శ్రీకాకుళం పాతబస్టాండ్:ఖజానాశాఖలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఖజానా శాఖ ద్వారా చెల్లించే వివిధ చెల్లింపులను ఈ పేమెంట్ ద్వారా చెల్లించేందుకు సర్వం సిద్దం చేశారు. వచ్చే నెల నుంచి ఉద్యోగుల జీతాలు నేరుగా వారి ఖాతాల్లో జమకానున్నాయి. ఇంతవరకు ఉద్యోగుల జీతాలు ముందుగా ట్రెజరీలో సంబంధిత అధికారులు అందజేసిన వివరాల ప్రకారం ఖజానాశాఖ అధికారులు బ్యాంకులకు ఖాతాల వారీగా జమ చేసేలా నివేదికలు అందజేసేవారు. ఇక నుంచి ఈ పేమెంట్ విధానంలో ఆ ప్రక్రియ ఉండదు. నేరుగా ఖజానా శాఖ నుంచి ఉద్యోగి బ్యాంకు ఖాతాలో వారి జీతం తదితర నగదు జమ కానుంది. ఈ పేమెంట్ విధానం అంటే ఎలక్ట్రానిక్ చెల్లింపులు ఈ విధానం కార్పొరేట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ విధానం ద్వారా జరుగుతుంది. ఇలా ఉద్యోగుల జీతాలు చెల్లింపులు చేయడం వల్ల ఖజానా శాఖ నుంచి నేరుగా ఉద్యోగి ఖాతాలోనికి జమ అవుతుంది. బ్యాంకుకు ప్రభుత్వం చెల్లించాల్సిన నిర్వహణ ఖర్చులు మిగలనున్నాయి.
ఈ పేమెంట్ ద్వారా ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, పదవీ విరమణ చేసిన తరువాత వారికి వచ్చే ప్రయోజనాల నగదు, ఆర్జిత సెలవులు, ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన విద్యుత్ బిల్లులు, టెలిఫోన్, కార్యాలయ నిర్వహణా ఖర్చులు వంటివి చెల్లింపులు జరుగుతాయి. పంచాయతీలకు సంబంధించిన బిల్లులు పంచాయతీల్లో పనిచేస్తున్న సిబ్బంది జీతభత్యాలు, పంచాయతీల అభివృద్దికి సంబంధించిన పన్నుల బిల్లులు, పీడీ అకౌంట్‌కు సంబంధించిన బిల్లులు ఈ పేమెంట్ ద్వారా చెల్లింపులు జరగవు. ఇవి ఎప్పటిలానే బ్యాంకుల ద్వారా చెల్లింపులు నిర్వహిస్తారు. ఈ మేరకు ఈ నెల 2న విశాఖపట్నంలో మూడు జిల్లాలకు చెందిన సబ్ ట్రెజరీ అధికారులుగా గణాంక అధికారులతో ఈపేమెంట్‌పై శిక్షణలు కూడా ఉన్నతాధికారులు అందజేశారు.
జిల్లా ఖజానాశాఖ కార్యాలయంతో పాటు 14 సబ్‌ట్రెజరీ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు కలిపి 30వేలకు పైనే ఉన్నారు. పెన్షన్‌దారులు ఉన్నారు. వీరందరికీ ఈపేమెంట్ ద్వారా జీతాలు చెల్లింపులు జరుగుతున్నాయి. అయితే జిల్లాలో నాలుగు సబ్‌ట్రెజరీల్లో డాటాఎంట్రీ ఆపరేటర్లు లేరు. ఆమదాలవలస, రణస్థలం, కొత్తూరు, కోటబొమ్మాళి ఉపఖజానా కార్యాలయాల్లో డీఏవోలు లేక సిబ్బందే నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మిగిలిన ఉప ఖజానాకార్యాలయాల్లో 11 మంది ఔట్‌సోర్సింగ్ విధానంలో డాటాఎంట్రీ ఆపరేటర్లు ఉన్నారు. ఈపేమెంట్ ప్రభుత్వం తప్పనిసరి చేసినప్పటికీ సిబ్బంది కొరత వేధిస్తోంది.
ఈ పేమెంట్ ద్వారా ఉద్యోగుల జీతాలు
Published Fri, Aug 8 2014 2:22 AM | Last Updated on Sat, Sep 2 2017 11:32 AM
Advertisement
Advertisement