పాలసీ విధానాలపై అంతర్జాతీయ మార్గదర్శకాలు!
♦ ఆర్‌బీఐ గవర్నర్ రాజన్ సూచన
♦ లేదంటే... ప్రతికూల పరిణామలకు
♦ అవకాశం ఉంటుందని విశ్లేషణ
ముంబై: ద్రవ్య పరపతి విధానాలకు సంబంధించి అంతర్జాతీయంగా కొన్ని మార్గదర్శకాలు అవసరమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ బాధ్యతాయుత ద్రవ్య విధాన ప్రవర్తన దిశలో ఇది కీలకమని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వృద్ధే లక్ష్యంగా ఒక దేశం తీసుకునే దూకుడు నిర్ణయాలు... అంతర్జాతీయంగా మరో దేశంపైనా ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, దీనిపై సమగ్ర మార్గదర్శకాలు అవసరమని అన్నారు.
అంగీకృత మార్గదర్శకాలు పాలసీ విధాన నిర్ణయాల్లో పాటిస్తే... ఏకీకృత సానుకూల ఫలితాలను మెరుగుపరచుకునే అవకాశం ఉంటుందని వివరించారు. ‘రూల్స్ ఆఫ్ మానిటరీ పాలసీ’ అన్న శీర్షికన రాసిన ఒక వర్కింగ్ పేపర్‌లో ఆయన తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. అనుసరించే విధానాలు తాత్కాలిక ప్రయోజనాలను కల్పించే విధంగా కాకుండా... దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చేట్లు ఉండాలని అన్నారు. ఒక విధానం దేశీయంగా అంతర్జాతీయ సానుకూల ఫలితాన్ని ఇస్తే.. అది దీర్ఘకాలంలో ప్రపంచ సంక్షేమానికి దోహదపడుతుందని వివరించారు. విధానాల అసమర్థత అనే పదానికి ఎక్కడా తావులేని పరిస్థితిని తద్వారా సృష్టించవచ్చని అన్నారు. సిగ్మా పేరుతో ఇలాంటి ఒక విధానాన్ని ఇప్పుడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ కూడా అభివృద్ధి చేసింది.