నోటు నడిచొచ్చేది ఇలా..
ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ నగదు అవసరాలను అంచనా వేస్తుంది. ఇందుకోసం దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ, జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం, ఎలక్ట్రానిక్ పేమెంట్లు జరుగుతున్న తీరు ఇలా పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన అనంతరం ఆర్డర్ ఇస్తుంది.
►కర్ణాటకలోని మైసూరు, మధ్యప్రదేశ్‌లోని హౌషంగాబాద్‌లోని కరెన్సీ పేపర్ మిల్లులు హైసెక్యూరిటీ నోట్ల డిజైన్, ఉత్పత్తి చేస్తాయి.
► పేపర్ రెడీ కాగానే.. ప్రింటింగ్‌కు పంపిస్తారు. దేశంలో 4 ప్రింటింగ్ ప్రెస్‌లున్నాయి. కొత్త నోట్ల విషయానికొస్తే.. కర్ణాటకలోని మైసూరు, పశ్చిమ బెంగాల్లోని సల్బోనీలో రూ.2 వేల నోట్లనుముద్రిస్తుండగా.. మహారాష్ట్రలోని నాసిక్, మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో రూ.500 నోట్లను ప్రింటింగ్ చేస్తున్నారు.
► ముద్రణ పూర్తి కాగానే.. వీటిని దేశంలోని 19 ప్రధాన నగరాల్లో ఉన్న ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు(ఇష్యూ ఆఫీస్) పంపిస్తారు. అందులో హైదరాబాద్ కూడా ఒకటి. బ్యాంకుల ఇండెంట్ల ఆధారంగా ఇక్కడ్నుంచి వీటిని భద్రత మధ్య దేశవ్యాప్తంగా ఉన్న 4 వేల కరెన్సీ చెస్ట్‌లకు తరలిస్తారు. వీటిని వివిధ బ్యాంకులు నిర్వహిస్తున్నాయి.
► చెస్ట్‌లోని కరెన్సీ రాగానే.. సదరు బ్యాంకు ప్రధాన శాఖ.. అవసరాల ఆధారంగా తన పరిధిలోని ఇతర బ్రాంచులకు నగదును సరఫరా చేస్తుంది.
► బ్రాంచుల నుంచి ఏటీఎంకు కరెన్సీని పంపిస్తారు. రిజిస్టరైన ఏడు క్యాష్ లాజిస్టిక్స్ సంస్థలకు చెందిన 8800 వ్యాన్లు కరెన్సీని ఏటీఎంలకు తరలించే పనిని చేస్తాయి. ఏటీఎంలలో నాలుగు కంటెయినర్లు ఉంటాయి. ఒక్కోదానిలో 2,500 చొప్పున.. మొత్తం 10 వేల నోట్లు ఉంటాయి. గతంలో వీటిల్లోని రెండు కంటెయినర్లలో వంద నోట్లు.. ఒకదాంట్లో రూ.500, మరోదాంట్లో రూ.1000 ఉండేది. ఇప్పుడు పాత నోట్ల కంటెయినర్లకు మార్పులుచేసి ..వాటి స్థానంలో కొత్త రూ.2000, రూ.500 నోట్లను పెడుతున్నారు. ఇక్కడ్నుంచి నగదు మనకు చేరుతుంది.