ఆర్‌బీఐ ద్రవ్యోల్బణం లక్ష్య సాధన కష్టమే
ఐఎంఎఫ్ అంచనా
సమన్వయ లోపాలే కారణంగా విశ్లేషణ
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కేవలం తన ద్రవ్య పరపతి విధానాల ద్వారా రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యాలను సాధించడం కష్టమని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) పేర్కొంది. ‘అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ద్రవ్య పరపతి విధానాల బదలాయింపు’ పేరుతో ఐఎంఎఫ్ తాజా అధ్యయన పత్రాన్ని విడుదల చేసింది. దిగువస్థాయి ఆదాయాల దేశాల్లో ద్రవ్య, పరపతి విధానాల ద్వారా ద్రవ్యోల్బణం లక్ష్యాలను సాధించడం తేలిక్కాదని ఈ అధ్యయన పత్రం వివరించింది. ఆర్‌బీఐ నియంత్రణలోని పాలసీ ఇన్‌స్ట్రుమెంట్స్ (రెపో, రివర్స్ రెపో వంటి సాధనాలు)-ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ మధ్య తగిన విశ్వసనీయ, సమర్థవంతమైన సంబంధాలు లేకపోవడం భారత్‌కు సంబంధించి తమ ‘ద్రవ్యోల్బణం లక్ష్య సాధన కష్టనష్టాల’ అంచనాకు కారణంగా వివరించింది. ఇప్పటికే దేశంలో రుణ వృద్ధి, డిపాజిట్ రేట్లు తగ్గడాన్నీ నివేదిక ప్రస్తావించింది. వచ్చే ఐదేళ్లలో రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ‘ప్లస్ 2 లేదా మైనస్ 2’తో 4 శాతంగా ఉండేలా చర్యలు తీసుకునే బాధ్యతలను ఆర్‌బీఐకి అప్పగించిన నేపథ్యంలో ఐఎంఎఫ్ నివేదికకు ప్రాధాన్యత సంతరించుకుంది.
దేశంలో ఆర్థిక రికవరీ: మోర్గాన్ స్టాన్లీ
మరోవైపు దేశంలో ఆర్థిక రికవరీ మున్ముందు మరింత వేగం పుంజుకుంటుందన్న అభిప్రాయాన్ని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ- మోర్గాన్ స్టాన్లీ అంచనావేసింది. విద్యుత్ వినియోగం పెరగడం, వినియోగ వృద్ధి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇం డియా రుణ రేట్లు తగ్గే అవకాశాలను ఇందుకు కారణంగా చూపింది. అలాగే వచ్చే రెండేళ్లలో రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతం దిగువనే కొనసాగుతుందని కూడా మోర్గాన్ స్టాన్లీ అంచనావేసింది. గ్రామీణ డిమాండ్ పెరగడం, ప్రభుత్వ పెట్టుబడుల్లో వృద్ధి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా దీర్ఘకాలంలో భారత్ వృద్ధికి దోహదపడే అంశాలుగా వివరించింది.