సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగం బ్యాంకు లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్‌వీబీ)కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఒక నెల తాత్కాలిక నిషేధం ముగిసిన వెంటనే ఈ బ్యాంకును డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్ (డీబీఐఎల్) తో విలీనం చేయనుంది. ఈ మేరకు ఒక ముసాయిదా పథకాన్ని ఆవిష్కరించినట్లు మంగళవారం వెల్లడించింది.ఇందుకు డీబీఐఎల్ 2,500 కోట్ల రూపాయల అదనపు మూలధనాన్ని ముందస్తుగా సమకూరుస్తుందని ఆర్‌బీఐ తెలిపింది.
డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడటానికే ఈ చర్య తీసుకున్నామని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే కెనరా బ్యాంక్ మాజీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ టీఎన్‌మనోహరన్‌ను బ్యాంక్ నిర్వాహకుడిగా నియమించింది. ముసాయిదా పథకంపై ఇరు బ్యాంకుల సభ్యులు, డిపాజిటర్లు ఇతర రుణదాతల నుండి సూచనలు, అభ్యంతరాలను ఆహ్వానిస్తోంది. ఇవి 2020 నవంబర్ 20 న సాయంత్రం 5 గంటలలోపు తమకు చేరాలని ఆర్‌బీఐ తన నోటీసులో తెలిపింది. మరోవైపు లక్ష్మి విలాస్ బ్యాంక్‌పై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం మారటోరియం విధించింది. ఈ రోజు (నవంబరు, 17వ తేదీన) సాయంత్రం 6 గంటల నుంచి డిసెంబర్ 16 వరకు మారటోరియం అమలులో ఉండనుంది. మారటోరియం సమయంలో విత్‌డ్రా లిమిట్‌ను 25వేలకు కుదించింది. ఈ వెంటనే ఆర్‌బీఐ విలీన ప్రతిపాదనని ప్రకటించడం గమనార్హం.
కాగా ఇటీవల జరిగిన బ్యాంక్ వార్షిక సర్వ సభ్య సమావేశం (ఏజీఎం)లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బ్యాంకు తీరుపై ఆగ్రహంతో ఉన్న వాటాదారులు (దాదాపు 60 శాతం) భారత బ్యాంకింగ్ చరిత్రలోనే తొలిసారిగా ప్రస్తుతం తాత్కాలిక ఎండీ, సీఈఓగా ఉన్న సుందర్‌ను తిరిగి ఆ పదవిలో తిరిగి నియమించే తీర్మానాన్ని తిరస్కరించారు. దీంతో పాటు మొత్తం ఏడుగురు డైరెక్టర్లు ఎన్ సాయిప్రసాద్, గోరింక జగన్మోహన్ రావు, రఘురాజ్ గుజ్జర్, కేఆర్ ప్రదీప్, బీకే మంజునాథ్, వైఎన్ లక్ష్మీ నారాయణలను ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా తిరిగి నియమించే తీర్మానాన్ని కూడా భారీ మెజార్టీతో వ్యతిరేకించిన సంగతి విదితమే.
Comments
Please login to add a commentAdd a comment