తక్కువ ద్రవ్యోల్బణం బాటలోనే భారత్!
♦ రాజన్ ఆశాభావం...ఎన్‌పీఏల సమస్యపైనా
♦ దృష్టి కొనసాగుతుందన్న విశ్వాసం
♦ తక్కువ వడ్డీరేట్ల విధానంతో
♦ ఆర్థిక వ్యవస్థల్లో ఇబ్బంది తప్పదని హెచ్చరిక
ముంబై/న్యూయార్క్: భారత్‌లో ద్రవ్యోల్బణం దిగువ స్థాయి బాటలోనే కొనసాగుతుందన్న విశ్వాసాన్ని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ (ఆర్‌బీఐ)గా పదవీ విరమణ చేసిన రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. అలాగే బ్యాంకింగ్ మొండిబకాయిల సమస్యల పరిష్కారంపైనా దృష్టి ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వృద్ధి చక్రాలకు తిరిగి వేగం ఎలా పెంచాలన్న అంశంపై ప్రపంచ సెంట్రల్ బ్యాంకులు తర్జన భర్జనలు పడుతున్న నేపథ్యంలో... ఈ మేరకు 53 సంవత్సరాల రాజన్ న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో కొన్ని అంశాలు చూస్తే...
ద్రవ్యోల్బణం: ప్రస్తుతం దాదాపు 6% వద్ద ఉన్న ద్రవ్యోల్బణం ప్రభుత్వ నిర్దిష్ట 4%కి దిగిరావడానికి కఠిన పరపతి విధానం దోహదపడుతుంది. ఇందుకు సంబంధించి ఇప్పటి వరకూ ఏమి చేయాలో అదంతా చేశాం. నేను అనుసరించిన ద్రవ్య విధానమే ఆర్‌బీఐ గవర్నర్ బాధ్యతల రెండో విడత కొనసాగింపునకు అడ్డంకి అయ్యిందనడాన్ని ఏకీభవించను.
తక్కువ వడ్డీరేట్లు: తక్కువ వడ్డీరేట్ల విధానం ప్రపంచ మార్కెట్లను అనిశ్చితికి గురిచేస్తుంది. తిరిగి సరిదిద్దడం చాలా కష్టం. వృద్ధి రేటును పెంచాలన్న ధ్యేయంతో అమెరికా, యూరప్‌సహా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు తక్కువ స్థాయి వడ్డీరేట్ల వ్యవస్థలో ఉన్నాయి. చివరకు రేట్లు పెంచాల్సిన పరిస్థితుల్లో ఆయా దేశాలు భయం గుప్పిట్లోకి జారిపోయే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ఇతర ద్రవ్య ఇన్‌స్ట్రమెంట్స్ ద్వారా దిగువస్థాయి వడ్డీరేట్లకు ప్రత్యామ్నాయం వెతకడం సాధ్యం కాదు. వృద్ధికి ఊపునివ్వడానికి సంస్కరణలు చేపట్టడమే మార్గం.
అధ్యాపకుడు-ఆర్‌బీఐ గవర్నర్-వ్యత్యాసం: నా గత అధ్యాపక వృత్తికి- సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ పదవికీ మధ్య వ్యత్యాసం ఏమిటని చాలా మంది అడుగుతున్నారు. ఏదైనా ఒక పనికి సంబంధించి సలహా ఇవ్వడం కన్నా, దానిని చేయడం మంచిది. ఇక్కడ ఇదే వర్తిస్తుంది. ఇక ఒక సలహా కొన్ని సందర్భాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఫలితాలను ఇవ్వవచ్చు. ఈ ఫలితాన్ని ఆ సలహాదారుడు తక్షణం చూడడు. అయితే పని చేస్తున్న వ్యక్తి మాత్రం తాను చేసిన పనికి సంబంధించి ఫలితాన్ని కొద్ది కాలంలోనే చూడగలుగుతాడు.
సెంట్రల్ బ్యాంకుల సాయం అంతింతకాదు!
వివిధ దేశాల్లో కేంద్ర బ్యాంకులు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలను రక్షించడానికి నిరంతరం శ్రమిస్తాయి. ప్రభుత్వాలకు సెంట్రల్ బ్యాంకులు భారీ నిధులనే ‘మిగులు’ రూపంలో మళ్లిస్తున్నాయి. ఇక్కడ భారత్‌లో ఆర్‌బీఐని తీసుకుందాం. జూన్‌తో ముగిసిన సంవత్సర కాలానికి తన మిగులు రూ.65,876 కోట్లను కేంద్రానికి ఆర్‌బీఐ బదలాయించింది. ప్రధానంగా అమెరికా ట్రెజరీ బిల్స్‌సహా ఇతర సావరిన్ బాండ్లలో ఇన్వెస్ట్‌మెంట్ కార్యకలాపాల వల్ల ఆర్‌బీఐకి ఈ మిగులు సమకూరింది.
గత ఆర్థిక సంవత్సరం ఇలా అందించింది రూ.65,896 కోట్లు. ఉద్యోగులకు వేతనాల పెంపు అమలు సమయంలో తాజాగా ఆర్‌బీఐ నుంచి అందిన మొత్తం ప్రభుత్వానికి పెద్ద ఊరటే. ఇక అమెరికాను చూస్తే... 4.5 ట్రిలియన్ డాలర్ల బ్యాలెన్స్ షీట్ ప్రభుత్వానికి ఆర్థిక భారీ ప్రయోజనాలను అందిస్తోంది. 117 బిలియన్ డాలర్లు అమెరికా ఖజానాకు అందుతోంది. అయితే బ్రిజిల్ సెంట్రల్ బ్యాంక్ విషయంలో 5.3 బిలియన్‌ల మేర ఆపరేషనల్ నష్టం వాటిల్లింది.