ముంబై: దేశంలో ఈ ఏడాది తొలి నెలల్లో ద్రవ్యోల్బణం పెరుగుదలకు సరఫరాల సంబంధ సమస్యలే ప్రధాన కారణమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మంగళవారం విడుదల చేసిన ఒక బులెటిన్‌లో పేర్కొంది. అయితే ఇప్పుడు ఈ ప్రభావం క్షీణించిందని, తగ్గిన ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో వ్యవస్థలో డిమాండ్, వ్యయాలు భారీగా పెరుగుతున్నాయని బులెటిన్ వివరించింది. ద్రవ్యోల్బణం దిగివచ్చి, డిమాండ్ నిరంతరం కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయని వివరించింది.
2022 ఫిబ్రవరి తర్వాత ద్రవ్యోల్బణం పరిస్థితిని విశ్లేషించిన ఆర్‌బీఐ పేపర్ ప్రకారం, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఫలితంగా ఏర్పడిన సరఫరాల వైపు సమస్యలు– రిటైల్ ద్రవ్యోల్బణాన్ని నవంబర్ వరకూ గడచిన 10 నెలల్లో ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతానికి మించి పెంచాయి. అయితే నవంబర్ నెల్లో భారీగా 90 బేసిస్ పాయింట్లు తగ్గి 5.9 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే.
‘అటానమీ ఆఫ్ ఇన్‌ఫ్లెషన్’ అన్న శీర్షికన రూపొందిన ఈ విశ్లేషణా పత్రం రాసిన బృందానికి ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర నేతృత్వం వహించారు. ద్రవ్యోల్బణం నిర్దేశిత 6 శాతం దాటి ఎందుకు పెరిగిందన్న అంశంపై ఆర్‌బీఐ ఇటీవలే కేంద్రానికి ఒక నివేదికను అందజేసింది. ఇది రహస్యంగా సమర్పించిన నివేదిక అని, దీనికి బహిర్గతం చేయడం జరగదని ఆర్‌బీఐ వర్గాలు పేర్కొన్నాయి. ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022–23) సగటున 6.7 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) అంచనావేస్తోంది.
చదవండి: ఆరేళ్లలో బ్యాంకింగ్ రుణ మాఫీ ఎన్ని లక్షల కోట్లు తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment