న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వచ్చే మూడు నెలల్లో రెపో రేటును మరో అరశాతం పెంచే అవకాశం ఉందని డీబీఎస్ బ్యాంక్ అంచనావేసింది. ఈ మేరకు బ్యాంక్ తన తాజా నివేదికను విడుదల చేసింది. ‘‘2014 వరకూ రెపో రేటులో ఎటువంటి మార్పూ ఉండదన్నది మా క్రితం అంచనాలు. అయితే ఇప్పుడు ద్రవ్యోల్బణం తీవ్రత వల్ల మా అంచనాలను మార్చుకోవాల్సిన పరిస్థితి కనబడుతోంది. రానున్న మూడు నెలల్లో రెపో రేటు మరో రెండు విడతలుగా అరశాతం మేర పెరిగే అవకాశం ఉంది’’ అని నివేదిక పేర్కొంది. లిక్విడిటీ (నగదు లభ్యత) కట్టడి దిశలో ఆర్‌బీఐ ఇటీవల తీసుకున్న చర్యలను డిసెంబర్ లోపు ఎంతమాత్రం వెనక్కు తీసుకునే అవకాశం లేదని సైతం నివేదిక అభిప్రాయపడింది. ఈ నెల 20వ తేదీన జరిగిన తన తొలి పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పావు శాతం మేర వడ్డీరేటు పెంపునకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనితో బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు 7.5 శాతానికి చేరింది.