మొండిబకాయిలను నైతికతతో ముడిపెట్టలేం
దీనికి అనేక కారణాలున్నాయ్.. ఆర్‌బీఐ గవర్నర్ రాజన్
న్యూయార్క్: బ్యాంకింగ్ మొండిబకాయిల సమస్య తీవ్రమయిన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ దీనిపై కీలక వ్యాఖ్య చేశారు. ఒక అకౌంట్ మొండిబకాయిగా మారడానికి పలు కారణాలు ఉంటాయని పేర్కొన్న ఆయన, ఈ అకౌంట్ల న్నింటికీ నైతికతను జోడించడం సరికాదని అభిప్రాయపడ్డారు. మొండిబకాయిల సమస్యల్లో ఇరుక్కున్నవారిలో మంచి వారూ, చెడ్డవారూ... ఇద్దరూ ఉంటారని విశ్లేషించారు. న్యూయార్క్‌లో కొలంబియా లా స్కూల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
మొండిబకాయిల సమస్యను పరిష్కరించే క్రమంలో... దీనిని ‘నేరపూరిత అంశానికి’ దూరంగా ఉంచాలని సూచించారు. ఒక కంపెనీ మొండిబకాయి సమస్యలో కూరుకుపోవడంలో పలు కారణాలు ఉంటాయని అన్నారు. ‘మీ భాగస్వామి సరిగా పనిచేయకపోవచ్చు. తగిన సమయంలో అనుమతులు రాకపోవచ్చు. మీ లెసైన్సులను రద్దు చేసి ఉండవచ్చు. ఇవన్నీ మీకు ప్రతికూలంగా మారవచ్చు. ఇలా ఒకరు చేసిన తప్పుకూ మీరు నష్టపోయే వీలుంది. వీటిని నేరపూరితంగా పరిగణించలేం’ అని ఈ సందర్భంగా రాజన్ అన్నారు.
ప్రభుత్వ ప్రకటన సానుకూలం...
రుణ మంజూరు ప్రక్రియలో ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం ఉండబోదని ప్రభుత్వం స్పష్టం చేయడం పట్ల రాజన్ హర్షం వ్యక్తం చేశారు. ఇది కీలకమైన అంశంగా పేర్కొన్న ఆయన, బ్యాంకుల్లో నిర్వహణా వ్యవస్థ మెరుగుదలపై తదుపరి దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. ఎన్‌పీఏల సమస్య పరిష్కారంలో ఇది కీలక అంశమని సైతం అభిప్రాయపడ్డారు. సమస్య పరిష్కారంలో తగిన చట్ట నిబంధనల వ్యవస్థ కూడా అవసరమని వివరించారు. ఈ అంశంపై ఇప్పుడు న్యాయవ్యవస్థ కూడా పటిష్టంగా పనిచేస్తోందని పేర్కొన్న ఆయన, గతంలో ఇలాంటి పరిస్థితి లేదన్నారు.
వర్షపాతం, ద్రవ్యోల్బణం కీలకం..
తదుపరి వడ్డీరేటు కోత నిర్ణయం వర్షపాతం, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుందని రాజన్ అన్నారు. భారత్‌కు ఈ ఏడాది భారీ ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వచ్చాయని అన్నారు.