dbs bank
-
డీబీఎస్ బ్యాంక్ సీఈవోగా రజత్ వర్మ
సింగపూర్‌కు చెందిన డీబీఎస్ గ్రూప్ (DBS) తమ డీబీఎస్ బ్యాంక్ ఇండియా సీఈవోగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా రజత్ వర్మను నియమించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆమోదం మేరకు మార్చి 1 నుండి డీబీఎస్ బ్యాంక్ ఇండియా సీఈవోగా రజత్ వర్మ బాధ్యతలు స్వీకరిస్తారని డీబీఎస్ ప్రకటించింది.ప్రస్తుతం డీబీఎస్ బ్యాంక్ ఇండియాలో ఇన్స్టిట్యూషనల్ బ్యాంకింగ్ గ్రూప్ (IBG) హెడ్‌గా ఉన్న వర్మ, ఫిబ్రవరి 28న సురోజిత్ షోమ్ రిటైర్మెంట్ తర్వాత సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కొత్త పాత్రలో వర్మ డీబీఎస్ గ్రూప్ మేనేజ్మెంట్ కమిటీలో భాగం అవుతారు.రజత్ వర్మ గురించి.. అనుభవజ్ఞుడైన బ్యాంకర్ అయిన వర్మ లావాదేవీల బ్యాంకింగ్, ఆర్థిక సంస్థలు, స్థిరమైన ఫైనాన్స్, మైక్రో అండ్ ఎస్ఎంఈ (SME) బ్యాంకింగ్, అలాగే బ్రాంచ్ బ్యాంకింగ్‌తో సహా వినియోగదారు, కార్పొరేట్ బ్యాంకింగ్‌లో 27 సంవత్సరాల ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉన్నారు.2023 జూన్‌లో ఐబీజీ హెడ్‌గా డీబీఎస్‌లో చేరినప్పటి నుండి ఆయన అన్ని క్లయింట్ విభాగాలలో వ్యాపారాన్ని గణనీయంగా అభివృద్ధి చేశారు. ఇప్పటికే ఉన్న కార్పొరేట్ సంబంధాలను మరింతగా పెంచుకోవడం, కొత్త కస్టమర్ల సముపార్జనను వేగవంతం చేయడం, విస్తృతమైన వృద్ధి రంగాలలో కొత్త అవకాశాలను గుర్తించడం ద్వారా ఇది సాధ్యమైంది.రజత్ వర్మ నాయకత్వంలో డీబీఎస్ 2024లో గ్లోబల్ ఫైనాన్స్ నుంచి సస్టైనబుల్ ఫైనాన్స్ ఇండియా బెస్ట్ బ్యాంక్‌గా ఎంపికైంది. డీబీఎస్‌లో చేరడానికి ముందు ఆయన హెచ్ఎస్బీసీ (HSBC) ఇండియాలో మేనేజింగ్ డైరెక్టర్, కమర్షియల్ బ్యాంకింగ్ కంట్రీ హెడ్‌గా ఉన్నారు.“బ్యాంకింగ్ అనుభవజ్ఞుడైన రజత్ 18 నెలల క్రితం మాతో చేరినప్పటి నుండి మా ఇండియా ఐబీజీ వ్యాపారాన్ని పటిష్టం చేశారు. మా బలమైన ప్లాట్‌ఫామ్‌తో రాబోయే సంవత్సరాల్లో భారతదేశ వృద్ధిలో పాల్గొనడాన్ని డీబీఎస్ కొనసాగిస్తుంది. రజత్ వ్యాపారాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్తారని విశ్వసిస్తున్నాను’’ డీబీఎస్ సీఈవో పీయూష్ గుప్తా పేర్కొన్నారు.డీబీఎస్ గురించి..డీబీఎస్ అనేది 19 దేశాల్లొ ఉనికిని కలిగి ఉన్న ఆసియాలో ప్రముఖ ఆర్థిక సేవల సమూహం. సింగపూర్‌లో లిస్ట్ అయిన ఈ గ్రూప్ ప్రధాన కార్యాలయం అక్కడే ఉంది. 2024లో బాధ్యతాయుతమైన బ్యాంకింగ్‌పై దాని దృష్టికి అనుగుణంగా, గ్లోబల్ ఫైనాన్స్ ద్వారా డీబీఎస్ సస్టైనబుల్ ఫైనాన్స్‌లో భారతదేశానికి ఉత్తమ బ్యాంక్‌గా ఎంపికైంది. అంతే కాకుండా 2020 నుండి 2022 వరకు వరుసగా మూడు సంవత్సరాలు ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాంకుల ఫోర్బ్స్ జాబితాలో భారత్‌లోని మొదటి 3 స్థానాల్లో డీబీఎస్ బ్యాంక్ నిలిచింది.డీబీఎస్ బ్యాంక్ భారతదేశంలో 30 సంవత్సరాలుగా ఉనికిలో ఉంది. 1994లో ముంబైలో తన మొదటి కార్యాలయాన్ని ప్రారంభించింది. డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్ భారతదేశంలోని అతిపెద్ద విదేశీ బ్యాంకులలో మొదటిది. దేశంలోని పెద్ద, మధ్యస్థ, చిన్న సంస్థలు, వ్యక్తిగత వినియోగదారులకు విస్తృత సేవలు అందిస్తోంది. 2020 నవంబర్‌లో లక్ష్మీ విలాస్ బ్యాంక్ డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్‌లో విలీనమైంది. డీబీఎస్ బ్యాంక్ ఇండియా ఇప్పుడు భారత్‌లోని 19 రాష్ట్రాల్లో సుమారు 500 శాఖల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. -
మహిళలంటే షాపింగేనా? ఆర్థిక విషయాల్లో వారి ప్లాన్స్ తెలిస్తే !
మహిళలు షాపింగ్ చేయడంలో ముందుంటారు. కానీ, కుటుంబ శ్రేయస్సు కోసం ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం వెనకుంటారు.. అనేది నాటి మాట. నేడు ఈ మాటను తిరుగ రాస్తోంది మెట్రో మహిళ. ఈ విషయాన్ని డీబీఎస్బ్యాంక్, ఇండియన్ క్రిసిల్ చేసిన సర్వేలో స్పష్టమైంది. మెట్రో నగరాలలో జీవిస్తున్న భారతీయ మహిళలు స్వతంత్రంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలియజేసిన డీబీఎస్–ఇండియా క్రిసిల్ సర్వేలో దేశంలోని పది నగరాల్లో 800 మంది మహిళలు ΄ాల్గొన్నారు. మహిళలు–ఆర్థిక ప్రగతి పేరుతో చేసిన ఈ అధ్యయనంలో స్వయం ఉపాధి పొందుతున్న మహిళల ప్రాధాన్యతను ఈ సర్వే ప్రత్యేకంగా పేర్కొంది. పొదుపు ఖాతాలు పట్టణ ప్రాంతాల్లోని స్త్రీలలో ఎక్కువమంది సాధారణంగా ఫిక్స్డ్ డిపాజిట్లు, పొదుపు ఖాతాల వంటి సంప్రదాయక ఎంపికల వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపింది. కుటుంబంలో దీర్ఘకాలిక నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో భారతదేశంలోని 98 శాతం మంది ఉపాధి, స్వయం ఉపాధి పొందుతున్న మహిళలు గణనీయమైన మార్పును కోరుకుంటున్నారు. వయస్సు, ఆదాయం, వైవాహిక స్థితి, ఆధారపడిన వారు, ఇంటి స్థానం వంటి అంశాలు మహిళల ఆర్థిక ప్రవర్తనపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. ఫైనాన్స్‌పై మహిళల అవగాహన పట్టణాల్లో పని ప్రదేశాల్లో మహిళల సంఖ్య పెరగడం, వారి ఆర్థిక ప్రాధాన్యతలు వయసుతో΄ాటు ఎలా మారుతున్నాయో హైలైట్ చేస్తుంది ఈ నివేదిక. వైవాహిక స్థితి, వృత్తిపరమైన నిర్ణయాలు, వ్యక్తిగత ఆరోగ్యం, జీవితంలో ఊహించని సంఘటనలు వంటి అంశాలు వివిధ దశల్లో మహిళల ఆర్థిక ప్రాధాన్యతలను ప్రభావితం చేస్తున్నాయి. ఉదాహరణకు.. 25 నుంచి 35 సంవత్సరాల వయసు గల మహిళలు ఇంటిని కొనుగోలు చేయడం లేదా అప్‌గ్రేడ్ చేయడం, 35-45 సంవత్సరాల మధ్య ఉన్న వారు పిల్లల విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం, 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు వైద్య సంరక్షణకు మారడం వంటి వాటికి ఎలా ప్రాధాన్యత నిస్తున్నారో నివేదిక హైలైట్ చేస్తుంది. వయసు ప్రాధాన్యంగా.. మహిళల నిర్ణయాలు, వారి వయసు ఆర్థిక స్థితిని గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి. 45 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళల్లో 65 శాతం మంది స్వయం ప్రతిపత్తి ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటూ కుటుంబ నాయకత్వంలో ఎదిగారు. దాదాపు 47 శాతం మంది మహిళలు స్వావలంబనతో కూడిన ఆర్థిక నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఇది మహిళల్లో పెరుగుతున్న ఆర్థిక స్వాతంత్య్రాన్ని నొక్కి చెబుతోందని ఫలితాలు సూచించాయి. ఆర్థిక నిర్ణయాలపైన లీడర్షిప్, విభిన్న పెట్టుబడి, లోన్లు, పెరుగుతున్న డిజిటల్ ఛానెల్స్ స్వీకరణ ఇవన్నీ ఆధునిక భారతీయ మహిళ కేవలం భాగస్వామిగా మాత్రమే కాదు, జీవన ప్రయాణాన్ని ప్లాన్ చేస్తోంది. ఎలా పొదుపు చేస్తున్నారంటే.. మహిళల ఆర్థిక మార్గాలు వారి వ్యక్తిత్వంలానే భిన్నంగా ఉంటున్నాయి. పొదుపు చేయడం, రుణం తీసుకోవడం, పెట్టుబడి విధానం, వయసు, ఆదాయం, సాంస్కృతిక నేపథ్యం, వనరులను పొందడం వంటి అనేక అంశాలు పొదుపు మీదనే ఆధారపడి ఉంటాయి. ఒక సర్వే ప్రకారం.. మెట్రో పాలిటన్ ప్రాంతాల్లో సంపాదించే మహిళలు తక్కువ రిస్క్ పెట్టుబడులకు ప్రాధాన్యతనిస్తున్నారు. వారి నిధులలో 51 శాతం ఫిక్స్డ్ డిపాజిట్లు, సేవింగ్స్ ఖాతాలకు కేటాయిస్తున్నారు. బంగారంలో 16 శాతం, మ్యూచువల్ ఫండ్స్‌లో 15 శాతం, రియల్ ఎస్టేట్‌లో 10 శాతం, స్టాక్‌లలో కేవలం ఏడు శాతం ఉన్నాయి. ఆధారపడిన వారు.. జీవిత భాగస్వామిపై ఆధారపడిన మహిళల పెట్టుబడి ప్రవర్తన కూడా గణనీయంగా మారుతుంది. దాదాపు 43 శాతం మంది వివాహితలు 10 నుంచి 29 శాతం పెట్టుబడులకు కేటాయిస్తున్నారు. ఆదాయాన్ని ΄÷ందే మహిళలు తమ ఆదాయంలో సగానికి పైగా పెట్టుబడులుగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. క్రెడిట్ కార్డ్ వినియోగం మెట్రో పాలిటన్ ప్రాంతాల్లో ముఖ్యంగా హైదరాబాద్, ముంబై నగరాలలో మహిళలు క్రెడిట్ కార్డ్ వినియోగంలో ముందంజలో ఉన్నారు. సగం మంది మహిళలు తాము ఎప్పుడూ రుణం తీసుకోలేదని తెలియజేశారు. రుణం తీసుకున్నవారిలో గణనీయంగా గృహరుణం తీసుకోవడాన్ని ఎంచుకున్నారు. నగదును మించి యుపిఐ షాపింగ్ చేయడంలో నగదు బదిలీ కన్నా యుపిఐ మార్గాలన్నే ఎక్కువ ఎంచుకుంటున్నారు. 25 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులలో సుమారు 33 శాతం మంది ఆన్లైన్ షాపింగ్ కోసం యూపీఐని ఉపయోగిస్తున్నారు. మనీ ట్రాన్స్ఫర్ 38 శాతం, బిల్లుల్లు 34 శాతం, ఇ–కామర్స్ కొనుగోళ్లు 29 శాతం సహా వివిధ చెల్లింపు అవసరాల కోసం యూపీఐ పట్టణ మహిళలకు ఇష్టమైన ఎంపిక అయ్యింది. ఢిల్లీలో కేవలం రెండు శాతం మంది మహిళలు మాత్రమే నగదు చెల్లింపులను ఎంచుకున్నారు. కోల్‌కతాలో 43 శాతం మహిళలు ఈ ఎంపికను ఎంచుకున్నారు.. అని మహిళల ఆర్థిక నిర్ణయాల నివేదికను మన ముందుంచింది డీబీఎస్–క్రిసిల్ సర్వే. -
లక్ష్మీ విలాస్ విలీన స్కీమ్‌పై రగడ
న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న లక్ష్మీ విలాస్ బ్యాంక్‌ను (ఎల్వీబీ) డీబీఎస్ బ్యాంక్ ఇండియాలో విలీనం చేసే అంశం కొత్త మలుపు తిరిగింది. ఈ విలీన స్కీమ్‌పై స్టే విధించాలంటూ ఎల్వీబీ ప్రమోటర్ గ్రూప్ సంస్థలు, వాటాదారైన ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ .. బాంబే హైకోర్టులో పిటిషన్ వేశాయి. రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం, డీబీఎస్ బ్యాంక్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నాయి. అయితే, విలీనంపై స్టే విధించడానికి న్యాయస్థానం నిరాకరించింది. ‘విలీనంపై స్టే విధించాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నాం. దీనిపై తదుపరి విచారణను డిసెంబర్ 14నకు వాయిదా వేస్తున్నాం. అప్పట్లోగా ప్రతివాదులు (ఆర్బీఐ, ఎల్వీబీ, డీబీఎస్ బ్యాంక్ ఇండియా) తమ అఫిడవిట్లు దాఖలు చేయాలి‘ అని జస్టిస్ నితిన్ జమ్దార్, జస్టిస్ మిలింద్ జాదవ్‌తో కూడిన డివిజన్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ విలీనంతో తాము రూ. 188 కోట్లు నష్టపోనున్నట్లు కేసు విచారణ సందర్భంగా ఇండియాబుల్స్ వాదించింది. అయితే, ప్రజలు, డిపాజిటర్లు, ఎల్వీబీ ఉద్యోగుల విస్తృత ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతో విలీన నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆర్బీఐ తరఫు న్యాయవాది రవి కదమ్ తెలిపారు. నవంబర్ 27 నుంచే విలీనం అమల్లోకి రానుండగా, సరిగ్గా ఒక్క రోజు ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, విలీన పథకంలో భాగంగా సుమారు రూ. 320 కోట్ల విలువ చేసే టియర్2 బాండ్లను కూడా రైటాఫ్ చేయాలని ఆర్బీఐ ఆదేశించింది. పథకం ఏంటంటే..: విలీనానికి సంబంధించిన తుది స్కీమ్ ప్రకారం ఎల్వీబీ పెయిడప్ షేర్ క్యాపిటల్ మొత్తం రైటాఫ్ చేయనున్నారు. దీంతో వాటాదారులకు దక్కేదేమీ లేదన్న నేపథ్యంలోనే తమ పెట్టుబడంతా కోల్పోనున్న ప్రమోటర్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు కూడా.. చట్టపరమైన చర్యలపై దృష్టి పెట్టారు. ప్రమోటర్ గ్రూప్‌నకు ఎల్‌వీబీలో 6.8% వాటాలు ఉన్నాయి. ఇక సెప్టెంబర్ ఆఖరు నాటికి ఎల్‌వీబీలో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌కు 4.99%, ప్రొలిఫిక్ ఫిన్‌వెస్ట్‌కు 3.36%, శ్రేయి ఇన్ఫ్రాకు 3.34%, ఎంఎన్ దస్తూర్ అండ్ కో సంస్థకు 1.89%, క్యాప్రి గ్లోబల్ హోల్డింగ్స్ 1.82%, క్యాప్రి గ్లోబల్ అడ్వైజరీ సర్వీసెస్ 2%, బయాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు 1.36%, ట్రినిటీ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్‌కు 1.61% వాటాలు ఉన్నాయి. -
లక్ష్మీ విలాస్ ‘ఖాతా’ క్లోజ్
న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్వీబీ)ని డీబీఎస్ బ్యాంక్ ఇండియాలో (డీబీఐఎల్) విలీన ప్రతిపాదనకు అధికారికంగా ఆమోదముద్ర పడింది. విలీన స్కీమ్‌నకుకేంద్ర క్యాబినెట్ బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ తర్వాత కొద్ది గంటల వ్యవధిలోనే దీనిపై ఒక ప్రకటన చేసిన రిజర్వ్ బ్యాంక్ .. నవంబర్ 27 (శుక్రవారం) నుంచి విలీనం అమల్లోకి వస్తుందని తెలిపింది. ఆ రోజు నుంచి ఎల్వీబీపై విధించిన మారటోరియం కూడా తొలగిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో రూ. 25,000 విత్‌డ్రాయల్ పరిమితులు తొలగిపోనున్నాయి. ‘‘నవంబర్ 27 నుంచి విలీనం అమల్లోకి వస్తుంది. ఎల్వీబీ శాఖలన్నీ కూడా ఆ రోజు నుంచి డీబీఎస్ బ్యాంక్ ఇండియా శాఖలుగా మారతాయి. ఎల్వీబీ డిపాజిటర్లంతా కూడా డీబీఎస్ ఖాతాదారులుగా మారతారు. అలాగే, ఎల్వీబీపై విధించిన మారటోరియం కూడా ఇక అమల్లో ఉండదు’’ అని ఆర్బీఐ పేర్కొంది. ఎల్వీబీ ఖాతాదారులకు యథాప్రకారంగా సర్వీసులు అందేలా చూసేందుకు డీబీఎస్ బ్యాంక్ ఇండియా అన్ని ఏర్పాట్లూ చేస్తోందని వివరించింది. వాస్తవానికి మారటోరియం గడువు డిసెంబర్ 16తో ముగియనున్నప్పటికీ అంతకన్నా ముందుగానే ఎత్తివేయనుండటం గమనార్హం. లక్ష్మీ విలాస్ బ్యాంక్ విలీన స్కీమ్‌పై కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం ఎల్వీబీ ఉద్యోగులందరికీ కూడా నవంబర్ 17నకు ముందు నుంచి అందుకుంటున్న వేతనాలు, సర్వీసు నిబంధనలే ఇకపైనా వర్తిస్తాయి. సంక్షోభంలో చిక్కుకున్న ఎల్వీబీ బోర్డును ఆర్బీఐ నవంబర్ 17న రద్దు చేసి ప్రత్యేక అడ్మినిస్ట్రేటర్‌ను నియమించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఆర్బీఐ సిఫార్సుల మేరకు డిపాజిటర్లు రూ. 25,000కు మించి విత్‌డ్రా చేసుకోకుండా కేంద్రం .. ఎల్వీబీపై 30 రోజుల మారటోరియం విధించింది. సింగపూర్‌కి చెందిన సంస్థ డీబీఎస్ భారత విభాగం డీబీఐఎల్‌లో లక్ష్మీ విలాస్ బ్యాంక్‌ను విలీనం చేసే ప్రతిపాదనను ఆర్బీఐ రూపొందించింది. తాజాగా ఇదే అమల్లోకి రానుంది. ఈ ఏడాది పెను సంక్షోభం ఎదుర్కొన్న బ్యాంకుల్లో యస్ బ్యాంక్ తర్వాత ఎల్వీబీ రెండోది. నిధుల కొరతతో కుదేలైన యస్ బ్యాంక్‌పై ప్రభుత్వం మార్చిలో మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐతో 45 శాతం వాటాలు కొనిపించి, రూ. 7,250 కోట్ల మేర పెట్టుబడులు పెట్టించి యస్ బ్యాంక్‌ను గట్టెక్కించింది. షేరు జూమ్.. దాదాపు వారం రోజులుగా లోయర్ సర్క్యూట్లకు పడిపోతూ వస్తున్న ఎల్వీబీ షేర్లు తాజా పరిణామాలతో బుధవారం 5 శాతం పెరిగాయి. బీఎస్ఈలో రూ. 7.65 వద్ద (అప్పర్ సర్క్యూట్) ముగిశాయి. ఒక దశలో లోయర్ సర్క్యూట్ స్థాయి రూ. 6.95కి, ఏడాది కనిష్టానికి కూడా పడిపోయినప్పటికీ ఆ తర్వాత గణనీయంగా కోలుకోవడం గమనార్హం. ఆంక్షలు అమల్లోకి వచ్చిన తర్వాత నవంబర్ 17 నుంచి 24 మధ్య షేరు ధర 53 శాతం పడిపోయింది. షేర్హోల్డర్లకు సున్నా..? ఈ మొత్తం లావాదేవీలో షేర్హోల్డర్లకు దక్కేదేమీ లేదు. విలీన ప్రతిపాదన తుది స్కీమ్‌ను బట్టి చూస్తే ముసాయిదాలో పేర్కొన్న ఈక్విటీ రైటాఫ్‌లో ఎలాంటి మార్పు లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం లావాదేవీ అనంతరం ఎల్వీబీ పెయిడప్ షేర్ క్యాపిటల్ మొత్తాన్ని రైటాఫ్ చేయనున్నారు. గురువారం నుంచి ట్రేడింగ్‌ను ఎన్ఎస్ఈ నిలిపివేయనుంది. శుక్రవారం ఎక్సే్చంజీల నుంచీ ఎల్వీబీ షేర్లను డీలిస్ట్ చేయనున్నారు. డిపాజిట్లు సురక్షితం.. ఎల్‌వీబీకి చెందిన 20 లక్షలకు పైగా ఖాతాదా రులు, 4,000 మంది పైగా ఉద్యోగులకు తాజా పరిణామం ఊరట కలిగిస్తుందని క్యాబినెట్ సమావేశం అనంతరం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. డిపాజిట్ల విత్‌డ్రాయల్‌పై ఇతరత్రా మరే ఆంక్షలు ఉండబోవని ఆయన చెప్పారు. ‘‘ఖాతాదారులు ఆందోళన చెందనవసరం లేదు. డిపాజిట్లు సురక్షితమైన చేతుల్లోనే ఉన్నాయి. విత్‌డ్రాయల్ కోసం పరుగెత్తాల్సిన అవసరం లేదు’’ అని మంత్రి తెలిపారు. డీబీఐఎల్‌కు తగినంత స్థాయిలో మూలధనం ఉన్నప్పటికీ విలీనానంతరం కార్యకలాపాల వృద్ధి కోసం ముందుగానే మరో రూ. 2,500 కోట్ల నిధులను కూడా సమకూర్చుకుంటుందని చెప్పారు. ఎల్వీబీ కనుమరుగు.. సుమారు 94 ఏళ్ల చరిత్ర కలిగిన ఎల్వీబీని వీఎస్ఎన్ రామలింగ చెట్టియార్ సారథ్యంలో తమిళనాడులోని కరూర్‌కి చెందిన ఏడుగురు వ్యాపారవేత్తలు 1926లో ఏర్పాటు చేశారు. 19 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతంలో ఎల్‌వీబీకి 566 శాఖలు, 918 ఏటీఎంలు ఉన్నాయి. బడా సంస్థలకు భారీ స్థాయిలో రుణాలివ్వడం మొదలెట్టినప్పట్నుంచి ఎల్‌వీబీకి కష్టాలు మొదలయ్యాయి. మొండిబాకీలు భారీగా పేరుకుపోవడంతో బ్యాంకుపై ఆర్బీఐ గతేడాది ఆంక్షలు కూడా విధించింది. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, క్లిక్స్ క్యాపిటల్ సర్వీసెస్ సంస్థలతో విలీనమయ్యేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. 2019–20లో రూ. 836 కోట్ల నికర నష్టం ప్రకటించిన ఎల్వీబీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 397 కోట్ల నష్టం నమోదు చేసింది. తాజా పరిణామాలతో ఎల్వీబీ ఇక పూర్తిగా కనుమరుగు కానుంది. పటిష్టంగా డీబీఐఎల్... సింగపూర్ కేంద్రంగా ఆర్థిక సేవలు అందిస్తున్న డీబీఎస్‌కు డీబీఐఎల్ భారతీయ అనుబంధ సంస్థ. డీబీఎస్‌కు ఆసియాలోని 18 మార్కెట్లలో కార్యకలాపాలు ఉన్నాయి. ఎల్వీబీని విలీనం చేసుకోవడంతో డీబీఐఎల్ శాఖల సంఖ్య 600కు పెరుగుతుంది. బాధ్యులపై చర్యలు ఉంటాయి.. ఎల్వీబీ ఆర్థిక పరిస్థితి దిగజారడానికి బాధ్యులైన వారిపై చర్యలు ఉంటాయని జవదేకర్ తెలిపారు. ‘‘తప్పులు చేసిన వారిపై చర్యలుంటాయి. ఇలాంటివి భవిష్యత్‌లో పునరావృతం కాకుండా పర్యవేక్షణ మెరుగుపరుస్తాం. బ్యాంకింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా చేస్తున్న ప్రయత్నాల్లో ఇవి కూడా భాగం’’ అని ఆయన చెప్పారు. ఆర్బీఐ కూడా పర్యవేక్షణను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘పరిస్థితి చేయి దాటిపోవడానికి ముందే సమస్యను ఆర్బీఐ అంచనా వేయగలగాలి. రాబోయే సమ స్యలను పసిగట్టగలిగితే పరిష్కారం సులువవుతుంది’’ అని జవదేకర్ వ్యాఖ్యానించారు. -
డిపాజిటర్ల సొమ్ము భద్రం!!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు ఎదుర్కొంటున్న లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్వీబీ) తమ ఖాతాదారులకు భరోసా కల్పించడంపై దృష్టి పెట్టింది. డిపాజిటర్ల సొమ్ము భద్రంగానే ఉందని రిజర్వ్ బ్యాంక్ నియమించిన అడ్మినిస్ట్రేటర్ టీఎన్ మనోహరన్ తెలిపారు. ఖాతాదారులకు చెల్లింపులు జరిపేందుకు బ్యాంకు వద్ద తగినన్ని నిధులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆర్బీఐ నిర్దేశించిన గడువులోగా డీబీఎస్ బ్యాంక్ ఇండియాలో విలీన ప్రక్రియ పూర్తి చేయగలమని మనోహరన్ ధీమా వ్యక్తం చేశారు. ఎల్వీబీ వద్ద రూ. 20,000 కోట్ల మేర డిపాజిట్లు ఉండగా, ఇచ్చిన రుణాల పరిమాణం రూ. 17,000 కోట్ల స్థాయిలో ఉన్నాయి. సంక్షోభంలో చిక్కుకున్న ఎల్వీబీని గట్టెక్కించే ప్రయత్నాల్లో భాగంగా భారీ చెల్లింపులు చెల్లించకుండా నెల రోజుల పాటు (డిసెంబర్ 16 దాకా) బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీనితో ఖాతాదారులు రూ. 25,000కు మించి విత్‌డ్రా చేసుకోవడానికి లేదు. డీబీఎస్‌లో ఎల్వీబీని విలీనం చేసే ప్రతిపాదనకు సంబంధించి నవంబర్ 20న ఆర్బీఐ తుది ప్రకటన చేయనుంది. దీని ప్రకారం ఎల్‌వీబీలో డీబీఎస్ సుమారు రూ. 2,500 కోట్ల దాకా ఇన్వెస్ట్ చేయనుంది. డీబీఎస్‌కు సానుకూలం: మూడీస్ సింగపూర్‌కి చెందిన డీబీఎస్ బ్యాంక్.. భారత్‌లో తన వ్యాపారాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు ఎల్వీబీ విలీనం ఉపయోగపడగలదని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అభిప్రాయపడింది. కొత్తగా మరింత మంది రిటైల్, చిన్న, మధ్య స్థాయి కస్టమర్లను చేర్చుకోవడానికి ఇది తోడ్పడగలదని వివరించింది. ‘విలీనం తర్వాత డీబీఎస్ ఇండియా కస్టమర్ల డిపాజిట్లు, రుణాల పరిమాణం 50–70 శాతం దాకా పెరగవచ్చు‘ అని అంచనా వేసింది. డీబీఎస్ ఇండియాకు 27 శాఖలు ఉండగా విలీనంతో ఎల్‌వీబీకి చెందిన సుమారు 500 పైచిలుకు శాఖలు కూడా జత కానున్నాయి. డీబీఎస్‌కు కీలక మార్కెట్లలో భారత్ కూడా ఒకటి కావడంతో, ఆ సంస్థ కార్యకలాపాల విస్తరణ వ్యూహాలకు అనుగుణంగా ఎల్వీబీ డీల్ ఉండగలదని మూడీస్ తెలిపింది. ‘పటిష్టమైన మాతృసంస్థ దన్ను ఉంటుంది కాబట్టి డీబీఎస్‌లో విలీనం అంశం ఎల్వీబీ డిపాజిటర్లకు సానుకూలంగా ఉంటుంది‘ అని పేర్కొంది. బ్యాంకింగ్ సమస్యలను పరిష్కరించేందుకు భారత్‌లో అనుసరిస్తున్న విధానాల్లోని లోపాలను చూపే విధంగా .. ఎల్వీబీని గట్టెక్కించే ప్రక్రియ ఉందని తెలిపింది. మారటోరియం కారణంగా డిపాజిటర్లు, రుణదాతలకు సకాలంలో చెల్లింపులు జరపలేకపోవడం వల్ల బ్యాంకు తాత్కాలికంగా దివాలా తీసినట్లే అవుతుందని మూడీస్ తెలిపింది. మారటోరియం విధించే దాకా పరిస్థితి వెళ్లకుండా సమస్యాత్మక బ్యాంకులను చక్కదిద్దేందుకు ఆర్బీఐకి ప్రభుత్వం ఇటీవలే పూర్తి అధికారాలు ఇచ్చినప్పటికీ ఇలా జరగడం గమనార్హమని వ్యాఖ్యానించింది. తాజా పరిణామాలతో బుధవారం బీఎస్ఈలో ఎల్వీబీ షేరు 20 శాతం డౌన్ సర్క్యూట్‌ను తాకి రూ. 12.40 వద్ద క్లోజయ్యింది. విదేశీ బ్యాంకులో విలీనం వద్దు: ఏఐబీవోసీ డిమాండ్ విదేశీ బ్యాంకులో ఎల్వీబీని విలీనం చేసే ప్రతిపాదనను తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆఫీసర్ల యూనియన్ ఏఐబీవోసీ స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదన చూస్తుంటే విదేశీ బ్యాంకులకు తలుపులు బార్లా తెరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని డీబీఎస్‌లో ఎల్వీబీని విలీనం చేసే విషయంపై పునరాలోచన చేయాలంటూ ఆర్బీఐకి ఏఐబీవోసీ విజ్ఞప్తి చేసింది. పాతతరం బ్యాంకులు.. దాదాపు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లాగానే దేశానికి స్వాతంత్య్రం రావడానికి ఎంతో ముందు నుంచీ సేవలు అందిస్తున్నాయని ఏఐబీవోసీ ప్రెసిడెంట్ సునీల్‌కుమార్ తెలిపారు. -
ఆర్బీఐ షాక్ : ఎల్వీబీ షేర్లు ఢమాల్
సాక్షి, ముంబై: బ్యాంకు కార్యకలాపాలపై కేంద్ర ప్రభుత్వం దాదాపు నెల రోజులపాటు మారటోరియంను విధించిన నేపథ్యంలో ప్రయివేట్ రంగ బ్యాంకు లక్ష్మీ విలాస్ బ్యాంక్ కౌంటర్లో ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూ కట్టడంతో ఎన్ఎస్ఈలో ఈ షేరు 20 శాతం డౌన్ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు అధికంకాగా.. కొనేవాళ్లు కరవుకావడంతో రూ. 3.10 నష్టంతో రూ. 12.45 వద్ద ఫ్రీజయ్యింది. తద్వారా ఇంతక్రితం మార్చి 31న నమోదైన ఏడాది కనిష్టం రూ. 10.40కు చేరువైంది. ట్రేడింగ్ ప్రారంభమైన తొలి అర్ధగంటలోనే కౌంటర్లో 3.5 కోట్లకుపైగా షేర్ల విక్రయానికి సెల్ ఆర్డర్లు(బీఎస్ఈ, ఎన్ఎస్ఈ) నమోదైనట్లు మార్కెట్ విశ్లేషకులు తెలియజేశారు. ఏం జరిగిందంటే? చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్వీబీ)పై కేంద్రం మంగళవారం మారటోరియం విధించింది. ఈ నెల 17 నుంచి డిసెంబర్ 16 వరకూ 30 రోజులపాటు మారటోరియం అమల్లో ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. బ్యాంక్ ఖాతాదారుడు తన ఖాతాలో ఎంత మొత్తం ఉన్నాగానీ రూ.25,000 వరకూ మాత్రమే వెనక్కు తీసుకోగలుగుతాడు. అయితే ఆరోగ్య వ్యయాలు, ఉన్నత విద్యకు చెల్లింపులు, వివాహ ఖర్చుల వంటి అత్యవసరాలకు ఆర్బీఐ ముందస్తు అనుమతితో ఖాతాదారుడు రూ.25,000కు మించి తన డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు వీలుంటుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. బ్యాంక్ బోర్డ్‌ను పక్కనబెట్టి కేంద్రం తాజా నిర్ణయాన్ని తీసుకుంది. బ్యాంక్ ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) సలహా మేరకు అత్యవసర ప్రాతిపదికన కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్‌గా కెనరాబ్యాంక్ మాజీ నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్ టీఎన్ మనోహరన్‌ను నియమించింది. తొలిసారి దేశీ బ్యాంకింగ్ చరిత్రలో తొలిసారి విదేశీ బ్యాంకుకు చెందిన దేశీ యూనిట్‌తో దేశీయ బ్యాంకును విలీనం చేసేందుకు ఆర్బీఐ ప్రతిపాదించినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఇందుకు ప్రధానంగా డీబీఎస్ బ్యాంకు ఆర్థికంగా పరిపుష్టంగా ఉండటం, విలీనంతో ఎల్వీబీ ఖాతాదారులు, ఉద్యోగులకు ప్రయోజనం కలిగే వీలుండటం వంటి అంశాలను ఆర్బీఐ పరిగణనలోకి తీసుకుని ఉండవచ్చని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. గతంలో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఇందుకు ఆర్బీఐను సంప్రదించినప్పటికీ అనుమతించకపోవడం గమనార్హం. ఇదే విధంగా క్లిక్స్ క్యాపిటల్ ప్రతిపాదనకు సైతం నో చెప్పింది. విలీనానికి సంబంధించి రెండు సంస్థల మధ్య ప్రతిపాదించిన వేల్యుయేషన్స్ సక్రమంగా లేవన్న కారణం ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. డీబీఎస్ బ్యాంక్‌తో విలీనం తాజా పరిణామాల నేపథ్యంలో లక్ష్మీ విలాస్ బ్యాంక్‌ను సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న బ్యాంకింగ్ సేవల దిగ్గజం... డీబీఎస్ బ్యాంక్ ఇండియా (డీబీఐఎల్)తో విలీనానికి ఆర్బీఐ ముసాయిదా పథకాన్ని వెలువరించింది. లక్ష్మీ విలాస్ బ్యాంక్ విలీన ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ లభిస్తే.. భారత్‌లో తమ అనుబంధ సంస్థ డీబీఐఎల్ రూ. 2,500 కోట్ల మేర నిధులు ఇవ్వనున్నట్లు డీబీఎస్ వెల్లడించింది. దేశీయంగా డీబీఎస్ బ్యాంకు 26 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 13 రాష్టాలు, 24 పట్టణాలలో సేవలు విస్తరించింది. ఎల్‌వీబీకి ఎన్ఆర్ఐ కస్టమర్లు అధికంగా ఉన్నట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఆసియాలో కార్యకలాపాలు విస్తరించిన డీబీఎస్ ఈ కస్టమర్లకు మరింత సులభంగా సర్వీసులు అందించగలుగుతుందని అభిప్రాయపడ్డాయి. డీబీఎస్ బ్యాంకులో సింగపూర్ ప్రభుత్వానికి చెందిన టెమాసెక్ వాటాదారుకావడంతో ఆర్థిక పరిపుష్టిని కలిగి ఉన్నట్లు తెలియజేశాయి. దీంతో ఎల్వీబీ విలీనం తదుపరి అవసరమైతే మరిన్ని నిధులతో బ్యాంకు కార్యకలాపాలను విస్తరించగలదని పేర్కొన్నాయి. డీబీఎస్ బ్యాంకు ఇంతక్రితం దేశీయంగా మురుగప్ప గ్రూప్‌తో ఏర్పాటు చేసిన ఎన్బీఎఫ్సీ జేవీ చోళమండలం ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్స్‌లోనూ 37.5 శాతం వాటాను సొంతం చేసుకుంది. కాగా.. ఎల్వీబీని విలీనం చేసుకుంటే దక్షిణాదిలో కార్యకలాపాలను విస్తరించేందుకు వీలు కలుగుతుందని విశ్లేషకులు తెలియజేశారు. ఎల్వీబీ ప్రస్తుతం 563 బ్రాంచీలు, 974 ఏటీఎంలను కలిగి ఉంది. డీబీఎస్ బ్యాంకులో ఎల్వీబీ విలీనమైతే సంయుక్త సంస్థ 12.51 శాతం సీఆర్ఏఆర్ను, 9.61 శాతం సీఈటీ-1 క్యాపిటల్‌నూ సమకూర్చుకోగలదని వివరించారు. -
లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఆర్బీఐ కీలక ప్రతిపాదన
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగం బ్యాంకు లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్వీబీ)కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఒక నెల తాత్కాలిక నిషేధం ముగిసిన వెంటనే ఈ బ్యాంకును డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్ (డీబీఐఎల్) తో విలీనం చేయనుంది. ఈ మేరకు ఒక ముసాయిదా పథకాన్ని ఆవిష్కరించినట్లు మంగళవారం వెల్లడించింది.ఇందుకు డీబీఐఎల్ 2,500 కోట్ల రూపాయల అదనపు మూలధనాన్ని ముందస్తుగా సమకూరుస్తుందని ఆర్బీఐ తెలిపింది. డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడటానికే ఈ చర్య తీసుకున్నామని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే కెనరా బ్యాంక్ మాజీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ టీఎన్‌మనోహరన్‌ను బ్యాంక్ నిర్వాహకుడిగా నియమించింది. ముసాయిదా పథకంపై ఇరు బ్యాంకుల సభ్యులు, డిపాజిటర్లు ఇతర రుణదాతల నుండి సూచనలు, అభ్యంతరాలను ఆహ్వానిస్తోంది. ఇవి 2020 నవంబర్ 20 న సాయంత్రం 5 గంటలలోపు తమకు చేరాలని ఆర్బీఐ తన నోటీసులో తెలిపింది. మరోవైపు లక్ష్మి విలాస్ బ్యాంక్‌పై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం మారటోరియం విధించింది. ఈ రోజు (నవంబరు, 17వ తేదీన) సాయంత్రం 6 గంటల నుంచి డిసెంబర్ 16 వరకు మారటోరియం అమలులో ఉండనుంది. మారటోరియం సమయంలో విత్‌డ్రా లిమిట్‌ను 25వేలకు కుదించింది. ఈ వెంటనే ఆర్బీఐ విలీన ప్రతిపాదనని ప్రకటించడం గమనార్హం. కాగా ఇటీవల జరిగిన బ్యాంక్ వార్షిక సర్వ సభ్య సమావేశం (ఏజీఎం)లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బ్యాంకు తీరుపై ఆగ్రహంతో ఉన్న వాటాదారులు (దాదాపు 60 శాతం) భారత బ్యాంకింగ్ చరిత్రలోనే తొలిసారిగా ప్రస్తుతం తాత్కాలిక ఎండీ, సీఈఓగా ఉన్న సుందర్‌ను తిరిగి ఆ పదవిలో తిరిగి నియమించే తీర్మానాన్ని తిరస్కరించారు. దీంతో పాటు మొత్తం ఏడుగురు డైరెక్టర్లు ఎన్ సాయిప్రసాద్, గోరింక జగన్మోహన్ రావు, రఘురాజ్ గుజ్జర్, కేఆర్ ప్రదీప్, బీకే మంజునాథ్, వైఎన్ లక్ష్మీ నారాయణలను ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా తిరిగి నియమించే తీర్మానాన్ని కూడా భారీ మెజార్టీతో వ్యతిరేకించిన సంగతి విదితమే. -
భారత్‌లో డీబీఎస్ బ్యాంక్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్ సేవల్లో ఉన్న సింగపూర్‌కు చెందిన డీబీఎస్ భారత్‌లో విస్తరిస్తోంది. ప్రస్తుతం సంస్థకు శాఖలు, కియోస్క్‌లు 70 దాకా ఉన్నాయి. ఏడాదిలోగా ఈ సంఖ్య 100కు చేరుతుందని డీబీఎస్ బ్యాంక్ ఇండియా బ్రాంచ్ బ్యాంకింగ్ హెడ్ ప్రియాశిష్ దాస్ తెలిపారు. వైస్ ప్రెసిడెంట్, బ్రాంచ్ హెడ్ కె.శ్రీనివాస రావుతో కలిసి గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. 25 నగరాల్లో సేవలు అందిస్తున్నట్టు చెప్పారు. ఆరవ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌ను త్వరలో హైదరాబాద్‌లోని వేవ్‌రాక్‌లో ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. భాగ్యనగరిలో 40 వేల పైచిలుకు కస్టమర్లున్నారని వివరించారు. బ్యాంకు ఉద్యోగుల సంఖ్య 2,000లకు పైగా ఉంది. పూర్తిగా కాగిత రహిత విధానాన్ని అనుసరిస్తున్నట్టు ఆయన తెలిపారు. -
హైదరాబాద్ హబ్‌లోనే డీబీఎస్ టెక్నాలజీ అభివృద్ధి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సింగపూర్‌కు చెందిన డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ (డీబీఎస్) గ్రూప్ సాంకేతికత, అభివృద్ధి అంతా హైదరాబాద్ కేంద్రంగానే జరుగుతుంది. 2016లో నగరంలో 2 లక్షల చ.అ.ల్లో డీబీఎస్ ఏషియా హబ్ 2ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సింగపూర్ తర్వాత రెండో అతిపెద్ద టెక్నాలజీ హబ్ ఇదే. ఈ సెంటర్లో అతిపెద్ద బ్యాంకింగ్ అప్లికేషన్స్ ప్రొగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఫ్లాట్‌ఫామ్స్ (ఏపీఐఎస్), ఇంటిగ్రేటెడ్ ఈ–బ్యాంకింగ్ సొల్యూషన్స్, అకౌంటింగ్ అండ్ ఈఆర్పీ ఫ్లాట్‌ఫామ్‌లను అభివృద్ధి జరుగుతుందని డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్ (డీబీఐఎల్) సీఈఓ సురోజిత్ షోమీ తెలిపారు. మన దేశంతో పాటూ చైనా, తైవాన్, సింగపూర్, హాంగ్‌కాంగ్ మార్కెట్లలో 350కి పైగా ఏపీఐఎస్ సేవలందిస్తున్నామని చెప్పారు. మంగళవారమిక్కడ డీబీఐఎల్ తొలి బ్యాంక్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రస్తుతం నానక్‌రాంగూడలోని వేవ్‌రాక్‌లో 2 లక్షల చ.అ.ల్లో డీబీఎస్ హబ్–2 ఉంది. ఇందులో 2 వేల మంది ఇంజనీర్లు, డెవలపర్లు పనిచేస్తున్నారు. త్వరలోనే రూ.260 కోట్ల పెట్టుబడులతో రాయదుర్గంలోని ఆర్ఎంజెడ్ స్కైవ్యూలో మరొక 2 లక్షల చ.అ.ల్లో కొత్త క్యాంపస్‌ను ప్రారంభించనున్నాం. ఏడాదిలో వెయ్యి మంది ఇంజనీరింగ్, టెక్నాలజీ నిపుణులను నియమించుకుంటామని’’ ఆయన వివరించారు. 25 నగరాలు, 100 బ్రాంచీలు.. ఇప్పటివరకు డీబీఎస్ గ్రూప్ ఇండియాలో రూ.7,700 కోట్ల పెట్టుబడులు పెట్టింది. వచ్చే 12–18 నెలల్లో దేశంలో 25 నగరాల్లో 100 బ్రాంచ్‌లు, కియోస్క్‌లను ఏర్పాటు చేయాలని లకి‡్ష్యంచాం. ఇందుకోసం రూ.125–150 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాం. ఈ నెల ముగింపు నాటికి అహ్మదాబాద్, కోయంబత్తూరు, వడోదర, ఇండోర్, లుథియానాలో 9 బ్రాంచీలు, గ్రామీణ ప్రాంతాల్లో ఐదు బ్రాంచీలను ఏర్పాటు చేయనున్నాం. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, పుణె, నాసిక్, సూరత్, కొల్హాపూర్, సాలీం, కుద్దాలూర్, ముర్దాబాద్ నగరాల్లో 12 బ్రాంచ్‌లున్నాయి. మూడేళ్లలో 1.50 లక్షల కోట్ల వ్యాపారం.. ప్రస్తుతం డీబీఐఎల్‌కు డిపాజిట్లు రూ.30 వేల కోట్లుగా ఉన్నాయి. ఇందులో సీఏఎస్ఏ 15–18%గా ఉంది. వచ్చే ఐదేళ్లలో 25 శాతం సీఏఎస్ఏ వృద్ధిని లకి‡్ష్యంచాం. ప్రస్తుతం రూ.50 వేల కోట్ల బ్యాలెన్స్ షీట్స్ ఉన్నాయి. వచ్చే మూడేళ్లలో రూ.1.50 లక్షల కోట్ల వ్యాపారాన్ని టార్గెట్‌గా పెట్టుకున్నాం. ఇప్పటివరకు కార్పొరేట్ రుణాల మీద ఎక్కువ దృష్టిపెట్టాం. ఇక నుంచి ఎస్ఎంఈ, రిటైల్ రుణాల మీద ఫోకస్ చేస్తాం. మొత్తం మొత్తం రుణాల్లో కార్పొరేట్ రూ.20 వేల కోట్ల వరకుంటాయి. 18 దేశాలు 280 బ్రాంచీలు.. ఇప్పటివరకు డీబీఎస్‌కు 18 దేశాల్లో 280 బ్రాంచీలు, 1200 ఏటీఎం సెంటర్లున్నాయి. 25 వేల మంది ఉద్యోగులున్నారు. ఏటా 11% వృద్ధి రేటుతో 13.2 సింగపూర్ బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తుంది. గత ఆర్ధిక సంవత్సరంలో 28% వృద్ధితో 5.6 సింగపూర్ బిలియన్ డాలర్ల లాభాన్ని మూటగట్టుకుంది. హ్యాక్‌థాన్ ద్వారా ఉద్యోగుల నియామకం క్యాంపస్ రిక్రూట్మెంట్, ఇంటర్వ్యూ వంటివి కాకుండా డీబీఎస్ బ్యాంక్ ఉద్యోగుల నియామకాలను హ్యాక్‌థాన్ ద్వారా నిర్వహిస్తుంది. డీబీఎస్ బ్యాంక్ మొత్తం నియామకాల్లో 30–40 శాతం హ్యాక్‌థాన్ ద్వారానే ఎంపిక చేస్తుంది. హ్యాక్ 2 హైర్ ప్రోగ్రామ్ ద్వారా ఆన్లైన్ చాలెంజ్ నిర్వహించి.. ఎంపికైన అభ్యర్థులు 24 గంటల రియల్ లైఫ్ బిజినెస్ ప్రొబ్లమ్స్ను పరిష్కరించాల్సి ఉంటుందని డీబీఎస్ ఆసియా హబ్ 2 హెడ్ మోహిత్ కపూర్ తెలిపారు. ఒక్కో హ్యాక్ 2 హైర్లో 13 వేలకు పైగా అభ్యర్థులు పాల్గొంటున్నారని.. క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ, మిషన్ లెర్నింగ్, బిగ్ డేటా విభాగాల్లో సుమారు వంద మంది నిపుణులను నియమించుకుంటామని తెలిపారు. త్వరలోనే 6వ ఎడిషన్‌ను ప్రారంభిచనున్నట్లు ఆయన చెప్పారు. నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. పాతికేళ్ల క్రితం ముంబైలో తొలి బ్రాంచ్ ప్రారంభించిన డీబీఎస్ బ్యాంక్ 2015లో పూర్తి సొంత అనుబంధ సంస్థ (డబ్ల్యూఓఎస్) కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి దరఖాస్తు చేసుకుంది. నాలుగేళ్ల తర్వాత అంటే ఈ ఏడాది మార్చి 1న ఆర్బీఐ అనుమతినిచ్చింది. దీంతో ప్రస్తుతం దేశంలోని 12 డీబీఎస్ బ్రాంచీలు కూడా డీబీఐఎల్‌లోకి మారాయి. ప్రస్తుతం మన దేశంలో 45 విదేశీ బ్యాంక్‌లున్నాయి. స్టాండర్డ్ చార్డెర్డ్కు 100 బ్రాంచీలు, సిటీ బ్యాంక్‌కు 35, హెచ్ఎస్బీసీకీ 26 బ్రాంచీలున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్‌కు 4 బ్రాంచీలున్నాయి. విదేశీ బ్యాంక్ నుంచి డబ్యూఓఎస్ బ్యాంక్‌గా మారిన తొలి బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్. ఇది గతేడాది డిసెంబర్లో ఆర్బీఐ అనుమతి పొందింది. -
ఈ ఎన్నికలు మోదీకి పరీక్షే!?
సాక్షి, ముంబై : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు మోదీ ఆర్థిక సంస్కరణలకు లిట్మస్ పరీక్ష అని సింగపూర్ లీడింగ్ బ్యాంక్ డీబీఎస్ పేర్కొంది. మోదీ ప్రజాదరణకు, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీని ప్రజలు ఆదరించారని చెప్పడానికి ఈ ఎన్నికల ఫలితాలను నిదర్శనంగా తీసుకోవచ్చని డీబీఎస్ బ్యాంక్ స్పష్టం చేసింది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్‌ను అమలు చేయడం వల్ల గుజరాత్లో వ్యాపారాలు మందగించాయనేది వాస్తవం.. అదే సమయంలో కులాల గొడవలు.. బీజేపీకి పరీక్షలు పెడుతున్నాయని డీబీఎస్ తెలిపింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేసిన ఆర్థిక సంస్కరణలకు దేశానికి ముఖ్యమా? లేక అనవసరమా అన్నది ఈ రెండు రాష్ట్రాల ఫలితాలతో తేలిపోతుందని డీబీఎస్ తెలిపింది. 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు వీటిని సంకేతాలు కూడా భావించవచ్చని పేర్కొంది. -
సెన్సెక్స్ టార్గెట్ 30,000!
* ఏడాదిలో చేరే అవకాశం... * స్టాక్ మార్కెట్లపై నిపుణుల అంచనా.. * మోడీ-బీజేపీ అఖండ విజయంతో * ఇక సంస్కరణలకు జోష్ * అభివృద్ధిపైనే మోడీ పూర్తిగా దృష్టిసారించే చాన్స్ * ఆర్థిక వ్యవసపై విశ్వాసం పెరుగుతోందని వెల్లడి న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ తాజా ఎన్నికల్లో సాధించిన అపూర్వ విజయం దేశ ఆర్థిక వ్యవస్థకు దివ్వ ఔషధంగా పనికొస్తుందా? అవుననే అంటున్నారు నిపుణులు. ఎన్డీఏ కూటమి సాధారణ మెజారిటీ కంటే భారీగా సీట్లను కైవసం చేసుకోవడం... బీజేపీ ఒక్కటే సొంతంగా మేజిక్ ఫిగర్ 272 సీట్లను అధిగమించడంతో ఇక ఆర్థిక సంస్కరణలు కొంత పుంతలు తొక్కుతాయనే అంచనాలు సర్వత్రా బలపడుతున్నాయి. ఈ ప్రభావంతో దేశీ స్టాక్ మార్కెట్లు ఇప్పటికే రోజుకో కొత్త ఆల్‌టైమ్ గరిష్టాలను తాకుతున్నాయి కూడా. అయితే, మోడీ నేతృత్వంలోని సుస్థిర సర్కారు తీసుకోబోయే సాహసోపేత పాలసీ చర్యలతో మార్కెట్లు మరింత పరుగు తీస్తాయనేది విశ్లేషకుల అభిప్రాయం. సంస్కరణలకు గనుక చేయూత లభిస్తే... సెన్సెక్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15) చివరినాటికి అంటే వచ్చే ఏడాది మార్చికల్లా 30,000 పాయిం ట్లను తాకొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంకా పెరుగుతుంది... ప్రస్తుతం సెన్సెక్స్ గత రికార్డులన్నీ చెరిపేసి 24,500 స్థాయిలో కదలాడుతోంది. మోడీ విజయం రోజున ఏకంగా 25,000 పాయింట్లనూ అధిగమించింది. అయితే, చరిత్రాత్మక గరిష్టాల వద్దే సెన్సెక్స్ ఇప్పుడు ఉన్నప్పటికీ... మరింత దూసుకెళ్లేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని యాంబిట్ క్యాపిటల్ అభిప్రాయపడింది. మార్చినాటికి తమ సెన్సెక్స్ లక్ష్యాన్ని 30,000 పాయింట్లకు పెంచుతున్నట్లు పేర్కొంది. అంతక్రితం ఏడాది జనవరిలో ఈ లక్ష్యం 24,000 పాయింట్లుగా ఉంది. గత దశాబ్దపు కాలానికి పైగా సంకీర్ణ ప్రభుత్వాల పాలన కారణంగా ఆర్థిక, విధానపరమైన నిర్ణయాల్లో జడత్వం నెలకొందని.. ఇప్పుడు మోడీ నేతృత్వంలో 30 ఏళ్ల తర్వాత తొలిసారిగా బీజేపీ సొంతంగా సంపూర్ణ మెజారిటీ సాధించడంతో పారిశ్రామిక రంగానికి సానుకూల పరిస్థితులు నెలకొంటాయన్న విశ్వాసాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్‌లోని మోడీ సర్కారు విజయాలు.. తాజా ఎన్నికల ప్రచారంలో అభివృద్ధిపైనే మోడీ దృష్టిసారించడం కూడా ఇన్వెస్టర్లలో నమ్మకం పెంచుతోందంటున్నారు. ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరిగింది... విదేశీ సంస్థ డాయిష్ బ్యాంక్ కూడా ఈ ఏడాది డిసెంబర్‌నాటికి సెన్సెక్స్ 28,000 పాయింట్లకు, నిఫ్టీ 8,000 పాయింట్లకు ఎగబాకవచ్చని అంచనా వేసింది. ‘దేశీ, విదేశీ ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరుగుతోంది. పెట్టుబడులకు భారత్ మెరుగైన గమ్యంగా భావిస్తున్నారు. దీంతో మరిన్ని నిధులు ఇక్కడకు తరలనున్నాయి’ అని డీబీఎస్ బ్యాంక్ హెడ్(ట్రెజరీ-మార్కెట్స్) విజయన్ ఎస్ పేర్కొన్నారు. ఇక మోర్గాన్ స్టాన్లీ కూడా తన తాజా రీసెర్చ్ నోట్లో మార్కెట్లు మరింత దూకుడును కనబరుస్తాయని అంచనా వేసింది. వచ్చే ఏడాది జూన్‌నాటికి సెన్సెక్స్ టార్గెట్‌ను 26,300 పాయింట్లకు పెంచింది. గతంలో ఈ టార్గెట్ 21,280 పాయింట్లుగా ఉంది. ‘మోడీ సాధించిన భారీ విజయం, ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై దృష్టిపెడుతూ ఆయన సాగించిన ప్రచారంతో సంస్కరణలు, ప్రస్తుత పాలసీ చర్యలు మరింత ముందుకెళ్తాయన్న నమ్మకం పెరుగుతోంది. భారత్ ఈక్విటీ మార్కెట్‌పై మా బులిష్ ధోరణి కొనసాగుతోంది. ఇప్పుడప్పుడే లాభాలను స్వీకరించడం తొందరపాటే’ అని యూబీఎస్ తన నివేదికలో పేర్కొంది. సంస్కరణలు, సరైన ఆర్థిక మంత్రే కీలకం: డీబీఎస్ ముంబై: మోడీ ప్రభుత్వం చేపట్టబోయే సంస్కరణల ఎజెండా... ఆర్థిక మంత్రి ఎంపిక, ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌ను కొనసాగించడం... ఈ అంశాలే మార్కెట్ సెంటిమెంట్‌ను ముందుకు నడిపిస్తాయని సింగపూర్‌కు చెందిన బ్రోకరేజి దిగ్గజం డీబీఎస్ అభిప్రాయపడింది. గతేడాది జపాన్‌లో షింజో అబే నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అప్పుడు అక్కడి మార్కెట్లు దూసుకెళ్లిన అంశానికీ... ఇప్పుడు మోడీ భారీ విజయంతో భారత్ మార్కెట్లలో దూకుడుకు ఎలాంటి పోలికలూ లేవని కూడా డీబీఎస్ పేర్కొంది. తక్షణం మార్కెట్ల సెంటిమెంట్‌కు బూస్ట్ ఇచ్చేది సరైన ఆర్థిక మంత్రి నియామకమేనని, రాజన్‌ను కొనసాగించడం కూడా రూపాయి విలువకు మద్దతుగా నిలుస్తుందని తన రీసెర్చ్ నివేదికలో వెల్లడించింది. -
వడ్డీరేట్లు మరింత పైకే!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వచ్చే మూడు నెలల్లో రెపో రేటును మరో అరశాతం పెంచే అవకాశం ఉందని డీబీఎస్ బ్యాంక్ అంచనావేసింది. ఈ మేరకు బ్యాంక్ తన తాజా నివేదికను విడుదల చేసింది. ‘‘2014 వరకూ రెపో రేటులో ఎటువంటి మార్పూ ఉండదన్నది మా క్రితం అంచనాలు. అయితే ఇప్పుడు ద్రవ్యోల్బణం తీవ్రత వల్ల మా అంచనాలను మార్చుకోవాల్సిన పరిస్థితి కనబడుతోంది. రానున్న మూడు నెలల్లో రెపో రేటు మరో రెండు విడతలుగా అరశాతం మేర పెరిగే అవకాశం ఉంది’’ అని నివేదిక పేర్కొంది. లిక్విడిటీ (నగదు లభ్యత) కట్టడి దిశలో ఆర్బీఐ ఇటీవల తీసుకున్న చర్యలను డిసెంబర్ లోపు ఎంతమాత్రం వెనక్కు తీసుకునే అవకాశం లేదని సైతం నివేదిక అభిప్రాయపడింది. ఈ నెల 20వ తేదీన జరిగిన తన తొలి పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పావు శాతం మేర వడ్డీరేటు పెంపునకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనితో బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు 7.5 శాతానికి చేరింది.