ఆర్‌బీఐ పేరుతో కాలయాపన: సుప్రీం ఆగ్రహం |  Cant hide behind RBI; think about people plight, SC tells Centre | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ పేరుతో కాలయాపన : సుప్రీం ఆగ్రహం

Published Wed, Aug 26 2020 12:33 PM | Last Updated on Wed, Aug 26 2020 1:19 PM

 Cant hide behind RBI; think about people plight, SC tells Centre - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) మంజూరు చేసిన మారటోరియం వ్యవధిలో వడ్డీ మాఫీ అంశంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఆరు నెలల రుణ మారటోరియం కాలానికి వడ్డీని మాఫీ చేసే అంశంపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని కోరింది. వడ్డీ మీద వడ్డీ విధిస్తారా అంటూ గతంలోనే ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం బుధవారం మరోసారి కేంద్రం వైఖరిపై మండిపడింది. ఆర్‌బీఐ పేరు చెప్పి ఎంతకాలం దాక్కుంటారని  వ్యాఖ్యానించింది. ఆర్థిక ఉద్దీపన వల్ల ఎంత మందికి ప్రయోజనం, నిజంగా ప్రజలకు మేలు జరిగిందా అని ప్రశ్నించింది. వ్యాపార ఉద్దేశ్యాలు పక్కనబెట్టి ప్రజలకష్టాలు తీర్చాలని సూచించింది. దీనిపై సెప్టెంబర్‌  ఒకటవ తేదీ నాటికి  పూర్తి  నివేదిక  సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. 

ఇప్పటివరకూ పరిశ్రమకు సంబంధించిన ఆందోళనలతోనే ఆర్‌బీఐ సరిపెట్టుకుందని, ప్రభుత్వం కూడా ఆర్‌బీఐ వెనుక దాక్కుంటోందని సుప్రీం విరుచుకుపడింది. వడ్డీ మాఫీ, వడ్డీపై వడ్డీ మాఫీ అంశంపై విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని పేర్కొంది. వడ్డీ మాఫీ చేయాలని కోరుతూ  దాఖలైన పిటిషన్‌పై స్పందన దాఖలు చేయాలని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది.  అనంతరం విచారణను సుప్రీం కోర్టు సెప్టెంబర్ 1 కి వాయిదా వేసింది. ప్రభుత్వం వ్యాపారం గురించి మాత్రమే  కాకుండా ప్రజల దుస్థితి గురించి కూడా ఆలోచించాలని హితవు చెప్పింది. 

రెగ్యులేటర్‌గా ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. ఒత్తిడితో కూడిన ఖాతాలను గుర్తించి, తక్కువ వడ్డీ రేట్ల పరంగా ఉపశమనం కల్పించాలని ఆర్‌బీఐ చూస్తోందని కేంద్రం తరపున వాదిస్తున్నసొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. అలాగే ఇలాంటి అభిప్రాయానికి రావద్దని సుప్రీంకోర్టును కోరారు. దీనిపై సమీక్షించి,నివేదిక అందిస్తామని మెహతా తెలిపారు. కాగా కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్ కారణంగా బ్యాంకు రుణాలపై రిజర్వు బ్యాంకు విధించిన మారిటోరియం గడువు ఆగస్టు 31తో ముగియనున్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement