సాక్షి, అమరావతి: గత సర్కారు హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏలు ఇవ్వకుండా పోస్ట్ డేటెడ్ జీవోలతో మభ్యపుచ్చినా ఈనాడు రామోజీకి చీమ కుట్టినట్లైనా అనిపించలేదు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు, చివరకు చిరుద్యోగులైన పారిశుధ్య సిబ్బందికి జీతాల పెంపు దేవుడెరుగు.. ఆర్నెల్ల నుంచి ఏడాది పాటు కనీసం జీతాలు ఇవ్వకపోయినా ఒక్క ముక్క కూడా రాయలేదు. ఇప్పుడు పొరుగు రాష్ట్రాల కంటే మిన్నగా సకాలంలో చెల్లిస్తుంటే వక్రీకరణలతో పచ్చ పత్రికలో కట్టు కథలు ముద్రిస్తున్నారు.
నాడు దళారీల దందా..
చంద్రబాబు హయాంలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, కార్పొరేషన్ ఉద్యోగులకు ఒక్క నెల కూడా సమయానికి జీతాలివ్వలేదు. ఏజెన్సీల పేరిట టీడీపీ నేతలు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను దోచుకుతిన్నారు. ఇప్పుడు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరీ మధ్య దళారీలు లేకుండా నెల నెలా సకాలంలో వేతనాలు చెల్లిస్తున్నా రామోజీ తప్పుడు కథనాలు వండుతున్నారు.
కోవిడ్ లాంటివి లేకున్నా..
ప్రభుత్వ, ప్రభుత్వ కార్పొరేషన్ ఉద్యోగులదీ నాడు అదే దుస్థితి. మొదటి వారంలో జీతాలు అందుకోవడం గగనమే. అంగన్‌వాడీలకు నెలల తరబడి బకాయిలే. మధ్యాహ్న భోజన కార్మికులకూ బాకీలే. ఇక 108, 104 ఉద్యోగులదీ అదే పరిస్థితి. కొందరికైతే సంవత్సరం దాటినా జీతాలు అందని దయనీయ పరిస్థితులు చంద్రబాబు పాలనలో నెలకొన్నాయి. గత సర్కారు హయాంలో కోవిడ్ లాంటి సంక్షోభం లేదు. లాక్‌డౌన్‌లు, ఆర్థిక ప్రగతి మందగమనం లాంటి పరిస్థితులూ ఉత్పన్నం కాలేదు. అయినా సరే ఏనాడూ జీతాలు సకాలంలో ఇచ్చిన పాపాన పోలేదు.
సంక్షోభాలను అధిగమిస్తూ సకాలంలో..
కోవిడ్ సంక్షోభంతో పాటు ఆర్థిక మందగమనం లాంటి ప్రతికూల పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొంటూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం జీతాలు, పెన్షన్లు చెల్లిస్తోంది. దేశంలో ఏ రాష్ట్రం నిర్వర్తించని విధంగా సంక్షేమాన్ని, నెలకు సుమారు రూ.1,700 కోట్లకు పైగా సామాజిక పెన్షన్ల బాధ్యతనూ నెరవేరుస్తూనే ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపులను సక్రమంగా నిర్వర్తిస్తోంది. సీఎం జగన్ ప్రభుత్వం అప్కాస్ ద్వారా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు తెచ్చింది. దళారీలను నిర్మూలించి ఏజెన్సీ వ్యవస్థను రూపుమాపింది. నేరుగా వారి ఖాతాల్లోకే మొదటి తారీఖు కల్లా జీతాలు జమ చేస్తోంది. ఐఏఎస్‌ల కంటే ముందుగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు, కార్పొరేషన్ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లిస్తోంది. తొలి ఏడు రోజుల్లోనే క్రమం తప్పకుండా జీతాలు ఇస్తోంది. పొరుగు రాష్ట్రాలతో పోల్చినా, దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చినా ఏపీలో జీతాల చెల్లింపులు చాలా మెరుగ్గా ఉన్నాయన్నది సుస్పష్టం. డిసెంబర్ నెలలో 12వ తేదీ నాటికి సుమారు రూ.6 వేల కోట్లను జీతాల కోసం ప్రభుత్వం చెల్లించింది. అదే పొరుగున ఉన్న రాష్ట్రంలో జిల్లాల వారీగా జీతాల చెల్లింపులు చేస్తున్నారు. ఏ రోజు కూడా మొదటి తారీఖు అనే మాటే లేదు. ప్రతి నెలా తేదీ, ఆ తర్వాతే చెల్లింపులు చేస్తున్నారు.
ఇదీ చదవండి: రామోజీ.. అస్మదీయ తకథిమి
Comments
Please login to add a commentAdd a comment