Electronic payments
-
ఫాస్టాగ్ లేకుంటే రాయితీ కట్
సాక్షి, హైదరాబాద్: ఫాస్టాగ్ తీసుకోకుంటే టోల్‌ప్లాజాల వద్ద క్యూలో ఎదురుచూడాల్సి రావటం ఇప్పటివరకు ఉన్న సమస్య.. కానీ ఇప్పుడు కేంద్ర ఉపరితల రవాణా శాఖ క్రమంగా కొత్త ఆంక్షలను తెరపైకి తెస్తోంది. ఎంత ప్రయత్నించినా, ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపు విధానం వైపు వాహనదారులు వేగంగా మళ్లకపోతుండటంతో, ఒత్తిడి తెచ్చి మరీ ఫాస్టాగ్స్ కొనిపించాలని నిర్ణయించింది. సంక్రాంతి వేళ కొత్త ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఫాస్టాగ్ ఉంటేనే ఆ రాయితీ.. టోల్‌ప్లాజాల వద్ద రాయితీ చాలాకాలంగా అమల్లో ఉంది. టోల్గేట్ దాటి వెళ్లిన వాహనాలు 24 గంటల్లో తిరుగుప్రయా ణమై సంబంధిత టోల్ ప్లాజాకు చేరుకుంటే, రిటర్న్ టోల్‌ఫీజులో సగం రాయితీ ఉంటుంది. ఇప్పుడు ఈ రాయితీని ఫాస్టాగ్ వాహనాలకే వర్తింపచేస్తున్నారు. సంక్రాంతి నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చింది. నగదు రూపంలో టోల్ చెల్లించే వాహనాలకు ఇది వర్తించదు. నగదు చెల్లించే వారు 24 గంటల్లో తిరిగి వచ్చినా మొత్తం టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నెలవారీ పాస్ రాయితీ కూడా.. జాతీయ రహదారులపై రెగ్యులర్ గా తిరిగే వాహనదారులకు నెలవారీ పాస్‌లనూ జారీ చేసే విధానం అమల్లో ఉంది. ఈ పాస్ తీసుకుంటే టోల్ చార్జీల్లో తగ్గింపు లభిస్తుంది. ఇప్పుడు ఈ పాస్‌లను కూడా ఫాస్టాగ్‌తో ముడిపెట్టారు. ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపు విధానంలోనే ఇక రాయితీ వర్తిస్తుంది. ఫాస్టాగ్ లేకుంటే నెలవారీ పాస్ రాయితీ ఉండదు. అలాగే టోల్గేట్లకు 10 కి.మీ. పరిధిలో ఉండే వాహనదారులకు కూడా ప్రత్యేక రాయితీ పాస్ అమల్లో ఉంది. ఇప్పుడు ఈ పాస్‌ను కూడా ఫాస్టాగ్ ఉంటేనే రాయితీ వర్తించేలా మార్చారు. సంక్రాంతి నుంచి ఇదీ అమల్లోకి వచ్చింది. ఆ 2 టోల్ గేట్లు మినహా... సంక్రాంతి వరకు అమల్లో ఉన్న 25 శాతం హైబ్రిడ్ విధానం గడువు పొడిగింపునకు కేంద్రం సుముఖంగా లేదు. జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల వద్ద 25 శాతం లేన్లు నగదు చెల్లింపునకు వీలుగా ఉండేవి. వీటిల్లోంచి ఫాస్టాగ్ వాహనాలతోపాటు నగదు చెల్లించే వాహనాలు వెళ్లేవి. 14వ తేదీ అర్ధరాత్రితో ఈ గడువు తీరింది. దీంతో 15 నుంచి టోల్ ప్లాజాల వద్ద ఒక్కో వైపు ఒక్కో లేన్ మాత్రమే నగదు చెల్లింపునకు కేటాయించారు. రాష్ట్రంలో 17 ప్రాంతాల్లో ఉన్న టోల్‌ప్లాజాల్లో 15 చోట్ల ఇదే విధానం అమల్లోకి వచ్చింది. రద్దీ ఎక్కువగా ఉండే విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న పంతంగి టోల్‌ప్లాజా, బెంగుళూరు హైవే మీదున్న రాయికల్ టోల్‌ప్లాజాలను దీని నుంచి మినహాయించారు. ఈ రెండు ప్లాజాల్లో మరో నెల రోజులు 25 శాతం హైబ్రీడ్ లేన్లు నగదు చెల్లించేందుకు అందుబాటులో ఉంటాయి. 1.12 లక్షలకు పెరిగిన ఫాస్టాగ్ వాహనాలు ప్రస్తుతం రాష్ట్రంలో ఫాస్టాగ్ వాహనాల సంఖ్య 1.12 లక్షలకు పెరిగింది. సంక్రాంతి వేళ సొంతూళ్లకు వెళ్లే సందర్భంలో ఎక్కువమంది ఫాస్టాగ్స్ కొనుగోలు చేయటంతో వాటి సంఖ్య కాస్త వేగంగా పెరిగింది. దీంతో టోల్‌ప్లాజాల నుంచి దూసుకెళ్తున్న మొత్తం వాహనాల్లో 54 శాతం వాహనాలకు ఫాస్టాగ్ ఉన్నట్టైంది. టోల్ వసూళ్లలో వీటి వాటా 65 శాతానికి పెరిగింది. -
నోటు నడిచొచ్చేది ఇలా..
ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ నగదు అవసరాలను అంచనా వేస్తుంది. ఇందుకోసం దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ, జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం, ఎలక్ట్రానిక్ పేమెంట్లు జరుగుతున్న తీరు ఇలా పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన అనంతరం ఆర్డర్ ఇస్తుంది. ►కర్ణాటకలోని మైసూరు, మధ్యప్రదేశ్‌లోని హౌషంగాబాద్లోని కరెన్సీ పేపర్ మిల్లులు హైసెక్యూరిటీ నోట్ల డిజైన్, ఉత్పత్తి చేస్తాయి. ► పేపర్ రెడీ కాగానే.. ప్రింటింగ్‌కు పంపిస్తారు. దేశంలో 4 ప్రింటింగ్ ప్రెస్‌లున్నాయి. కొత్త నోట్ల విషయానికొస్తే.. కర్ణాటకలోని మైసూరు, పశ్చిమ బెంగాల్‌లోని సల్బోనీలో రూ.2 వేల నోట్లనుముద్రిస్తుండగా.. మహారాష్ట్రలోని నాసిక్, మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో రూ.500 నోట్లను ప్రింటింగ్ చేస్తున్నారు. ► ముద్రణ పూర్తి కాగానే.. వీటిని దేశంలోని 19 ప్రధాన నగరాల్లో ఉన్న ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు(ఇష్యూ ఆఫీస్) పంపిస్తారు. అందులో హైదరాబాద్ కూడా ఒకటి. బ్యాంకుల ఇండెంట్ల ఆధారంగా ఇక్కడ్నుంచి వీటిని భద్రత మధ్య దేశవ్యాప్తంగా ఉన్న 4 వేల కరెన్సీ చెస్ట్‌లకు తరలిస్తారు. వీటిని వివిధ బ్యాంకులు నిర్వహిస్తున్నాయి. ► చెస్ట్‌లోని కరెన్సీ రాగానే.. సదరు బ్యాంకు ప్రధాన శాఖ.. అవసరాల ఆధారంగా తన పరిధిలోని ఇతర బ్రాంచులకు నగదును సరఫరా చేస్తుంది. ► బ్రాంచుల నుంచి ఏటీఎంకు కరెన్సీని పంపిస్తారు. రిజిస్టరైన ఏడు క్యాష్ లాజిస్టిక్స్ సంస్థలకు చెందిన 8800 వ్యాన్లు కరెన్సీని ఏటీఎంలకు తరలించే పనిని చేస్తాయి. ఏటీఎంలలో నాలుగు కంటెయినర్లు ఉంటాయి. ఒక్కోదానిలో 2,500 చొప్పున.. మొత్తం 10 వేల నోట్లు ఉంటాయి. గతంలో వీటిల్లోని రెండు కంటెయినర్లలో వంద నోట్లు.. ఒకదాంట్లో రూ.500, మరోదాంట్లో రూ.1000 ఉండేది. ఇప్పుడు పాత నోట్ల కంటెయినర్లకు మార్పులుచేసి ..వాటి స్థానంలో కొత్త రూ.2000, రూ.500 నోట్లను పెడుతున్నారు. ఇక్కడ్నుంచి నగదు మనకు చేరుతుంది. -
ఈ పేమెంట్ ద్వారా ఉద్యోగుల జీతాలు
శ్రీకాకుళం పాతబస్టాండ్:ఖజానాశాఖలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఖజానా శాఖ ద్వారా చెల్లించే వివిధ చెల్లింపులను ఈ పేమెంట్ ద్వారా చెల్లించేందుకు సర్వం సిద్దం చేశారు. వచ్చే నెల నుంచి ఉద్యోగుల జీతాలు నేరుగా వారి ఖాతాల్లో జమకానున్నాయి. ఇంతవరకు ఉద్యోగుల జీతాలు ముందుగా ట్రెజరీలో సంబంధిత అధికారులు అందజేసిన వివరాల ప్రకారం ఖజానాశాఖ అధికారులు బ్యాంకులకు ఖాతాల వారీగా జమ చేసేలా నివేదికలు అందజేసేవారు. ఇక నుంచి ఈ పేమెంట్ విధానంలో ఆ ప్రక్రియ ఉండదు. నేరుగా ఖజానా శాఖ నుంచి ఉద్యోగి బ్యాంకు ఖాతాలో వారి జీతం తదితర నగదు జమ కానుంది. ఈ పేమెంట్ విధానం అంటే ఎలక్ట్రానిక్ చెల్లింపులు ఈ విధానం కార్పొరేట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ విధానం ద్వారా జరుగుతుంది. ఇలా ఉద్యోగుల జీతాలు చెల్లింపులు చేయడం వల్ల ఖజానా శాఖ నుంచి నేరుగా ఉద్యోగి ఖాతాలోనికి జమ అవుతుంది. బ్యాంకుకు ప్రభుత్వం చెల్లించాల్సిన నిర్వహణ ఖర్చులు మిగలనున్నాయి. ఈ పేమెంట్ ద్వారా ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, పదవీ విరమణ చేసిన తరువాత వారికి వచ్చే ప్రయోజనాల నగదు, ఆర్జిత సెలవులు, ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన విద్యుత్ బిల్లులు, టెలిఫోన్, కార్యాలయ నిర్వహణా ఖర్చులు వంటివి చెల్లింపులు జరుగుతాయి. పంచాయతీలకు సంబంధించిన బిల్లులు పంచాయతీల్లో పనిచేస్తున్న సిబ్బంది జీతభత్యాలు, పంచాయతీల అభివృద్దికి సంబంధించిన పన్నుల బిల్లులు, పీడీ అకౌంట్‌కు సంబంధించిన బిల్లులు ఈ పేమెంట్ ద్వారా చెల్లింపులు జరగవు. ఇవి ఎప్పటిలానే బ్యాంకుల ద్వారా చెల్లింపులు నిర్వహిస్తారు. ఈ మేరకు ఈ నెల 2న విశాఖపట్నంలో మూడు జిల్లాలకు చెందిన సబ్ ట్రెజరీ అధికారులుగా గణాంక అధికారులతో ఈపేమెంట్పై శిక్షణలు కూడా ఉన్నతాధికారులు అందజేశారు. జిల్లా ఖజానాశాఖ కార్యాలయంతో పాటు 14 సబ్‌ట్రెజరీ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు కలిపి 30వేలకు పైనే ఉన్నారు. పెన్షన్‌దారులు ఉన్నారు. వీరందరికీ ఈపేమెంట్ ద్వారా జీతాలు చెల్లింపులు జరుగుతున్నాయి. అయితే జిల్లాలో నాలుగు సబ్‌ట్రెజరీల్లో డాటాఎంట్రీ ఆపరేటర్లు లేరు. ఆమదాలవలస, రణస్థలం, కొత్తూరు, కోటబొమ్మాళి ఉపఖజానా కార్యాలయాల్లో డీఏవోలు లేక సిబ్బందే నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మిగిలిన ఉప ఖజానాకార్యాలయాల్లో 11 మంది ఔట్సోర్సింగ్ విధానంలో డాటాఎంట్రీ ఆపరేటర్లు ఉన్నారు. ఈపేమెంట్ ప్రభుత్వం తప్పనిసరి చేసినప్పటికీ సిబ్బంది కొరత వేధిస్తోంది.