మళ్లీ రూపాయి విలవిల..
65 పైసలు డౌన్..62.94 వద్ద ముగింపు
⇒11 నెలల కనిష్ట స్థాయి...
⇒నాలుగు నెలల్లో అతిపెద్ద పతనం
⇒ఆయిల్ కంపెనీల నుంచి భారీ డాలర్ డిమాండ్ ప్రభావం...
ముంబై: దేశీ కరెన్సీ మళ్లీ బక్కచిక్కుతోంది. సోమవారం డాలరుతో రూపాయి మారకం విలువ 65 పైసలు దిగజారి 62.94 వద్ద ముగిసింది. ఇది 11 నెలల కనిష్టస్థాయి(2014 జనవరి 27న విలువ 63.10) కావడం గమనార్హం. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రెండు రోజుల పాలసీ సమీక్ష నేడు(మంగళవారం) ప్రారంభం కానుండటంతో గ్లోబల్ మార్కెట్ల ప్రధాన కరెన్సీలతో డాలరు విలువ భారీగా పుంజుకుంది. వడ్డీరేట్ల పెంపుదిశగా ఫెడ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే ఉత్కంఠే దీనికి కారణం.
దీనికితోడు అంతర్జాతీయంగా ముడి చమురు ధరల భారీ పతనం కారణంగా దేశీయ క్రూడ్ దిగుమతిదారులు కొనుగోళ్లు పెంచడం.. దీంతో డాలర్లకు డిమాండ్ పోటెత్తడం రూపాయి విలువ పడిపోయేందుకు దారితీసినట్లు ఫారెక్స్ డీలర్లు పేర్కొన్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ధర బ్యారెల్‌కు ఐదేళ్లకుపైగా కనిష్టానికి(నెమైక్స్ క్రూడ్ 60 డాలర్ల దిగువకు) పడిపోయిన సంగతి తెలిసిందే. కాగా, గతేడాది ఆగస్టు 28న డాలరుతో రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్టమైన 68.80ని తాకింది.
4 నెలల్లో అతిపెద్ద పతనం...
సోమవారం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్‌లో రూపాయి విలువ గత ముగింపు 62.29తో పోలిస్తే బలహీనంగా 62.50 వద్ద ప్రారంభమైంది. ఒకానొక దశలో 62.95కి కూడా జారింది. చివరకు 1.04% నష్టపోయి 62.94వద్ద స్థిరపడింది. గడిచిన 4 నెలల్లో రూపాయి అతిపెద్ద పతనం ఇదే. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఇటీవలి కాలంలో అమ్మకాల బాట పడుతుండటంతో దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుతున్నాయి. ఇది కూడా రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. కాగా, నవంబర్ నెలకు టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆదారిత ద్రవ్యోల్బణం రేటు సున్నా స్థాయికి పడిపోవడంతో ఆర్‌బీఐ వడ్డీరేట్ల కోతకు త్వరలోనే ఆస్కారం ఉందన్న అంచనాలు బలపడుతున్నాయి.
ఆర్థిక వ్యవస్థపై ప్రభావం...
రూపాయి క్షీణతతో.. ప్రధానంగా దిగుమతులపై ఆధారపడుతున్న మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడనుంది. ముఖ్యంగా బంగారం, క్రూడ్ దిగుమతుల భారం పెరిగి... కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) ఎగబాకుతుంది. దిగుమతి ఉత్పత్తులైన బంగారం, వెండి, చమురు, వంటనూనెల ధరలు పెరిగే ఆస్కారం వుంది. కార్పొరేట్ కంపెనీల విదేశీ రుణాల చెల్లింపుల భారం పెరగడంతో వాటి లాభాలు హరించుకుపోతాయి. ఇది దేశీయంగా వాటి విస్తరణ, కార్యకలాపాలపై ప్రభావం చూపుతుంది. వెరసి అసలే మందగమనంలో ఉన్న స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)కి శరాఘాతంగా మారుతుంది. విదేశీ విద్య, ప్రయాణాలు కూడా భారమవుతాయి. అయితే, అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు భారీగా తగ్గడం భారత్‌కు సానుకూలాంశం.