
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పావుశాతం రేటు పెంచినప్పటికీ, ఆ మేరకు పెంపు ప్రభావం వ్యవస్థలోకి బదలాయించవద్దని పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ గురువారం బ్యాంకింగ్‌కు విజ్ఞప్తి చేసింది. ఇది పారిశ్రామిక వృద్ధికి, తద్వారా స్థూల దేశీయోత్పత్తి వృద్ధికి దోహదపడుతుందని అన్నారు. పావుశాతం రెపో పెంపును సర్దుబాటు చేసుకునే లిక్విడిటీ పరిస్థితులు ప్రస్తుతం బ్యాంకింగ్‌కు ఉన్నాయని చాంబర్ ప్రెసిడెంట్ అనిల్ ఖైతాన్ అభిప్రాయపడ్డారు.
ఇక ద్రవ్యోల్బణం భయాలు ఇప్పుడు అక్కర్లేదని కూడా ఆయన అంచనావేశారు. కేంద్రం తీసుకువస్తున్న సంస్కరణలు, తగిన వర్షపాతం దేశంలో ద్రవ్యోల్బణం భయాలను తగ్గిస్తుందని భావిస్తున్న ఆయన ఆయా అంశాల వల్ల లభించే ప్రయోజనాల వల్ల దేశం క్రూడ్ ధరల తీవ్రత వంటి అంతర్జాతీయ ఆర్థిక ఒత్తిడులను కూడా తట్టుకోగలుగుతుందని పేర్కొన్నారు.