ కష్టాలను బ్యాంకింగ్ నిబంధనల ద్వారా పరిష్కరించలేమని తెలిపింది. రియల్ ఎస్టేట్, విద్యుత్ రంగాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ వివరణ ఇచ్చాయి.
కాగా ఆరు నెలల రుణ తాత్కాలిక నిషేధ కాలంలో వడ్డీపై వడ్డీ మాఫీకి కేంద్రం అంగీకారం తెలిపిన నేపథ్యంలో అదనపు అఫిడవిట్లు దాఖలు చేయడానికి ఆర్బీఐకి, కేంద్రానికి అక్టోబర్ 5న ఒక వారం సమయం ఇచ్చింది. రియల్ ఎస్టేట్ అసోసియేషన్లు క్రెడాయ్, విద్యుత్ ఉత్పత్తిదారులు లేవనెత్తిన సమస్యలను కూడా పరిశీలించాలంటూ తదుపరి విచారణ ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment