సింగపూర్‌కు చెందిన డీబీఎస్ గ్రూప్ (DBS) తమ డీబీఎస్ బ్యాంక్ ఇండియా సీఈవోగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా రజత్ వర్మను నియమించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆమోదం మేరకు మార్చి 1 నుండి డీబీఎస్ బ్యాంక్ ఇండియా సీఈవోగా రజత్ వర్మ బాధ్యతలు స్వీకరిస్తారని డీబీఎస్ ప్రకటించింది.
ప్రస్తుతం డీబీఎస్ బ్యాంక్ ఇండియాలో ఇన్‌స్టిట్యూషనల్ బ్యాంకింగ్ గ్రూప్ (IBG) హెడ్‌గా ఉన్న వర్మ, ఫిబ్రవరి 28న సురోజిత్ షోమ్ రిటైర్మెంట్ తర్వాత సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కొత్త పాత్రలో వర్మ డీబీఎస్ గ్రూప్ మేనేజ్‌మెంట్ కమిటీలో భాగం అవుతారు.
రజత్ వర్మ గురించి..
అనుభవజ్ఞుడైన బ్యాంకర్ అయిన వర్మ లావాదేవీల బ్యాంకింగ్, ఆర్థిక సంస్థలు, స్థిరమైన ఫైనాన్స్, మైక్రో అండ్ ఎస్‌ఎంఈ (SME) బ్యాంకింగ్, అలాగే బ్రాంచ్ బ్యాంకింగ్‌తో సహా వినియోగదారు, కార్పొరేట్ బ్యాంకింగ్‌లో 27 సంవత్సరాల ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉన్నారు.
2023 జూన్‌లో ఐబీజీ హెడ్‌గా డీబీఎస్‌లో చేరినప్పటి నుండి ఆయన అన్ని క్లయింట్ విభాగాలలో వ్యాపారాన్ని గణనీయంగా అభివృద్ధి చేశారు. ఇప్పటికే ఉన్న కార్పొరేట్ సంబంధాలను మరింతగా పెంచుకోవడం, కొత్త కస్టమర్‌ల సముపార్జనను వేగవంతం చేయడం, విస్తృతమైన వృద్ధి రంగాలలో కొత్త అవకాశాలను గుర్తించడం ద్వారా ఇది సాధ్యమైంది.
రజత్ వర్మ నాయకత్వంలో డీబీఎస్ 2024లో గ్లోబల్ ఫైనాన్స్ నుంచి సస్టైనబుల్ ఫైనాన్స్ ఇండియా బెస్ట్ బ్యాంక్‌గా ఎంపికైంది. డీబీఎస్‌లో చేరడానికి ముందు ఆయన హెచ్‌ఎస్‌బీసీ (HSBC) ఇండియాలో మేనేజింగ్ డైరెక్టర్, కమర్షియల్ బ్యాంకింగ్ కంట్రీ హెడ్‌గా ఉన్నారు.
“బ్యాంకింగ్ అనుభవజ్ఞుడైన రజత్ 18 నెలల క్రితం మాతో చేరినప్పటి నుండి మా ఇండియా ఐబీజీ వ్యాపారాన్ని పటిష్టం చేశారు. మా బలమైన ప్లాట్‌ఫామ్‌తో రాబోయే సంవత్సరాల్లో భారతదేశ వృద్ధిలో పాల్గొనడాన్ని డీబీఎస్ కొనసాగిస్తుంది. రజత్ వ్యాపారాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్తారని విశ్వసిస్తున్నాను’’ డీబీఎస్ సీఈవో పీయూష్ గుప్తా పేర్కొన్నారు.
డీబీఎస్ గురించి..
డీబీఎస్ అనేది 19 దేశాల్లొ ఉనికిని కలిగి ఉన్న ఆసియాలో ప్రముఖ ఆర్థిక సేవల సమూహం. సింగపూర్‌లో లిస్ట్ అయిన ఈ గ్రూప్ ప్రధాన కార్యాలయం అక్కడే ఉంది. 2024లో బాధ్యతాయుతమైన బ్యాంకింగ్‌పై దాని దృష్టికి అనుగుణంగా, గ్లోబల్ ఫైనాన్స్ ద్వారా డీబీఎస్ సస్టైనబుల్ ఫైనాన్స్‌లో భారతదేశానికి ఉత్తమ బ్యాంక్‌గా ఎంపికైంది. అంతే కాకుండా 2020 నుండి 2022 వరకు వరుసగా మూడు సంవత్సరాలు ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాంకుల ఫోర్బ్స్ జాబితాలో భారత్‌లోని మొదటి 3 స్థానాల్లో డీబీఎస్ బ్యాంక్ నిలిచింది.
డీబీఎస్ బ్యాంక్ భారతదేశంలో 30 సంవత్సరాలుగా ఉనికిలో ఉంది. 1994లో ముంబైలో తన మొదటి కార్యాలయాన్ని ప్రారంభించింది. డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్ భారతదేశంలోని అతిపెద్ద విదేశీ బ్యాంకులలో మొదటిది. దేశంలోని పెద్ద, మధ్యస్థ, చిన్న సంస్థలు, వ్యక్తిగత వినియోగదారులకు విస్తృత సేవలు అందిస్తోంది. 2020 నవంబర్‌లో లక్ష్మీ విలాస్ బ్యాంక్ డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్‌లో విలీనమైంది. డీబీఎస్ బ్యాంక్ ఇండియా ఇప్పుడు భారత్‌లోని 19 రాష్ట్రాల్లో సుమారు 500 శాఖల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment